నెల్లూరు, సెప్టెంబర్ 11: తెలంగాణ కంటే మిన్నగా సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడేలా నెల్లూరు ఉద్యమకారులు ప్రతినబూనుతున్నారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన బంద్ కార్యక్రమం విజయవంతమైంది. మంగళవారం నాయుడుపేటలో సమైక్యాంధ్ర పరిరక్షణ దీక్షా శిబిరంలో పాల్గొని ఉపన్యసించిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్యయాదవ్ మృతితో ఆందోళనాకారులు జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఊరూరా పోరాట కమిటీ, రాజకీయ నాయకులు మృతి చెందిన ఉపాధ్యాయుడికి శ్రద్ధాంజలి ఘటించారు. బంద్‌లో భాగంగా విద్యా, వ్యాపార సంస్థలు, వాణిజ్య బ్యాంక్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడేలా చేయడంతో సహా రాస్తారోకోలు చేపట్టారు. నగరంలోని కోమిట్లకు చెందిన ప్రైవేటు బస్సులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వాటిని కూడా నిలిపివేయాల్సి వచ్చింది. మధ్యాహ్నం మూడు గంటలు దాటేవరకు కూడా ఆందోళనకారులు బంద్ పర్యవేక్షణలో భాగంగా నెల్లూరు నగరం అంతటా కలియతిరిగారు. మోటార్‌సైకిళ్ల ర్యాలీ చేస్తూ ఎక్కడైనా దుకాణాలు తెరచి వుంటే వాటి ఎదుట ఆందోళనకారులతో తమ వాహనాల హారన్లు మూకుమ్మడిగా మోగించారు. దీంతో ఆయా దుకాణదారులు షాపులు మూయకతప్పలేదు. బంద్‌లో భాగంగా పలువురు వక్తలు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగే విశ్వవిద్యాలయం లేదనే సంగతి గుర్తెరగాలంటూ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తూ సగటు ప్రజానీకంలో అవగాహన కల్పించారు. హైదరాబాద్‌లో ఉన్న వివిధ విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఇప్పటి వరకు 81శాతం వరకు అవకాశాలు పొందుతున్న సీమాంధ్రులు ఇకపై నాన్‌లోకల్ పరిధిలో ఒక్కశాతం పొందడం గగనమేనంటూ ఆవేదన చెందారు. తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వీగి పోయేవరకు సమ్మె చేస్తామంటూ ఖరాఖండిగా స్పష్టం చేస్తున్నారు. జిల్లా స్థాయి అధికార్ల నుంచి ఎన్‌జిఓలు, రాష్ట్ర ప్రభుత్వ నాలగవ తరగతి ఉద్యోగవర్గాలు కూడా సమ్మెలో పాల్గొని పాలనా వ్యవస్థను స్తంభింపజేసి ఇప్పటికే నెల రోజులైంది. ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలైతే ఇప్పటి వరకు తమ ఉద్యోగవర్గాలకు కొనసాగుతున్న ఆరు జోన్ల పద్ధతి రద్దైపోతుందని నాయకులు వాపోతున్నారు. కొత్త రాష్ట్రంలో జోన్ల ఏర్పాటు కావాలంటే ఇక్కడి ప్రభుత్వ ఆధీనంలో అధికారం ఉండబోదని చెపుతున్నారు. అందువల్ల ఇప్పటి వరకు కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్‌ను యధాప్రకారం కొనసాగించాలని కోరుతున్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా అంటూ కాంగ్రెస్ అధినేత్రిని ఉద్దేశించి ప్రశ్నిస్తున్నారు. పదవులు వ్యాపారాల కోసం, రాజకీయ స్వార్ధంతో ప్యాకేజిలకు కక్కుర్తి పడుతూ అధిష్టానానికి తలొగ్గవద్దని హెచ్చరిక ధోరణితో అధికార పార్టీ నేతలనుద్దేశించి హెచ్చరిక చేస్తున్నారు.
అమరవీరుడికి ఘననివాళి
శోకసముద్రంలో గొల్లపాలెం
దొరవారి సత్రం, సెప్టెంబర్ 11: సమైక్య రాష్ట్రం కోసం నిరాహార దీక్ష చేపట్టి తుదిశ్వాస విడిచిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ భౌతికకాయానికి బుధవారం సమైక్యాంధ్ర జెఎసి ఘనంగా నివాళులు అర్పించింది. చిన్నతనం నుంచే పలు పోరాటాల్లో చురుగ్గా పాల్గొనే శంకరయ్య యాదవ్ సమైక్యాంధ్ర సాధన ఉద్యమంలో కూడా తనదైన పాత్ర పోషించారు. 42 రోజులుగా రిలే నిరాహాదీక్షల్లో చురుగ్గా పాల్గొని సమైక్యాంధ్ర సాధనకు కృషి చేశారు. ఈక్రమంలో నాయుడుపేటలో ఎఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పాల్గొని అధికార పార్టీ నాయకుల తీరుపై గొంతెత్తి ప్రశ్నించేవారు. మంగళవారం కూడా శంకరయ్య యాదవ్ రిలే నిరాహారదీక్షల్లో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఎండగట్టారు. ఇలా ప్రసంగిస్తూండగానే శంకరయ్య గుండెపోటుతో స్టేజిపైనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన రాష్ట్ర నలుమూలలకు పాకడంతో ఆయా ప్రాంతాల సమైక్యవాదులంతా శంకరయాదవ్‌కు నివాళులర్పించేందుకు దొరవారిసత్రం మండలంలోని ఆయన స్వగ్రామమైన గొల్లపాలెంకు చేరుకున్నారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా వేలసంఖ్యలో ప్రజలు కూడా వచ్చి శంకరయ్య మృతదేహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. సమైక్యాంధ్రాను సాధించి శంకరయాదవ్ ఆత్మకు శాంతి చేకూర్చాలని అందరూ ప్రతిజ్ఞ చేశారు. నాయుడుపేట ఎస్సై ఎన్ రామారావు, దొరవారి సత్రం ఎస్సై వేణుగోపాలరెడ్డి గొల్లపాలానికి వచ్చిన సమైక్యాంధ్రులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
శంకయ్య కుటుంబాన్ని ఆదుకుంటాం: ఎమ్మెల్సీ వాకాటి
సమ్యైవాది శంకరయ్య యాదవ్ కుటుంబానికి ప్రభుత్వపరంగా సాయం అందించి వారిని అన్నివిధాలా ఆదుకుంటామని ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తెలిపారు. శంకరయ్యకు నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన విషయాన్ని మఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో చర్చించానని వారి సూచనల మేరకే శంకరయ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామన్నారు. ఇంకా వారికి అందాల్సిన సాయాన్ని వెంటనే అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన వెంట నాయకులు హర్షవర్దన్‌రెడ్డి, సుధాకరరెడ్డి, రమణారెడ్డి, మునిస్వామినాయుడు తదితరులు ఉన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర మాట్లాడుతూ శంకరయ్య యాదవ్ మృతితో ప్రభుత్వం కళ్లుతెరచి రాష్ట్ర విభజనను మానుకోవాలని సూచించారు. సమైక్యాంధ్రకోసం అసువులు బాసిన శంకరయ్య యాదవ్ మంచి భావాలు కలిగిని వ్యక్తి అని ఆయన మృతితో ఒక మంచి వ్యక్తిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
సాయం కాదు సమైక్యాంధ్రే కావాలి:విఠపు
శంకరయ్య యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం సాయం చేసేకన్నా సమైక్య రాష్ట్రంగా ప్రకటించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కోరారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్తలు నెలవల సుబ్రహ్మణ్యం, పి సంజీవయ్య, దువ్వూరు బాలచంద్రారెడ్డి, తెలుగుదేశం నాయకులు సూళ్లూరుపేట ఎమ్మెల్యే పరసా వెంకటరత్నయ్య, రాష్ట్ర నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి, ఆర్డీఓ ఎంవి రమణ తదితరులు పాల్గొన్నారు.
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 11: విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెకు శ్రీకారం చుడుతున్నారు. బుధవారం ఉద్యోగులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా శాఖాపరమైన తమ సెల్‌ఫోన్ సిమ్‌లను ఎస్‌ఇకి అందజేసి విధుల నుంచి గైర్హాజరయ్యారు. విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టడంతో ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఎస్‌ఇ మాత్రం విద్యుత్‌శాఖలో ఏభైశాతం వరకు ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారని, ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి అంతరాయానికి చోటివ్వకుండా సేవలందిస్తామని హామీ ఇచ్చారు.
బిట్రగుంట రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన డిఆర్‌ఎం
బిట్రగుంట, సెప్టెంబర్ 11: విజయవాడ డివిజన్‌లోని బిట్రగుంట రైల్వే స్టేషన్‌ను బుధవారం డివిజనల్ మేనేజర్ ప్రదీప్‌కుమార్ ఆకక్మిక తనిఖీ చేశారు. డిజనల్ కేంద్రం నుండి స్పెషల్ రైలులో ఆయన 5-20 గంటలకు బిట్రగుంటకు వచ్చారు. స్టేషన్ పరిసరాలు, కార్యాలయాలు తనిఖీ చేశారు. ఈసందర్భంగా పలువురు అధికారులు ప్రయాణికుల వౌలిక వసతులు గురించి వివరించారు. అనంతరం కార్మికుల పనితీరు మెచ్చుకొని క్యాష్ అవార్డులు ప్రకటించారు. హెల్త్ ఇన్‌స్పెక్టర్, స్టేషన్‌మాస్టర్ ఎల్‌సి మీనా, సిడబ్ల్యూ అధికారి నాగసుబ్రహ్మణ్యం తదితరులకు ఆయన క్యాష్ అవార్డులు అందజేశారు.
ఓట్లు, సీట్ల రాజకీయాలను పక్కనపెట్టాలి
* ఎమ్మెల్యే ఆనం వివేకా, ముంగమూరు
నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 11: ఓట్లు, సీట్ల రాజకీయాలు చేసే పార్టీలు తమ అజెండాలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర కోసం కలసికట్టుగా పోరాటం చేయాలని నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు ఆనం వివేకానందరెడ్డి, ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి సంయుక్తంగా పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో మరణించిన శంకరయ్యయాదవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన మరణత్యాగం వృథా పోకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఎన్‌జిఓలు, విద్యార్థి సంఘ నేతలు వ్యాపార, ఉపాధ్యాయ ఉద్యమాన్ని చూసి రాష్ట్రాన్ని చీల్చినా అభ్యంతరం లేదన్న పార్టీలు, సమన్యాయం పాటించాలన్న పార్టీలు, ఆత్మగౌరవ యాత్ర పేరిట బస్సు యాత్ర చేస్తున్న నాయకులంతా ఇప్పుడు ప్రత్యేకం తగదని బాణీ మారుస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఉద్యమాన్ని చూసి అందరూ సమైక్య వాదన వినిపిస్తున్నారని వివరించారు. ఇప్పటికైనా రాజకీయ యాత్రలు ఆపాలని, సమైక్యాంధ్ర కోసం చేయి చేయి కలిపి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఆనం కుటుంబం తమ స్వార్థానికి ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సమైక్యతవాద ఉద్యమాన్ని ఎక్కడా లబ్ధి చేకూర్చేలా తమ పార్టీ రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఈనెల 15వ తేదీన అన్ని దేవాలయాల్లో, తొలుత వైష్ణవ ఆలయాల్లో సుదర్శనయాగాలు, శివాలయాల్లో రుద్రాభిషేకాలు, అమ్మవారి ఆలయాల్లో హోమాలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆదివారంనాడు ప్రతి చర్చిలో సమైక్యాంధ్ర కోసం ప్రార్ధనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వారంరోజుల ఉద్యమ కార్యాచరణ ప్రణాళికను ఈనెల 21వ తేదీన ప్రకటిస్తున్నట్లు వివరించారు. ఈ ఉద్యమాన్ని మరింత దీక్షతో ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలసిగట్టుగా రావాలన్నారు. తమతో కలసి రాకుంటే రాజకీయ నాయకులను ప్రజలు, భగవంతుడు కూడా క్షమించబోరని హెచ్చరించారు. కెసిఆర్ తమ ఉద్యమాల్ని శంకించడం తగదన్నారు. కెసిఆర్ తరఫున రౌడీలు, గూండాలతో తెలంగాణా ఉద్యమాన్ని నడిపించారన్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను విమర్శిస్తే కెసిఆర్‌కు పుట్టగతులుండవని హెచ్చరించారు. రాజకీయాల్లో తిట్ల పురాణాన్ని ప్రారంభించింది కెసిఆరేనన్నారు. ఆయన తన రాజకీయం కోసం అడ్డగోలు భాషను వినియోగించి లబ్ధిపొందాలని కోరుకోవడం మంచిది కాదన్నారు. రాజకీయ విలువల్లేని కెసిఆర్‌ను తెలంగాణావాదులే తరిమికొట్టే రోజులు వస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో డిసిసి ఇన్‌చార్జి చాట్ల నరసింహారావు, బర్నాబాస్, తదితరులు పాల్గొన్నారు.
నేడు కావలిలో పొలికేక
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లా అధికారుల సంఘం ప్రధాన భూమికగా నిర్వహిస్తున్న వివిధ ఆందోళనా కార్యక్రమాల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను డిఆర్‌ఓ రామిరెడ్డి వెల్లడించారు. ఈనెల 12న లక్షమందితో కావలిపట్టణంలో పొలికేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈనెల 13న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. 14న మహిళలతో భారీర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. 15న నాయుడు పేటలో లక్షగళ ఘోష జరుగుతుందన్నారు. 16న జిల్లా స్టీరింగ్ కమిటి సమావేశమవుతుందని అన్నారు. 17న పొదలకూరులో లక్షగళఘోష జరుగుతుందని చెప్పారు. 19న గూడూరులో, 21న ఆత్మకూరులో, 23న ఉదయగిరిలో, 25న వెంకటగిరిలో, 27న బుచ్చిరెడ్డిపాళెంలో, 29న వింజమూరులో, వచ్చేనెల 1న సూళ్లూరుపేటలో లక్షగళ ఘోష కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.
=
ఆమరణ దీక్ష విరమణ
నెల్లూరు సిటీ, సెప్టెంబర్ 11: మూలాపేటలోని రాజాగారివీధిలో ఎన్టీఆర్ అభిమాని అన్నమేటి రాజగోపాలనాయుడు సమైక్యాంధ్రకు మద్దతుగా గత నాలుగురోజుల నుంచి తన ఇంటిలోనే ఆమరణ దీక్ష చేస్తున్నారు. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, డిసిసి ఇన్‌చార్జి అధ్యక్షులు చాట్ల నరసింహారావు ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడంతో సహా దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి, శ్రీ్ధరకృష్ణారెడ్డి, కాంగ్రెస్‌పార్టీ పోరాటం సాగిస్తున్నాయన్నారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. రాజగోపాల్‌నాయుడు ఎన్టీఆర్ అభిమానికాగా, ఆనాడు తెలుగువారి కోసం ఎన్టీఆర్ ఎంతో పోరాటం చేశారన్నారు. అదే స్ఫూర్తితో రాజగోపాల్ తెలుగువారి కోసం పోరాటం చేయాలని ఆకాంక్షించారు. ప్రాణాన్ని బలిగొనడం మంచిది కాదని నచ్చచెప్పి అతనికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తెలుగువారంతా ఒకటిగా ఉండాలని ఈ నెల 8వ తేదీ నుంచి ఇంటిలోనే ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలుసుకుని ఆయనకు సంఘీభావం ప్రకటించడం జరిగిందన్నారు. తమతో కలసి పోరాటం సాగించాలంటూ ఎమ్మెల్యే కోరారు. అన్నమేటి రాజగోపాలనాయుడు కుమార్తె, భార్య మాట్లాడుతూ సమైక్యాంధ్రను విడగొట్టడం ఇష్టం లేక గత ఆరువారాలుగా మనస్థాపంతో ఉన్న సంగతి వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు హరిప్రసాద్, అన్నంగి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా వెంకయ్య ఆరాధన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, సెప్టెంబర్ 11: నగరంలోని మూలాపేట బ్రాహ్మణవీధిలో కొలువుదీరిన వెంకయ్యస్వామి గురునిలయంలో 31వ ఆరాధన మహోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు, హోమం, సహస్ర నామార్చన, మహా నివేదనం, హారతి కార్యక్రమాలను చేపట్టారు. తొమ్మిది గంటల నుంచి దయానంద స్వాములు, గురుదేవుల భక్త బృందంచే భజన సంకీర్తన చేపట్టారు. ఈ మహోత్సవంలో భాగంగా స్వామివారికి ప్రత్యేకంగా పూలంగిసేవ చేపట్టారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామివారి పాదరేణువుగా పేరొందిన మాకాని వెంకట్రావ్ భక్తబృందం నేతృత్వంలో ఈ ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి.
లక్ష ఉండ్రాళ్లతో మహాగణపతి హోమం
నెల్లూరు కల్చరల్, సెప్టెంబర్ 11: నగరంలోని గాంధీబొమ్మ సమీపంలో గల శివాజీ సెంటర్‌లోని వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం లక్షా వెయ్యిన్ని ఎనిమిది ఉండ్రాళ్లతో శ్రీ మహాగణపతి హోమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈసెంటర్‌లో సోమవారం నుండి నిర్వహిస్తున్న వినాయకచవితి ఉత్సవాలు బుధవారం ముగిశాయి. ముగింపు సందర్భంగా మన రాష్ట్రంలో ఎక్కడా, ఎవ్వరూ ఇప్పటివరకు నిర్వహించని విధంగా ఉండ్రాళ్లతో మహాగణపతి హోమాన్ని నిర్వహించడం విశేషం. ఆలయ అర్చకులు చదలవాడ మోహనకృష్ణ స్వామి ఆధ్వర్యంలో వరసిద్ధి విఘ్నేశ్వరస్వామి దేవస్థానం భక్తబృందం పర్యవేక్షణలో కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. ఈసందర్భంగా ఉదయం గణపతికి పంచామృతాభిషేకం అనంతరం పూలంగిసేవ చేశారు. సహస్రనామ పూజ, హారతి, తీర్ధప్రసాద వినియోగం జరిగింది. మధ్యాహ్నం అన్నదానం చేశారు. సాయంత్రం వేదపండితులు, అర్చక స్వాములు వేద మంత్రోచ్ఛాటనలు, భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాల నడుమ దేవస్థానం ముందు ఏర్పాటుచేసిన మహా హోమగుండంలో ఉండ్రాళ్లు, లక్ష గరికతో హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం, వివాహం, వ్యాపారాభివృద్ధి, స్వగృహం కోరుకునే పలువురు భక్తులు ఈ హోమంలో పాల్గొన్నారు. హోమానికి అవసరమైన ఉండ్రాళ్లను భక్తులు విరాళాల రూపంలో అందచేశారు. ఈసందర్భంగా ఇస్కాన్ నిర్వాహకులు శుకదేవస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన భజనలు, సంకీర్తనలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రపంచ సహకార్యదర్శి రాఘవువులు, విహెచ్‌పి నాయకులు మెంటా రామ్మోహన్‌రావు, బిజెపి నాయకులు సురేష్‌రెడ్డి, మిడతల రమేష్, పలువురు విహెచ్‌పి, ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి నాయకులు, స్థానిక వ్యాపారులు, అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
నెల్లూరు బంద్ విజయవంతం
* విఆర్‌సి సెంటర్‌లో రాస్తారోకో
* విభజనను వెనక్కి తీసుకోకుంటే తరిమికొడతాం
* టిఎన్‌ఎస్‌ఎఫ్ నేత తిరుమల హెచ్చరిక
నెల్లూరు, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్రకు మద్దతుగా నిరాహారదీక్ష చేస్తూ ఉపాధ్యాయుడు శంకర్‌యాదవ్ ప్రాణాలు విడిచిన సందర్భంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించారు. అనంతరం నగరంలోని విఆర్‌సి సెంటర్‌లో దాదాపు 4 గంటలపాటు రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై టైర్లను దహనం చేసి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. విఆర్‌సి సెంటర్‌లో ఎన్జీవోలు రాస్తారోకో చేశారు. టౌన్ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఈసందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. ఈసందర్భంగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు కాకర్ల తిరుమలనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజనను తక్షణం వెనక్కి తీసుకోకుంటే కాంగ్రెస్ పాలకులను తరిమికొడతామని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో ప్రజలు ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదన్నారు. నాయుడుపేటలో నిరాహారదీక్ష చేస్తూ సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు విడిచిన శంకరయాదవ్ మృతే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర విభజనను తట్టుకోలేక భవిష్యత్‌లో విద్యార్థుల జీవితం అధికారంలోకి వెళ్తుందన్న బాధతో ప్రాణాలు సైతం కోల్పోయి పోరాడుతున్నారన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చనిపోయిన శంకర్ నారాయణేనని, ఆయన ఆశయాలను సాధించి సమైక్య రాష్ట్రంను పరిరక్షించే వరకు విశ్రమించబోమన్నారు. సీమాంధ్రలో ప్రజలు కనీవినీ ఎరుగని రీతిలో ప్రాణాలు ఫణంగా పెట్టి ఉద్యమాలు నిర్వహిస్తుంటే ఢిల్లీ నేతల్లో మాత్రం ఎటువంటి చలనం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికే సమైక్యాంధ్ర కోసం ఎంతోమంది ప్రాణాలు వదిలారని, ఇంకెంత మంది ప్రాణాలు బలి తీసుకుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పదవులు, అధికారం కొరకు సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, రాష్ట్ర విభజన పేరుతో కేంద్రం ఆడుతున్న వికృత క్రీడను ఆపి సమైక్య రాష్ట్రాన్ని ప్రకటించాలని లేనిపక్షంలో ప్రజలే పాలకులను తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షులు ముజీర్, టిఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అమృల్లా, జెఏసి నాయకులు జయవర్థన్, నాయకులు హాజీ, యస్దాని, శ్రావణ్‌కుమార్, దత్తుయాదవ్, గగన్, అఖిల్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
తడలో దంపతుల దారుణ హత్య
పశువుల మేత విషయమై గొడవ
తడ, సెప్టెంబర్ 11: పశువుల మేత విషమయై గొడవ ముదిరి ఇద్దరు దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం తడలో చోటు చేసుకుంది. శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం తడకండ్రిగ గ్రామ పంచాయతీ పరిధిలోని బోడిలింగాలపాడులో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. స్థానికులు, పోలీసుల సమాచారం మేరకు ఇరుగుపొరుగు ఇంటివారైన బాబు, చిన మునుస్వాములు చాలా కాలంగా సన్నిహితంగా ఉండేవారు. ఇటీవల వీరిద్దరిమధ్య చిన్నచిన్న గొడవలు జరుగుతుండేవి. బుధవారం పశువుల మేత విషయమై వివాదం ముదిరింది. దీనితో వెలుగు చినమునిస్వామి అలియాస్ చిన్నా కత్తి తీసుకుని బాబు కుటుంబ సభ్యులపై దాడి చేసినట్లు ప్రత్యక్షసాక్షి బాబు కుమార్తె నాగభూషణమ్మ తెలిపారు. తోటబాబు(50)ను కత్తితో నరకబోగా అడ్డు బచ్చిన అతని భార్య(45)కు కత్తి తగిలి ఆమె అక్కడక్కడే మృతి చెందింది. బాబు నుకూడా నరకగా అతను కూడా సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ సంఘటనతో బిత్తరబోయిన నాగభూషణమ్మ బిగ్గరగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారుసంఘటనా స్థలానికి చేరుకునేలోగానే వీరిద్దరూ మృతి చెందినట్లు తెలిసింది. ఇంతలో నిందితుడు హత్యకు వాడిన కత్తిని తన ఇంటి ముందర చెట్ల పొదల్లోవేసి తడ పోలీస్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. పోలీసులతోపాటు సంఘటనా స్థలానికి 108వాహనాన్ని తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. గూడూరు డిఎస్పి చౌడేశ్వరి, సూళ్లూరుపేట సిఐ రత్తయ్య, తడ ఎస్సై నాగేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని కెసు దర్యాప్తు చేస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు డిఎస్పి చౌడేశ్వరి
తడ కండ్రిగ వద్ద జరిగిన ఇద్దరి దారుణ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని గూడూరు డిఎస్పి చౌడేశ్వరి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆమె విలేఖర్లతో మాట్లాడుతూ ఒకచిన్న విషయం ఈ సంఘటనకు కారణమని, మరోకోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు. నిందితులు లొంగిపోయినట్లు వస్తున్న సమాచారంపై ఆమె అధికారికంగా వెల్లడించలేదు.