ఖమ్మం, సెప్టెంబర్ 11: స్వామి వివేకానంద ప్రజలందరికీ మార్గదర్శేనని స్వామి కమలానంద భారతి స్పష్టం చేశారు. బుధవారం నగరంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాల సందర్భంగా 5కె రన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో స్వామి మాట్లాడుతూ వివేకానంద చికాగో నగరంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై భారతదేశ యొక్క గొప్పతనాన్ని అందరికీ వివరించారన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం కీలకపాత్ర పోషించిన వ్యక్తుల్లో మహోన్నతుడు స్వామి వివేకానంద అని, ఆ తర్వాత లాల్‌బహదూర్‌శాస్ర్తీ, సు భాష్ చంద్రబోస్‌లు సైతం విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. వివేకానంద ఆశయాలను స్పూర్తిగా తీసుకున్న మరెందరో ఉన్నత స్థానాల్లో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. స్ర్తిలకు విద్య, ప్రపంచంలో యువతదే కీలకపాత్రగా గుర్తించిన మహానీయుడు స్వామి వివేకానంద అని పేర్కొన్నారు. పాశ్చాత్య సంస్కృతిని పారద్రొలేందుకు తనదైన శైలిలో కృషి చేశాడని, వివేకానంద లాంటి మహోన్నతులు ఉండటం వల్లే మనదేశానికి ఒక గుర్తింపు లభించిందన్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ మాట్లాడుతూ స్వామి వివేకానంద పుస్తకాలను తాను చదువుతున్నానని, ఆయన ఆశయాలను స్పూర్తిగా తీసుకుంటే ఏదైనా సాధించవచ్చనే పూర్తి విశ్వాసం తనకు కలిగిందన్నారు. ఇన్ని సంవత్సరాలుగా తనకు ఆ పుస్తకం చదవాలనే ఆలోచన రాకపోవటంతో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయానని పేర్కొన్నారు. రోజుకు కొంత సమయాన్ని స్వామి వివేకానంద పుస్తకాన్ని చదివేందుకు కేటాయిస్తే ఎంతో హాయిగా ఉంటుందని, అతి తక్కువ వయస్సులోనే ప్రజలందరి మన్ననలు పొందారనే విషయాన్ని గుర్తించి అందరు ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సూచించారు. మన కర్తవ్యం ఏలా ఉండాలి, మనం ఏ రకంగా ఉండాలనేది స్వామి వివేకానంద పుస్తకాలు చదివితే ఇట్టే అర్థమవుతుందని పేర్కొన్నారు. తొలుత నగరంలోని పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు యువత పరుగు అనే నినాదంతో పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద ఉత్సవ సమితి నాయకులు మోత్కురి నారాయణరావు, జైపాల్‌రెడ్డి, లక్ష్మినారాయణ, దుద్దుకూరి వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, ప్రవీణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయండి
* కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, సెప్టెంబర్ 11: అర్హులైన వారందరినీ ఓటర్లుగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ ఆర్డీవోలను, తహశీల్దార్లను, ఎన్నికల ఉప తహశీల్దార్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖల అధికారులతోవీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో 18, 19 సంవత్సరాల యువతీ, యువకులు రాష్ట్రం మొత్తం మీద 4శాతం ఉంటే జిల్లాలో వీరి నమోదు సగటు 2.4శాతం మాత్రమేనన్నారు. అర్హులైన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేసేందుకు డిగ్రీ, ఇతర కళాశాల్లో నోడల్ అధికారులను నియమించాలన్నారు. ప్రతి కళాశాలలో ఉత్సాహవంతులైన ఉపాధ్యాయులను గుర్తించి ఓటరునమోదు దరఖాస్తు ఫారాలను అందించి ప్రక్రియను వేగవంతంచేయాలన్నారు. ఓటర్ల నమోదుకు సంబంధించి 2500అభ్యర్థనలు అపరిష్కృతంగా ఉన్నాయని, వీటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. రాష్ట్రంలో వందమంది జనాభాకు 65.5 శాతంగా నమోదైందన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సగటు అత్యంత తక్కువగా 56.54శాతంగా నమోదైందని, అందుకు గల కారణాలు ఏంటని ఆర్టీవో అమయ్‌కుమార్‌ను ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రభుత్వరంగ సంస్థలు ఉండటం వల్ల ఓటరునమోదు సగటు శాతం తక్కువగా ఉందన్నారు. ఓటర్లు, జనాభా, స్ర్తి పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే అసాధారంగా ఉంటే సంబంధిత నియోజకవర్గం, మండలంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు గల కారణాలను విశే్లషించాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల క్రమబద్దీకరణను జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారుల వివరాలకు సంబంధిత ఆర్డీవోలు పంపాలన్నారు. ఉద్యోగాల డాటా బేస్‌ను అప్‌డేట్ చేసి సంబంధిత వివరాల లేఖను నివేదించాలన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 90శాతం పోలింగ్ కేంద్రాల్లో నిఘా నేత్రాలను ఏర్పాటు చేయనున్న దృష్ట్యా డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యనభ్యస్తి ల్యాప్‌టాప్‌లు కలిగిన 2వేల మంది విద్యార్థులను రెవెన్యూ డివిజన్ అధికారులను గుర్తించాలన్నారు. ఏజన్సీ డివిజన్‌లైన్ల కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో 100విఆర్వోలకు కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించి, ఈ నెలాఖరులోగా ప్రతిపాదనలు పంపించాలని ఆదేశించారు. అనంతరం జెసి సురేంద్రమోహన్ మాట్లాడుతూ 28.5లక్షల జనాభాకు గాను 26లక్షల జనాభాకు సంబంధించి ఆధార్ నమోదు పూర్తయిందన్నారు. 22లక్షల మందికి ఆధార్ జనరేట్ అయిందని, 17లక్షల మంది ఆధార్‌కార్డులు అందుకున్నారన్నారన్నారు. కాన్ఫరెన్స్ జిల్లా అదనపు సంయుక్త సంచాలకులు బాబురావు, డిఆర్వో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రోగుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి
* ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే కూనంనేని
కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 11: ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల వైద్యులు, నర్సులు, సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది పేదలే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వస్తారని, వారి పట్ల సానుభూతితో వ్యవహరించాల్సిన బాధ్యత వైద్యులతో పాటు ఆసుపత్రి సిబ్బందిపై ఉందన్నారు. ప్రధానంగా ఫైర్ యాక్సిడెంట్ కేసులను ప్రైవేట్ ఆసుపత్రులు స్వీకరించని కారణంగా శరీరం కాలిపోయిన రోగుల పట్ల మరింత బాధ్యతగా వ్యవహరించాలని కో రారు. అదేవిధంగా గర్భిణీల వైద్యం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వైద్యం అందించడంలో ఎలాంటి అశ్రద్ధ వహించినా సహించేదిలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా మృతదేహాలు పాడుకాకుండా కొత్తగూడెం ఏరియా ఆసుపత్రిలో ఎసి బాక్సులు రెండు వుండడం ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధాన సమస్యగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ. 10లక్షలతో ప్రతిపాదనలు పంపిస్తున్నామని త్వరలో మంజూరు లభించడం ఖాయమన్నారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం వివరాలు, వస్తున్న కేసుల పట్ల సూపరింటెండెంట్ జనార్ధన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈసమావేశంలో ఆసుపత్రి సూపరింటెంట్ డాక్టర్ జనార్ధన్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ రమేష్‌బాబు, డాక్టర్ విజయ్‌కుమార్‌లతో పాటు ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సభ్యుడు గడ్డం రాజయ్య, మున్సిపల్ మాజీ వైస్‌చైర్‌పర్సన్ ఎస్‌కె సాబీర్‌పాషా, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ నినాదాన్ని జీర్ణించుకోని వాళ్ళు సమైక్యంగా ఎలా ఉంటారు..?
* ప్రశ్నించిన పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుమలరావు
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 11: తెలంగాణ నినాదాన్ని జీర్ణించుకోలేని వారు సమైక్యంగా ఎలా ఉంటారని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి తిరుమలరావు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఎస్‌ఆర్ అండ్ బిజిఎన్‌ఆర్ కళాశాలలోజరిగిన పిడిఎస్‌యు సదస్సులో ఆయన మాట్లాడుతూ కలిసి ఉండాలని మాటలు చెప్తున్న ఎపిఎన్జీవోలు కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలంగాణ నినాదం చేశాడని దాడి చేశారని, అలాంటి వారు తెలంగాణవాదులతో ఎలా కలిసి ఉంటారన్నారు. తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టడంతో పాటు రోడ్‌మ్యాప్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పౌరులపై దాడులు చేయటం హేయమైన చర్య అని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అపహాస్యం చేస్తూ ఘర్షణలు పెంచటం సరైందికాదన్నారు. స్వల్ప సంఘటనల్లో తెలంగాణవాదులపై కేసులు నమోదు చేస్తూ సీమాంధ్ర నాయకులపై కేసులు నమోదు చేయటం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తెలంగాణ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం కళాశాల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉమ మహేష్, ఉపాధ్యక్షుడిగా యాకుబ్, కార్యదర్శిగా హరి, సం యుక్త కార్యదర్శిగా వినోద్, కోశాధికారిగా మధుకర్, మరో పది మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ప్రదీప్, శ్రీను, విప్లవ్, సందీప్, అనూష, ప్రసన్న, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
విద్యతోపాటు క్రీడలూ అవసరమే
* మండల విద్యాశాఖాధికారి సలాది రామారావు
వైరా, సెప్టెంబర్ 11: విద్యార్థులకు విద్యతోపాటు మానసిక వికాసానికి క్రీడలు కూడా చాలా అవసరం అని మండల విద్యాశాఖాధికారి సలాది రామారావు అన్నారు. బుధవారం వైరా మండల పరిధిలోని కనకగిరి సిరిపురం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైన మండల స్థాయి పాఠశాల క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి నేటి పోటీ సమాజంలో చదువు తప్పనిసరి అని విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు భావించడంతో విద్యార్థులకు మానసిక ప్రశాంతత కరువైందన్నారు. క్రీడలతో శారీరక పెరుగుదల, దేహదారుఢ్యం, ఏకాగ్రత పెరుగుతాయని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి ఆటలు ఆడాలని గెలుపొటములు ఆటలలో సహజమని ఎందరు ఆడినా గెలుపు కొందరిదే నన్నారు. విద్యార్థులకు ఆటలతో గెలుపొందిన వారికి ఇదే శాశ్వతం కాదని స్నేహం శాశ్వతం అని తెలుసుకుంటారనిన్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ క్రీడలు మొదటి రోజు బాలికలకు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ నిర్వహించారు. రెండవ రోజు బాలురకు జరుగుతాయని తెలిపారు. మూడవరోజు బాలికలకు, బాలురకు అథ్లెటిక్స్ జరుగుతాయన ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎస్‌బిఐ మేనేజర్ జి ఉష, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వీరభధ్రాచారి, గ్రామ సర్పంచ్ టి.వెంకటేశ్వర్లు, ఎస్.ఎమ్.సి చైర్మన్ ఐ.కేశవరావు, వైరా లయన్స్ క్లబ్ అద్యక్షుడు డాక్టర్. శ్రీనివాసరెడ్డి, లయన్స్ జోనల్ చైర్మన్ కాపా మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.