ఒంగోలు, సెప్టెంబర్ 11: తెలంగాణా అంశంపై క్యాబినెట్‌లో నోట్‌పెట్టేసమయంలో తాము విభేదిస్తామని, సమైక్యాంధ్రకోసం పార్లమెంటులో తన వాణిని వినిపించానని, అదేవిధంగా రాజీలేని పోరాటం చేస్తానని ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్రిభజన జరగదన్న నమ్మకం తనకుఉందన్నారు. అందరం కలిసికట్టుగా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమం మరింత ఉద్ధృతంగా ఉంటుందని అందువలన ఎన్‌జివోలు రాజకీయపార్టీలను కూడా కలుపుకుని ఉద్యమం చేస్తే బాగుంటుందని ఆయన విజ్ఞప్తిచేశారు. సీమాంధ్రలోని పార్లమెంటుసభ్యులు, శాసనసభ్యులందరూ సమైక్యాంధ్రకోసం పోరాటం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎన్‌జివోలు, రాజకీయపార్టీలకు అతీతంగా రాజకీయనాయకులుకలిసి సమైక్యాంధ్ర ఉద్యమ సభ పెడితే ఆ ఉద్యమం మరింతగా ఉగ్రరూపందాల్చుతుందని ఆయన తెలిపారు. తాను ఎంపి పదవీకోసంకాకుండా ప్రజాసేవకోసం వచ్చానని ఆయన ప్రజలకు గుర్తుచేశారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ అమెరికానుండి రాగానే సీమాంధ్రలో జరుగుతున్న అన్యాయాలను ఆమెకు విన్నవించనున్నట్లు పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోనియాగాంధీ హామీఇచ్చారని ఆయన వివరించారు. సీమాంధ్రలో జరుగుతున్న అన్యాయాలపై తాము పొరాటం సాగిస్తామని ఆయన తెలిపారు. సమైక్యాంధ్రకోసం షర్మిల, చంద్రబాబులు బస్సు యాత్రలు చేస్తున్నారని తమకు హైకమాండ్ ఆదేశాలు జారీచేస్తే యాత్రలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈనెల 7వతేదీన హైదరాబాదులో ఏర్పాటుచేసిన సీమాంధ్రప్రదేశ్ కార్యక్రమం విజయవంతంగా సాగించినందుకు ఎన్‌జివోలు, ఆర్‌టిసి, వివిధ కార్మిక సంఘాలకు ఆయన అభినందనలు తెలిపారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఎన్‌జివోలు సాగించటం భారతదేశంలోనే మొట్టమొదటదన్నారు. తమరాజీనామాలను ఆమోదించేవరకు పార్లమెంటులో ఉద్యమాలను కొనసాగించటం జరిగిందని ఆయన వివరించారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై హైకమాండ్ విప్‌జారీచేసినా తాను ఓటు వేయ్యనని ఆయన స్పష్టం చేశారు. ఎన్‌జివోలు, రాజకీయనాయకులు సభపెడితే ఆ సభను ఒంగోలులో ఏర్పాటుచేసేందుకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన తెలిపారు. సమైక్యాంధ్ర కోసం పార్లమెంటు లోపల,బయట ఉద్యమాలను కొనసాగించటం జరుగుతుందని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలో ఒంగోలు వ్యవసాయమార్కెట్ యార్డు ఛైర్మన్ అయినబత్తిన ఘనశ్యాం, యువజన నాయకులు జడా బాలనాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలిపిన మాగుంట
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, సెప్టెంబర్ 11: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తుకెరటాల్లా ఎగసిపడుతోంది. రోజురోజుకు ఉద్యమాల తీవ్రత పెరిగిపోతుండటంతో సామాన్య,మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఎన్‌జివోలు, నగర కార్పొరేషన్ సిబ్బంది విచిత్ర వేషధారణలతో సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు శ్రీనివాసరెడ్డి కార్పొరేషన్ సిబ్బందికి, ఉద్యోగులకు మద్దతు తెలిపేందుకు స్థానిక కలెక్టరేట్ వద్దకు విచ్చేశారు. ఈసందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతూ తమపదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని మాగుంటను కోరారు. ఈసందర్భంగా మాగుంట ఉద్యోగులతో మాట్లాడుతూ తాము గతంలోనే స్పీకర్ ఫార్మట్ రాజీనామాలను సమర్పించామని ఆ మేరకు పార్లమెంటు లోపల, బయట సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎంపిలు కూడా తమవాణిని వినిపిస్తున్నట్లు తెలిపారు. తాను సమైక్యవాదినేనని రాష్ట్రాన్ని విభజిస్తే ఒప్పుకునే ప్రసక్తేలేదని ఆయన ఉద్యోగులకు తెగేసి చెప్పారు. దీంతో ఉద్యోగులు కలుగచేసుకుని మాట్లాడుతూ మంత్రులు, ఎంపిలు తమపదవులకు రాజీనామాలు సమర్పిస్తే కేంద్రంలో రాజకీయసంక్షోభం ఏర్పాటుతుందని దీంతో ప్రభుత్వం దిగివచ్చి రాష్ట్ర విభజన ప్రకటననువెనక్కితీసుకునే అవకాశం ఉందని ఆవైపుగా తమ పదవులకు రాజీనామాలను చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు, ఎంపిల వలకం చూస్తుంటే పైకి సమైక్యాంధ్ర అంటూ లోపల మాత్రం తమపదవులను కాపాడుకుంటున్నారని ఉద్యోగులు నిలదీశారు. దీంతో స్పందించిన ఎంపి మాగుంట శ్రీనివాసరెడ్డి తాను సమైక్యావాదినేనని సమైక్యాంధ్రకు జై అంటూ నినాదాలు చేశారు. దీంతో ఎన్‌జివోలు, కార్పోరేషన్ సిబ్బంది కూడా మాగుంట నినాదాలకు గొంతుకలిపారు. అనంతరం స్థానిక జిల్లాకోర్టువద్ద న్యాయవాదులు చేపట్టిన రిలేనిరాహార దీక్షల వద్దకు ఎంపి మాగుంట వెళ్లి మద్దతు తెలిపారు.
ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్‌లో విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్రకు మద్దతుగా మానవహరం చేసారు. ఈసందర్భంగా విద్యుత్ ఉద్యోగులు సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ప్రైవేటు పాఠశాలల యజమాన్యాలు కూడా సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. దీంతో జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల మూతపడుతుండటంతో విద్యార్ధుల చదువులు కుంటుపడనున్నాయి. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటుతున్నాయి.
నేటి నుండి విద్యుత్ ఉద్యోగులు
72 గంటల సమ్మె
ఒంగోలు, సెప్టెంబర్ 11 : సమైక్యాంధ్రాకు మద్దతుగా ప్రకాశం జిల్లా విద్యుత్ ఉద్యోగుల జెఏసి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేది నుండి విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెను చేపట్టనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జెఏసి చైర్మన్ ఎన్ జయాకర్‌రావు, జెఏసి కన్వీనర్ టి సాంబశివరావు, రాష్ట్ర కో కన్వీనర్ ఎం హరిబాబులు తెలిపారు. బుధవారం స్థానిక కర్నూల్ రోడ్డులోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రకటన చేసిన తరువాత సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమాలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు నిరవధిక సమ్మెలను కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రాన్ని విభజించటం వలన ఉద్యోగులు, విద్యార్థులు నష్ట పోతారని, అదే విధంగా సాగు , తాగునీరు , విద్య, వైద్యం తదితర సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయని తెలిపారు. దీంతో తాము సమైక్యాంధ్రా సమ్మెకు మద్దతు తెలుపుతూ 12న గురువారం నుండి ఒంగోలులోని ఎస్సీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షా కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాము పై అధికారులకు తమ వద్ద ఉన్న సెల్ సిమ్‌లను కూడా అందజేశామన్నారు. తాము విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తమకు ఏలాంటి సంబంధం లేదని తెలిపారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకోవడం వల్లే ఇలాంటి సమస్య ఏర్పడిందని, కనుక ఇందుకు బాధ్యత కేంద్ర ప్రభుత్వం, మంత్రులు , ఎంపిలు బాధ్యత వహించాలని కూడా వారు తెలిపారు. రాష్ట్రం విభజించడం వలన సీమాంధ్ర అన్నీ విధాల నష్ట పోయే పరిస్థితి ఉందన్నారు. రాష్ట్రం మొత్తం మీద ఆదాయం సుమారు 83 కోట్ల రూపాయలు అయితే అందులో ఒక్క హైదరాబాద్ నగరం నుండి 54 వేల కోట్లు ఆదాయం వస్తుందని సీమాంధ్ర ప్రాంతం నుండి 18 వేల కోట్లు, తెలంగాణా ప్రాంతం నుండి 11 వేల కోట్లు ఆదాయం వస్తుందని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగితే 78 శాతం ఆదాయం తెలంగాణా రాష్ట్రానికి వస్తే కేవలం 22 శాతం ఆదాయం మాత్రమే సీమాంధ్ర రాష్ట్రానిక వస్తుందని, దీనిని బట్టి చూస్తే ఒక్క ప్రాంతానికి అంటే తెలంగాణాకే ఎక్కువ ఆదాయం ఇచ్చి, సీమాంధ్రకు తక్కువ ఆదాయం ఇవ్వడం వలన సీమాంధ్ర ప్రాంతంలో సంక్షేమ పథకాలు ఏలా ముందుకు సాగుతాయని తెలిపారు. విద్యుత్ పరంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉత్పత్తి, వినియోగంలో భారీ వ్యత్యాల కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గినందు వలన సబ్సిడీల భారం మోయలేనంతగా పెరిగి గృహ, వ్యాపార, పారిశ్రామిక వర్గాలకు కరెంట్ చార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే రైతులకు అందజేస్తున్న ఉచిత విద్యుత్ కూడా కనుమరుగైయ్యే ప్రమాదం ఉందన్నారు. సింగరేణి , బొగ్గు మనకు దూరమైన మనం ప్రక్క రాష్ట్రాలు, దేశాల నుండి బొగ్గు సరఫరా చేసుకుంటే సుంకాలు, రవాణా చార్జీలు పెరిగి ఇంధన సర్థుబాటు చార్జీలు విపరీతంగా పెరిగిపోతాయని విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. కనుక విద్యుత్ ఉద్యోగులతో పాటు ఎపి ఎన్జీవోలు, ఆర్టీసీ , ఉపాధ్యాయ, అన్నీ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, ప్రజలతో కలసి జరిగే సమ్మెను విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎడి ఈ పి శ్రీనివాసరావు, ఎఈ స్టాలిన్ కుమార్, ఎ ఈ ఉదయ్‌భాస్కర్, విద్యుత్ ఉద్యోగులు డి శేషయ్య, డి సురేష్, ఆర్ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
‘రాష్ట్రం రావణ కాష్టంలా మారినా స్పందించని యుపిఏ’
దర్శి, సెప్టెంబర్ 11 : కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వలన గత 43 రోజుల నుండి రాష్ట్రం రావణ కాష్టంలా మారిన యుపిఏ ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి శిద్దా రాఘవరావు విమర్శించారు. బుధవారం ఆ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు స్టీవెన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షా శిబిరాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన పూర్తిగా స్తంభించిందన్నారు. గత 43 రోజుల నుండి కోట్లాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి తెలంగాణా ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటే యుపి ఏ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు అయినా లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు రెండు గ్రూపులుగా వీడి రాష్ట్రంలో నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక పక్క సమైక్యాంధ్రాను సాధించేంత వరకు పోరాటాలు చేస్తామని , మరోక పక్క తెలంగాణా ప్రకటనలను వెనక్కి తీసుకునేది లేదని, వారే ప్రకటించి రాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు తెలుగు ఆత్మ గౌరవం పేరిట సీమాంధ్రలో పర్యటిస్తుంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితులను గాడిలో పెట్టగల సత్తా ఒక్క టిడిపి మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, దర్శి సర్పంచ్ జిసి గురవయ్య, సంఘా తిరుపతి రావు, మునగల శ్రీనివాసరావు, కలవకొలను చంద్రశేఖర్, దేవతు మహానంద, రాచపూడి మోష, గర్నెపూడి జోసఫ్, పరకాల అంజమ్మ, తిరుపతమ్మ, పూసల సంజీవయ్య, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి
త్రిజి కాలేజీకి చెందిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు
నాగులుప్పలపాడు, సెప్టెంబర్ 11 : గణేష్ నిమజ్జనంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులు మద్దిరాలపాడు వద్ద గల గుండ్లకమ్మలో గల్లంతయ్యారు. బుధవారం మద్దిరాలపాడులోని త్రిజి కాలేజీలో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాన్ని ఊరేగింపుగా కాలేజీ విద్యార్థులు మద్దిరాలపాడు వద్ద ఉన్న గుండ్లకమ్మకు నిమజ్జనం నిమిత్తం తీసుకొచ్చారు. నిమజ్జనం చేస్తున్న సమయంలో పదిమంది విద్యార్థులు వరద ఉద్ధృతికి కొట్టుకొని పోయారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద గేట్లు ఎత్తి వేయడంతో భారీగా నీటి ప్రవాహాం ఉండడంతో వీరు నీటిలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల హాహాకారాలు విని స్థానికులు నదిలోకి ఎనిమిదిమంది విద్యార్థులను రక్షించారు. ఇద్దరు మాత్రం గల్లంతైనట్లు తెలుస్తుంది. స్థానికుల కధనం మేరకు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కొరిశపాడు మండలం వేముల నాగరాజు (19), అదే మండలం పమిడి పాడు గ్రామానికి చెందిన గాదెంశెట్టి మురళీకృష్ణ ఉరఫ్ మహేంద్ర (20) డిగ్రీ ద్వితియ సంవత్సరం చదువుతున్నాడు. వీరిద్దరూ గల్లంతు అయినట్లుగా తెలుస్తుంది. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గల్లంతు అయిన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి
మర్రిపూడి, సెప్టెంబర్ 11 : మండలంలోని కూచిపూడి గ్రామానికి చెందిన మాచేపల్లి గురవయ్య కుమార్తె మాచేపల్లి సిరి (8) అనే బాలిక డెంగ్యూ జ్వరంలో బుధవారం మృతి చెందినట్లు బాలిక తండ్రి గురవయ్య తెలిపారు. వివరాల్లోకి వెళితే గత రెండు రోజులుగా జ్వరంతో బాధ పడుతూ మెరుగైన వైద్యం నిమిత్తం ఒంగోలుకు తీసుకొని వెళ్ళగా అక్కడ ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడం జరిగిందని, గుంటూరులో డాక్టర్లు డెంగ్యూ జ్వరం కారణంగా తెల్ల రక్తకణాలు తగ్గిపోవడంతో బాలిక మృతి చెందిందని తండ్రి గువరయ్య తెలిపారు. ఇదిలా ఉంటే బిసి కాలనీలో మురికినీరు నిల్వ చేరి దోమలు ఉదృతంగా ఉండడం వలన ఈ డెంగ్యూ జ్వరం వచ్చి ఉండవచ్చునని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
నిమజ్జనానికి వెళుతూ
ఒకరు దుర్మరణం
కొత్తపట్నం, సెప్టెంబర్ 11 : ఆదిదేవుడు లంబోదరుని నిమజ్జనానికి వెళుతూ బుధవారం కొత్తపట్నంలో ఒకరు దుర్మరణం పాలైన సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే ఒంగోలు మండలం పేర్నమిట్ట గ్రామానికి చెందిన దాసరి వెంకట్రావు (40) తన మిత్రులతో కలిసి గణేష్ నిమజ్జనానికి ట్రాక్టర్‌లో కొత్తపట్నం సముద్ర తీరానికి వెళుతున్నారు. కొత్తపట్నం బకింగ్‌హాం కెనాల్ దగ్గరికి చేరుకునే సరికి ట్రాక్టర్ అదుపుతప్పి దాసరి వెంకట్రావు కిందపడ్డాడు. కిందపడిన వెంకట్రావుకు తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదుచేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్ ఇత్తడి శ్రీనివాసరావు తెలిపారు.
రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ కాదు
* జిల్లా ఎన్‌జిఓ అధ్యక్షులు బషీర్
మార్కాపురం టౌన్, సెప్టెంబర్ 11: రాష్ట్రాన్ని విభజించడం ఆషామాషీ విషయం కాదని, ఆంధ్రరాష్ట్ర అవతరణకు పట్టిన కాలాన్ని గ్రహిస్తే మరో దశాబ్దకాలం పడుతుందని ప్రకాశంజిల్లా ఎన్‌జిఓ అధ్యక్షులు బషీర్ అన్నారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు 50సంవత్సరాల చరిత్ర ఉందని, 1903 నుంచి 1953 వరకు ఎన్నో ఉద్యమాలు చేస్తే ఎన్నో కమిటీలు వేసి తుది నివేదికతో రాష్ట్ర అవతరణ జరిగిందని అన్నారు. స్థానిక వాసవీకళ్యాణ మండపంలో బుధవారం రాత్రి జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆంధ్రరాష్ట్ర అవతరణకు దీర్ఘపోరాటం జరిగిందని, ఎన్నో కమిటీల నివేదికను క్షుణ్ణంగా పరిశీలించాక ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ఉద్యమం రాజకీయ స్వార్ధంతో కూడినదని అన్నారు. చంద్రబాబు తన పార్టీలో నుంచి కెసిఆర్‌ను బయటకు నెట్టితే 2002లో టిఆర్‌ఎస్ పార్టీ పెట్టి స్వార్ధరాజకీయం కోసం తెలంగాణ పోరాటం చేశారని అన్నారు. ఇప్పటివరకు ఎన్నో కమిటీలను పెట్టిన ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ నివేదికను క్షుణ్ణంగా పరిశీలించకుండానే ఆంటోని కమిటీని పెట్టిందన్నారు. ఇప్పటికే సమైక్యసెగ ఢిల్లీకోటకు తగిలి అధిష్ఠానం తల్లడిల్లుతుందన్నారు. విభజన చేయాలంటే పార్లమెంటులో బిల్లు పెట్టాలని, నోట్ అసెంబ్లీలో తీర్మానానికి పెట్టాలని, ఇవేమి లేకుండా తెలంగాణ ఇచ్చేందుకు సోనియా, కెసిఆర్‌ల జాగీర్ ఏమి లేదన్నారు. ఉద్యోగులు చేస్తున్న ఉద్యమం ఉధృత రూపం దాల్చిందని, విద్యుత్ ఉద్యోగులు సైతం సమ్మెలో దిగడంతో రాష్ట్రం మొత్తం 92శాతం ఉద్యోగులు సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉన్నారని అన్నారు. ఉద్యోగులకు కాదని ఏరాష్ట్రం సొంత నిర్ణయాలకు ముందడుగు వేయదని అన్నారు. ఉద్యోగులకు ఎన్‌జిఓ సంఘం అండగా ఉంటుందని, అలుపెరుగని ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. సంఘ కార్యదర్శి బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ రక్తం పురంథేశ్వరి ఒంట్లో ఉంటే తక్షణమే పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతు ఇచ్చి ఉద్యమానికి ఊపిరిపోయాలని అన్నారు.
ఈకార్యక్రమానికి ఎన్‌జిఓ సంఘ నాయకులు బివి శ్రీనివాసశాస్ర్తీ, నరేంద్రలు అధ్యక్షత వహించగా ఎన్‌జిఓ నాయకురాలు రాజ్యలక్ష్మీ, ఆర్టీసీ రీజనల్ కన్వీనర్ నాగేశ్వరరావు, ఆర్టీసీ నాయకులు ప్రసాద్, ఉమామహేశ్వరరావు, దస్తగిరి, బార్ అసోసియేషన్ నాయకులు బాలరంగారెడ్డి, పిఎల్‌పియాదవ్, సిడిపిఓలు ధనలక్ష్మీ, రమిజభాను, ఎసిటిఓ కృష్ణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఓవి వీరారెడ్డి, ఎర్రయ్య, కొమరోలు తహశీల్దార్ మధుసూదనరావు, ఆర్యవైశ్య ప్రముఖులు రామడుగు కోటేశ్వరరావు, ఎపిటిసిఎ జిల్లా అధ్యక్షులు చెంచిరెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు.