Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

విరామమెరుగని పోరు

$
0
0

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా చేపడుతున్న ఉద్యమం విరామమెరుగకుండా ముందుకు సాగుతోంది. సమైక్యాంధ్ర కోసం ఎవరికి వారుగా ఉద్యమంలో భాగస్వాములై మద్దతును తెలియజేస్తున్నారు. ప్రజాప్రతినిధులు రాజీనామా చేయకుంటే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. సమ్మెలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఉన్నతాధికారులు ఉండగా ప్రభుత్వ పాలనా వ్యవస్థ, బడులకు తాళాలు పడిన విషయం తెలిసిందే. అయితే 12వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెలోకి దిగాలని నిర్ణయించినా సిఎం విజ్ఞప్తి మేరకు వాయిదా పడింది. సిక్కోల్‌లో ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు సమైక్యాంధ్ర జేఏసి కార్యాచరణ ప్రకటించింది. బంద్‌లు, రాస్తారోకోలు, వంటావార్పులతో నిరసనలు వ్యక్తం చేశారు. బుధవారం సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియంలో జిల్లా సాక్షరభారత్ కోఆర్డినేటర్ల సంఘంఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ముందుగా వీరు అక్కడ నుండి ఏడురోడ్ల జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టి జై సమైక్యాంధ్ర..జైజై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. కలెక్టరేట్ వద్ద హౌసింగ్ ఉద్యోగులు ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించి రోడ్డుపైనే భోజనాలు చేశారు. నందిగాం మండల రెవెన్యూ సిబ్బంది కలెక్టరేట్ వద్ద దీక్షలకు దిగారు. ఆర్టీసి ఉద్యోగులు ఆధ్వర్యంలో కాంప్లెక్స్ నుండి పొట్టిశ్రీరాములు జంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తంచేశారు. జెడ్పీ ఉద్యోగులు షిండే డౌన్...డౌన్.. అంటూ దిష్టిబొమ్మతో ఊరేగింపు చేసి అనంతరం దగ్ధం చేశారు. పట్టణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దీక్షలను ఆ పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు, న్యాయవాదులు, మున్సిపల్ ఉద్యోగులు చేపడుతున్న రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. పాలకొండ రెవెన్యూ డివిజన్‌లో 13 మండలాల్లో సమైక్యాంధ్ర జేఏసి పిలుపు మేరకు బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి సమైక్యవాదులు రోడ్లెక్కి వాహనాలను అడ్డుకున్నారు. వ్యాపారులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి సమైక్య ఉద్యమానికి మద్దతు తెలిపారు. పాలకొండలో సమైక్యాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో సాగిస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్ మద్దతు తెలిపేందుకు రాగా ఉద్యోగులు ఆయనను అడ్డుకున్నారు. రాజీనామా చేయకుండా శిబిరంలోకి రావొద్దని స్పష్టంచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ర్యాలీలు, రాస్తారోకోలతో నిరసన వ్యక్తంచేశారు. పాలకొండ, సారవకోట, పాతపట్నం, రాజాం, వంగర, సంతకవిటి, సీతంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. జి.సిగడాంలో సమైక్యాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో రాష్ట్ర విభజనపై జరిగే నష్టాల గూర్చి అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో సమైక్యవాదులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. నరసన్నపేటలో క్రిష్టియన్ సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. అలాగే ఉపాధ్యాయులు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జలుమూరు మండలం చల్లవానిపేటలో ఉపాధ్యాయ జేఏసి ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలో అంధులు పాల్గొని సమైక్యగేయాలు ఆలపించారు. పలాస, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, మందస, వజ్రపుకొత్తూరు, కోటబొమ్మాళి తదితర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి.

మీ వాళ్లైతే ఇలానే చేస్తారా..?
లావేరు, సెప్టెంబర్ 11: జ్వరాలతో మంచంపట్టిన బుడతవలస గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. గ్రామంలో జ్వరాల తీవ్రతను తెలుసుకున్న కలెక్టర్ బుధవారం అకస్మాత్తుగా అక్కడకు చేరుకుని జ్వరాలపై ఆరాతీశారు. ఇంటింటికీ వెళ్లి రోగులను పరామర్శించారు. గ్రామంలో పారిశుద్ధ్యలోపంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. వారం రోజులుగా జ్వరాలు రోగులను పట్టిపీడిస్తున్నా వైద్యసిబ్బంది స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ కుటు ంబ సభ్యులు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలాగే చూస్తూ ఊరుకుంటారా అని లావేరు పిహెచ్‌సి వైద్యాధికారిణి భారతీదేవిని ప్రశ్నించారు. తగిన మందులు అందుబాటులో ఉంచుకుని రోగులకు స్వస్థత చేకూరేంతరకు శిబిరాలు కొనసాగించాలని సూచించారు. జ్వరాల తీవ్రత మరింతగా పెరగకుండా చూడాలన్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ నర్సింహులు, మాజీ సర్పంచ్ రౌతు శ్రీనివాసరావు, పిహెచ్‌సి వైద్యాధికారిణి భారతీదేవి, హెల్త్ సూపర్‌వైజర్ రమణమూర్తి, ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు.

రిజిస్ట్రార్ కుర్చీ కోసం పైరవీలు
ఎచ్చెర్ల, సెప్టెంబర్ 11: జిల్లాలో ఉన్నతవిద్యాఫలాలు అందించేందుకు కృషిచేస్తున్న అంబేద్కర్ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పదవీకాలం ఈ నెల 16వ తేదీతో ముగియనుండడంతో ఆ కుర్చీని దక్కించుకోవాలని పలువురు ఆచార్యులు తెరవెనుక యత్నాలు సాగిస్తున్నారు. వర్సిటీ ఆవిర్భావం అనంతరం మొదటివీసీగా ఎస్.వి.సుధాకర్‌ను నియమించగా రిజిస్ట్రార్‌గా ఆచార్య జ్ఞానమణిని ఆగస్టు 25, 2008న నియమిస్తూ ఉన్నతవిద్యామండలి ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ఆచార్యులే...రిజిస్ట్రార్ జ్ఞానమణి 2009, ఆగస్టు 25వ తేదీవరకు సేవలందించి తిరిగి ఆచార్యులుగా ఎ.యుకు బదిలీ అయ్యారు. అనంతరం ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన కామర్స్ ఆచార్యులు కృష్ణమోహన్‌కు 2009, సెప్టెంబర్ 16వ తేదీన రిజిస్ట్రార్‌గా ఎం.అండ్ డిసి అవకాశం కల్పించింది. అయితే వీసీ నియామకం జాప్యం కావడంతో నాలుగేళ్లపాటు రిజిస్ట్రార్‌గా నలుగురు వీసీల వద్ద పనిచేసే ఛాన్స్ కృష్ణమోహన్‌కు లభించింది. అయితే ఈయన పదవీకాలం ముగియనుండటంతో రిజిస్ట్రార్ కుర్చీ కోసం స్థానిక నినాదానికి కొందరు ఆచార్యులు లేవనెత్తారు. జిల్లాకు చెందిన విశేష అనుభవం ఉన్న ఆచార్య హెచ్.లజపతిరాయ్‌ను వీసీగా ఇటీవల నియమితులవడంతో రిజిస్ట్రార్ కుర్చీ ఎవరికి అప్పగిస్తారోనన్న వాడివేడి(మిగతా 2వ పేజీలో)
చర్చ ఊపందుకుంది. సీనియర్ ఆచార్యునిగాఉండి ప్రిన్సిపాల్‌గా సేవలందిస్తున్న ఎం.చంద్రయ్యకు రిజిస్ట్రార్ ఛాన్స్ దక్కుతుందని అనేక మంది భావిస్తున్నారు. ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన రాష్టమ్రంత్రి కూడా వీసీపై ఒత్తిడి పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో ఆచార్యులు తులసీరావుకు రిజిస్ట్రార్ పదవి దక్కుతుందని కొంతమంది భావిస్తున్నప్పటికీ ఒకే సామాజికవర్గానికి వీసీ, రిజిస్ట్రార్ పదవులను ఎలా కేటాయిస్తారని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటువంటి సంక్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలన్న సంశయంలో వీసీ ఉన్నట్లు వర్శిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. వర్శిటీ స్నాతకోత్సవం...సిబ్బంది నియామకం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని అనుభవం ఉన్న కృష్ణమోహన్‌ను రిజిస్ట్రార్‌గా కొనసాగించాలన్న ఆలోచనలో వీసీ ఉన్నట్లు సమాచారం. ఏదిఏమైనా వీసీ కుర్చీ కత్తిమీద సాములా వర్శిటీకి తయారైంది.
ఎం.అండ్.డి.సి ప్రతిపాదనల మేరకే
రిజిస్ట్రార్ నియామకం ఎం.అండ్.డి.సి ప్రతిపాదనల మేరకే నియామకం చేయాల్సి ఉంటుందని వైస్ ఛాన్సలర్ లజపతిరాయ్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో ఏర్పడ్డ తాజా సంక్లిష్ఠ పరిస్థితుల వలన ఎం.అండ్.డి.సి సర్వసభ్య సమావేశం ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదన్నారు. ఎం.అండ్.డిసి సమావేశంలో చర్చించిన మేరకే రిజిస్ట్రార్ నియామకం చేపడతామన్నారు.

తెలుగోడిలో ఆత్మస్థైర్యం నింపేందుకే
బాబు యాత్ర
శ్రీకాకుళం (టౌన్), సెప్టెంబర్ 11: తెలుగోడి ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్ర చేపడుతున్నారని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడి పేర్కొన్నారు. పట్టణ కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలేదీక్షా శిబిరాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుజాతిని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడాలని నాడు దివంగత ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే, నేడు చంద్రబాబు నాయుడు తెలుగోడిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు బస్సుయాత్ర చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని పరిశీలించిన సోనియా విభజనతో తెలుగువారి మధ్య చిచ్చు రేపిందన్నారు. అయితే తెలుగోడి సత్తా ఉద్యమ రూపంలో చూపామన్నారు. దేశంలో చాలా రాష్ట్రాల డిమాండ్లు ఉన్నా వాటి జోలికి వెళ్లని సోనియా ఆంధ్ర రాష్ట్రాన్ని విభజిస్తారా అంటూ మండిపడ్డారు. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలను ఒప్పకునేది లేదని స్పష్టంచేశారు. టిఆర్‌ఎస్ విలీనం కోసమే కాంగ్రెస్ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఆంధ్ర, తెలంగాణా, రాయలసీమ వారి కష్టార్జితమే హైదరాబాద్ అని అటువంటి నగరం నుంచి సీమాంధ్రులు విడిచివెళ్లేది లేదన్నారు. సమైక్య ఉద్యమం రాజ్యాంగ విరుద్ధమంటున్న కోదండరామ్, 70 శాతం ఆదాయం ఉన్న ఆంధ్ర, 50 శాతం ఆదాయం ఉన్న రాయలసీమ, 170 శాతం ఆదాయం ఉన్న తెలంగాణా అభివృద్ధి ఒక్కటేనా అని ప్రశ్నించారు. తెలంగాణాకు మొదటగా ఆజ్యం పోసింది దివంగత వై ఎస్సార్ అయితే రెండో ముద్దాయి సీట్ల కోసం విభజన నిర్ణయాన్ని ప్రకటించిన సోనియాగాంధీ అన్నారు. పదవుల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టిన టిఆర్‌ఎస్ మూడో ముద్దాయి, చిన్న రాష్ట్రాలకు వత్తాసు పలుకుతున్న బిజెపి నాలుగో ముద్దాయిగా నిలువగా, లేఖ ఇచ్చిన టిడిపి ఆరో ముద్దాయి అవుతుందని పేర్కొన్నారు. విధిలేని పరిస్థితుల్లోనే తమ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణాలో ఉన్న గనుల కోసం వైకాపా నేతలు రాష్ట్రం కలిసుండాలని కోరుతున్నారు తప్ప, తెలుగుజాతి కోసం కాదని అన్నారు. శాసనసభ, పార్లమెంటులో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామని చెప్పారు. లోక్‌సభలో సమైక్యాంధ్ర కోసం టిడిపి ఎంపీలు పోరాడితే, కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడకుండా, సిగ్గులేకుండా కూర్చున్నారని విమర్శించారు. తొలుత పార్టీ నేతలు కింజరాపు రామ్మోహననాయుడు, గుండ అప్పలసూర్యనారాయణ, చౌదరి బాబ్జి, ముద్దాడ కృష్ణమూర్తినాయుడు, కొర్ను ప్రతాప్‌లకు మాలవేసి దీక్షలు ప్రారంభించారు.

చెరువులో మునిగి
బాలికలు మృతి
నరసన్నపేట, సెప్టెంబర్ 11: స్నానాకని వెళ్లి చెరువులో దిగిన ఆ ఇద్దరు విద్యార్థినులు ప్రమాదవశాత్తూ నీటమునిగి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. మండలంలో నడగాం గ్రామంలో ఉన్న కొత్తచెరువులో ఉదయం ఏడవ తరగతి చదువుతున్న సుంకరి దివ్య(12), ఎనిమిదవ తరగతి చదువుతున్న అలిగి కృష్ణవేణి(13)లు స్నానానికని గ్రామంలో కొత్తచెరువులో దిగారు. చెరువు లోతుగా ఉండడంతో ఈత రాక మునిగిపోయారు. ఉదయం స్నానాకని వెళ్లిన వీరిద్దరూ 12 గంటలైనా ఇంటికి చేరుకోకపోవడంతో అనుమానమొచ్చిన తల్లిదండ్రులు చెరువు వద్దకు వెళ్లి గాలించగా వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకైక కుమార్తెలైన వీరు మృతిచెందడంతో దివ్య తల్లిదండ్రులు సుంకరి అప్పలసూరి, ఎర్రమ్మలు, అలిగి కృష్ణవేణి తల్లిదండ్రులు భగవతి, వరహాలు కన్నీటిపర్యంతమయ్యారు. గ్రామమంతా విషాధచాయలు అలముకున్నాయి. ఏనాడూ ఇటువంటి సంఘటన జరుగలేదని సర్పంచ్ రాణ చెల్లాయమ్మ, జిల్లా నీటిసంఘం మాజీ అధ్యక్షుడు రాడ మోహనరావు ఆవేదన వ్యక్తంచేశారు. అనుకోని సంఘటన తో గ్రామంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే సంఘటన జరిగిన తరువాత పోలీసులకు ఎటువంటి సమాచారం అందించలేదని స్థానికులు తెలిపారు.

నక్షత్ర తాబేళ్లను పట్టించుకోరా..!
గార, సెప్టెంబరు 11: విష్ణుమూర్తి అవతారాల్లో రెండవదైన కూర్మావతారానికి ప్రతిరూపంగా భావించే నక్షత్ర తాబేళ్లకు సమస్యలు వెంటాడుతున్నాయి. సుమారు రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఇక్కడి పార్కులో అప్పట్లో సుమారు 120 వరకు నక్షత్ర తాబేళ్లు ఉండేవి. కొందరు జంతు ప్రేమికులు చొరవతో న్యాయ స్థానం ఆదేశాల మేరకు కృష్ణమ్ వందే జగద్గురుమ్ సంస్థ ముందుకు వచ్చి తాబేళ్లకు ప్రత్యేక వసతి సౌకర్యాన్ని కల్పించింది. అదేవిధంగా ఇక్కడి వాతావరణం కలుషితం కాకుండా ఉండేందుకు పార్కులో అరేకాఫాం మొక్కలు సుమారు 70 వరకు ఉన్నాయి. గతంలో 120 వరకు ఉన్న తాబేళ్లు సంఖ్య ప్రస్తుతం రెండు వందలు పైచిలుకు పెరిగిందంటే ఇక్కడ కృత్రిమంగా కల్పించిన సహజ సిద్ధమైన వాతావరణమే కారణంగా చెప్పవచ్చు. వసతి సౌకర్యాలు మెరుగ్గా ఉండడంతో వృద్ధి అవుతున్న సంతతికి ఆకలి, ఆరోగ్య సమస్యలు మాత్రం తలెత్తుతున్నాయి. ఈ సమస్యలు అధిగమించాలంటే మూలవిరాట్ దృష్టి సారించాల్సిందే. ఎందు కంటే వీటి ఆహారానికి రోజుకు సుమారు 20కేజీల ఆకుకూరలు అవసరం ఉంటుంది. కాని అందుకు గాను శాఖా పరంగా కేవలం వంద రూపాయలు మాత్రమే వెచ్చిస్తున్నారు. ఈ వెచ్చింపు ఎటూ చాలకపోవడంతో ప్రత్యేక పర్వదినాలు మినహా ఇవి ప్రతీ రోజు అర్ధాకలితోనే జీవనం సాగిస్తున్నాయని చెప్పవచ్చు. (పర్వదినాల్లో భక్తులు తెచ్చే ఆహారం వీటికి పుష్కలంగా లభిస్తుంది కాబట్టి) కనీసం ఆరోగ్యపరంగా వీటికి శాఖాపరమైన ఆదరణ కరవే. ఈ తాబేళ్లు దీన స్థితిని మెరుగు పరిచేందుకు ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందన్న ఆలోచనతోనే సంబంధిత శాఖాధికారులు కాలం వెళ్లుబుచ్చుతున్నారే తప్ప తమ వంతుగా చేస్తుంది ఏమిటన్నది ప్రశ్నించుకోకపోతుండడం బాధాకరం.
కూర్మనాథునికి ప్రతిరూపాలుగా భక్తులు భావిస్తున్న నక్షత్ర తాబేళ్లుపై శీతకన్నుగా వ్యవహరిస్తుండడం బాధాకరం. ఇకనైనా వీటి సంరక్షణకు దేవాదాయ శాఖాపరంగా చర్యలు చేపట్టాల్సి ఉందని భక్తులు విశ్వసిస్తున్నారు.

ఉత్సాహమే అసలు గురువు
శ్రీకాకుళం(కల్చరల్), సెప్టెంబర్ 11: ఏ వ్యక్తి అయిన ఉత్సాహాం, ప్రతిభ కనబరచడం ద్వారా ప్రోత్సాహాన్ని పొందుతారని సినీ నటుడు రావి కొండలరావు అన్నారు. వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఉపనిష్మందిరం సాహిత్య గణపతి, ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో బుధవారం రాత్రి పట్టణంలోని కోదండరామ మందిరంలో అలానాటి సినీ సాహిత్య వైభవం అనే ప్రధాన అంశంగా ప్రసంగించారు. నాటి సినిమాలను కళాఖండాలుగా ప్రజలు భావించేవారని, నేటి చిత్రసీమ సమాజాన్ని భ్రష్టుపట్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళంతో తనకున్న అనుబంధం వివరిస్తూ పట్టణ వీధుల్లో విచ్చలవిడిగా తిరుగుతూ తన నాటక, సాహిత్య జీవితం పదవ ఏటనే ప్రారంభమైయ్యిందన్నారు. చదువుకున్న రోజుల్లోనే తోటి విద్యార్థులైన బండారు చిట్టిబాబు, దూసి బెనర్జీ, డ్రాయింగ్ మాష్టర్ భాస్కరరావు, తమ్ముడితో కలసి సుకుమార్ ఆర్కిస్ట్రాను ఇక్కడే ఆరంభించడం జరిగిందన్నారు. స్వాతంత్య్ర పోరాటం సమయంలో జైలు జీవితం తనకు సాహిత్యంపై ఆసక్తి పెంచిందన్నారు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో జిల్లా ప్రజలు స్వచ్ఛందంగా చేపడుతున్న ఉద్యమం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>