మహబూబ్‌నగర్, మార్చి 5: ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో మంత్రులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ ఉప ఎన్నికల ఇన్‌చార్జి, ఎమ్మెల్యే మేచినేని కిషన్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం టిడిపి జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణ, మరికొందరు మంత్రులు ఎన్నికల ప్రచారంలో నియమావళిని కాలరాస్తున్నారని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి టిడిపి తీసుకెళ్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనే భయం ఆ పార్టీ నాయకుల్లో, ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రుల్లో వణుకు పుడుతుందన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయని అన్నారు. మహబూబ్‌నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్, బిజెపి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. ఒకపక్క కెసిఆర్ మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిని బరిలోకి దింపి మరోపక్క జెఎసిలో ఉన్న బిజెపిని సైతం బరిలోకి దింపారని, అసలు కెసిఆర్ తెలంగాణ ప్రజలు అమాయకులని భావిస్తున్నారని, అయితే మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు ఎక్కడ చురక పెట్టాలో అక్కడ కెసిఆర్‌కు పెట్టనున్నారని విమర్శించారు. ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్, బిజెపి కుట్రలను ఈ నియోజకవర్గ ప్రజలు గమనించారని, ఆ రెండు పార్టీలకు ఓటమి తప్పదని హితవుపలికారు. మైనారిటీలకు సమాన అవకాశాలు కల్పించిన పార్టీ టిడిపియేనని అన్నారు. ఓ తప్పు చేశామని, అది బిజెపితో అప్పట్లో పొత్తు పెట్టుకోవడం పెద్ద తప్పిదమేనని, ఆ విషయాన్ని ఇదివరకే మా నాయకుడు చంద్రబాబునాయుడు బహిరంగంగా చెప్పడంతో పాటు మదన పడ్డారని అన్నారు. జిల్లా అభివృద్ధిని విస్మరించిన మంత్రి అరుణ ఏమి ఉద్దరించారని ప్రజల ముందుకు ఓట్లు అడగడానికి వస్తున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ టిడిపి హయాంలోనే అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి శూన్యమన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచి ప్రజలను మభ్యపెట్టినా టిడిపినే గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు హయాంలోనే జిల్లా అభివృద్ధి జరిగిందని అన్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలోనే జరిగిన అభివృద్ధి ఎప్పుడు కూడా జిల్లాలో జరగలేదని, అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగాలకు, వారి బందోబస్తులకే ప్రాధాన్యతను ఇచ్చుకున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ కెసిఆర్‌ను ప్రజలు నమ్మడం లేదని, ఈ ఎన్నికల్లో తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 2009లో 40కి పైగా సీట్లు కూటమిలో ఇస్తే కెసిఆర్ గెలుచుకున్నది ఎంతో తెలంగాణ ప్రజలకు తెలుసని, ప్రస్తుత ఉప ఎన్నికల్లో కూడా కెసిఆర్‌కు శృంగభంగం తప్పదని ఆయన ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో టిడిపి నాయకులు రాజేశ్వర్‌గౌడ్, శేఖర్‌నాయక్, చంద్రవౌళి, వెంకటయ్య, నాగేశ్వర్‌రెడ్డి, మాల్యాద్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*ఎమ్మెల్యే మేచినేని కిషన్‌రెడ్డి
english title:
ff
Date:
Tuesday, March 6, 2012