Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తొలిరోజు బంద్ సంపూర్ణం

$
0
0

మచిలీపట్నం, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన 48గంటల బంద్ తొలిరోజైన బుధవారం సంపూర్ణంగా ముగిసింది. జనజీవనం స్తంభించింది. ఎవరికి వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతో జిల్లా దద్దరిల్లింది. వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పెట్రోలు బంక్‌లు పూర్తిగా మూతబడ్డాయి. సినిమా ప్రదర్శనలను నిలిపివేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. బ్యాంక్‌లు మూతబడటంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. ఆఖరికి ఆటోలను కూడా తిరగనివ్వలేదు. గుడివాడ మినహా జిల్లా అంతటా బంద్ జరిగింది. ఈ నెల మొదటి మూడురోజులు గుడివాడలో నిరవధిక బంద్ జరగటంతో 48గంటల బంద్ నుండి మినహాయించారు. బందరు, గుడివాడ, నూజివీడు, విజయవాడ డివిజన్‌లలో పూర్తి బంద్ పాటించారు. మచిలీపట్నం జిల్లా కోర్టు ఆవరణలో పోస్ట్ఫాసు పోస్టుమాష్టర్ బంద్‌కు సహకరించకపోవటంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు టెలిఫోన్, విద్యుత్ సరఫరాను కట్ చేసి పోస్ట్ఫాసు ఎదుట బైఠాయించారు. పోలీసులు రంగప్రవేశం చేసి పోస్ట్‌మాష్టర్‌కు రక్షణ కల్పించారు. సమైక్యవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జిఓలు బైక్ ర్యాలీ, విద్యార్థుల ప్రదర్శనతో గుడివాడ అట్టుడికింది. మైలవరంలో ఉపాధ్యాయులు, వైద్యులు, ఉద్యోగులు బైక్ ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో 48గంటల రిలే దీక్షను ప్రారంభించారు. తిరువూరులో ఆందోళనకారులు భారీ ర్యాలీ జరిపారు. ఉయ్యూరులో టాక్సీ ఓనర్స్ అసోసియేషన్, ఆర్టీసీ కార్మికులు, ఎన్‌జిఓలు, వ్యాపారులు వేర్వేరుగా ప్రదర్శనలు నిర్వహించి పెద్దపెట్టున సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. గుడ్లవల్లేరులో 500 మీటర్ల జాతీయ పతాకంతో వేలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. నందిగామ, కంచికచర్ల, జగ్గయ్యపేట, కైకలూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, పామర్రు, గూడూరు, నాగాయలంక, అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, మొవ్వ, ఎ.కొండూరు, జి.కొండూరు, ముసునూరు, విస్సన్నపేట, హనుమాన్‌జంక్షన్ ఇలా అన్ని మండలాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటించి ర్యాలీలు నిర్వహించారు. అన్నిచోట్ల రిలే దీక్షలు కొనసాగాయి. గురువారం కూడా జిల్లా అంతటా బంద్ జరగనుంది.

స్వామి వివేకానందుని ఆశయ సంపత్తి... యువతకు చైతన్యస్ఫూర్తి
విజయవాడ, సెప్టెంబర్ 11: భారతీయ హైందవ సమాజానికి వేల సంవత్సరాల జ్ఞాన భాండాగారాన్ని అందించిన మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద అని వక్తలు కొనియాడారు. యువత తమ ఆలోచనలను సన్మార్గంలో ఉంచినట్లయితే భారతదేశం సుసంపన్నంగా వెలుగొందుతుందని అన్నారు. స్వామి వివేకానంద చికాగోలోని సర్వమత సమ్మేళనంలో ప్రసంగించిన రోజును పురస్కరించుకుని బుధవారం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ‘దేశం కోసం యువత పరుగు’ అనే కార్యక్రమంతో పాటు సభ నిర్వహించారు. భారత జాతిని మొత్తం జాగృతం చేసి మన హైందవ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన స్వామి వివేకానందుని నేడు ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగు జాడల్లో ముందుకు సాగాలని వక్తలు ఆకాంక్షించారు. సభకు అధ్యక్షత వహించిన ఉత్సవ కమిటీ అధ్యక్షులు టి హనుమంతరావు మాట్లాడుతూ స్వామి వివేకానందుని ఆశయాలకనుగుణంగా యువతలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా మేథావుల సదస్సు, ఇంటింటికి వివేకానంద, విద్యా సంస్థల్లో సదస్సులు, కార్యకర్తల శిక్షణ తరగతులు వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో ముఖ్య అతిథి ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ మాట్లాడుతూ సనాతనధర్మం విశిష్టతను వివేకానందుడు ఆనాడు చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో వివరిస్తుంటే వేలాది మంది తమ గుండె చప్పుడు సైతం వినిపించేంత నిశ్శబ్దంతో అయన ప్రసంగాన్ని ఆలకించారన్నారు. భరతజాతి గౌరవాన్ని, హైందవ సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచ దేశాలకు తన ప్రసంగంలో గళమెత్తి ఘోషించి వినిపించారని అన్నారు. రామకృష్ణ మిషన్ అధ్యక్షులు శివానందస్వామి, మాతా శివచైతన్యానందజీ తదితరులు సభనుద్దేశించి ప్రసంగించారు. అనంతరం దేశం కోసం యువత పరుగు కార్యక్రమాన్ని ప్రముఖ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి ప్రారంభించారు. ఈ పరుగు కార్యక్రమం స్టేడియం నుండి ప్రారంభమై రాఘవయ్య పార్కు వద్ద ఉన్న వివేకానందుని విగ్రహం వద్దకు చేరి తిరిగి స్టేడియంకు చేరింది.

దేశం కోసం యువత పరుగు
మచిలీపట్నం (కల్చరల్), సెప్టెంబర్ 11: స్వామి వివేకానంద 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని బుధవారం పట్టణంలో ‘దేశం కోసం.. యువత పరుగు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. 1883 సెప్టెంబర్ 11న వివేకానంద స్వామి చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో ప్రసంగించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీటాకీసు సెంటరు నుండి కోనేరుసెంటరు వరకు బాలాజీ విద్యాలయం, సాయి సిద్ధార్థ, కృష్ణవేటి ఐటిఐ, బాలభాను, అమలేశ్వరి, ఇంద్రకీలాద్రి విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. హిందూ కళాశాల, అనుబంధ సంస్థల పాలకవర్గ అధ్యక్షుడు డా. ధన్వంతరి ఆచార్య జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరేపు వెంకటేశ్వరరావు, వివేకానంద చిత్రపటానికి ఎం శాస్ర్తీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు కొమరగిరి చంద్రశేఖర్, శివలెంక ఉదయశంకర్, చినముత్తేవి సూర్యప్రకాశరావు, చంద్రశేఖర్, వాసుదేవరావు, సుందరరాం, దినేష్, కొత్తగుండు రమేష్ పాల్గొన్నారు.

పిడుగుపాటుకు వ్యక్తి మృతి
ముదినేపల్లి, సెప్టెంబర్ 11: పొట్టికూటికై పొలం పనులకు వెళ్ళి నారు లాగుతున్న వ్యక్తిపై పిడుగు పడి మృత్యువు కబలించిన విషాధ సంఘటన బొమ్మినంపాడు గ్రామం వద్ద బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముదినేపల్లి మండలం ములకలపల్లి గ్రామానికి చెందిన జంగం ఏసుపాదం బొమ్మనంపాడు గ్రామానికి బుధవారం పొలంలో నారు తీసేందుకు వెళ్ళాడు. వర్షం బాగా కురుస్తుండటంతో చెట్టు కింద తలదాచుకునేందుకు నిలబడ్డాడు. ఉరుము పెద్ద శబ్దంతో చెట్టుకింద నిలబడిన జంగం ఏసుపాదంపై పిడుగు పడడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడి మృతి చెందడం. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో వారు విలపిస్తున్న తీరు హృదయాలను కలచి వేస్తుంది. ఈ పిడుగుపాటు 20 కి.మీ మేర ఆయా గ్రామాలలో ప్రభావితం చేసింది. ఈ మేరకు కె.ఈశ్వరరావు శవాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సమైక్యంగా ఉంచేవరకు పోరాటం ఆగదు
పెదపారుపూడి, సెప్టెంబర్ 11: కేంద్ర ప్రభుత్వ కళ్లు తెరిచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవరకు ఉద్యమం ఆగదని పెదపారుపూడి కాంప్లెక్స్ ఉపాధ్యాయులు అన్నారు. బుధవారం మండలంలో ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష 19వ రోజుకు చేరింది. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే అథోగతి పాలేనని అన్నారు. దీక్ష చేస్తుండగా వర్షం రావడంతో రోడ్డుపైకి వచ్చి కుర్చీలు నెత్తిన పెట్టుకుని నిల్చున్నారు. అనంతరం తెలంగాణ వద్దు, సమైక్యమే ముద్దు అని నినాదాలు చేశారు. దీక్షలో ఉపాధ్యాయులు చిట్టిబాబు, శేషగిరి, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కనె్నర్రజేస్తే మసైపోతావ్!
* చంద్రబాబుకు డిసిసి అధ్యక్షుడు నరహరిశెట్టి హెచ్చరిక
విస్సన్నపేట, సెప్టెంబర్ 11: జిల్లాలో జరుగుతున్న ఆత్మగౌరవ యాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని, రాహుల్, మన్మోహన్ సింగ్‌లను విమర్శించడం మానుకోకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సహనం కోల్పోయి కనె్నర్రజేస్తే మాడి మసైపోవడం ఖాయమని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు హెచ్చరిం చారు. బుధవారం విస్సన్నపేటలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురవింద గింజ చందాన చంద్రబాబు తన తప్పులు కప్పిపుచ్చుకుని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు సీమాంధ్ర సమైక్యవాదంతో అట్టుడికిపోతుంటే వారికి మద్దతు ఇవ్వకపోవడం చూస్తే ఆయన రాజకీయ విధానాలు ఏమిటో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నప్పటికీ పార్టీ జెండాను, ఎజెండాను పక్కన బెట్టి సీమాంధ్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తుంటే చంద్రబాబుకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. సమైక్యవాదం సీమాంధ్రలో ఉద్ధృతంగా ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానంటూ చంద్రబాబు ఏ ఆత్మగౌరవ సభలోనూ ప్రకటించకపోవడం సీమాంధ్ర ప్రజలను చిన్నచూపు చూడటమేనన్నారు. కృష్ణా జిల్లాలో పుట్టిన ఎన్టీఆర్‌కు తాను అల్లుడినని ఆత్మగౌరవ సభలో చెబుతున్న చంద్రబాబు తాను అధికారంలో ఉన్న కాలంలో జిల్లా అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, కాంగ్రెస్ పార్టీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీని విమర్శించడం ఎంతమాత్రం తగదన్నారు.
రాజనీతిజ్ఞుడు, ఆర్థిక మేధావి మన్మోహన్ సింగ్‌ను విమర్శించే స్థాయి చంద్రబాబుకు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను, ఎంపిలను పెంపుడు కుక్కలని వర్ణించడం చంద్రబాబు మానుకోవాలన్నారు. తన పార్టీలోని ఎమ్మెల్యే, ఎంపిలను చంద్రబాబు కుక్కల కంటే హినంగా చూడటం ఎవరికి తెలియదని నరహరిశెట్టి ప్రశ్నించారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు పెండెం సోమయ్య, ఉమ్మడి ధనరాజు, గోళ్ళ గురునాథం, గుడ్డల రాంబాబు, అమానుల్లా, విస్సన్నపేట పిఎసిఎస్ అధ్యక్షులు గుర్రం కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం మండుతుంటే విందులు, వినోదాలా?
* పాలకులపై షర్మిల ఫైర్
అవనిగడ్డ, సెప్టెంబర్ 11: ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని వున్న ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్య పరిష్కారానికి ఆలోచన చేయక రాష్ట్రానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు విందులు, వినోదాలతో కాలక్షేపం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన సమస్యలన్నింటికీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా బాధ్యతవహించవలసి వుంటుందన్నారు. బుధవారం రాత్రి సమైక్య శంఖారావం బస్సుయాత్ర అవనిగడ్డకు చేరుకున్న సందర్భంగా ఆమె ప్రసంగించారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ నిర్వీర్యం చేసేందుకు కిరణ్ ప్రభుత్వం కృషి చేస్తోందని విమర్శించారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలను వీలైనంత త్వరలో రద్దుచేసేందుకు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం, సీట్ల కోసం ఎంతకైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బరితెగిస్తున్నాయని అంటూ రాష్ట్ర విభజనకు చంద్రబాబే ప్రథమ కారకుడని షర్మిల ధ్వజమెత్తారు. ఈవిషయాన్ని పక్కనబెట్టి ప్రజలను మభ్యపెట్టేందుకు ఆత్మగౌరవ యాత్ర పేరుతో పర్యటన చేస్తున్నారని, ఆయనను ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. మన ఖర్మకొద్దీ చేతగాని అసమర్థుడు ముఖ్యమంత్రిగా వచ్చాడని, పాలకపక్షాన్ని కాలర్ పట్టుకుని నిలదీయాల్సిన చంద్రబాబు విభజనకు కారణమయ్యాడని అన్నారు. చంద్రబాబు కంటే నీచుడు, దుర్మార్గుడు మరెవరూ ఉండరన్నారు. మైనార్టీ సర్కారును కాపాడుతున్నది చంద్రబాబేనని, ఈ ప్రభుత్వాన్ని తన భుజాలపై మోస్తున్నాడని వ్యంగ్యంగా అన్నారు. నిజంగా సమైక్యాంధ్రను కోరుకున్నవాడైతే తెలుగుదేశం శాసనసభ్యులు, అలాగే ప్రభుత్వంలోని మంత్రులు వారి రాజీనామాలను గవర్నర్‌కు సమర్పిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని షర్మిల పేర్కొన్నారు. ఈ సభకు జిల్లా పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయభాను అధ్యక్షత వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్, నాయకులు జోగి రమేష్, కుక్కల నాగేశ్వరరావు, గుడివాక శివరావు, రాయసం చిట్టిబాబు షర్మిల వెంట వున్నారు.

తెలుగుజాతితో పెట్టుకుంటే భస్మమే!
* కాంగ్రెస్‌కు చంద్రబాబు హెచ్చరిక
నూజివీడు/ తిరువూరు/ గంపలగూడెం, సెప్టెంబర్ 11: తెలుగుజాతితో పెట్టుకున్న వారెవరూ బతికి బట్టకట్టినట్లు చరిత్రలో లేదని, అన్నదమ్ముల్లా ఉన్న తెలుగుజాతిని విడదీసేందుకు ప్రయత్నిస్తే భస్మం కావడం ఖాయమని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు.జిల్లాలో తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర ఆరో రోజు బుధవారం తిరువూరు నియోజకవర్గంలో సాగింది. గంపలగూడెం మండలంలో ప్రారంభమైన యాత్ర గాదేవారిగూడెం, ఆర్లపాడు, గుళ్ళపూడి మీదుగా తిరువూరు మండలంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో చంద్రబాబుకు మహిళలు మంగళ నీరాజనాలు పట్టారు. రాష్ట్ర విభజన కేవలం తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని ఈసందర్భంగా చంద్రబాబు ఆరోపించారు. దీనికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి సహకరిస్తున్నాయని అన్నారు. ఇరు ప్రాంత ప్రజలు ప్రశాంతంగా, రాష్ట్రం అభివృద్ధిపథంలో నడుస్తుండగా తెలుగుదేశం పార్టీ హవాను అడ్డుకునేందుకు 1998లో వైఎస్ రాజశేఖరరెడ్డి తెలంగాణ ఫోరం ఏర్పాటు చేసి తెలంగాణకు మళ్ళీ బీజం వేశారని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయటం, రాష్ట్రంలో జగన్‌ను ముఖ్యమంత్రిని చేయడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదుపుతున్నారని చెప్పారు. కిలో ఉల్లిపాయల ధర 80 రూపాయలకు చేరిందంటే ఎమిటో ఆలోచించాలని అన్నారు. కేంద్రంలోని ప్రధాన మంత్రి మన్‌మోహనసింగ్ ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా చేతిలో కీలుబొమ్మ అయ్యారని విమర్శించారు.
చంద్రబాబు యాత్రకు బ్రేక్
చంద్రబాబు చేపట్టిన తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. జిల్లాలో ఆరు రోజుల పాటు విజయవాడ, నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలో యాత్ర సాగింది. ఇటీవల కురుస్తున్న వర్షాల ప్రభావంతో కొద్దిగా చంద్రబాబుకు ఆరోగ్యం దెబ్బతింది. వర్షం వల్ల యాత్ర సజావుగా సాగని పరిస్థితిలు ఏర్పడ్డాయి. దీంతో నాలుగైదు రోజుల పాటు చంద్రబాబు యాత్రను వాయిదా వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో బుధవారం రాత్రి తిరువూరు యాత్ర ముగించుకుని హైదరాబాదు వెళ్లారు.
న్యాయం జరిగేంతవరకు పోరాటం
తెలుగుజాతికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తానని, ఇందుకోసం తన చివరి రక్తపు బొట్టును సైతం ధారబోస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆత్మగౌరవ యాత్ర బుధవారం తిరువూరు మండలంలో జరిగిన సందర్భంగా బోసు సెంటర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టి కాంగ్రెస్ పార్టీ వినోదం చూస్తోందన్నారు. తెలుగుజాతి మధ్య విభేదాలు సృష్టించిన పాపం సోనియాదేనన్నారు. తెలుగువారికి అన్యాయం చేసేవారి అంతు చూస్తానన్నారు. తెలుగువారికి ఎల్లప్పుడూ టిడిపి అండగా ఉంటుందన్నారు.
తెలుగుజాతికి న్యాయం జరుగకపోతే అందుకు కారణమైన కాంగ్రెస్ పార్టీని కేంద్ర, రాష్ట్ర స్థాయిలో భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు. జైలులో జగన్, ఫాంహౌస్‌లో కేసిఆర్ కాలక్షేపం చేస్తున్నారని, ముఖ్యమంత్రి కిరణ్ మాటల గారడీతో ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. పిసిసి అధ్యక్షుడు బొత్స ఉత్సవ విగ్రహమని, మాఫీయా డాన్ అని ఆరోపించారు.
చంద్రబాబుకు సమైక్య సెగ
చంద్రబాబు నాయుడుకు బుధవారం తిరువూరులో సమైక్య సెగ తగిలింది. మండలంలోని వావిలాలలో, తిరువూరులో కొందరు సమైక్యవాదులు సమైక్యాంధ్రపై ప్రకటన చేయాలంటూ నినాదాలు చేశారు. దీనిపై చంద్రబాబు స్పందించలేదు. పోలీసులు వారిని అక్కడ నుంచి తరలించారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ ఎస్‌పిఆర్‌టియు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్‌ల తిరువూరు ఐక్యకార్యచరణ కమిటీ నాయకులు చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు.

తొలిరోజు బంద్ విజయవంతం
నందిగామ, సెప్టెంబర్ 11: ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి సంఘాలు ఇచ్చిన 48గంటల బంద్ పిలుపు మేరకు తొలి రోజు బుధవారం నందిగామ పట్టణంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఎన్‌జిఒ అసోసియేషన్, ఉపాధ్యాయ సంఘాల నేతలు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బ్యాంకులు, సినిమా హాళ్లు, పాఠశాలలు, పెట్రోల్ బంక్‌లు తదితర వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. సమితి నేతలు శ్యాంబాబు, జి వెంకటరత్నం, కొత్తా శ్రీనివాసరావు, మాధవరావు, దాసు, అబూబాకర్, గంగాధర్ తదితర ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు బంద్ విజయవంతానికి కృషి చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల జెఎసి నేతలు కాపా రవీంద్రనాధ్, ఆళ్ల రాంబాబు తదితరుల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించి గాంధీ సెంటర్ వద్ద రోడ్డుపై కబడ్డీ ఆడి నిరసన తెలియజేశారు. ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ శిబిరాన్ని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వేల్పుల పరమేశ్వరరావు, టిడిపి నాయకులు కనె్నకంటి జీవరత్నం, కొండూరు వెంకట్రావు, వైఎస్‌ఆర్ సిపి నాయకుడు తాటి రామకృష్ణ, జెఎసి నాయకులు కాపా రవీంద్రనాధ్, ఆళ్ల రాంబాబులు ప్రారంభించగా వైఎస్‌ఆర్ సిపి కార్యాలయ ఇన్‌చార్జి మొండితోక అరుణ్‌కుమార్, సొసైటి మాజీ అధ్యక్షుడు చిరుమామిళ్ల చైతన్య కుమార్, టిడిపి నాయకుడు కొంగర కాళేశ్వరరావు, పలువురు న్యాయవాదులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.

* జిల్లాలో స్తంభించిన జనజీవనం * మూతబడ్డ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు * ఉయ్యూరులో భారీ ర్యాలీలు * నూజివీడులో 48గంటల రిలే దీక్ష ప్రారంభం * గుడ్లవల్లేరులో జాతీయ పతాకంతో భారీ ప్రదర్శన
english title: 
t

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>