Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

72 గంటల విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

$
0
0

విశాఖపట్నం, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా విద్యుత్ ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి 72 గంటల పాటు సమ్మెలోకి వెళ్లనున్నారు. జూనియర్ లైన్‌మెన్ దగ్గర నుంచి డిప్యూటి ఇంజనీర్ స్థాయి అధికారి వరకూ సమ్మెలోకి వెళుతున్నారు. ఈపిడిసిఎల్ పరిధిలో సుమారు ఏడు వేల మంది ఉద్యోగులు, సిబ్బంది సమ్మెబాట పట్టనున్నారు. అయితే, సాధారణ విద్యుత్ సరఫరాకు ఎటువంటి అంతరాయం ఉండదని, ఈపిడిసిఎల్ అధికారులు చెపుతున్నారు. ఒకవేళ ఏదైనా ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా, విద్యుత్ లైన్ సమస్య ఉత్పన్నమైనా, వాటిని పునరుద్ధరించేందుకు సమ్మెలో ఉన్న సిబ్బంది మాత్రం హాజరు కారు. సబ్ స్టేషన్‌లో షిప్ట్ ఆపరేషన్‌కు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. విద్యుత్ వినియోగదారులు విద్యుత్ సమస్య ఏమైనా ఏర్పడితే, ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీస్‌కు ఫోన్ చేసుకోవచ్చు. లేదా ఎస్.ఇ కార్యాలయానికి ఫోన్ చేయచ్చు. సబ్ స్టేషన్లలో ఉన్న ప్రైవేటు సిబ్బంది సహకారంతో ఈ సమస్యను పరిష్కరించనున్నారు.

సిమ్స్ ఆస్తుల వేలానికి రంగం సిద్ధం
* 15 రోజుల్లో ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: సిమ్స్ ఆస్తుల కేసు త్వరలో కొలిక్కి రానుంది. సుమారు సంవత్సరం కిందట కోట్ల రూపాయలకు టోకరా వేసి బోర్డు తిప్పేశాడు సిమ్స్ ఎండి గుప్త. దీంతో వేలాది మంది బాధితులు రోడ్డున పడ్డారు. విశాఖపట్నం, నర్సీపట్నం, అనకాపల్లితోపాటు ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో సిమ్స్ బాధితులు ఉన్నారు. వీరంతా పోలీస్ స్టేషన్లకు వచ్చి లబోదిమోమన్నారు. అక్కడక్కడ పోలీస్ కేసులు నమోదైనాయి. ఈ కేసును కొంతకాలం పోలీసులు దర్యాప్తు జరిపారు. ఆ తరువాత సిబిసిఐడికి అప్పగించారు. సిఐడి పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. సుమారు 500 కోట్ల రూపాయలకు టోకరా వేసినట్టు తేలింది. ఈ సంస్థలో పెట్టుబడి పెట్టిన వారి సొమ్ముకు రెట్టింపు సొమ్ము లభించింది. తిరిగి దాన్ని ఇదే సంస్థలో పెట్టుబడిగా పెట్టారు. ఇప్పుడు ఆ సొమ్మంతా గల్లంతైంది. బాధితుల దగ్గర కొన్ని రశీదులు మాత్రమే ఉన్నాయి. వీటిని పోలీసులు సేకరించారు. వీటి విలువ ఎంత ఉంటుందన్నది సిఐడి అధికారులు చెప్పడం లేదు.
గుప్తకు చెందిన ఆస్తులను సిఐడి అధికారులు గుర్తించారు. విశాఖలోని సిమ్స్ కార్యాలయం అద్దె భవనంలో నడిచింది. దీన్ని సీజ్ చేశారు. అందులోని ఆస్తులను సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సిమ్స్ యాజమాన్యానికి సంబంధించి సుమారు 208 ఎకరాల భూమి ఉన్నట్టు గుర్తించారు. దీన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇలా గుర్తించిన ఆస్తులను విలువకట్టి, సిబిసిఐడి అడిషనల్ డిజి పేరిట జమ చేస్తారు. ఇప్పటికే అడిషనల్ డిజి పేరిట అకౌంట్ తెరచినట్టు సిఐడి అధికారులు తెలియచేశారు. త్వరలోనే సిమ్స్ సంస్థకు చెందిన ఆసులను వేలం వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. సుమారు 15 రోజుల్లో ఈ ప్రక్రియ మొదలవుతుందని చెపుతున్నారు. ఈ ఆస్తులను వేలం వేయడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇందులో ఒక న్యాయమూర్తితో సహా, వివిధ శాఖలకు చెందిన అధికారులు ఉంటారు. స్థానిక పోలీస్ బారెక్స్‌లో ఈ వేలం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని డిజి పేరిట తెరచిన అకౌంట్‌లో జమ చేస్తారు. బాధితులకు రావల్సిన మొత్తాలను లెక్కకట్టి వారికి ఆయా మొత్తాలను అందచేయనున్నారు. ఈ వేలం కార్యక్రమానికి అందరూ రావచ్చని సిఐడి అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే సిఐడి అధికారుల వద్ద ఎనిమిది కేసులు నమోదై ఉన్నాయి. ఇందులోని బాధితులకు ఈ ఆస్తులను వేలం ద్వారా విక్రయించగా వచ్చిన మొత్తాన్ని అందించనున్నారు.

బెయిల్ తిరస్కరణ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: వుడా భూ కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న ఆరుగురు నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి బుధవారం తిరస్కరించారు. అలాగే అజ్ఞాతంలో ఉన్న మాజీ విసి విష్ణుతో సహా, ముగ్గురు నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ను కూడా తిరస్కరించినట్టు తెలిసింది. కాగా, వుడా నుంచి సేకరించిన రికార్డులను సిఐడి అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే హట్ డిస్క్‌లను కూడా నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కీలక పాత్రధారులు అజ్ఞాతంలో ఉన్నారు. వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని సిఐడి అధికారులు స్పష్టం చేశారు.

వుడా ఉద్యోగుల రూటే సపరేటు!
* రిజిస్టర్‌లో సంతకాలు
* ఎంచెక్కా జేబులోకి జీతాలు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: జివిఎంసి, ఎన్‌జిఓ, విద్యుత్, ఆర్టీసీ, ఆంధ్రా యూనివర్శిటీ, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఇలా ఒకరేంటి ప్రభుత్వరంగానికి చెందిన ఉద్యోగులంతా సమ్మెబాట పట్టారు. గతనెల 13వ తేదీ నుంచి వీరు సమ్మెలో కొనసాగుతున్నారు. గత నెల కేవలం 12 నెలల జీతాన్ని మాత్రమే వీరు అందుకున్నారు. సమ్మెకు దిగిననాటి నుంచి వీరికి జీతం వచ్చే పరిస్థితులు లేవు. కానీ వుడా ఉద్యోగుల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. వుడా ఉద్యోగులు ఉదయం కార్యాలయానికి వస్తున్నారు. రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారు. ఉద్యమకారులు వచ్చి వీరిని బయటకు తీసుకువెళ్లిపోతున్నారు. భోజన సమయం వరకూ వీరు బయటే గడిపి, సాయంత్రానికి నెమ్మదిగా తిరిగి కార్యాలయానికి చేరుకుని విధులను నిర్వర్తిస్తున్నారు. ఈనెల ఒకటో తేదీన ఉద్యోగులంతా 12 రోజుల జీతానే్న అందుకుంటే, వుడా ఉద్యోగులు మాత్రం మొత్తం జీతాన్ని అందుకున్నారు. వుడాలో ఒక ఫైలు కదిపితే, కాసులు కురుస్తాయి. అటువంటి ఫైళ్ళను పక్కనపెట్టి ఉద్యమిస్తే ఏమొస్తుందని భావించారో, ఏమో వుడా ఉద్యోగులు మాత్రం ఉద్యమానికి ద్రోహం చేస్తూ, ఏంచెక్కా జీతాన్ని జేబుల్లో వేసుకుంటున్నారు.

హైదరాబాద్‌పై హక్కు లేదన్నందుకే ఈ ఉద్యమం
* టిడిపి నేత సోమరెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: హైదరాబాద్‌పై ఆంధ్ర ప్రాంత ప్రజలకు హక్కు లేదని అనడం వల్లనే సమైక్యాంధ్ర ఉద్యమం ఇంత తీవ్రంగా జరుగుతోందని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి అన్నారు. బుధవారం విశాఖలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీమాంధ్రలో ఇప్పటి వరకూ జరిగిన అన్ని ఉద్యమాలకు కేంద్రం తలొగ్గిందన్నారు. ఈ ఉద్యమానికి కూడా కేంద్రం దిగి రావల్సిందేనని ఆయన అన్నారు. తెలంగాణలో ఉన్న వారు కూడా తెలుగువారిగానే తాము ఇప్పటికీ భావిస్తున్నామని సోమిరెడ్డి అన్నారు. తిట్లు నేర్పడం కెసిఆర్‌కు వచ్చినట్టుగా ఎవ్వరికీ రాదని అన్నారు. సీమాంధ్రులు ఒక్క సభను హైదరాబాద్‌లో నిర్వహిస్తే, ఓర్చుకోలేని దుస్థితిలో తెలంగాణ నాయకులు ఉన్నారన్నారు. కెసిఆర్ నోటి దురుసుతనం, జగన్ చేతివాటం వల్లనే రాష్ట్రం నాశనమవుతోందని విమర్శించారు. తెలుగు జాతిని టిడిపి ఎన్నడూ తన స్వార్థం కోసం వాడుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్న వారందరూ రాష్ట్రం విడిపోతే, ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రులమైపోదామని భావిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో మొదటి ముద్దాయి వైఎస్ రాజశేఖరరెడ్డి, రెండో ముద్దాయి సోనియా, మూడో ముద్దాయి కెసిఆర్, నాలుగో ముద్దాయి బిజెపి, ఐదో ముద్దాయి సిపిఐ అని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమం తొమ్మిదేళ్లపాటు నడిచిన తరువాత టిడిపి లేఖ ఇచ్చిందని ఆయన వివరించారు.

27కు చేరిన హెచ్‌పిఎల్ మృతుల సంఖ్య
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: గత నెల 23న విశాఖ హెచ్‌పిసిఎల్‌లో కూలింగ్ టవర్ కూలిన ప్రమాదంలో గాయపడిన కంబాల రమణ (28) మంగళవారం మరణించగా, అనంత్ గౌడ్ (27) బుధవారం చనిపోయాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. విశాఖ ఆసుపత్రిలో ఆరుగురు, ముంబై ఆసుపత్రిలో ఆరుగురు చికిత్స పొందుతున్నారు. ముంబైలో నలుగురి ఆరోగ్య పరిస్థితి కుదుటపడినట్టు హెచ్‌పిసిఎల్ ఈడి నరసింహం బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో తెలియచేశారు. ప్రమాదం జరిగిన తరువాత యూరో-3, యూరో-4 ఉత్పత్తులు నిలిచిపోయాయి. వీటిని రెండు రోజుల నుంచి కొంత వరకూ పునరుద్ధరించామని ఆయన తెలియచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలింగ్ టవర్ నిర్మాణం పనులు ఒక సవాలుగా నిలిచాయని అన్నారు. టవర్ బేస్‌మెంట్ బాగుందని, టవర్ నిర్మాణానికి టెండర్ పిలువనున్నామని ఈడి తెలియచేశారు. టవర్ నిర్మాణానికి సుమారు వంద రోజులు పడుతుందని ఆయన చెప్పారు. హెచ్‌పిసిఎల్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఇన్స్యూరెన్స్ ఉందని దీనివలన వారికి నెలకు ఎనిమిది వేల రూపాయల చొప్పున పింఛను వస్తుందని అన్నారు. ఈ ప్రమాదం జరిగిన తరువాత ఇప్పటి వరకూ 8.4 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఆయన చెప్పారు. ఇందులో సుమారు ఐదు కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ కార్మికులకు నష్టపరిహారంగా చెల్లించామని నరసింహం వివరించారు. ప్రస్తుతం కలెక్టర్ వద్ద ఉన్న పరిహారం చెక్కులను బాధిత కుటుంబాలకు అందేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నేడు విశాఖలో రాష్టప్రతి కుమార్తె నృత్య ప్రదర్శన

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె సర్మిత ముఖర్జీ కథక్ నృత్య ప్రదర్శన గురువారం విశాఖలోని కళాభారతి ఆడిటోరియంలో జరగనుంది. సర్మిత ముఖర్జీ కథక్ నృత్యంలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. నాట్యాచార్యులు పండిట్ దుర్గల్, ఉమాశర్మ, రాజేంద్ర గంగాని వద్ద సర్మిత కథక్ నృత్యంలో మెళకువలను నేర్చుకున్నారు. భారత దేశంలో ప్రముఖ పర్వదినాలను పురస్కరించుకుని సర్మిత తన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. నలభై దేశాల్లో సర్మిత ఇచ్చిన కథక్ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. భారతీయ నృత్యకళలో వివిధ కోణాలను ఆరు ఎపిసోడ్‌లతో కూడిన టివి సీరియల్స్ ద్వారా ఆమె ఆవిష్కరించారు.

టెన్త్ విద్యార్థులకు ఉద్యమ సెగ
* క్వార్టర్లీ పరీక్షలు వాయిదా
* ఖాళీ అయిన హాస్టళ్ళు
* బడులు తెరుస్తామంటున్న ఒక వర్గం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర ఉద్యమ సెగ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు తగిలింది. వచ్చే నెల ఐదవ తేదీ నుంచి వీరికి క్వార్టర్లీ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే సిలబస్ పూర్తి కాకపోవడం వలన ఈ పరీక్షలను వాయిదా వేయనున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు సమ్మెబాటపట్టారు. అప్పటికే అంతంతమాత్రంగా పూర్తయిన సిలబస్ ఈ సమ్మెతో నిలిచిపోయింది. పాఠశాలలు పనిచేయకపోవడంతో వాటికి అనుబంధంగా పనిచేస్తున్న సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు కూడా మూతపడ్డాయి. జిల్లాలోని 79 షెడ్యూల్డ్ కులాల సంక్షేమ హాస్టళ్ళలో తొమ్మిది మాత్రమే పనిచేస్తున్నాయి. జిల్లా మొత్తంమీద సుమారు 220 హాస్టళ్ళు ఉన్నాయి. వీటిలో కేవలం 15 మాత్రమే పనిచేస్తున్నాయి. విద్యార్థులు ఇళ్ళకు వెళ్లిపోవడంతో హాస్టళ్లలు మూసివేశారు.
ఇదిలా ఉండగా సమ్మెలోకి వెళ్లని యూనియన్లు త్వరలోనే కొన్ని పాఠశాలలను తెరవడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్టు తెలిసింది. పాఠశాలలు నడిచేచోట హాస్టళ్లను తెరుస్తామని షెడ్యూల్డ్ కులాల హాస్టళ్ల డిప్యూటీ డైరక్టర్ తెలియచేశారు.

సీమాంధ్ర కేంద్ర మంత్రులు నాటకాలు కట్టిపెట్టాలి
* రాజీనాలు చేయండి, చేసిన వారు ఆమోదింపచేసుకోండి
* రాష్ట్రం ముక్కలవుతోంటే ఉద్యోగాలు చేసుకుంటున్నారు
* ఎస్‌బిఐ మెయిన్‌బ్రాంచ్‌ను ముట్టడించిన విద్యార్థి జెఎసి
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: తెలంగాణ విభజనపై హోంశాఖ ఒకపక్క కసరత్తు పూర్తి చేస్తోంటే సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు మాత్రం పరిస్థితులు మనకు అనుకూలంగానే ఉన్నాయంటూ మభ్యపెడుతున్నారని విద్యార్థి జెఎసి ఆరోపించింది. సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా పాతజైల్ రోడ్డు జంక్షన్‌లోని భారతీయ స్టేట్‌బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని బుధవారం మట్టడించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు బ్యాంకు కార్యాలయానికి చేరుకుని ఉద్యోగులను, అధికారులను సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా అభ్యర్థించారు. రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఏర్పడిందని, ఈసందర్భంలో మీరు ఉద్యోగాలు చేసుకుంటూ బాధ్యతలను నుంచి తప్పించుకోవడం సమజసం కాదంటూ విద్యార్థి జెఎసి నాయకులు అన్నారు. ఈసందర్భంగా విద్యార్థి జెఎసి కన్వీనర్ లగుడు గోవిందరావు మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతున్న సంకేతాలను కేంద్ర ప్రభుత్వం పంపుతోందని, అయితే సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ నాయకులు మాత్రం ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణాపై హోంశాఖ నోట్ సిద్ధం చేసి కేబినెట్ ముందుంచేందుకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజల ఆకాంక్ష మేరకు సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాజీనామా చేసినట్టు ప్రకటించిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు తక్షణమే వాటిని ఆమోదింపచేసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు మరిన్ని కార్యక్రమాలను చేపట్టనున్నట్టు వెల్లడించారు. కార్యక్రమంలో విద్యార్థి జెఎసి చైర్మన్ ఆరేటి మహేష్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

నేటి నుంచి ఎన్జీఓల ఉద్యమ కార్యాచరణ
* 12న అవగాహన సదస్సులు
* 13న కేంద్ర కార్యాలయాల ముట్టడి
* 14న మహిళా ఉద్యోగుల ర్యాలీ
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: ఎపి ఎన్జీఓల ఆధ్వర్యంలో తలపెట్టిన సమైక్యాంధ్ర సాధన ఉద్యమంలో భాగంగా మూడు రోజుల కార్యాచరణను బుధవారం ప్రకటించారు. కలెక్టరేట్ వద్ద ఎన్జీఓల నిరసన శిబిరంలో ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన నగర ఎన్జీఓ అధ్యక్షుడు కె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ ఈనెల 12న విస్తృతంగా సదస్సులు నిర్వహించనున్నట్టు తెలిపారు. అలాగే 13న కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను స్తంభింపచేయాలని నిర్ణయించామన్నారు. తద్వారా కేంద్రం దిగిరాకతప్పదని అభిప్రాయపడ్డారు. 14న మహిళలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎన్జీఓ సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్రం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకూ ఉద్యమం కొనసాగిస్తామని, ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వ్యక్తిగత ప్రయోజనాలను ఆశిస్తూ సమైక్య ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నగర ఎన్జీఓ ఉపాధ్యక్షుడు ఆర్ రాంబాబు, కార్యదర్శి వివివిపివి సత్యనారాయణ, మెడికల్ అండ్ హెల్త్ సహా పలు ప్రభుత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
వైద్య జెఎసి ఆధ్వర్యంలో
సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్యవిభాగం జెఎసి ఆధ్వర్యంలో కెజిహెచ్ వద్ద రిలేనిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. ఈసందర్భంగా జెఎసి నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల కార్యదర్శి డాక్టర్ పి శ్యామసుందర్ మాట్లాడుతూ సీమాంధ్రకు చెందిన వైద్యులపై తెలంగాణ వైద్యులు దాడులకు పాల్పడటాన్ని ఖండించారు. అనాగరికతతో ప్రవర్తిస్తున్న వారికి కనువిప్పు కలిగే విధంగా సీమాంధ్రలో పనిచేస్తున్న తెలంగాణా వైద్యులను గౌరవించి తెలుగువారి సంస్కృతిని, ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల జెఎసిలతో చర్చించి ఉద్యమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు సిద్ధం కావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో జెఎసి ప్రతినిధులు డాక్టర్ ఎన్ అప్పారావు, ఎ ఈశ్వరరావు, బాబ్జీశ్యామ్, పివి సుధాకర్, కె ఇందిరాదేవి, భాగ్యలక్ష్మి, ఐఎంఎ ప్రతినిధులు సీనియర్ వైద్యులు, నర్సులు, క్లాస్ 4 ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కొనసాగుతున్న దీక్షలు
జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం, కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల రిలేనిరాహార దీక్షలు బుధవారం కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ ఉత్తర నియోజకవర్గం కన్వీనర్ భరణికాన రామారావు, తెలుగుయువత అధ్యక్షుడు లొగడల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా భరణికాన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన సొంత జాగీరు మాదిరి రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు నిర్ణయించిందని ఆరోపించారు. కేవలం ఓట్లు,సీట్లుకోసం సోనియాగాంధీ రాష్ట్ర విభజనకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలుగు ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగు యువత అధ్యక్షుడు లొడగల కృష్ణ, 11,13,14 వార్డుల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టిన రిలేదీక్షల్లో ఎస్సీ సెల్ చైర్మన్ కొల్లాబత్తుల వెంగళరావు పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల మనోభావాలను అర్ధం చేసుకుని రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు విభజనకు అంగీకరిస్తూ లేఖలు ఇచ్చి ఇప్పుడు వెనక్కు తగ్గడం రాజకీయ లబ్దికోసమేనన్నారు. పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

సిడబ్ల్యుసి విభజన ఉపసంహరణ ప్రకటన చేయాలి
* కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, సెప్టెంబర్ 11: రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, తక్షణమే సమైక్య రాష్ట్ర ప్రకటన చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో తీర్మానించారు. ఇక్కడ టర్నర్‌చౌల్ట్రీలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈమేరకు పలు తీర్మానాలను చేశారు. ఈసందర్భంగా విప్ ద్రోణంరాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రకటన అనంతరం సీమాంధ్రలో చోటుచేసుకున్న పరిణామాలపై కాంగ్రెస్ అధిష్టానం పునరాలోచించాలని కోరారు. తెలుగు ప్రజల మనోభీష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించాలని కోరారు. హైదరాబాద్‌లో సీమాంధ్రకు చెందిన ఎన్జీఓలు సభ నిర్వహిస్తే తెలంగాణా నాయకులు బంద్‌కు పిలుపునివ్వడం వారి అహంకారానికి నిదర్శనమని అన్నారు. ఎంతగా ఆటంకాలు సృష్టించాలని ప్రయత్నించినా ఎన్జీఓలు హైదరాబాద్‌లో సభను విజయవంతంగా నిర్వహించడంతో తెరాసా నాయకుల్లో అభద్రతా భావం పెరిగిపోయిందన్నారు. ఇక తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణాకు అనుకూలంగా లేఖలు ఇచ్చి తీరా విభజన నిర్ణయం తీసుకున్నాక కాంగ్రెస్‌ను విమర్శించడం చౌకబారు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. విభజనపై యుటర్న్ తీసుకున్న చంద్రబాబు ఆత్మగౌరవయాత్ర పేరిట ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై చౌకబారు విమర్శలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఈసందర్భంగా మూడు తీర్మానాలు ఆమోదించారు. హైదరాబాద్‌లో ఎపిఎన్జీఓలపై తెలంగాణా వాదుల దాడులను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. సిడబ్ల్యుసిని సమావేశ పరచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతున్నట్టు ప్రకటించాలని, ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాను అసభ్య పదజాలంతో ధూషించిన చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఈనెల 14న భారీ ర్యాలీని నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల వెంకటరావు, గరికిన గౌరి, పోలిపల్లి జ్యోతి, పి సాయిలక్ష్మి, పచ్చిరపల్లి లక్ష్మి, కదిరి అప్పారావు, పార్టీ నాయకులు వంకాయల తాతాజీ, కె తాతారావు, పాలూరి రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

ఎయులో సమైక్య సమ్మె సెగ
* నిరవధిక విధుల బహిష్కరణ
* బోసిపోయిన విభాగాలు
* రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించిన జెఎసి
విశాలాక్షినగర్, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్రకు మద్దతుగా ఎయు బోధనేతర ఉద్యోగులు బుధవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. విధులను బహిష్కరించి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎయులో బోధనేతర ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎయులోని పలు విభాగాల సిబ్బంది ర్యాలీ నిర్వహించి, ప్రధాన గేటు వద్ద మానవహారం నిర్వహించారు. ఈసందర్భంగా జెఎసి అధ్యక్షుడు బొట్టా రాంచందర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఖాతరుచేయట్లేదని ఆరోపించారు. విభజన వల్ల సీమాంధ్రకు తీరని అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోతే విద్యార్ధులు తీవ్రంగా నష్టపోతారన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విద్యారంగానికి రావాల్సిన నిధుల్లో కోతపడుతుందని, దీంతో మధ్యతరగతి, సామాన్య వర్గాలకు చెందిన విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల నిర్వాహణ భారంగా మారుతుందని, విద్యార్థుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడే పరిస్థితి దాపురిస్తుందన్నారు. ఇప్పటికైనా మేథావులు, ప్రజాప్రతినిధులు రాష్ట్ర విభజనపై తమ వాదన గట్టిగా విన్పించడంతో పాటు విభజన నిర్ణయాన్నివెనక్కు తీసుకునే విధంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చైర్మన్ అక్కణాచారి, నర్సింగరావు, మీసాల శ్రీను, సి పాపారావు, ధర్మారావు, మురళి తదితరులు పాల్గొన్నారు.

ఎయు హాస్టళ్ల మూసివేత
ఎప్పుడూ విద్యార్థులతో కళకళలాడే ఎయు వసతిగృహాలు జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు మూతపడ్డాయి. సిబ్బంది సామూహిక సమ్మెకు సిద్ధం కావడంతో హాస్టళ్లను మూసివేసి మద్దతు ప్రకటించారు. హాస్టల్ ఎంప్లారుూస్ యూనియన్ ప్రతినిధులు తాతారావు, బి రమణి, కొండమ్మ, సునీత, చిన్నతల్లి తదితరులు పాల్గొన్నారు.

కెజిహెచ్‌లో కలెక్టర్ తనిఖీలు

విశాలాక్షినగర్, సెప్టెంబర్ 11: ప్రజలకు మెరుగైన వైద్య ఆరోగ్యసేవలు అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం కెజిహెచ్‌లో వివిధ వైద్య విభాగాలను ఆయన పరిశీలించారు. ముందుగా కెజిహెచ్ పరిపాలనా విభాగాన్ని చేరుకుని ఆసుపత్రి పర్యవేక్షక అధికారి డాక్టర్ ఎం.మధుసూదనబాబుతో భేటీ అయ్యారు. ఆసుపత్రిలో వివిధ విభాగాలు, వైద్యులు, సిబ్బంది వౌలిక సదుపాయాలు, వైద్య పరికరాలు తదితర విషయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. తరువాత ఆసుపత్రి వైద్యాధికారులతో కలిసి కార్డియాలజీ వైద్య విభాగాన్ని పరిశీలించారు. అత్యవసర వైద్యం అందిస్తున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. అక్కడ వైద్యులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ వద్ద ప్రస్తావించారు. అనంతరం ప్రసూతి భవనాన్ని సందర్శించి రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీసారు. రోగుల కోసం ఏర్పాటు చేసిన ఫిల్టరేజేషన్ మంచినీరు కాంప్లెక్స్‌ను తిలకించారు. నవజాతి పిల్లల వైద్య విభాగానికి వెళ్ళి పనితీరును పరిశీలించారు. పౌష్టికాహార చికిత్సా కేంద్రంలో పనితీరును కలెక్టర్ తనిఖీలు చేపట్టారు. సూపర్‌స్పెషాలిటీ విభాగం కింద ఏర్పాటు చేసిన వైద్య విభాగాలను పరిశీలించారు. డాక్టర్ టిఎస్సార్ పథకం కింద రూ.85 కోట్లతో నిర్మాణం అవుతున్న కాంప్లెక్స్ నిర్మాణ పనులపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ వైద్య అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉదయ్‌కుమార్, డాక్టర్ జివి.రెడ్డి, పి.రమణారెడ్డి, సిఎస్ ఆర్‌ఎంఓ డాక్టర్ బి.బంగారయ్య, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శివకుమార్, ఎండ్రోకెనాలజీ విభాగాధిపతి డాక్టర్ సుబ్రహ్మణ్యం, పిడియాట్రిక్ విభాగాధిపతి డాక్టర్ వసుంధరాదేవి తదితరులు పాల్గొన్నారు.

ప్రాణాలైనా అర్పిస్తాం
సమైక్యాంధ్ర సాధిస్తాం
నినాదాలతో దద్దరిల్లిన అనకాపల్లి
లక్షగళ గర్జన హోరు
అనకాపల్లి, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్ర కోరుతూ అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో బుధవారం ఉదయం నిర్వహించిన లక్షగళ గర్జన దిగ్విజయమైంది. ఈ సభకు అనూహ్యరీతిలో తరలివచ్చిన ప్రజలు సమైక్యాంధ్ర జెండాలు చేతబూని నినాదాలతో అనకాపల్లి పట్టణం దద్దరిల్లిపోయింది. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అందరూ ఒకేమాట ఒకే బాటగా నినదించారు. సభ తొమ్మిది గంటలకు ప్రారంభం కావాల్సిఉండగా గంటముందుగానే విద్యార్థిని విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు తండోపతండాలుగా సభాప్రాంగణానికి చేరుకున్నారు. అనకాపల్లితోపాటు కశింకోట, మునగపాక, అచ్యుతాపురం ఇతర ప్రాంతాల నుండి ఉపాధ్యాయులు, ఎన్‌జీవోలు, ఆర్టీసి ఉద్యోగులు, న్యాయవాదులు, కార్మికులు, రైతులు కూడా తరలిరావడంతో పట్టణంలోని అన్ని మార్గాలు జనవాహినితో కిక్కిరిసిపోయాయి. అనకాపల్లి సమైక్యాంధ్ర ఐక్యవేదిక చైర్మన్ మాదేటి పరమేశ్వరరావు సభను ప్రారంభించగా, పట్టణంలోని వివిధ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమైక్యాంధ్రకు స్ఫూర్తి కలిగించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, జానపద ప్రదర్శనలు ఉత్తేజాన్ని నింపాయి.
ప్రాణాలైనా అర్పిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తామంటూ సభలో పాల్గొన్న ప్రజలంతా ఒకేసారి అనూహ్యరీతిలో గొంతెత్తి నినాదాలు చేయడంతో సభా ప్రాంగణం మార్మోగిపోయింది. కళాకారిణి వంగపండు ఉష సమైక్యాంధ్ర కోసం ఆలపించిన జానపద గీతాలు, ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనకాపల్లి న్యాయవాదులంతా సభావేదికపైకి వచ్చి సమైక్యాంధ్ర కోరుతూ నినాదాలు చేశారు. ఆదాయపన్ను శాఖ ఉద్యోగి రాజు అల్లూరి సీతారామరాజు వేషధారణలో ప్రసంగం, ఏకపాత్రాభినయం బాగా అలరించింది. గుడ్‌షెపర్డ్ స్కూల్ యాజమాన్యం వెయ్యి అడుగుల మూడు రంగుల జెండా సభాప్రాంగణం చుట్టూ అలంకరించడంతో సమైక్యవాదానికి ప్రత్యేక ఆకర్షణ అయింది. తప్పెటగుళ్లు, చిడతలు, డప్పుల వాయిద్యాలతో సభాప్రాంగణం మార్మోగిపోయింది. సమైక్యాంధ్ర కోరుతూ రూపొందించిన పుస్తకాన్ని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ఆవిష్కరించారు.
ప్రజాప్రతినిధులు డ్రామాలు మాని రాజీనామాలు చేయాలి
* విభజన దుర్మార్గపు చర్య
విశాలాంధ్ర మహాసభ నేత పరకాల
అనకాపల్లి, సెప్టెంబర్ 11: సమైక్యాంధ్రను సాధించే విషయంలో ఇప్పటికైనా కేంద్రమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలు డ్రామాలు మాని రాజీనామాలు చేయాలని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు పరకాల ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో బుధవారం జరిగిన లక్షగళ గర్జన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేస్తే అసెంబ్లీకి, పార్లమెంటుకు తాళాలు బిగిద్దామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూలిపోతే తప్ప సమైక్యాంధ్రను సాధించడం సాధ్యం కాదన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై తీవ్రస్థాయిలో ఉద్యమం వస్తుందని ఊహించలేక రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులు ఇంతవరకు డ్రామా రాజకీయాలు సాగించారని ఆరోపించారు. గత్యంతరంలేని పరిస్థితుల్లో సమైక్యాంధ్రకు మద్ధతు పలుకుతున్నారన్నారు. భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకోసం ఎప్పటినుండో ఉద్యమాలు చేస్తుంటే పట్టించుకోని కేంద్రం, కేవలం ఆంధ్రప్రదేశ్‌నే ముక్కలు చేసేందుకు పూనుకోవడం దుర్మార్గపుచర్యగా అభివర్ణించారు. సమైక్యాంధ్రపై ఢిల్లీనుండి స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమాన్ని ఆపకపోగా మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమైక్యాంధ్ర కోసం ఉపాధిని లెక్కచేయకుండా ఆర్టీసీ, ఉపాధ్యాయ, ఎన్‌జీవో ఉద్యోగులు, కార్మికులు, రైతులు స్వచ్చందంగా చేస్తున్న ఉద్యమాలకు అనకాపల్లిలో జరిగిన లక్షగళ గర్జన సభ దిగ్విజయం ఒక ఉదాహరణగా ప్రభాకర్ పేర్కొన్నారు. ఈ సభ ద్వారా కేంద్రం కళ్లు తెరవాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్సార్ సిపి నాయకులు కొణతాల లక్ష్మీనారాయణరావు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ బ్రతికుంటే వేర్పాటువాదం పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. రాష్ట్రంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యాంధ్రపై రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని, తెలుగుదేశం పార్టీకి చెందిన హరికృష్ణ ఒక్కడే తన రాజీనామాను ఆమోదింపజేసుకుని రియల్ హీరోగా నిలిచారని కొనియాడారు. అనకాపల్లి అసెంబ్లీ టిడిపి కోర్‌కమిటీ సభ్యుడు బుద్ధ నాగజగదీష్ మాట్లాడుతూ సమైక్యాంధ్రను సాధించేవరకు రాజీలేని పోరు సాగించాలని పిలుపునిచ్చారు. వైకాపా నాయకులు దాడి రత్నాకర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర సాధన కోసం రాజకీయాలకు అతీతంగా సాగిన ఉద్యమం అనకాపల్లి చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. విద్యార్థి జెఎసి కన్వీనర్ ఆడారి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే భవిష్యత్‌లో హైదరాబాద్‌లో ఉద్యోగులెవరూ అక్కడ ఉనికి సాధించలేని పరిస్థితులు నెలకొంటాయన్నారు. భావితరాల వారికి కోలుకోలేని నష్టం ఏర్పడనుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన అనకాపల్లి సమైక్యాంధ్ర పరిరక్షణ కమిటీ చైర్మన్ మాదేటి పరమేశ్వరరావు మాట్లాడుతూ రాజకీయాలకు తావులేకుండా కేవలం ఉద్యోగులు, యువకులు ఒకేమాట ఒకే బాటగా లక్షగళ గర్జనను దిగ్విజయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వస్థాయి అధికారులు, వివిధ హోదాల్లోని ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థులు, కళాకారులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

రూ. 20 కోట్లతో జోలాపుట్ గేట్ల ఆధునీకరణ
* జెన్‌కో చీఫ్ ఇంజనీర్
ముంచంగిపుట్టు, సెప్టెంబర్ 11: ఆంధ్రా- ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మా చ్‌ఖండ్ జలవిద్యుత్ కేం ద్రానికి నీటిని అందించే జోలాపుట్టు రిజర్వాయర్ గేట్ల ఆధునీకరణ, జెన్‌కో సిబ్బంది గృహాల నిర్మాణానికి 20 కోట్ల రూపాయలను కేటాయించనున్నట్టు జెన్‌కో సి.ఇ. వి.సూర్యలక్ష్మి తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రిసోర్స్ ల్యాబ్ బృందంతో ఆమె బుధవా రం జోలాపుట్టు రిజర్వాయర్‌ను పరిశీలించారు. జోలాపుట్టు ప్రధాన రిజర్వాయర్ గేట్లను, గతంలో కొట్టుకుపోయిన బ్రిడ్జి స్థానంలో ఏర్పాటుచేసిన కర్రల వంతెను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాజెక్టు ఉద్యోగుల గృహాల నిర్మాణం కోసం 20 కోట్ల రూపాయలు కేటాయించాలని జెన్‌కోకు నివేదిక సమర్పించామన్నారు. నిధులు మంజూరైన వెంటనే ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్, జోలాపుట్టులో సిబ్బంది గృహ నిర్మాణాలకు చర్యలు చేపడతామన్నారు. జోలాపుట్టు డ్యాం నుండి విడుదల చేసే నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నట్టు ఆమె చెప్పారు. మూడు కోట్ల రూపాయలు వెచ్చించి గ తంలో నిర్మించిన కర్రెల వంతెనకు మరమ్మతులు చేయనున్నట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. వి.ఎల్.రమేష్, ఇ.ఇ. చంద్రశేఖర్, ఎ.పి.ఇ.ఆర్.ఐ. అధికారులు మనోజ్‌కుమార్, వెంకటేష్‌తోపాటు ప్రాజెక్టు ఉద్యోగులు పాల్గొన్నారు.

* సమ్మెలోకి ఏడు వేల మంది సిబ్బంది * సాధారణ సరఫరాకు అంతరాయం ఉండదు * బ్రేక్‌డౌన్ అయితేనే సమస్య
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>