Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

భవ్యభారతాన్ని పునర్నిర్మిద్దాం

$
0
0

భీమవరం, సెప్టెంబరు 11: భవ్యభారతాన్ని పునర్నిర్మిద్దాం... భారతదేశాన్ని మేలుకొలుపుదాం... ప్రపంచాన్ని జ్ఞానమయం చేద్దాం.. రండి.. యువత కదిలి రండని స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. స్వామి వివేకానంద సూక్తులను అనుసరించాలన్నారు. నేటి యువత వల్లే భారతదేశ చరిత్ర మారిపోనుందని పేర్కొన్నారు. భీమవరం కేంద్రంగా స్వామి వివేకానంద శతాబ్దిన్నర ఉత్సవాలను బుధవారం నుంచి స్వామి వివేకానంద 150 జయంతి ఉత్సవ సమితి బుధవారం ప్రారంభించింది. ఈ ఉత్సవాలను ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చేయనున్నారు. భీమవరంలో నిర్వహించిన తొలి కార్యక్రమానికి 3దేశం కోసం యువత పరుగు2 పేరుతో భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా న్యాయమూర్తి కె.కృష్ణమూర్తి వివేకా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. వివేకానందుని 150 ఉత్సవాల సమితికి చెందిన గ్రామీణ ప్రముఖ్ హరికుమార్‌రెడ్డి ముఖ్య వక్తగా విచ్చేశారు. ఆయన స్వామి వివేకానంద గురించి మరిన్ని విషయాలను విద్యార్థులకు వివరించారు. సెప్టెంబర్ 11, 1893లో స్వామి వివేకానంద చికాగోలో జరిగిన విశ్వమత మహాసభల్లో ఉపన్యసించి ప్రపంచ భారతదేశ సనాతన ధర్మం, సంస్కృతి గొప్పతనాన్ని అందించి, జాతిని జాగృతపరిచిన నాడుని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన దేశం కోసం యువత పరుగును నరసాపురం డిఎస్పీ రఘవీరారెడ్డి ప్రారంభించారు. డిఎన్‌ఆర్ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు), రుద్రరాజు వేణుగోపాలరాజు, గంటా కృష్ణ, హరి, అల్లూరి నర్సింహరాజు, గంధం శ్రీదేవి, చెట్లపల్లి జగన్మోహన్, ఐవికె జగ్గరాజు, ఎస్‌ఎస్‌ఎంవి ప్రసాద్, గన్నపురెడ్డి గోపాలకృష్ణ, మానేపల్లి సూర్యనారాయణ గుప్తా, జివిఐటి సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గ్రంధి సురేష్, తహశీల్దార్ గంధం చెన్ను శేషు, ఉండపల్లి రమేష్‌నాయుడు, చెరుకువాడ రంగసాయి, అల్లు శ్రీనివాస్, ఎబివిపి, ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ తదితరులు పాల్గొన్నారు.

తణుకులో లక్ష గళ గర్జన
తణుకు, సెప్టెంబరు 11: సమైక్యాంధ్ర పరిరక్షణకోసం జెఎసి సహకారంతో ఎంఎస్‌ఒలు కేబుల్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో బుధవారం తణుకులో నిర్వహించిన లక్షగళ గర్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉదయం 11 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర నినాదాలతో పట్టణం హోరెత్తింది. గంటకు పైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉభయ గోదావరి జిల్లాల ఎంఎస్‌ఒలు, కేబుల్ ఆపరేటర్లు, స్థానిక ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, కార్మికులు పట్టణంలోని నరేంద్ర సెంటర్‌కు చేరి సమైక్య నినాదం వినిపించారు. ముఖ్యంగా ఎంఎస్‌ఒలు, కేబుల్ ఆపరేటర్లు ఆయా ప్రాంతాల నుండి మోటారు సైకిళ్లపై ర్యాలీగా వచ్చి రాష్టప్రతి రోడ్డులోని సభా ప్రాంగణమైన నరేంద్ర సెంటర్ వద్దకు చేరుకున్నారు. దీనికితోడు తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఉత్తేజపరిచాయి. గజల్ శ్రీనివాస్ వినిపించిన గజల్స్ సభను అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగ సభలో జెఎసి జిల్లా నాయకుడు సాగర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధిష్ఠానం చేసిన విభజన ప్రకటన వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. తణుకు జెఎసి కన్వీనర్ ఎంవి రమణ మాట్లాడుతూ న్యాయమైన ఈ పోరాటంలో విజయం సాధించే వరకు మడమ తిప్పేది లేదని వెల్లడించారు. ఎంఎస్‌ఒ అసోసియేషన్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి చిట్టూరి కృష్ణ కన్నయ్య మాట్లాడుతూ తెలుగు ప్రజలు ఐక్యంగా ఉండటం ద్వారానే అభివృద్ధి సాధ్యపడుతుందని, రాష్ట్ర విభజన జరగకూడదని చెప్పారు. మొగల్తూరు ఎంఎస్‌ఒ కె రామకృష్ణ కేంద్ర మంత్రి చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. తమ అభిమాన నేతపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ చిరంజీవి అభిమానులు స్థానిక సిటీ కేబుల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. దాంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో కొవ్వూరు డిఎస్పీ రాజగోపాల్, సిఐ మధుబాబు విచ్చేసి సమస్యను సర్దుబాటు చేశారు.
001, 002,003,004,005
- సభలో పాల్గొన్న జనం

గర్జించిన జిల్లా
మిన్నంటిన సమైక్య నినాదం - నేటి నుండి విద్యుత్ ఉద్యోగుల 48 గంటల సమ్మె
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, సెప్టెంబరు 11: ప్రశాంత పశ్చిమగోదావరి సమైక్య గర్జన విన్పించింది. దాదాపుగా ఢిల్లీ వరకు తన గళం చేరేలా ఈ గర్జన కొనసాగటం విశేషంగానే చెప్పుకోవాలి. బుధవారం జిల్లాలో లక్ష గళ గర్జనలతో ఉద్యమాలన్నీ దద్ధరిల్లిపోయాయి. అన్నివర్గాలు భాగస్వాములు కావటంతో లక్ష గళాలు పలుచోట్ల గర్జించాయి. సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను విభజిస్తే సహించేది లేదని స్పష్టం చేశాయి. అటు తణుకు, ఇటు కొవ్వూరులలో లక్ష గళ గర్జనలతో జనం అంతా తమ మనోభీష్టాన్ని అటు పార్టీలకు, ఇటు ప్రభుత్వాలకు స్పష్టం చేశారు. కొవ్వూరు వాటర్‌ట్యాంకు సెంటరులో పట్టణ ఐకాస ఆధ్వర్యంలో ఉగ్ర గోదావరి లక్ష జనగళ గర్జన కార్యక్రమం పూర్తిస్ధాయిలో విజయవంతమైంది. అలాగే తణుకులో ఎంఎస్‌ఓలు, జెఎసిల ఆధ్వర్యంలో లక్ష గళ గర్జన భారీగా సాగింది. వీటితోపాటు ఏలూరులో యువతరం గర్జించి సమైక్యాంధ్ర డిమాండ్‌ను గట్టిగా విన్పించింది. అలాగే బుధవారం రాత్రి మున్సిపల్ జెఎసి, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలోని ఏలూరు కార్పోరేషన్‌తోపాటు అన్ని మున్సిపాల్టీల కమిషనర్లు, ఉద్యోగులు, సిబ్బంది భారీ కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇదిఇలాఉంటే ఈ ఉద్యమాలన్ని ఒక ఎత్తు అయితే గురువారం ఉదయం 6గంటల నుంచి విద్యుత్ ఉద్యోగులు చేపడుతున్న 48గంటల సమ్మె ఉద్యమంలో కొత్త మలుపుగా నిలిచిపోనుంది. దాదాపుగా విద్యుత్ కార్పోరేషన్ ఏర్పడిన తర్వాత లైన్‌మెన్ నుంచి ఎస్‌ఇ స్ధాయి అధికారి వరకు ఒకేసారి సమ్మెలోకి వెళ్లటం ఇదే తొలిసారిగా చెపుతున్నారు. ఈ సమ్మె వివరాలను పరిశీలిస్తే గురువారం ఉదయం 6గంటల నుంచి శనివారం ఉదయం 6గంటల వరకు తూర్పు ప్రాంత విద్యుత్ కార్పోరేషన్ పరిధిలోని ఉద్యోగులు, అధికారులంతా సమ్మెలోకి వెళ్లిపోతారు. దీనిఫలితంగా విద్యుత్ సరఫరా వ్యవస్ధ చాలావరకు ఆస్తవ్యస్ధంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది. సరఫరా కొనసాగినా వాస్తవానికి విద్యుత్ ఉత్పత్తిలో నిమగ్నమైన సిబ్బంది కూడా సమ్మెలోకి వెళ్లిపోవటంతో సరఫరా కొనసాగినంత వరకు పరిస్దితి సజావుగా సాగినట్లు కన్పిస్తుంది. అయితే ఎక్కడైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తినా, ఏ ఇతర ఇబ్బందులు వచ్చినా వాటిని పరిష్కరించేందుకు ఉద్యోగులు, సిబ్బంది మాత్రం అందుబాటులో ఉండరు. ఉత్పత్తి కూడా నిలిచిపోవటంతో ఈసరఫరా ఎన్ని గంటల సేపు సాగుతుందన్నది అర్ధంకాని పరిస్ధితి. ఇదే సమయంలో అత్యవసర సేవలకు మాత్రం ఈ సమ్మె నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రధానంగా ఆసుపత్రులను వీటి నుంచి పూర్తిగా మినహాయించారు. అలాగే రైల్వేలను కూడా మినహాయించారు. లేనిపక్షంలో అటు రోగులకు, ఇటు ప్రయాణీకులకు కూడా నానాయిబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా కొన్నిసార్లు ప్రమాదకర పరిస్ధితులను కూడా ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ సేవలతోపాటు మరికొన్ని అత్యవసరాలను కూడా మినహాయించటం ఉపశమనం కలిగించేదిగానే చెప్పుకోవాలి.
ఇక బుధవారంనాటి పరిణామాల్లో ఏలూరులో జరిగిన యువగర్జన భారీగా సాగి యువతరం మనోభావాలను స్పష్టంగా వెలికితీసుకువచ్చింది. రాష్ట్ర విభజన జరిగితే తమ భవిష్యత్ అంధకారంగా మారిపోతుందన్న ఆందోళన ప్రతి విద్యార్ధిలోను, ప్రతి యువకునిలోను స్పష్టంగా కన్పించింది. దీనికి కారణమైన రాజకీయనాయకులపై వారిలో తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తమైంది. ఏ పరిస్ధితుల్లోనూ విభజనను అంగీకరించేది లేదని వారు తేల్చిచెప్పారు. అలాగే జిల్లాలో జరిగిన మిగిలిన ఉద్యమాల్లోనూ దాదాపు ఇదే డిమాండ్ విన్పించింది. పార్లమెంటు సమావేశాలు పూర్తయినా నియోజకవర్గాలను పలకరించలేకపోతున్న ఎంపిల వైఖరిపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. తక్షణం పదవులకు రాజీనామా చేసి ఉద్యమాల్లోకి రావాలని జనం అంతా డిమాండ్ చేస్తున్నారు. బుధవారం రాత్రి ఏలూరులో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది, మున్సిపల్ పాఠశాలల విద్యార్ధినీవిద్యార్ధులు నిర్వహించిన కొవ్వొత్తుల ప్రదర్శన కూడా విజయవంతం అయింది. ఆర్డీ రవీంద్రబాబుతో సహా రాజమండ్రి, ఏలూరు నగరపాలకసంస్ధ కమిషనర్లు, జిల్లాలోని వివిధ మున్సిపాల్టీల కమిషనర్లు, జెఎసి నేతలు దీనిలో పాల్గొన్నారు. దాదాపు మూడువేలమందితో నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తిస్ధాయిలో విజయవంతం అయింది.

దూసుకొచ్చిన మృత్యువు
*పుల్లలపాడు వద్ద ఆటోను ఢీకొన్న కారు
*ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి మృతి
*ఆటో డ్రైవర్ సహా ముగ్గురి పరిస్థితి విషమం
*బాధితులంతా ఒకే కుటుంబీకులు
నల్లజర్ల, సెప్టెంబరు 11: ప్రతి సంవత్సరం ఆ కుటుంబమంతా ద్వారకాతిరుమలలోని చిన వెంకన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపధ్యంలోనే బుధవారం ఉదయం 6.30 గంటలకు స్వామివారిని దర్శించుకోడానికి బయలుదేరిన ఆ కుటుంబాన్ని మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చి కబళించింది. ఒకే కుటుంబంలో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి అనంతలోకాలకు చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లజర్ల మండలం సింగరాజుపాలెం గ్రామానికి చెందిన నెక్కలపూడి ప్రసాద్, భార్య వరలక్ష్మి (55), కుమారుడు వీరాస్వామి (బుజ్జిబాబు), కోడలు ధనలక్ష్మి (30), మనుమరాలు కీర్తి (8) మరో మనుమరాలు మంజు బుధవారం ఉదయం ద్వారకాతిరుమల
వెంకటేశ్వరస్వామి ఆలయానికి గ్రామానికి చెందిన ఆటోలో బయలుదేరారు. ఆటో పుల్లలపాడు సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా విజయవాడ వైపు నుండి వస్తున్న ఎపి16బిజె5803 నంబరుగల హూండాయ్ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వరలక్ష్మి, కీర్తి అక్కడికక్కడే మృతి చెందగా ధనలక్ష్మి 108 వాహనంలో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా భీమడోలు సమీపంలో మృతి చెందింది. ప్రసాద్, వీరాస్వామి, ఆటో డ్రైవర్ మిరియాల రమేష్‌ల పరిస్థితి విషమంగా ఉండటంతో 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యంకోసం రాజానగరం జిఎస్‌ఎల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదం జరిగిన తీరు స్థానికుల, వాహన చోదకుల హృదయాలను కలచివేసింది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను, క్షతగాత్రులను చూసిన వారు కంటతడిపెట్టుకున్నారు. ఇలావుండగా సింగరాజుపాలెం గ్రామంలో ఈ వార్త దావానలంలా వ్యాపించి విషాద ఛాయలు అలుముకున్నాయి. వ్యవసాయం చేసుకుంటూ ప్రసాద్ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఇంటి వద్ద ఆలనాపాలనా చూడాల్సిన భార్య, కోడలు ప్రమాదంలో మృత్యువాత పడటంతో మనుమరాలు మంజు తప్ప క్షతగాత్రులను చూసే దిక్కులేని పరిస్థితి నెలకొంది. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతపల్లి ఎస్‌ఐ డి భగవాన్ ప్రసాద్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని తాడేపల్లిగూడెం సిఐ చింతా రాంబాబు పరిశీలించారు. మృతుల బంధువులను రాజమండ్రి నుండి వస్తున్న టిడిపి రాష్ట్ర నాయకులు మాగంటి మురళీమోహన్ ఓదార్చారు. క్షతగాత్రులను జిఎస్‌ఎల్ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఉరిమిన ఉగ్ర గోదావరి
జనసంద్రమైన కొవ్వూరు - విజయవంతమైన లక్ష జన గళ గర్జన
కొవ్వూరు, సెప్టెంబరు 11: లక్షకు పైగా సమైక్యవాదుల జై సమైక్యాంధ్ర నినాదంతో కొవ్వూరు పట్టణం మార్మోగింది. కొవ్వూరు, పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలి వచ్చి కొవ్వూరు మెరక వీధి సెంటరులో ఒకచోట పాల్గొనడం రికార్డు సృష్టించింది. పట్టణ జెఎసి ఆధ్వర్యంలో జెఎసి నాయకులు పరిమి రాధ పర్యవేక్షణలో బుధవారం ఉగ్ర గోదావరి లక్ష జన గళాలతో సమైక్యాంధ్రకు మద్దతుగా చేపట్టిన ఉగ్ర గోదావరి లక్షజన గళ గర్జన విజయవంతమైంది. పట్టణమంతా జనసముద్రంతో మునిగింది. కొవ్వూరు మెరకవీధి సెంటరులో మెయిన్‌రోడ్డుపై జెఎసి నాయకులు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉగ్ర గోదావరిలా జనం తరలివచ్చారు. మెయిన్‌రోడ్డు ఇరుపక్కలా రోడ్డును దిగ్బంధం చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సమైక్యవాదులు, విద్యార్థులు సమైక్య నినాదాలు చేశారు. జెఎసి నాయకులు పరిమి రాధ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, వ్యాపార, కార్మిక వర్గాలవారితో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వేలాదిగా తరలివచ్చి పాల్గొన్నారు. సమైక్యాంధ్రను కోరుతూ కళాకారులు గేయాలు ఆలపించారు. వీర్రాజు మాస్టారు ఆధ్వర్యంలో గీతాలాపన జరిగింది. కొవ్వూరులోని హోలీ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూలు కరస్పాండెంట్ నెల్సన్ ఆంథోనీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కుమారదేవం గ్రామానికి చెందిన చిన్నారి కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. పరిమి హరిచరణ్, మారిశెట్టి వెంకటేశ్వరరావు, బివి ముత్యాలరావు, పాశం సాయిప్రతాప్, ఎఎంసి ఛైర్మన్ బి. వీర్రాఘవులు, కోడూరి శివరామకృష్ణ ప్రసాద్, దొడ్డా విజయసారధి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జెఎసి నాయకులు పరిమి రాధ తదితరులు డా. బిఆర్ అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అందరి బాట సమైక్యమే
ఆంధ్రభూమి బ్యూరో
ఏలూరు, సెప్టెంబరు 11: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో ముందుకు సాగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమమే అందరి బాట కావాలని మున్సిపల్ అధికారులు ఉద్ఘాటించారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్రం స్పష్టమైన నిర్ణయం ప్రకటించేంతవరకు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని ప్రతినబూనారు. మున్సిపల్ సమైక్య పరిరక్షణ సమితి (జెఎసి), సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదికల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఏలూరులో ఏలూరు కార్పోరేషన్‌తోపాటు జిల్లాలోని వివిధ మున్సిపాల్టీలకు చెందిన ఉద్యోగులు, సిబ్బంది భారీఎత్తున కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. స్ధానిక కార్పోరేషన్ కార్యాలయం వద్ద నుండి పవరుపేట, ఆర్‌ఆర్ పేట, ప్రభుత్వాసుపత్రి మీదుగా ఫైర్‌స్టేషన్ సెంటరు వరకు తీన్‌మార్ డప్పుల మధ్య భారీ కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ ఆర్డీ వి రవీంద్రబాబు, ఏలూరు కార్పోరేషన్ కమిషనర్ జి నాగరాజు, రాజమండ్రి కార్పోరేషన్ కమిషనర్ రాజేంద్రప్రసాద్, ఏలూరు కార్పోరేషన్ ఎస్‌ఇ యోహాన్, నిడదవోలు కమిషనర్ సన్యాసిరావు, తాడేపల్లిగూడెం కమిషనర్ జివిఎన్ నరసింహారావు, తణుకు మున్సిపల్ కమిషనర్ సాయిరామ్, పాలకొల్లు కమిషనర్ రాజు, నర్సాపురం కమిషనర్ పి విజయకుమార్, కొవ్వూరు కమిషనర్ డి శ్రీనివాసరావు, భీమవరం కమిషనర్ మూర్తి, ఏలూరు కార్పోరేషన్ ఎంహెచ్‌ఓ డాక్టరు సురేష్‌బాబు, ఏలూరు కార్పోరేషన్ మేనేజరు శర్మ, రాజమండ్రికి చెందిన పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ రంగరాజు, జెఎసి నేతలు ఎల్ విద్యాసాగర్, బి సోమశేఖర్, ఆర్‌ఎస్ హరినాధ్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు ర్యాలీ ఆగ్రభాగాన నిలిచి సమైక్య నినాదాలతో ముందుకు సాగారు. ఫైర్‌స్టేషన్ సెంటరు వద్ద మున్సిపల్ పాఠశాలలకు చెందిన విద్యార్ధులు కొవ్వొత్తులతో ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఆకారంలో నిలిచారు. దీంతో ఆ ప్రాంతం అంతా దేదీప్యమానంగా కొవ్వొత్తుల వెలుగులతో నిండిపోయింది. ఇదే సమయంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవటంతో అ ప్రాంతంలో కొవ్వొత్తుల దీపపుకాంతులు వెదజల్లాయి. అనంతరం జరిగిన సభలో ఆర్డీ రవీంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన దగ్గరనుంచి సమైక్య ఉద్యమం ప్రారంభమై ప్రస్తుతం ఉప్పెన మాదిరిగా ముందుకు సాగుతోందన్నారు. అన్ని ప్రభుత్వశాఖల ఉద్యోగులతోపాటు సమాజంలోని అన్ని వర్గాలవారు దీనిలో భాగస్వాములై రోజురోజుకు ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో మరింతగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామన్నారు. రాజమండ్రి కమిషనర్ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులు భాగస్వాములవుతుంటే ప్రైవేటు పాఠశాలలు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నాయని, ఇది మంచి పద్దతి కాదని, ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏలూరు కమిషనర్ జి నాగరాజు మాట్లాడుతూ ఉద్యమంలో మున్సిపల్ ఉద్యోగులందరూ తమవంతు బాధ్యతగా భాగస్వాములవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏలూరు కార్పోరేషన్ ఆర్‌ఐలు మురళీకృష్ణ, నాగరాజు, కమిషనర్ సిసి గోపి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివి కృష్ణారెడ్డి, జెఎసి నేతలు రమేష్‌కుమార్, జి రఘురామ్ తదితరులు పాల్గొన్నారు.

యువ గర్జనతో దద్దరిల్లిన హేలాపురి
ఏలూరు, సెప్టెంబరు 11 : ప్రాణాలైనా అర్పిస్తాం... సమైక్యాంధ్ర సాధిస్తాం... విభజన వద్దు... సమైక్యాంధ్రా ముద్దు... జై సమైక్యాంధ్ర... జైజై సమైక్యాంధ్ర... అంటూ విద్యార్ధుల సమైక్య నినాదాలతో స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ దద్దరిల్లింది. ఏలూరు విద్యార్ధి యువజన జె ఎసి ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్ద సర్ సి ఆర్ ఆర్ పాలిటెక్నిక్, డిగ్రీ, రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల, ఎన్ ఆర్ ఐ కళాశాల, సెయింట్ ఆన్స్ కళాశాల, థెరిస్సా కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులు యువ గర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమైక్య వాదానికి మద్దతునిస్తేనే సీమాంధ్ర నాయకులను రానిస్తామని, లేదంటే వారిని అడ్డుకుని తీరతామని విద్యార్ధులు భీషణ ప్రతిజ్ఞ చేశారు. విద్యార్ధుల నినాదాలతో ఫైర్‌స్టేషన్ సెంటర్ మార్మోగింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న సర్ సి ఆర్ ఆర్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎం పాండురంగారావు మాట్లాడుతూ 1949లో చెన్నారెడ్డి వంటి స్వార్ధ రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజలను వాడుకున్నారన్నారు. 2001 నుంచి టి ఆర్ ఎస్ అధినేత కెసి ఆర్ కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారని అన్నారు. విద్యార్ధి జె ఎసి నేత లంకపల్లి డేవిడ్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత విద్యార్ధులు గాంధేయ మార్గంలో శాంతియుతంగా ఉద్యమాలను నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే సహించేది లేదని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత మంత్రులు సమైక్యవాదానికి మద్దతునిస్తేనే జిల్లాలో అడుగు పెట్టనివ్వడం జరుగుతుందన్నారు. సమైక్యాంధ్ర కోసం రాజకీయ నాయకులు స్పష్టమైన విధానాన్ని చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ సమైక్యాంధ్ర నేతల ఇళ్లను ముట్టడిస్తామని అన్నారు. ప్రతీ విద్యార్ధి ఉద్యమించి వేర్పాటువాదుల చేతుల్లోనుంచి రాష్ట్రాన్ని కాపాడాలన్నారు. ఏలూరు జెఎసి ఛైర్మన్ సిహెచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్ధుల భవిష్యత్తు కోసమే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కానాల రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడిదారీ ఉద్యమం జరుగుతుంటే సీమాంధ్రలో స్వచ్ఛమైన ప్రజా ఉద్యమం జరుగుతోందని అన్నారు. సీమాంధ్ర మంత్రులు తక్షణం రాజీనామా చేయాలని, అంత వరకు విద్యార్ధులు ఉద్యమాలు కొనసాగించాలని అన్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు పివి రావు, చలుమోలు అశోక్‌గౌడ్, జె ఎసి నేతలు కోనే సీతారామారావు, కోనే రవి, బార్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర, కొఠారి రామచంద్రరావు, డాక్టర్ దిరిశాల వరప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

అలుపెరుగని ఉద్యమ స్ఫూర్తి
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, సెప్టెంబరు 11: చేతల్లో కొత్తదనం.. నిరసనలో వినూత్నం. 50 రోజులకు చేరువవుతున్నా సమైక్యాంధ్ర ఉద్యమం ఎక్కడా ఊపు తగ్గలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ రెట్టింపు ఉత్సాహంతో ఉద్యమిస్తున్నారు. రెండో బార్డోలిగా పేరొందిన భీమవరంలో గత 40 రోజులకు పైగా భీమవరం మున్సిపల్ ఎంప్లారుూస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేస్తూనే ఉన్నారు. జెఎసి సంఘం కార్యదర్శి డి రాజేంద్రకుమార్, అధ్యక్షుడు వి వీరస్వామి ఆధ్వర్యంలో బుధవారం విశ్రాంత మున్సిపల్ ఉద్యోగులు పాల్గొన్నారు. మున్సిపల్ ఇంజనీర్లు సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ గోగురాజు, వి సోమేశ్వరరావు, గూడూరి సుబ్బారావు, ఆర్ ద్రోణాచార్యులు, పి సూర్యనారాయణ, ఎం కుమారస్వామి, జి అప్పారావు, కె. నాగేశ్వరరావు, ఎస్ పుల్లయ్య, బి సత్యనారాయణ, టిపిఒ టి సుబ్బారావు, ఆర్‌ఒఎం సుబ్బరాజు తదితరులు ఇంజనీర్ల వాహనాలను తుడిచి వినూత్నంగా నిరసన తెలిపారు. అలాగే ఎపి ఎన్జీఒల ఆధ్వర్యంలో కొద్దిరోజులుగా చేస్తున్న రిలే నిరాహారదీక్షల్లో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. జెఎసి అధ్యక్షుడు, గొల్లవానితిప్ప పిహెచ్‌సి సూపర్‌వైజర్ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగులు విభజన నిర్ణయం అవివేకమని చెబుతూ కళ్ళు మూసుకొని వినూత్న ప్రదర్శన చేశారు. కొణితివాడ పిహెచ్‌సి సూపర్‌వైజర్ కె శంకర్, పాలకోడేరు పిహెచ్‌సికి చెందిన వైద్యసిబ్బంది ఎస్ నరేష్‌బాబు, ఐఎస్ రామకృష్ణ, డి చండిరాణి, ఎం సావిత్రి, ఎన్ అమ్మాజీ, కె దయామణి, ఎం రాజమ్మ, కె మేరీరత్నం, బి నళినీకుమార్ దీక్షలో పాల్గొన్నారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా న్యాయశాఖ ఉద్యోగులు వర్షంలో తడుస్తూ దీక్షలు చేపట్టారు. ఎన్‌ఎన్‌విఎస్ ప్రసాదరావు, జి రాధాకృష్ణ, కె రమేష్‌కుమార్, వై వీర్రాజు పాల్గొన్నారు. ఉపాధ్యాయ సంఘం జెఎసి ఆధ్వర్యంలో ప్రకాశం చౌక్‌లో రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. పాఠశాలలకు సమ్మె నోటీసు ఇవ్వడంతో ప్రకాశం చౌక్‌లో సమ్మె చేపట్టిన ఉపాధ్యాయులు సమైక్యాంధ్ర కోసం పాఠ్యాంశాలుగా కరపత్రాలను పంపిణీ చేస్తూ వాటినే చదువుకుంటూ ప్రదర్శన చేశారు. వీరితో పాటు విద్యార్థి ఐకాస జిల్లా కన్వీనర్ డాక్టర్ వత్సవాయి శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

భారీ వర్షం
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, సెప్టెంబరు 11: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భీమవరం ప్రాంతంలో బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటల నుండి చిన్నపాటి చినుకులతో ప్రారంభమైన వర్షం సాయంత్రం వరకూ కుండపోతగా కురిసింది. దీంతో పట్టణంలోని పురవీధులన్నీ వర్షం నీటితో నిండిపోయాయి.
ఆచంటలో...
ఆచంట: భారీ వర్షాలకు ఆచంట పెదపేట చిన్నాభిన్నమైపోయింది. పెదపేటకు చెందిన మేడిద పేలమ్మకు చెందిన పూరిల్లు కూలిపోయింది. పేలమ్మ కుమారుడు నాగేశ్వరరావు, మనమలు విజయ్, సంతోష్‌లు నిరాశ్రయులయ్యారు. సుమారు రూ. 80 వేలు నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ప్రభుత్వ అధికారులు సమ్మెలో ఉన్నారని, ప్రభుత్వం తమకు ఆదుకోవాలని పేలమ్మ కోరుతోంది. ఆచంట కవురుపాలెం వద్ద పెద్దపెద్ద వర్షం వల్ల గోతులు పడటంతో ఆటోలో సైతం ప్రయాణం చేయలేని పరిస్థితి నెలకొంది. భారీ వర్షం కారణంగా పెదపేట వర్షం నీటిలో మునిగిపోయింది. కాలనీ రోడ్లపై నుండి వర్షం నీరు ప్రవహిస్తోంది. అంటువ్యాధులు ప్రబలుతాయని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
మొగల్తూరులో...
మొగల్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం మండలంలో ఉదయం నుండి సాయంత్రం వరకు భారీ వర్షం కురిసింది. వినాయకని ఊరేగింపు ఉత్సవాలకు కొంత అంతరాయం ఏర్పడింది. మండలంలో వరిచేలకు కొంత మేలు చేకూర్చింది. రహదార్లు వర్షం నీటితో నిండిపోయాయి.

ఆకట్టుకున్న ఇంద్రధనస్సు
భీమడోలు, సెప్టెంబరు 11 : భీమడోలులో బుధవారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి ఆకాశంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు పలువురిని ఆకట్టుకుంది. ఒక ప్రక్క ఎండ, మరో ప్రక్క వర్షం కురుస్తున్న వేళ ఇంద్ర ధనస్సు కనిపించడంతో ప్రతీ ఒక్కరూ దాన్ని చూసి ఆనందించారు.

నేటి నుండి 48 గంటలు
భీమవరం బంద్
ఆంధ్రభూమి బ్యూరో
భీమవరం, సెప్టెంబరు 11: సమైక్యాంధ్రకు మద్దతుగా, షిండే తీరుకు నిరసనగా భీమవరం సమైక్యాంధ్ర జెఎసి 48 గంటల పాటు బంద్ పాటిస్తున్నట్టు ప్రకటించింది. బుధవారం భీమవరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఏర్పాటుచేసిన జెఎసి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గురు, శుక్రవారాల్లో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు బంద్ పాటించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. అలాగే 48 గంటల అనంతరం కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించారు. రాజకీయ పార్టీలు కూడా ముందుకు వచ్చి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని జెఎసి కోరింది. సమన్వయం పాటిస్తూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి బంద్‌ను విజయవంతం చేయాలని జెఎసి నాయకులు గ్రంధి వెంకటేశ్వరరావు, మెంటే పద్మనాభం, ఎంవి సూర్యనారాయణరాజు, మానేపల్లి సూర్యనారాయణగుప్త, చింతా శ్రీనివాసరావు తదితరులు కోరారు.

చినవెంకన్నకు ఫ్యాన్లు బహూకరించిన
మహమ్మదీయ భక్తుడు
ద్వారకాతిరుమల, సెప్టెంబరు 11: చినవెంకన్న ఆలయానికి ఒక మహమ్మదీయ భక్తుడు పది సీలింగ్ ఫ్యాన్లను బుధవారం బహుకరించాడు. గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ కరీముల్లా ఈ ఫ్యాన్లను ఆలయ ఆవరణలో అమర్చాలని అధికారులకు అందచేశారు. కరీముల్లా గతంలో సైతం శ్రీవారి ఆలయంతో పాటు పలు హిందూ దేవాలయాలకు ప్యాన్లు, తీర్థపు బిందె బల్లలు వంటి వస్తువులను బహుమతిగా అందించారు. దాతను ఆలయ అధికారులు, సిబ్బంది అభినందించారు.

భవ్యభారతాన్ని పునర్నిర్మిద్దాం... భారతదేశాన్ని మేలుకొలుపుదాం...
english title: 
b

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>