Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కొవ్వొత్తులతో ఉపాధ్యాయుల ర్యాలీ

$
0
0

అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ గురువారం మండల యూటిఎఫ్ నాయకులు, స్థానిక ప్రజల నేతృత్వంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. స్థానిక బస్టాండ్ కూడలి నుంచి నగరాఖానా, దర్గా కూడలి వరకు కొవ్వొత్తులు వెలిగించి ర్యాలీ నిర్వహించారు. అలాగే సమైక్యాంధ్ర కోసం మృతి చెందిన ఉపాధ్యాయుడు బి శంకరయ్యయాదవ్‌కు సంతాపం వెలిబుచ్చారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గౌస్‌బాషా, ఉపాధ్యాయులు ఎద్దలయ్య, యు మల్లికార్జున, నాయబ్, వైఎస్‌ఆర్‌సి నాయకులు షేక్ షబ్బీర్, కొల్లా వెంకటేశ్వర్లు, పులి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సిఐ కసరత్తు
వెంకటగిరి, సెప్టెంబర్ 12: ఈనెల్లో జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి నుంచి స్థానిక సి ఐ శ్రీనివాసరెడ్డి కసరత్తు చేపట్టారు. ప్రస్తుతం వెంకటగరిలో ఉన్న సిఐ, ఎస్‌ఐ ఇద్దరు కొత్తకావడంతో కమిటీ సభ్యులతో వివిధ అంశాలను కూలంకషంగా చర్చించారు. అమ్మవారి దర్శనం విషయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ సంవత్సరం ప్రత్యేక చర్యలు తీసుకునేందుకు ఒక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. గురువారం అమ్మవారి ఆలయ వద్దకు చేరుకొని ఎలా ఏర్పాటు చేయాలో చుసుకున్నారు.
జ్వరాలపై ప్రత్యేక వైద్యశిబిరాలు
నిర్వహించాలి:డిఎంహెచ్‌ఓ
ఆత్మకూరురూరల్, సెప్టెంబర్ 12 : ఆత్మకూరు పట్టణంలో ప్రభలుతున్న జ్వరాలపై తక్షణమే ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి జె సుధాకర్ పేర్కొన్నారు. గురువారం ఆత్మకూరు పట్టణంలోని జ్వరాలు ఎక్కువగా సోకుతున్న ఏకలవ్యనగర్, ఏసిఎస్‌ఆర్‌కాలనీ, శివాలయం వీధులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి జ్వరపీడుతులను గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి జ్వరం డెంగీ జ్వరం కాదని, డెంగీ జ్వర నిర్థారణ ఆత్మకూరు పురపాలక సంఘ పరిధిలో సరైన సదుపాయాలు లేవని అన్నారు. డెంగీ నిర్థారణ చేసుకోవాలంటే నెల్లూరులోని ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు నిర్వహించిన అనంతరం అక్కడే చికిత్సలు పొందే అవకాశముందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఆత్మకూరు పట్టణంలో 28 మందికి జ్వరాలు సోకాయని, వారిలో ముగ్గురికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం ఆరుగురు మాత్రమే జ్వరలక్షణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆత్మకూరు జ్వరాలు సోకే వారిని పరిస్థితిని ప్రతి రోజు సమీక్షించి తనకు నివేదిక అందచేయాలని మహిమలూరు వైద్యాధికారి డాక్టర్ పెంచలయ్యను ఆదేశించారు. అనంతరం ఏకలవ్యనగర్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడి డ్రైనేజికాలువ పరిస్థితులపై మున్సిపల్ కమిషనర్‌తో చర్చిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భం మున్సిపల్ కమిషనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో డ్రైనేజిల నిర్మాణం కోసం 39 కోట్ల రూపాయలు నిధులు మంజూరై ఉన్నాయని, త్వరలోనే యుద్దప్రాతిపదికన పనులు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ మాల్యాద్రి, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.

వివాహితపై గ్యాంగ్‌రేప్
* బాధితురాలిని
ఆసుపత్రికి తరలింపు
విడవలూరు, సెప్టెంబర్ 12: మండలంలోని రామచంద్రాపురం పంచాయతీ పరిధిలోని మత్స్యకార గ్రామమైన పొన్నపుడి పాతూరులో వివాహితపై 10 మంది సామూహిక అత్యాచారం చేసారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ సంఘటన కోవూరు సిఐ మాణిక్యరావు, ఎస్‌ఐ అమీర్‌జాన్‌లు ఆ గ్రామానికి వెళ్లి విచారణ చేసారు. వారి కథనం మేరకు వివరాలు ఇలా వున్నాయి. భర్తలేని వివాహిత ఒంటరిగా నివశిస్తుంది. ఈనెల 6వ తేదీ రాత్రి పది మంది వ్యక్తులు ఆమె ఇంటి తలుపులు తట్టగా ఆమెతలుపు తీయడంతో వరుసగా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితురాలు ఈనెల 8 న పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా, నిందితులకు భయపడి పేర్లు చెప్పలేదని ఆమె పోలీసులకు వివరించారు. గురువారం ఉదయం విడవలూరు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పదిమంది తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం నెల్లూరులోని జూబ్లి మెటర్నటి ఆసుపత్రి పంపించినట్లు ఎస్‌ఐ అమీర్‌జాన్ తెలిపారు. సామూహిక అత్యాచార కేసులో జనార్ధన్, నరసయ్య, కృష్ణమూర్తి, తిరుపతి మిగిలిన వారిపై కేసు నమోదు చేసినట్లు కేసును సిఐ మాణిక్యరావు దర్యాప్తు చేస్తున్నారని ఎస్‌ఐ తెలిపారు.

ఓటర్ల జాబితాలు తయారు చేయాలి
నెల్లూరు, సెప్టెంబర్ 12: జనాభా గణాంకాల్ని అనుసరించి ఓటర్ల జాబితాలు సక్రమంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘ ఉప కమిషనర్ వినోద్ జుట్సీ పేర్కొన్నారు. గురువారం ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ జిల్లాలవారీగా జనాభా గణాంకాల్ని అనుసరించి ఓటర్ల జాబితా నిష్పత్తి, స్రీ, పురుష ఓటర్ల నిష్పత్తి సక్రమంగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితాలో తీసివేతలు, చేరికల ప్రక్రియపై సమర్ధవంతంగా, ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా చూడాలని కోరారు. సమ్మరి రివిజన్ ఓటర్ల జాబితా తయారీలో ఎలక్ట్రోరల్ పరిశీలకులు, సహాయ ఎలక్ట్రోరల్ పరిశీలకులు, బూత్‌స్థాయి అధికార్ల శిక్షణా కార్యక్రమాల్ని నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూరె్తైన తదుపరి డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేయాలన్నారు. దీనిపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించాలని కోరారు. ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 18 సంవత్సరాల వయస్సు పూరె్తైన పౌరులకు ఓటు హక్కు కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఓటర్ల జాబితాలో స్ర్తి, పురుష నిష్పత్తి వివరాలను తెలియజేయాలన్నారు. పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియ ఆయా ఓటర్ల జాబితాలను అనుసరించి తయారుకావాలని సూచించారు. ఈ సందర్భంగా నెల్లూరుజిల్లా కలెక్టర్ ఎన్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఓటర్ల సవరణ నిబంధనల మేరకు సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఇఆర్‌ఓ, ఏఓ, విఆర్‌ఓ, బిఎల్‌ఓలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో గుర్తింపుపొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాపై సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఓటరు నమోదుపై అవగాహన, ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఫోటో ఓటర్ల గుర్తింపుకార్డుల జాబితా వందశాతం పూర్తి చేసినట్లు చెప్పుకున్నారు. ఎన్నిల ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు.

రైల్లోంచి జారిపడి యువకుడు మృతి
మనుబోలు, సెప్టెంబర్12: చెన్నై వైపు వెళ్తున్న రైలు నుంచి ఓ యువకుడు జారిపడి మృతి చెందిన సంఘటన గురువారం మనుబోలులో జరిగింది. మండలపరిదిలోని కొమ్మలపూడి రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం ఉదయం చెన్నై వైపు వెళ్తున్న రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువకుడు జారిపడి మృతి చెందాడు. ఆ యువకుని వయస్సు సుమారు 22 సంవత్సరాలు వుంటుందని అతను నల్లరంగు టీషర్టు, గ్రె కలరు ఫ్యాంటు ధరించి వున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు తరలించినారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
17వరకు విద్యాసంస్థల బంద్
నెల్లూరు, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లాలో ఆందోళనా కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి. గురువారం జిల్లాలోని కావలిలో పొలికేక పేరిట విద్యార్థులు సమైక్యాంధ్ర కోసం గర్జించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు రోడ్లపై బారులు తీరి పొడవైన జై సమైక్యాంధ్ర పతాకాన్ని పోలే బ్యానరును రెపరెపలాడించారు. వస్తవ్య్రాపారానికి పేరొందిన కావలి వర్తకులు రెండు కిలోమీటర్లకు పైగా పొడవైన గుడ్డను సమకూర్చడంలో తమ ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చూసేందుకు ప్రజలుసైతం స్వచ్ఛందంగా వెల్లువలా తరలివచ్చారు. కావలి ట్రంకురోడ్డు రెండుకిలోమీటర్ల పొడవున, ఉదయగిరి రోడ్డు రైల్వే వంతెన సమైక్యవాదులతో కిటకిటలాడింది. పొలికేక వేదికపై తెలుగుజాతి గొప్పతనాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిన మహనీయుల వేషదారణలు ధరించిన విద్యార్ధులు నృత్యాలు చేసి జాతికీర్తిని చాటారు. అదే విధంగా ఆంధ్ర భోజుడు వేషధారి గుర్రంపై సభాస్థలి వద్దకు వచ్చి చూపరులకు కనువిందు చేశారు. పలువురు విద్యార్థులు కోలాటాలు వేయగా అన్నదాత మణి తన దైన ప్రాసలో ప్రసంగించి సభికుల చేత సమైక్యాంధ్ర నినాదాలు చేయించారు. నెల్లూరు నగరం తరువాత కావలి పట్టణంలో నిర్వహించిన ఈ సభ దిగ్విజయం కావడంతో అందరిలోను సమైఖ్య ఉద్యమ స్ఫూర్తి వెల్లివెరియడం విశేషం. ఇదిలాఉంటే నెల్లూరు నగరంలో ఎన్‌జిఓ అధికార్ల సంఘం ఆధ్వర్యంలో బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్ని మూసి వేయించారు. బిఎస్‌ఎన్‌ఎల్ ఎక్ఛ్సేంజ్‌లో కార్యాచరణను కూడా స్థంభింపజేశారు. ఈ సందర్భంలో బ్యాంకుల్లో ఉన్న ఖాతాదార్లను వెలుపలకు పంపుతుండగా ఒకింత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ అధ్యాపక జేఏసి నేతృత్వంలో గాంధీబొమ్మ వద్ద యోగా చేపట్టారు. విద్యుత్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మెలో పాల్గొనడంతో తొలినాడు అక్కడక్కడా కరెంట్‌లో అంతరాయాలు ఏర్పడటంతో జనం అగచాట్లు వర్ణనాతీతంగా మారాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు సైతం ఐదురోజులపాటు ఈ నెల 17వ తేదీ వరకు మూత వేసేందుకు నిర్ణయించుకున్నాయి. ఇదిలాఉంటే సమైక్య దీక్షలో మృతి చెందిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్యయాదవ్‌కు వైఎస్‌ఆర్‌సి నెల్లూరు నగర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ నేతృత్వంలో శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిరసనల్లో భాగంగా పలువురు నేతలు మాట్లాడుతూ సోదరభావంతో మెలుగుతున్న తెలంగాణా, సీమాంధ్ర ప్రాంతాల మధ్య విభజన చిచ్చు రావణకాష్టంలా మారిందన్నారు. ఇరుపక్షాల సానుకూల ధోరణితోనే విభజనైనా, సమైక్యంగా ఉండటమైనా పరిష్కరించాలన్నారు. ఉవ్వెత్తున ఆందోళనలు ఎగసిపడుతున్నా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రానికే కట్టుబడి ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం పదే పదే ఖరాఖండిగా స్పష్టీకరిస్తుండటాన్ని ఉద్దేశించి తప్పుబట్టారు. జిల్లా స్థాయి అధికార్ల సంఘం ఎన్‌జిఓలతోపాటు గ్రూప్-4 ఉద్యోగులు, ఏపిఎస్ ఆర్టీసి, రెవెన్యూ, ఇలా అన్ని ప్రభుత్వ శాఖలతోపాటు కార్మిక వర్గాలు కూడా సమ్మెలో ఉండటంతో పాలనా వ్యవస్థ సందిగ్ధంలో పడింది. సోనియా, కెసిఆర్ దిష్టిబొమ్మలను పలుచోట్ల పాడెకు కట్టి శవయాత్రగా ఊరేగించారు. తెలంగాణా కంటే మిన్నగా తమ సమైక్యాంధ్ర ఉద్యమం ఎగసిపడుతున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించదేమి అంటూ పలువురు వక్తలు ఆందోళనా కార్యక్రమాల్లో భాగంగా ప్రశ్నించారు.

అవసరమైతే ప్రాణత్యాగాలకు సిద్ధపడాలి
కావలి, సెప్టెంబర్ 12: సీమాంధ్రులకు రాష్ట్ర విభజన జీవన్మరణ సమస్యకాగా సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఎంతటి పోరాటాలకైనా సర్వసన్నద్ధంగా వుండాలని డి ఆర్ ఓ రామిరెడ్డి అన్నారు. కావలి కేక పేరిట గురువారం ఉదయం పట్టణంలోని కెయు బ్రిడ్జి సెంటర్‌లోవేలాది సమైక్యవాదులతో నిర్వహించిన లక్ష గళ ఘోష కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు స్వార్ధపరుల శక్తులే కారణమని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలందరు కలిసి నిర్మించుకున్న హైదరాబాద్ తెలంగాణాదంటే ఎవరూ ఊరుకోరరన్నారు. అవసరమైతే ప్రాణత్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. ఏపి ఎన్‌జి ఓ జిల్లా అధ్యక్షులు రవీంద్ర బాబు మాట్లాడుతూ సమైక్య వాద ఉద్యమ వేదికలపై పొట్టి శ్రీరాములు, బెజవాడ గోపాల్‌రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం వుందన్నారు. కేంద్రం విభజించి పాలించు అన్న విధానాలతో ముందుకు పోతూ తెలుగుజాతి మధ్య చిచ్చుపెట్టి చోద్యం చూస్తుందని విరుచుకుపడ్డారు. కొంతమంది స్వార్ధపరులు అధికారం కోసం, అక్రమార్జన కోసం రాష్ట్ర విభజన ఉద్యమాన్ని ముందుకు తేగా మంచిచెడులు ఆలోచించకుండా దేశ సమగ్రతను గాలికి వదిలి విభజన ప్రకటన చేయడం అన్యాయం అన్నారు. తెలుగువారి ఆత్మలంతా ఒక్కటే కాగా సమైక్యం కోసం హృదయాలన్ని ఘోషిస్తున్నాయని చెపుతూ సమైక్య ప్రకటన వచ్చే వరకు ఏపి ఎన్‌జిఓలు పోరాటా పంథాలో విరామం ఉండదన్నారు. విజయంగర్వంతోనే తిరిగి విధుల్లో చేరుతామని ధీమా వ్యక్తం చేసారు. కాగా కొంత మంది తెలంగాణ వాదులు, రాయల తెలంగాణ వాదులు ఉనికి కోసం సమైక్య ఉద్యమంలో చొరబడి ఉద్యమాన్ని పక్కదారి పట్టించేకార్యక్రమాలు చేస్తున్నారంటూ డి ఇ ఓ రామలింగంపై పరోక్షంగా అందరి సమక్షంలోనే విమర్శలు గుప్పించారు. ఊరు వాడ ఒక్కటై ఏక స్వరంతో ముందుకు సాగి సమైక్యాంధ్ర పరిరక్షణకు తరలిరావాలని పిలుపునిచ్చారు. డి ఇ ఓ రామలింగం మాట్లాడుతూ విభజన అంటూ జరిగితే సీమాంధ్ర ఏడారిగా మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. కోట్ల ప్రజలు ఒక్కటై విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని అంటూ 40రోజులుగా రాష్ట్రంలో ఉద్యమం కొత్త్ధనంతో సమరోత్సాహంతో ఉరకలువేస్తుందని అన్నారు. ఇదే ప్రజల ఆకాంక్షకు బలమైన నిదర్శనం అన్నారు. ఆర్‌డిఓ సుబ్రమణ్యేశ్వరెడ్డి మాట్లాడుతూ భారత దేశం ఎందుకు పనికిరాని అనాగరిక సమాజమని ప్రపంచం అంతా భావిస్తుండగా స్వామివివేకానంద ఒక్కడే దేశఖ్యాతిని సాంప్రదాయాలను, విశిష్టతను రెండునిమిషాల వ్యవధిలో చికాగోలో సర్వమత సమ్మేళనంలో తెలియచేసి దేశానికి ఎనలేని కీర్తిని తెచ్చారని చెపుతూ అదేవరవడితో విభజన జరిగితే నష్టాలు,కలిసి వుంటే ఒనగూడే లాభాలను విభజన వాదులకు, కేంద్రానికి తెలియచేయాల్సిన అవసరం వుందన్నారు. కార్యక్రమ ఆద్యాంతం ఉత్తేజభరిత ప్రసంగాలు చేస్తూ కేరింతలు కొట్టించారు. తహశీల్దార్ వెంకటేశ్వర్లు కార్యక్రమానికి సహకరించిన పట్టణ ప్రజలకు, కులసంఘాలకు వివిధ జె ఏసిలకు ఉద్యోగ కార్మిక సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు.

రాజకీయ నాయకులకు నోచాన్స్
వేదికపైకి వచ్చేందుకు ప్రయత్నించిన రాజకీయ నాయకులను ఆర్‌డి ఓ సుబ్రమణ్యేశ్వరరెడ్డి సున్నితంగా వారించి రాజకీయ ప్రసంగాలకు తావులేదంటూ తెలియచేసారు. ముందుగా కాంగ్రెస్ యనాయకులు గ్రంధి యానాదిశెట్టి వేదికపైకి రాగా విషయాన్ని చెప్పి పంపివేసారు. అనంతరం వై ఎస్ ఆర్‌సిపి సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వేదికపైకి చేరి టివి చానల్స్‌తో మాట్లాడుతుండగా గమనించిన ఆర్‌డిఓ మధ్యలోనే సమస్యలు వస్తాయని చెప్పి కిందికి పంపివేసారు. యువనేత జగదీశ్వర్‌రెడ్డిని వేదికపైకి వచ్చినప్పటికి ప్రసంగాలకు అవకాశం ఇవ్వకుండా పంపించివేసారు. ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు భారీ సంఖ్యలో తన కార్యకర్తలతో కలిసి నినాదాలు చేసుకుంటూ సభా ప్రాంగణానికి వచ్చినప్పటికి ఆయనకు పరిస్థితిని తెలియచేసి వేదికపైకి రాకుండా చూసారు. కాగా రాజకీయ ప్రసంగాలు కొత్త సమస్యలు తెస్తాయని గ్రహించిన నేతలుఅధికారుల వినతిని స్వీకరించి సహకరించారు.

కొనసాగుతున్న రిలే దీక్షలు

వరికుంటపాడు, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్రకు మద్దతుగా ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో మండల కేంద్రమైన వరికుంటపాడులో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 17వ రోజుకు చేరుకున్నాయి. గురువారం ఈ దీక్షా కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిబిరంలో ఆశీనులై సమైక్యాంధ్రకు జైకొట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే కలిగే నష్టాలను గురించే వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగా ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని ఉద్దేశించి కోరారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఎన్‌జిఓ, ఉపాధ్యాయ సంయుక్త కార్యాచరణ సమితి, యువత, విద్యార్థులు పాల్గొన్నారు.

ఏఎస్‌పేటలో గణేష్ నిమజ్జనం

అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 12: ఏఎస్‌పేట మెయిన్ బజార్‌లో గత మూడురోజులుగా పూజలందుకుంటున్న గణేష్ విగ్రహానికి నాలగవ రోజైన గురువారం మేళతాళాల నడుమ ఊరేగింపు చేపట్టారు. అనంతరం సమీపంలోని నక్కలవాగులో నిమజ్జనోత్సవం నిర్వహించారు. గ్రామంలోని ఆర్యవైశ్య సంఘ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.

ఉదయగిరిలో రిలే దీక్షలు
ఉదయగిరి, సెప్టెంబర్ 12 : సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పంచాయతీ బస్టాండ్‌లో గురువారం రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ జెఏసి ఆధ్వర్యంలో నీటిపారుదలశాఖకు సంబంధించిన ఉద్యోగులు రిలే దీక్షలో పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకు సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శనను నిర్వహించారు. బి శంకరయ్యయాదవ్‌కు సంఘీభావంగా కొవ్వొత్తుల ప్రదర్శన ఏర్పాటుచేశారు. అనంతరం తెలుగుదేశంపార్టీకి సంబంధించిన రిలే దీక్షలు శకునాలపల్లి పంచాయతీ, చెరువుపల్లి పంచాయతీకి సంబంధించిన కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్ర సాధించేంత వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని జెఏసి నాయకులు పునర్ఘుటించారు. ఈ కార్యక్రమంలో జెఏసి నాయకులు రామ్మోహన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ బొజ్జా నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా గణనాధుని వేడుకలు
ఉదయగిరి, సెప్టెంబర్ 12 : స్థానిక మండలంలో 4వ రోజు గణనాధుని వేడుకలు వైభవంగా జరిగాయి. పట్టణంలోని బాలాజీనగర్, అన్నపూర్ణానగర్, యాదవ్‌వీధి, బోయపాళెం, బెస్తపాళెం, బ్రహ్మణవీధి, అరుంధతీయవాడ, సినిమాహాల్ సెంటర్లలోని విగ్రహాలకు వైభవంగా అలంకారం చేసి భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. శుక్రవారం నిమజ్జన కార్యక్రమంలో భాగంగా గురువారం వైభవంగా గణనాధుడిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కోదండరామస్వామి ఆలయంలో అన్నదానం
బిట్రగుంట, సెప్టెంబర్ 12: మండల కేంద్రమైన బోగోలు కోదండ రామస్వామి ఆలయం అవరణలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహానికి స్థానికులు విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో సీతారామ లక్ష్మణ,హనుమాన్‌కు అర్చకుల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం జరిగింది. అన్నదానానికి ఉభయ దాతలుగా ఆలయ చైర్మన్ బిన్నిబోయిన పెంచలయ్య, వినాయక ఉత్సవ కమిటి సభ్యులు వ్యవహరించారు.

శేషసాయి మందిరంలోప్రత్యేక పూజలు
బిట్రగుంట, సెప్టెంబర్ 12:బోగోలు మండల లోని పాత బిట్రగుంట శేషసాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం బాబాకు అభిషేకాలు, పూలంగిసేవ, అర్చనలు జరిగాయి. సాయంత్రం భక్తులు మందిరం భజనలు చేశారు.

విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 12 : ఏఎస్‌పేట మండలం హిందూ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గురువారం స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామానికి చెందిన దాత యేల్చూరు హరికృష్ణ దంపతులు తమ సొంత నిధులతో పాఠశాలలోని మొత్తం 120 మంది విద్యార్థులకు బ్యాగులు అందచేశారు. ఈ సందర్భంగా దాత హరికృష్ణ మాట్లాడుతూ ఈ పాఠశాలలో తాను పూర్వ విద్యార్థిని అని తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ మేరకు పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కె సి రాగయ్య, బి ఎద్దలయ్య, హరీష్‌కుమార్‌లు దాత హరికృష్ణ దంపతులను శాలువా కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఆర్యవైశ్య సంఘ నాయకులు వాకిచర్ల బాబు, రాజా సత్యనారాయణ, రాజా బాలాజీ, మహ్మద్ రఫీ, వై హజరత్తయ్య, పాఠశాల చైర్మన్ జె వెంకటరత్నం, హెచ్‌ఎంలు షేక్ గౌస్‌బాష, ఎండి నాయబ్, ఉపాధ్యాయులు సుబ్బయ్య, రవీంధ్ర, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

శంకరయ్య మృతికి సంతాపం
అనుమసముద్రంపేట, సెప్టెంబర్ 12 : సమైక్య రాష్ట్రం పరిరక్షణ కోరుతూ సమైక్యదీక్షలో ఉండి గుండెపోటుతో మృతి చెందిన ఉపాధ్యాయుడు శంకరయ్యయాదవ్‌కు గురువారం ఏఎస్‌పేటలోని ఉపాధ్యాయులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు. స్థానిక హిందూ ప్రాధమిక పాఠశాలలో మృతి చెందిన శంకరయ్యయాదవ్ సంతాప సభను ఏర్పాటుచేశారు. ఈ సంతాప సభలో ఏఎస్‌పేటలోని హిందూ, ఉర్దూ హెచ్‌డబ్య్లూ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 నిమిషాల పాటు శంకరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని వౌనం వహించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె సి రాగయ్య, షేక్ గౌస్‌బాష, నాయబ్, మహబూబ్‌బాష, రవీంద్రా, సుబ్బయ్య, బి ఎద్దలయ్య, హరీష్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పొదలకూరు 17న ‘పొలికేక’
పొదలకూరు, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్రకు మద్దతుగా పొదలకూరులో ఈ నెల 17న పొలికేక పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటుచేయనున్నట్లు స్థానిక ఎంపిడిఓ శ్రీహరి పేర్కొన్నారు. ఉద్యమాన్ని ఉద్ధృతం చేసే కార్యక్రమంలో భాగంగా గురువారం అన్ని శాఖల అధికారులు, స్వచ్చంధ సేవా సంస్థలు, ఉపాధ్యాయ సంఘ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 వేల మందితో స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో ఈ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుంచి రైతులను, విద్యార్థులను, ప్రజలను చైతన్యపరిచి ఈ సభకు తరలించాలని కోరారు. ఇందుకోసం గ్రామకమిటీని ఏర్పాటుచేయాలని సూచించారు. ఈ సభ విజయవంతానికి అందరూ సహకరించాలని కోరారు. సమైక్యాంధ్ర జెఏసి కన్వీనర్ పి నరసింహులు, నాయకులు కొండా సుబ్బారెడ్డి, కె వెంకటేశ్వర్లు, స్థానిక తహశీల్దార్ రామకృష్ణ, ఎంఇఓ సయ్యద్ అబ్థుల్ హమీద్, సిడిపిఓ సత్యకుమారి, బాలుర, బాలికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, బాలనాగమ్మలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మళ్లీ గంగకు నీరు విడుదల
అనంతసాగరం, సెప్టెంబర్ 12 : సోమశిల జలాశయం నుంచి కండలేరు వరద కాలువకు గురువారం మళ్లీ అధికారులు చెన్నైకు తాగునీటి అవసరాల నిమిత్తం నీరు విడుదల చేశారు. ఈనెల 5న తెలుగుగంగ కాలువకు 1000 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేసి మరుసటి రోజే అధికారులు నీటి విడుదలను నిలుపుదల చేయడం తెలిసిందే. జలాశయం నీటి సామర్థ్యం మరింత పెరిగిన అనంతరం విడుదల చేయాలనే నేపధ్యంలో తెలుగుగంగకు నీటి విడుదల నిలుపుదల చేశారు. అయితే ప్రస్తుతం జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరడంతో పాటు 10 టిఎంసిలు జలాశయంలో చేరడంతో మళ్లీ గురువారం సోమశిల-కండలేరు వరద కాలువకు నీటి విడుదలకు అధికారులు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం తొలుత 1000 క్యూసెక్కుల వంతున విడుదల చేసిన అధికారులు సాయంత్రం నాలుగు గంటలకు 2 వేల క్యూసెక్కులకు నీటి విడుదలను పెంపుదల చేసి 27 వేల క్యూసెక్కులకు పెరిగింది. ఫలితంగా 27.522 టిఎంసిల నుంచి గురువారం ఉదయం ఆరు గంటలకు 29.825 టిఎంసిలకు జలాశయం నీటిసామర్థ్యం పెరిగింది. కాగా సాయంత్రానికి 30.80 టిఎంసిలు దాటింది. శుక్రవారం ఉదయానికి వస్తున్న వరద అంచనాల ప్రకారం సుమారు 32 టిఎంసిలు దాటే అవకాశముందని సోమశిల అధికారుల నుంచి సమాచారం. కాగా గురువారం 1.44 మీ.మీల సోమశిలలోనూ, చెన్నూరు వద్ద 13 మీ.మీల వర్షపాతం నమోదైంది. ఈ నేపధ్యంలో వరద మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తుంది.

21న ఆత్మకూరులో లక్ష గళార్చన
*జెఏసి నాయకుల సమావేశంలో తహశీల్దార్ వెల్లడి

ఆత్మకూరు, సెప్టెంబర్ 12 : సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం చేసేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ గురువారం సమావేశంలో తహశీల్దార్ ఈ నెల 21న ఆత్మకూరులో లక్ష గళార్జన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆత్మకూరు తహశీల్దార్ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహశీల్దార్ మాట్లాడుతూ సీమాంధ్ర ప్రజల గోడు ప్రభుత్వానికి పట్టడం లేదని, ఇందుకు గాను పల్లెల్లోకి వెళ్లి ప్రజలను చైతన్యపరిచి సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పక్షాల నాయకులు, జెఏసి నాయకులు, అన్ని శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పల్లెల్లో చైతన్య పరిచే సమయంలో సమైక్యాంధ్ర సాధించేంత వరకు పొరాటాలు సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెఏసి ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లక్ష జన ఘోషకు తరలిన జనం
బిట్రగుంట, సెప్టెంబర్ 12:సమైక్యాంధ్ర కోసం కావలిలో చేపట్టిన లక్షజన ఘోషకు గురువారం బోగోలు మండలం నుండి జనం తరలిపోయారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి అధ్వర్యంలో బోగోలు, అల్లిమడుగు లోని కడనూతల, తెల్లగుంట, సిఆర్ పాలెం, సింగపేట, అల్లూరు, పంచాయతీల నుండి ప్రజలు తరలిపోయారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు ఈనెల 14న సమైక్యాంధ్ర జె ఎసి కమిటి అధ్వర్యంలోపల్లెలోసమైక్యాంధ్ర గురించి అవగహన కల్పిస్తు జువ్వల దినె్న నుంచి కావలి వరకు ర్యాలి నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర విభజనపై సిపిఎం అధ్వర్యంలో
నేడు అవగహన సదస్సు
బిట్రగుంట, సెప్టెంబర్ 12: అంధ్రప్రదేశ్ రాష్ట్ర సమైక్యత, విభజన అంశాలపై భారత కమ్యూనిస్టు పార్టీ(ఎం)వైఖరి గురించి శుక్రవారం అవగహన సదస్సు చేపడుతున్నట్లు మండల కార్యదర్శి కాకుమాని వెంకయ్య చెప్పారు. పంచాయతీ అవరణలో మధ్యాహ్నం 3గంటలకు సదస్సు ప్రారంభమవుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటి సభ్యులు జక్యావెంకయ్య, జిల్లా కార్యవర్గసభ్యులు పులిగండ్లశ్రీరాములు, డివిజనల్ కార్యదర్శి తాళ్లూరు మాల్యాద్రి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తారని చెప్పారు. సమావేశానికి అభిమానులు,కార్యకర్తలు హజరుకావాలని కోరారు.

నిమజ్జనానికి తరలుతున్న గణనాథులు
నెల్లూరు , సెప్టెంబర్ 12:వినాయక చవితి సందర్భంగా నగరంలోని వివిధ వినాయక మండపాల్లో కొలువుదీరిన గణనాథులను గురువారం పెన్నానది, నెల్లూరు చెరువు, జాఫర్ సాహెబ్‌కాలువ, పెన్నాకాలువలో నిమజ్జనం చేశారు. ఇందుకోసం మున్సిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో పెన్నానది వద్ద షామ్యానాలు వేసి మంచినీటి వసతి కల్పించారు. సంతపేట నాలుగుకాళ్ల మండపం నుండి నుండి పెన్నానది వరకు విద్యుత్ దీపాలు ఏర్పాటుచేశారు. నది వద్ద క్రేన్లు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా పోలీసులు తగిన బందోబస్తు ఏర్పాటుచేశారు. నిమజ్జనం జరిగే చోట కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. నిమజ్జనానికి వీలుగా నదిలో ఎక్కువ నీటిని వదిలారు. వేదాయపాళెం, నిప్పోసెంటర్, దర్గామిట్ట ప్రాంతాల్లోని వినాయక విగ్రహాలను నెల్లూరు చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. బాలాజీనగర్ సిపిఎం సెంటర్, వెంకట్రామాపురం, చిన్నబజారు, పెద్దబజారు, తిప్పరాజువారివీధి, స్టోన్‌హౌస్‌పేట,నవాబుపేట తోపాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వందలాదిగా చిన్న, పెద్ద విగ్రహాలను పెన్నానది, జాఫర్ సాహెబ్‌కాలువలో నిమజ్జనం చేశారు. తప్పెట్లు, మేళతాళాలు, కీలుగుర్రాలు, బాణసంచాకాల్పులు, యువకుల కేరింతలు, నృత్యాల నడుమ రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబుచేసిన గణనాథుల విగ్రహాలను ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలపై ఉంచి కోలాహలంగా నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం అనంతరం పలువురు ప్రసాదాలు పంచిపెట్టారు. అదేవిధంగా నిమజ్జనానికి తరలివెళ్లే దారిలో సందర్శకులకు ప్రసాదాలు పంచారు. పలు మండపాల్లో ఈసందర్భంగా అన్నదానం చేశారు. వివిధ సెంటర్లలో కొలువుదీరిని వినాయకులను చూసేందుకు సందర్శకులు తరలి రావడంతో వినాయక మండపాలు సందడిగా కనిపించాయి. వివిధ మండపాల్లో ఈసందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు. ఆదివారం వరకు వినాయక నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయి.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
రాపూరు, సెప్టెంబర్ 12: రాపూరు మండలంలోని రామదేవపల్లి గ్రామ క్రాస్ రోడ్డువద్ద గురువారం సాయంత్రం ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఆ గ్రామనికి చెందిన ఒకరు మృతి చెందారు. రాపూరు ఎస్సై క్రిష్ణానందం తెలిపిన వివరాల మేరకు రామదేవపల్లి గ్రామ హరిజనవాడకు చెందిన ఒరేపల్లి అంకయ్య(40) రోడ్డుదాటు తుండగా ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబీకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై క్రిష్ణమూర్తి తెలిపారు.

తీరంలో అలల ఉద్ధృతి:ఆందోళనలో మత్స్యకారులు
కోట, సెప్టెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోట మండలంలోని తీర ప్రాంతంలో ఈదురు గాలులు, సముద్రంలో అలల తాకిడి అధికంగా వుండటంతో ఆప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండలంలోని సముద్రప్రాంత గ్రామాలైన గోవిందుపల్లిపాళెం, కొత్తపట్నం, శ్రీనివాససత్రం, యమదినె్నపాళెం, గున్నంపడియ గ్రామాల వద్ద బంగాళాఖాతంలో గురువారం అలల తాకిడి అధికంగా వుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లలేక అల్లాడిపోతున్నారు. పది రోజుల నుంచి వాతావరణంలో మార్పులు ఏర్పడ్డాయి. దీంతో సముద్రం కసురుగా మారింది. సముద్రంలో కెరటాలు అధికంగా వుండంతో జాలర్లు వారి పడవలను, వలలు ఒడ్డుపై జాగ్రత్త చేసుకున్నారు. తీరప్రాంత గ్రామాల్లోని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని దురాయి వేసుకున్నారు. అయితే సుమారు నెల రోజుల నుంచి వేట సాగకపోవడంతో ఆకలితో అల్లాడుతున్నామని తమను ఆదుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు. ఇదిలావుండగా గురువారం రాత్రి నుంచి చలిగాలులతో ఒకమోస్తారుగా వర్షం కురుస్తుండంతో చిరు వ్యాపారులు, కూలీపనులు చేసుకుని జీవించే వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో పంట చేతికందనున్న సమయంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని కొక్కుపాడు, తిమ్మనాయుడుపాళెం, వంజివాక, అల్లంపాడు, ఉత్తమనెల్లూరు గ్రామాల్లో సుమారు 1000 ఎకరాల్లో వరిపంట బురదలో కూరుపోయింది. దీంతో రైతులు అల్లాడిపోతున్నారు.

కోటలో కొనసాగుతున్న ఉపాధ్యాయల దీక్ష
కోట, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజనకు నిరసనల్లో భాగంగా గురువారం గురువారం కోట క్రాస్‌రోడ్డు వద్ద కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన ఉపాధ్యాయులు జెఎసి కమిటి ఆధ్వర్యంలో దీక్షను చేపట్టారు. ఈ దీక్షకు సినీయర్ న్యాయవాది పెల్లేటి గోపాల్‌రెడ్డి, కోట పంచాయతీ సర్పంచ్ కోట రాఘవయ్య పాల్గొని మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా సర్పంచ్ రాఘవయ్య మాట్లాడుతూ సోనియాగాంధీ తనకుమారుడిని ఏలాగైనా ప్రధానిని చేయాలన్న ఉద్దేశంతో పచ్చని రాష్ట్రంలో విభజన చిచ్చురేపిందని ఆరోపించారు. రాష్ట్ర విభజన ప్రకటన వినగానే కెసిఆర్ ముఖ్యమంత్రి అయిపోయినట్లు భావించి హైద్రాబాద్‌లో వున్న సీమాంధ్రులకు ఎలాంటి గడువు ఇవ్వకుండానే తరిమివేస్తానని ప్రకటించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రజలు 44రోజుల నుంచి నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయం అన్నారు. ప్రభుత్వం నుంచి సరైన ప్రకటన వెలువడే వరకు పోరాటం ఆగదని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంఆర్‌పి రామిశెట్టి, పాత్రికేయులు, ఉపాధ్యాయులు, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సమైక్యాంధ్ర పరిరక్షణ కోరుతూ గురువారం మండల యూటిఎఫ్
english title: 
rally

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>