Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

లాయర్ల వంటా వార్పు

$
0
0

ఒంగోలు, సెప్టెంబర్ 12: జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పులు, ర్యాలీలు, మానవహారాలు, విచిత్ర వేషధారణలతో అన్నివర్గాల వారు ఉద్యమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఒక ప్రైవేటు స్కూలుకు చెందిన విద్యార్థులు గురువారం ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని తన కార్యాలయంలో కలసి సమైక్యాంధ్రకు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ఎంపి మాగుంట స్పందిస్తూ తాను సమైక్యాంధ్రకు ఎల్లవేళలా మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. విద్యార్థులు భారతమాత వేషధారణలో మాగుంటను కలవటం విశేషం. విద్యుత్ ఉద్యోగులు 72 గంటల సమ్మెలో భాగంగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని ఎస్‌ఇ కార్యాలయం వద్ద నిరసన దీక్షలు చేపట్టారు. ఈసందర్భంగా ఎస్‌ఇ కార్యాలయంలోకి వెళుతున్న డిఇని అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర విభజన ప్రకటనలు వెంటనే వెనక్కి తీసుకుని సమైక్యాంధ్రకు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్‌జీవోలతో కలసి ఆందోళన కార్యక్రమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా లాయర్లు స్థానిక జిల్లా కోర్టు వద్ద సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలియచేశారు. సమైక్యాంధ్రను కొనసాగించేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని వారు హెచ్చరించారు. హైకోర్టు వద్ద సీమాంధ్ర న్యాయవాదులపై టి న్యాయవాదులు దాడులు చేయటాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఏదిఏమైనప్పటికి సమైక్యాంధ్ర ఉద్యమాలు జిల్లావ్యాప్తంగా ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదిలావుండగా జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాలు జోరందుకుంటుండటంతో ప్రజావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్‌టిసి, ప్రైవేటు సంస్థలు మూసివేసి ఉండటంతో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా ప్రభుత్వ కార్యాలయాలు మూసివేసి ఉండటంతో పరిపాలనే స్తంభించిపోవటంతో ప్రజలకు సేవలు అందక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. విద్యుత్ ఉద్యోగులు 72 గంటలపాటు సమ్మెలో పాల్గొంటుండటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లాలో ఎప్పుడు విద్యుత్ ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. దీనికితోడు నిత్యావసర వస్తువులు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిపాయలు కేజీ 70 రూపాయలకు పైగానే అమ్ముతుండటంతో ఉల్లిప్రియులు ఆందోళన చెందుతున్నారు. కూరగాయలు ధరలు కూడా తారాస్థాయికి చేరాయి. రేషన్ బియ్యం అందక సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా సమ్మెలో ఉండటంతో కార్యాలయాలన్ని బోసిపోయి కనిపిస్తున్నాయి. సమ్మె ఎప్పుడు ముగుస్తుంది, సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా అన్న ఆలోచనలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని సమైక్యాంధ్రపై స్పష్టమైన నిర్ణయాన్ని చేయాలని ప్రజలు కోరుతున్నారు.

రాజకీయ రాజీనామా డ్రామాలొద్దు
విశాలాంధ్ర వేదిక రాష్ట్ర కార్యదర్శి పరకాల ధ్వజం
స్కంధపురి సమైక్యాంధ్ర సింహగర్జన విజయవంతం
కందుకూరు, సెప్టెంబర్ 12: తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ రాజీనామా డ్రామాలతో హడావుడి చేస్తున్నారని విశాలాంధ్ర వేదిక రాష్ట్ర కార్యదర్శి పరకాల ప్రభాకర్ ధ్వజమెత్తారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల క్రీడామైదానంలో స్కంధపురి సమైక్యాంధ్ర సింహగర్జన కార్యక్రమానికి ప్రభాకర్ ముఖ్యఅతిధిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక జెఎసి అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమానికి ప్రభార్‌తోపాటు సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ కృష్ణయాదవ్, శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి, ఆర్‌టిసి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు, మజ్దూర్ యూనియన్ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు విచ్చేశారు. కార్యక్రమంలో పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు కాంగ్రెస్ పెద్దలతోపాటు రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధాన కారణమని విమర్శించారు. మూడున్నర సంవత్సరాలుగా ఢిల్లీలో విభజన ప్రక్రియ జరుగుతోందని తెలిసిన రాజకీయ పార్టీల నాయకులు, ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చూసీచూడనట్లు వ్యవహరించారని విమర్శించారు. ప్రస్తుతం సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగులు, ప్రజల భాగస్వామ్యంతో జరుగుతున్న ఉద్యమం ద్వారా తమ రాజకీయ భవిష్యత్‌కు నష్టం వాటిల్లుతుందని భావించిన ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజకీయ రాజీనామాలతో డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక్కరి రాజీనామా అయినా నేటికి ఆమోదింపబడలేదని, ఒక్క నందమూరి హరికృష్ణ తన రాజీనామాను ఆమోదింపజేసుకుని నిజాయితీని నిరూపించుకున్నారని అన్నారు. రాజీనామాల ఆమోదం తెలియకపోతే ఫార్మెట్ తాము తయారుచేసి ఇస్తామని, రాజీనామాల ఆమోదింపజేసుకుని ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. రాజీనామాలు ఆమోదింపచేసుకుంటేనే ఉద్యమంలోకి రాజకీయపార్టీల నాయకులను ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. సోనియా తెలుగుజాతి పౌరుషాన్ని మరచి విభజనతో సయ్యాటలాడుతున్నారని, వాస్తవాలను తెలుసుకుని విభజన ప్రకటన రద్దు చేసుకునేవరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. విభజన ప్రకటన రద్దయిన వెంటనే విజయోత్సవ సభకు తాను మరలా వస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యార్థి జెఎసి రాష్ట్ర నాయకులు కృష్ణయాదవ్ మాట్లాడుతూ రాష్టవిభజన వలన సీమాంధ్ర ప్రాంతంలోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 10 సెంటర్ యూనివర్శిటీలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయని, అదేవిధంగా పరిశోధనా సంస్థలు అన్ని హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో ఒక్క సెంట్రల్ యూనివర్శిటీ లేదని, పరిశోధనా సంస్థలు, కర్మాగారాలు లేవన్నారు. అందువలన ప్రతిఒక్కరు విభజనకు వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ నగరాన్ని దివంగత ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అభివృద్ధిపథంలో పయనింపజేశారని అన్నారు. తెలుగు ప్రజలు తమ శ్రమతో, మేథస్సుతో అభివృద్ధిపరిచిన హైదరాబాద్ నగరం ఏఒక్కరి సొత్తు కాదని, తెలుగుజాతి ప్రజలందరి సొంతం అని అన్నారు. కార్యక్రమంలో శ్రీవేంకటేశ్వర యూనివర్శిటీ ప్రొఫెసర్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి ప్రజలు ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో వివిధ రంగాలలో తమ సత్తాను వివిధ రంగాలలో చాటారని, అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఢిల్లీ పెద్దల ఎత్తులకు రాజకీయపార్టీల నాయకుల తోడ్పాటుతో చిత్తవడం బాధాకరం అని అన్నారు. మద్రాస్ రాష్ట్రంలో ఉన్న సమయంలో తెలుగువారి అభివృద్ధికోసం 1953లో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతంలోని ప్రజల అభిష్టం మేరకే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని అన్నారు. అప్పటి నుండి రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిపథంలో శరవేగంగా పయనించిందని అన్నారు. ప్రస్తుతం సమైక్యాంధ్ర ఉద్యమం ఒక్క సీమాంధ్ర ప్రాంతాల ప్రజల ప్రయోజనాల కోసమే కాదని, తెలంగాణ ప్రాంతంలోని తెలుగు ప్రజల అభివృద్ధికోసం అన్నారు. తెలంగాణ ప్రాంతంలో పీఠభూమి అని, హైదరాబాద్ మినహాయించి మరే ఇతర జిల్లాల్లో అభివృద్ధి శూన్యం అని ఆయన అన్నారు. తెలుగు ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండడమే తమ లక్ష్యం అని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన వలన సీమాంధ్ర ప్రాంతాలలోని 13జిల్లాల్లో ఆర్టీసీ మూతపడే అవకాశం ఉందని అన్నారు. ప్రస్తుతం ఆర్టీసీ 5వేల కోట్ల అప్పుల్లో ఉందని, అయితే సీమాంధ్ర ప్రాంతంలో ఆర్టీసీ ఆస్తుల వివలువ 1800కోట్లు కాగా, తెలంగాణ ప్రాంతంలో 16,000కోట్ల ఆస్తులు ఉన్నాయని, ఆర్టీసీ మనుగడ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని అన్నారు. ఈకార్యక్రమంలో తొలుత సమైక్యాంధ్రకు మద్దతుగా అమరులైన ఉద్యమ ముద్దుబిడ్డలకు ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌డి అహ్మద్ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఐదు నిమిషాల పాటు సింహగర్జన సభాప్రాంతం వౌనం వహించి సంతాపం తెలిపింది. అనంతరం సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతీయ జెండాను మున్సిపల్ కమిషనర్ ఫల్గుణకుమార్ ఆవిష్కరించారు. ప్రతిభ, గాయత్రి, చైతన్య, ఊళ్ళపాలెం, కందుకూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థిని, విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ముఖ్యంగా టంగుటూరి ప్రకాశం పంతులు వేషధారణ అందర్ని అలరించింది. ఈకార్యక్రమంలో జెఎసి గౌరవ అధ్యక్షులు జివి కృష్ణారావు, కంచర్ల రామయ్య, కార్యదర్శి పి చంద్రశేఖర్, కోశాధికారి బెజవాడ కృష్ణయ్య, శ్రీప్రతిభ విద్యాసంస్థల డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు, గాయత్రి కరస్పాండెంట్ రామకృష్ణ, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరికోటేశ్వరరావు, ప్రముఖ వైద్యురాలు అదిలాబాణు, ఎన్‌జిఓ సంఘం నాయకులు జెవి రమణారావు, థామస్, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు ఎంఎస్ రాంబాబు, ఉపాధ్యాయ జెఎసి నాయకులు పెరుగు ప్రసాద్, ఎంప్లాయిస్ యూనియన్ స్థానిక నాయకులు రామ్మూర్తి, ఎన్‌ఎంయు నాయకులు కృష్ణారెడ్డి వేదికను అలంకరించిన వారిలో ఉన్నారు. అనంతపురానికి చెందిన లెనిన్, కందుకూరుకు చెందిన చలంచర్ల సుబ్బారావు ఆలపించిన గేయాలు అందరిని అలరించాయి. ఈకార్యక్రమానికి టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, ప్రముఖ పారిశ్రామికవేత్త బుర్రా మధుసూదన్‌యాదవ్, నియోజకవర్గ పరిధిలోని తహశీల్దార్లు, ఎంపిడిఓలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రైవేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

విభజన ప్రథమ ముద్దాయి వైఎస్‌ఆరే
* ఎమ్మెల్యే కందుల ధ్వజం
మార్కాపురం, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజనలో కీలకపాత్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిదేనని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి విమర్శించారు. గురువారం తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1999లో అధికారం రాలేదనే ఆగ్రహంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన 41 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని చిన్నారెడ్డి ఆధ్వర్యంలో సోనియాకు ఉత్తరం పంపారని అన్నారు. అలాగే 2004లో తెలంగాణ విభజన చేస్తామని చెప్పి టిఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్నారని, ఇలాంటివారు చంద్రబాబుపై నిందలు వేయడం సమంజసం కాదన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం అనంతరం ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ ప్రాంత ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకోవాలని జగన్ ప్రకటించలేదా..? అని ప్రశ్నించారు. 2008 వరకు చంద్రబాబునాయుడు విభజనపై ఎలాంటి ప్రకటన చేయలేదని, అనుకోని పరిస్థితుల్లో 2008లో ఆ ప్రాంత నేతల ఒత్తిడి మేరకు లేఖ ఇచ్చారని తెలిపారు. విభజనలో మొదటి ముద్దాయి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అని, రెండవ ముద్దాయి సోనియా అని, మూడవ ముద్దాయి కాంగ్రెస్‌పార్టీ అని, నాల్గవ ముద్దాయి బిజెపి అని, ఐదవ ముద్దాయి సిపిఐ అని, ఆరవ ముద్దాయి తెలుగుదేశంపార్టీ అవుతుందని కందుల అన్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం ఉన్నంత వయస్సులేని షర్మిల విమర్శించడం బాధకరమని, ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకోకపోతే చూస్తూ ఊరుకోబోమని కందుల హెచ్చరించారు. సొంతపార్టీ రాజకీయ లబ్ధి కోసం ఇతర పార్టీలపై బురదచల్లడం వైఎస్‌ఆర్‌సిపికి అలవాటుగా మారిందని, ఇలాంటి వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రజలు సహించరని అన్నారు. విభజన జరిగితే మిగులు జలాలతో నిర్మితమైన వెలుగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, విభజన అనివార్యమైతే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
16 నుంచి గ్రామగ్రామాన సమైక్యాంధ్ర ఉద్యమం
ఈనెల 16వ తేదీ నుంచి మార్కాపురం నియోజకవర్గంలో గ్రామగ్రామాన సమైక్యాంధ్ర ఉద్యమం పేరిట నిరసన కార్యక్రమాలను ఉద్ధృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే కందుల తెలిపారు. ప్రతిరోజూ నాలుగు పంచాయతీల్లో పర్యటించి సమైక్యాంధ్ర ఆవశ్యకత గురించి ప్రజల్లో అవగాహన కల్పించి రైతుల్లో కూడా జెఎసిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
15న సర్పంచ్‌లతో సమావేశం
ఈనెల 15వ తేదీన మార్కాపురం నియోజకవర్గంలో ఇటీవల గెలిచిన సర్పంచ్‌లకు, ఓడిన మద్దతుదారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలకు వీరంతా తన ఇంటి వద్దకు రావాలని ఆయన కోరారు. ఈవిలేఖరుల సమావేశంలో పార్టీ అధ్యక్ష కార్యదర్శులు టి బాలసుబ్బారావు, అమీరుల్లాఖాన్, టిడిపి నేతలు తాళ్ళపల్లి సత్యనారాయణ, రూరల్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా వర్షాలు
ఒంగోలులో రోడ్లపైకి చేరిన వర్షపు నీరు
ఒంగోలు, సెప్టెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురుగాను, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో జిల్లాలోని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పత్తి, కంది, మిరప, జొన్న, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. కొన్నిప్రాంతాల్లో వరినారుమడులు పోసి నాట్లు వేసేందుకు కూడా రైతులు సిద్ధవౌతున్నారు. పొగనారుమడులు పెడుతున్నారు. జిల్లాలోని వాగులు, వంకల్లోకి నీరు చేరుతోంది. ఇటీవల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నల్లవాగు కొత్తపట్నం రోడ్డుపైకి పారింది. దీంతో వాహనచోదకులు ఇబ్బందులకు గురయ్యారు. ఇదిలాఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులో గురువారం భారీ వర్షం కురిసింది. దీంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రధానంగా డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవటంతో రోడ్లపైకి మురికినీరు చేరటంతో పాదచారులతోపాటు, వాహనచోదకులు కూడా ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. కాపుకల్యాణ మండపం, ఆర్‌టిసి బస్టాండుసెంటరు, నెల్లూరు బస్టాండు సెంటరులోకి వర్షపునీరు భారీగా చేరటంతో ఆ ప్రాంతాలకు చెందిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. వర్షంతో ఆటోలకు గిరాకీ పెరిగింది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెరిపి లేకుండా ఒంగోలు నగరంలో వర్షం కురవటంతో వ్యాపారవర్గాలతో పాటు అన్నివర్గాల వారు అసౌకర్యానికి గురయ్యారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
అద్దంకి: మండలంలో గురువారం ఉదయం నుండి సాయంత్ర వరకు భారీ వర్షం కురిసింది. ఈసమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పలుచోట్ల పిడుగులు కూడా పడ్డాయి. మండలంలోని బొమ్మనంపాడు గ్రామంలో పిడుగుపాటుకు పొలం పని చేసుకుంటున్న జి.సుజాత (35) అనే మహిళ మృతి చెందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఫలితంగా మండలంలో పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

ఎసిబి వలలో తిమింగలం
పొదిలి హౌసింగ్ డిఇ కార్యాలయం, ఇళ్లపై
ఎసిబి అధికారులు దాడులు
నాలుగు కోట్లకు పైగానే అక్రమ ఆస్తులు
ఏకకాలంలో ఆరుచోట్ల దాడులు
ఒంగోలు, సెప్టెంబర్ 12: ఆదాయానికి మించిన అక్రమ ఆస్తులు కలిగి ఉన్న పొదిలి గృహనిర్మాణ శాఖ డిఇ చేబ్రోలు రామాంజనేయులు ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో ఆరుచోట్ల అవినీతి నిరోధక శాఖాధికారులు గురువారం ముమ్మర దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతికి చెందిన ఎసిబి అధికారులు పాల్గొన్నారు. ఒంగోలులోని బృందావనం కాలనీ, పండరీపురం, పోలీస్ క్వార్టర్స్, రావినూతలలోని రామాంజనేయులు అత్త, అమ్మగారి ఇళ్లు, పొదిలిలోని గృహనిర్మాణ శాఖ కార్యాలయంలోను ఎసిబి అధికారులు దాడులు నిర్వహించి పలు విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎసిబి అధికారుల లెక్కల ప్రకారం ఆయన ఆస్తుల విలువ నాలుగు కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అయితే ఆయన ఆస్తుల విలువ అంతకుమించి ఉంటుందన్న ప్రచారం సాగుతోంది. కాగా నెల్లూరు ఎసిబి డిఎస్‌పి జె భాస్కరరావు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆయనపై దాడులు చేశామని, ఆ మేరకు ఆయన్ను అరెస్టు చేశామన్నారు. ఒంగోలులోని బృందావనం, అంజయ్యరోడ్డుల్లో 30 లక్షల రూపాయల విలువైన ప్లాట్లు, గుండ్లాపల్లిలోని నాగభైరవకోటేశ్వరరావు కాలేజీని కొనుగోలు చేశారన్నారు. దీని విలువ రికార్డుల ప్రకారం 45 లక్షల రూపాయలుగా ఉందన్నారు. కాగా దీని విలువ బయట మార్కెట్‌నుబట్టి సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుంది. అదేవిధంగా ఒంగోలు, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో 15 స్థలాలు ఉన్నట్లు గుర్తించినట్లు డిఎస్‌పి భాస్కరరావు తెలిపారు. డిఇ రామాంజనేయులు ఇంట్లో ఎనిమిది కిలోల వెండి, ఐదు లక్షల రూపాయల బ్యాంకు బ్యాలెన్స్, పది తులాల బంగారం, ఒక లాకర్ ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. లాకర్‌ను శుక్రవారం పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈదాడుల్లో ఎసిబి సిఐలు పివి శ్రీనివాసరావు, కృపానందం, చంద్రవౌళి, వెంకటేశ్వర్లు, తిరుపతిరెడ్డి, పార్ధసారధిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, లక్ష్మీకాంతరెడ్డి పాల్గొన్నట్లు డిఎస్‌పి భాస్కరరావు వివరించారు. ఎసిబి అధికారుల దాడులతో గృహనిర్మాణ శాఖాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తంమీద ఎసిబి అధికారుల దాడిలో పెద్ద తిమింగలమే పడింది.
ఎసిబి దాడులతో కలకలం
పొదిలి: పొదిలి గృహ నిర్మాణ శాఖ సబ్ డివిజన్ కార్యాలయంపై గురువారం ఎసిబి అధికారులు దాడులు చేయడంతో పలువురు సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. ఆ శాఖ పొదిలి డిఇగా పనిచేస్తున్న సిహెచ్ రామాంజనేయులు నివాసం ఉంటున్న ఒంగోలులో దాడులు జరిపిన అధికారులు ఆయన పనిచేస్తున్న కార్యాలయంపై కూడా దాడులు నిర్వహించారు. ఈసందర్భంగా ఎసిబి సిఐ కృపానందం ఆధ్వర్యంలో సిబ్బంది మధ్యవర్తుల సమక్షంలో పలు రికార్డులను పరిశీలించారు. కంప్యూటర్‌లో ఉన్న వివరాలను పరిశీలించిన ఎసిబి అధికారులు రామాంజనేయుల వ్యక్తిగత వివరాలపై కూడా ఆరా తీశారు. ఆదాయానికి మించి ఆస్తుల ఉన్న అభియోగంపై ఎసిబి డిఎస్‌పి ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఏకకాలంలో దాడులు చేపట్టాయని అందులోభాగంగా గత నాలుగేళ్లగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న పొదిలి కార్యాలయంపై కూడా దాడులు జరిపామని సిఐ చెప్పారు. ఈదాడుల్లో మధ్యవర్తులుగా సబ్ రిజిస్ట్రార్ షరబంధీ, జూనియర్ అసిస్టెంట్ రమణ వ్యవహరించారు. కాగా ఎసిబి దాడులు జరపటంతో పొదిలితోపాటు కొనకనమిట్ల, మర్రిపూడి మండలంలోని వివిధ శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎసిబి అదికారుల దాడుల గురించి ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

భారతమాత వేషధారణలో విద్యార్థులు సమైక్యాంధ్రకు జైకొట్టిన మాగుంట డిఇని అడ్డుకున్న విద్యుత్ ఉద్యోగులు
english title: 
l

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>