అమలాపురం, సెప్టెంబరు 12: రాష్ట్ర విభజన వల్ల రానున్నకాలంలో రైతుల మధ్య, రాష్ట్రాల మధ్య నీటి యుద్ధాలు తలెత్తుతాయని, రోజూ ఏదో ఒక ప్రదేశంలో ఉద్యమాలు జరుగుతాయని రాష్ట్ర రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన జరిగితే కోనసీమ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని, దేశానికి అన్నం పెట్టే రైతులు బిచ్చగాళ్లుగా మారిపోతారన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా గురువారం అమలాపురంలో జరిగిన ‘కోనసీమ రైతు గర్జన’ సభకు యెర్నేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తొలుత ఆర్డీవో కార్యాలయానికి వేలాదిగా చేరుకున్న రైతులు అక్కడి నుండి గడియారస్తంభం సెంటర్ వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గడియారస్తంభం సెంటర్‌లో కోనసీమ రైతు గర్జన సభను నిర్వహించారు. సభకు కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకుడు మట్టా మహాలక్ష్మీ ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిధిగా హాజరైన నాగేంద్రనాథ్ మాట్లాడుతూ రైతుల కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వాలు ఇలా విభేదాలు సృష్టించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర విభజన వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయి పంటలు లేక అల్లాడిపోతారని, సర్ ఆర్ధర్ కాటన్ ఆశించిన లక్ష్యాలు నీరుగారిపోతాయని ఆందోళన చెందారు. అగ్రికల్చర్ ఎఒల రాష్ట్ర నాయకుడు కె కమలాకరశర్మ మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో రైతులెవ్వరూ పాల్గొనకపోవటంతో ఉద్యమం నీరుగారుతుందని, రాష్ట్ర విభజన జరిగితే మొదటిగా నష్టపోయేది రైతేనన్నారు. కోనసీమ రైతుకు ఉద్యమంలో ఎంతో పట్టుందని, గత పంట విరామం ఉద్యమానికి జాతీయ నాయకులను కూడా ఇక్కడకు రప్పించిన సత్తా కోనసీమ రైతులదేనని ఆయనన్నారు. అయితే ఉద్యమంలో అధికారులు కొంతవరకే ఉంటారని, పూర్తిస్థాయిలో పాల్గొనేది రైతులేనన్నారు. రైతులు సారధ్యం వహించిన ఏ ఉద్యమమైనా విజయం సాధించిందని, అలాగే సమైక్యాంద్ర ఉద్యమం కూడా విజయం సాధిస్తుందన్నారు. సీమాంధ్ర నాయకులంతా రాజీనామాలు చేస్తే రాష్ట్ర విభజన ఆగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రైతులు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కోనసీమ జెఎసి ఛైర్మన్ విఎస్ దివాకర్ మాట్లాడుతూ రైతులు రాష్ట్ర విభజన ఉద్యమంలో పాల్గొంటే కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరిగితే పచ్చని కోనసీమ ఎడారిలా మారిపోతుందని, రైతులకు అనేక ఇబ్బందులు కలుగుతాయన్నారు. కోనసీమ రైతు నాయకులు యాళ్ల వెంకటానందం, రంబాల సుభాష్ చంద్రబోస్, తిక్కిరెడ్డి గోపాలకృష్ణ, అడ్డాల గోపాలకృష్ణ, వాసంశెట్టి సత్యం, దొంగ నాగేశ్వరరావు, ఉప్పుగంటి భాస్కరరావు, గణేశుల రాంబాబు, ఎడిఎలు ఎంఎస్‌సి భాస్కరరావు, ఎంఎ షంషీ, ఎం జగ్గారావు, జున్నూరి కొండయ్యనాయుడులు రైతు గర్జనకు నాయకత్వం వహించారు. కోనసీమ రైతు నాయకులు అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, వాసంశెట్టి సత్యం, ఉప్పుగంటి భాస్కరరావు, గణేశుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
వీధుల్లోకి విద్యుత్ ఉద్యోగులు
*72 గంటల సమ్మెలోకి 1847 మంది
*కాకినాడలో దీక్షలు, వంటా వార్పు
*నిలిచిపోయిన బిల్లుల చెల్లింపు
కాకినాడ, సెప్టెంబరు 12: విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరించి వీధికెక్కారు... వంటావార్పు, ధర్నా కార్యక్రమాలతో నగరం దద్దరిల్లేలా ఆందోళన చేశారు... కాకినాడ నగరంలో గురువారం ఉదయం తెలుగుతల్లి విగ్రహానికి పూలమాలలు వేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వేడుకున్నారు. అనంతరం దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. 72 గంటల సమ్మెకు నడుం బిగించిన ఉద్యోగుల ఆందోళనతో సమైక్యవాద ఉద్యమం మరింత పదును తేలింది. జిల్లా కేంద్రం కాకినాడలోని విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద ఆ శాఖ ఉద్యోగులు వంటావార్పు నిర్వహించి, సమైక్యాంధ్రకై చేసిన నినాదాలు మిన్నంటాయి. కాగా జిల్లాలో శుక్ర, శనివారాలు విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి జెఎసి పిలుపునిచ్చింది. నేటి రెండు రోజుల పాటు ప్రభుత్వ సంస్థలతో పాటు అన్ని రకాల ప్రైవేటు విద్యా సంస్థలు కచ్చితంగా బంద్ పాటించాలని సూచించింది. హైదరాబాద్‌లో జరిగిన సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నేపథ్యంలో సీమాంధ్రులపై దాడికి నిరసనగా ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్టు విద్యార్థి జెఎసి పేర్కొంది. మరోవైపు జిల్లాలో సమైక్యవాద ఉద్యమం శుక్రవారంతో 45వ రోజుకు చేరింది. సమైక్యాంధ్రకై కొనసాగుతున్న దీక్షలకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ సమితి, ఉద్యోగ జెఎసిల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట సాంఘిక సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగులు రిలే దీక్ష నిర్వహించారు. ఉపాధ్యాయ జెఎసి రిలే దీక్ష నిర్వహించి, వంటావార్పు చేపట్టారు. ఉపాధ్యాయ జెఎసి శిబిరం వద్ద విద్యార్థులచే సమైక్యాంధ్రను డిమాండ్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయం బయట రిలే దీక్ష కొనసాగుతోంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ, పశు సంవర్ధక శాఖ, జెఎన్‌టియుకె, విద్య, వైద్యారోగ్య శాఖ, జిల్లా పరిషత్, డిఆర్‌డిఎ, ఎస్సీ బీసీ కార్పొరేషన్, న్యాయశాఖ ఉద్యోగులు, న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా కళాశాల వద్ద అధ్యాపకుల రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
వైద్య సేవలపై చైతన్యం రావాలి
*జ్వర బాధితులను ప్రభుత్వాసుపత్రుల్లో చేర్చాలి
*బోడపాటివారిపాలెంలో కలెక్టర్ పర్యటన
*ఇంటింటి సర్వేతో శాశ్వత పరిష్కారానికి హామీ
*పారిశుద్ధ్యం మెరుగుకు ఆదేశాలు
డి గన్నవరం, సెప్టెంబరు 12: విషజ్వరాలకు గురైన బాధితులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేర్పించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ అన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యసేవలందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. డి గన్నవరం శివారు బోడపాటివారిపాలెంలో విషజ్వరాలు విజృంభించి ఒక వ్యక్తి మృతిచెందటంతో పాటు పలువురు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న నేపధ్యంలో గురువారం కలెక్టర్ గ్రామంలో పర్యటించారు. విషజ్వరాల పట్ల ఆందోళన చెందవద్దన్నారు. వీటి నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలున్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరి డబ్బు ఖర్చు చేసుకోవద్దని సూచించారు. కరవాకలో విషజ్వరాలను అదుపులోకి తెచ్చింది ప్రభుత్వ వైద్యులేనని ఆమె గుర్తుచేశారు. బివి పాలెంలో గత మూడేళ్లుగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వీటి నివారణకు తగిన సౌకర్యాలు లేక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నామని ప్రజలు కలెక్టర్‌తో అన్నారు. దీనిపై ఆమె స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. ర్యాపిడ్ యాక్షన్ టీం ద్వారా గ్రామంలో ఇంటింటి సర్వే చేయించి కారణాలు తెలుసుకుని జ్వరాలకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. శానిటేషన్‌ను మెరుగుపర్చాలని సర్పంచ్ చుట్టుగుళ్ల షర్మిళా రమణకు కలెక్టర్ సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. గ్రామంలో పందుల పాకను తొలగించాలని లేకపోతే పోలీసు బలగాలను ఉపయోగించి తొలగిస్తామని పందుల పెంపకందార్లను కలెక్టర్ హెచ్చరించారు. పంట కాల్వలో మురుగునీటి గొట్టాలు తొలగించాలన్నారు. కృత్రిమ బెల్లం తయారీ కేంద్రాన్ని అధికారులు పరిశీలించాలన్నారు. విధి నిర్వహణలో వైద్యులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం సిహెచ్‌సిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులను కలెక్టర్ పరామర్శించారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండాలన్నారు. విషజ్వరాల నివారణకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యాధికారి శ్రీనివాస్‌కు సూచించారు. అవసరమైతే రోగులను అమలాపురం, కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించాలన్నారు. ఇటీవల మృతిచెందిన కోటిపల్లి నాగభాస్కరరావు, కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. మృతుని కుటుంబాన్ని కలెక్టర్ పరామర్శించారు. బివి పాలెం డ్రెయిన్‌లో గంబోజియా చేపలను వేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో డిఎంఅండ్‌హెచ్‌ఒ సి పద్మావతి, డిపిఒ శ్రీ్ధర్‌రెడ్డి, అడిషనల్ డిఎంఅండ్‌హెచ్‌ఒ ఎం వెంకటరత్నం, డిఎల్‌ఒ పవన్‌కుమార్, డిఐఒ మురళీకృష్ణ, ఎస్‌పిహెచ్‌ఒ రామాంజనేయులు, సర్పంచ్ చుట్టుగుళ్ల షర్మిళారమణ, మాజీ సర్పంచ్ యడ్లపల్లి పెద్దబ్బులు, మూలాస్వామి తదితరులు పాల్గొన్నారు
తాటిపాకలో మిన్నంటిన లక్ష గళ గర్జన
రాజోలు, సెప్టెంబరు 12: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గురువారం తాటిపాకలో నిర్వహించిన లక్ష గళ గర్జన కార్యక్రమంలో సమైక్య నినాదం మిన్నంటింది. సమైక్య నినాదంతో ఉవ్వెత్తున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. తాటిపాక సెంటర్‌లో జెఎసి ఛైర్మన్ ఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు సఖినేటిపల్లి, రాజోలు, మామిడికుదురు మండలాల నుండి ప్రజలు అశేషంగా తరలివచ్చారు. ఒకపక్క భారీ వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా సమైక్యాంధ్రులు తమ ప్రాణాలైనా అర్పిస్తాం, సమైక్యాంధ్రను సాధిస్తామంటూ గర్జించారు. తాటిపాక జన సందోహంతో నిండిపోయింది. చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుండి విద్యార్థులు ర్యాలీగా తరలివచ్చి దేశ నాయకులు, భరతమాత వేషధారణలతో నృత్యాలుచేసి పిరమిడ్ ఆకృతిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నలంద స్కూలు విద్యార్థులు 200 మీటర్ల జాతీయ జెండాను ఆవిష్కరించి తాటిపాక పురవీధుల్లో తిరిగి జై సమైక్యాంధ్ర నినాదాలతో ప్రజలను ఛైతన్యపరిచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజకీయ నాయకులు తక్షణమే రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనకపోతే మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న తీరును పలువురు సమైక్యవాదులు నిరసించారు.
అనంతరం తాటిపాక ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో రోడ్లుపై వంటావార్పు నిర్వహించారు. రాజోలు, తాటిపాకలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. తాటిపాకలో ఆదర్శ రైతులు దీక్షలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెఎసి నాయకులు జాలెం భాస్కరరావు, పి రాజబాబు, జక్కంపూడి వాసు, పోతు కాశి, ఎఎంసి ఛైర్మన్ ఆర్‌డి సత్యనారాయణమూర్తి, వైసిపి నాయకులు జక్కంపూడి తాతాజీ, పెల్లెల ఆనంద్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
కోటలో సమైక్య ప్రజాబ్యాలెట్
సామర్లకోట, సెప్టెంబరు 12: సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం స్థానిక రైల్వే స్టేషన్ రింగ్‌సెంటర్ బసివిరెడ్డి సత్రం వద్ద సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ పోలింగ్ ప్రక్రియను నిర్వహించగా, అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల పోలింగ్ మాదిరిగా సిబ్బందిని ఏర్పాటుచేసి ఓటింగ్ స్లిప్‌లు ఇవ్వడం, ఇంకుమార్కు చేయడం, ఓటింగ్‌కు రహస్య ప్రదేశం ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు ఏర్పాటుచేసిన సమైక్యాంధ్ర ప్రజా బ్యాలెట్‌ను సామర్లకోట మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్ తొలి ఓటు వేసి ప్రారంభించారు. బ్యాలెట్‌పై 10 జిల్లాలతో కూడిన తెలంగాణ, 15 జిల్లాలతో కూడిన సీమాంధ్రను రెండు భాగాలుగా ముద్రించారు. ఓకె అనే ఇంగ్లీష్ స్టాంపుతో రహస్య ఓటింగ్ నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకూ ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. కాగా 25వ రోజుకు వేదిక (జెఎసి) దీక్షలు చేరుకోగా, గురువారం రిలే నిరాహార దీక్షల్లో ఎస్పీఎస్ శర్మ, వి సింహాచలం, ఐపి శ్రీనివాసు, కెవి శివరామ్, బొజ్జా అశోక్, ఎం శివరామ్, కె శ్రీనివాస్, కె శరత్, రాధాకృష్ణ పాల్గొన్నారు. పిఠాపురం ఎల్‌ఐసి ఏజెంట్లు అసోసియేషన్ అధ్యక్షుడు రావుల మాధవరావు, పెమ్మాడి వీరభద్రవర్మల ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రజా బ్యాలెట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో మున్సిపల్ కమిషనర్ జ్యోతుల నాగేంద్రప్రసాద్, ఎంఇవో ఇంటి వెంకటరావు, మున్సిపల్ డిఇ చుక్కా శ్రీనివాసరావు, ఎఇ కె సత్యనారాయణ, ఆర్‌ఐ మేకా నాగేశ్వరరావు, శానిటరీ ఇన్స్‌పెక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, వేదిక నాయకులు గుమ్మడి నరసింహమూర్తి, దవులూరి సుబ్బారావు, నండూరి ప్రసాదరావు, కంటె జగదీష్, గుణ్ణం రాజబ్బాయి, పిట్టా జానకిరామారావు, నేతల హరిబాబు, కొచ్చెర్ల చక్రధారి, కె విల్సన్ జయకర్, తోటకూర సాయిరామకృష్ణ, అడబాల కుమారస్వామి, సంగినీడు భవన్నారాయణ, నూతలపాటి లోవరాజు, పి రాజేష్, కాశీవిశ్వనాథం, మేకా శ్రీనివాసు, కె రఘుప్రసాద్, దవులూరి ప్రభాకర వెంకట రాజారావు, పోలిశెట్టి రాజేష్, కాశీవిశ్వనాథం, ఎ భారతి, పితాని కృష్ణ, గిడుతూరి శ్రీనివాసు, జుత్తుక అప్పారావు, జట్లా మోహన్, అర్బన్ ఐసిడిఎస్ సిడిపివో జి వరహాలు, వర్మ, బి సూర్యప్రకాశరావు, పి రాఘవరావు, వర్ల అప్పారావు, ఉడతా రామచంద్రరావు, మున్సిపల్, రెవిన్యూ, మెడికల్, సబ్‌రిజిస్ట్రార్, ఉపాధ్యాయ నాయకులు పాల్గొన్నారు. మొత్తం 1287మంది ఓటు వేయగా, 10 ఓట్లు చెల్లలేదు. మూడు విభజనకు అనుకూలంగా, మిగిలినవన్నీ సమైకాంధ్రకు మద్దతుగా పోలయ్యాయి.
నేడు, రేపు జిల్లాలో షర్మిల పర్యటన
కాకినాడ, సెప్టెంబరు 12: వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిల సమైక్యాంధ్ర కోరుతూ నిర్వహిస్తున్న బస్సు యాత్ర శుక్రవారం జిల్లాకు చేరుకోనున్నది. పశ్చిమ గోదావరి జిల్లా యాత్ర ముగించుకుని ఆమె జిల్లాలో ప్రవేశించనున్నారు. ఉదయం 10 గంటలకు రావులపాలెంలో జరిగే కార్యక్రమంలో ఆమె ప్రసంగిస్తారని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి గురువారం విలేఖరులకు తెలిపారు. అమలాపురం వరకు బస్సు యాత్ర నిర్వహించి, సాయంత్రం బహిరంగ సభ నిర్వహించి, రాత్రి అక్కడే బస చేస్తారన్నారు. ఈనెల 14న ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రం కాకినాడ చేరుకుంటారని చెప్పారు. యానాం రోడ్డులోని బాలయోగి విగ్రహం వద్ద 5వేల ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించి స్వాగతం పలుకుతామన్నారు. అక్కడి నుండి మెయిన్ రోడ్‌లో మసీదు సెంటర్‌కు చేరుకుని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. సమావేశంలో వైసిపి కాకినాడ నగర కన్వీనర్ రాగిరెడ్డి జయరాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు రిలయన్స్ సంస్థ ముట్టడి
కాకినాడ, సెప్టెంబరు 12: జిల్లాలోని గాడిమొగ రిలయెన్స్ సంస్థను శుక్రవారం జిల్లా జెఎసి ముట్టడించనున్నది... సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా రిలయెన్స్ కర్మాగారం వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టాల్సిందిగా రాష్ట్ర జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు జిల్లా జెఎసి నేతలు బి ఆశీర్వాదం, పితాని త్రినాథరావు ఆంధ్రభూమి ప్రతినిధికి తెలియజేశారు. ఉదయం 9 గంటలకు జిల్లా కలెక్టరేట్ నుండి ద్విచక్ర వాహనాలపై నిరసన ర్యాలీగా బయలుదేరి, గాడిమొగ చేరుకోనున్నట్టు చెప్పారు. అక్కడ సమైక్యాంధ్ర డిమాండ్‌తో పెద్ద ఎత్తున నిరసన తెలియజేయనున్నట్టు పేర్కొన్నారు. కాగా రిలయెన్స్ కర్మాగారం వద్ద జెఎసి ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
శిథిల భవనాల కూల్చివేత
రాజమండ్రి, సెప్టెంబరు 12: హైదరాబాద్‌లో సిటీలైట్ హోటల్, రాజమండ్రిలోని నాళంభీమరాజు వీధిలోని రెండస్తుల భవనం కుప్పకూలిన సంఘటన నేపథ్యంలో నగరంలోని శిథిల భవనాల కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే నగరంలో 217 భవనాలు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించామని సిటీప్లానర్ పిఎస్‌ఎన్ సాయిబాబు వెల్లడించారు. ఇంజనీరింగ్ అధికారులతో వాటిని తనిఖీ చేయించి, ఆయా భవన యజమానులకు నోటీసులు జారీ చేశామన్నారు. వారంరోజుల్లో కూల్చివేసుకోవాలని ఆదేశించామన్నారు. గురువారం శ్యామలాధియేటర్ వద్ద ఉన్న సుమారు 100ఏళ్ల నాటి భవనాన్ని యజమానులు స్వచ్చందంగా కూల్చివేసుకున్నారు. ఈప్రక్రియను సిపి, సిబ్బంది పర్యవేక్షించారు. ప్రమాదకరంగా ఉన్న భవనాలను యజమానులు కూల్చకపోతే తామే కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
రాజమండ్రి బంద్ సంపూర్ణం
రాజమండ్రి, సెప్టెంబరు 12: సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఊపందుకుంటోంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరిట నిర్వహించిన బహిరంగ సభ అనంతరం తిరిగి వస్తుండగా రాజమండ్రికి చెందిన కట్టా సత్యనారాయణపై జరిగిన దాడికి నిరసనగా ఎన్జీఓ సంఘం గురువారం రాజమండ్రి బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, దుకాణాలను ఎన్జీఓలు మూసివేయించారు. సినిమాహాళ్లు బంద్ చేశారు. విద్యాసంస్థలు కూడా మూసివేశారు. కట్టా సత్యనారాయణపై దాడిని ఖండిస్తూ ఎన్జీఓ హోమ్ వద్ద వివిధ శాఖల ఉద్యోగులు 24గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ఈదీక్ష శుక్రవారం ఉదయానికి ముగుస్తుంది.
రాత్రి పోరునిద్ర
రాత్రి పోరునిద్ర పేరిట ఉద్యోగులు ఉద్యమగీతాలు, పాటలు పాడుతూ జాగృతం చేశారు. నగరపాలక సంస్థకు చెందిన ఉద్యోగులు కోయ నృత్యం అలరించింది. అలాగే పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, రాత్రి వరకు ఉద్యమాన్ని కొనసాగించారు. రాత్రి ఎన్జీవో హోం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలోనే రోడ్డుపైనే నిద్రించారు. శుక్రవారం ఉదయం నిరవధిక దీక్షలను విరమిస్తారు. ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జి హరిబాబు, కార్యదర్శి జాన్సన్, నగరపాలక సంస్థ ఉద్యోగుల జెఏసి నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, రమణారావు, రెవెన్యూసర్వీసెస్ అసోసియేషన్ నాయకులు జిడి కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ, న్యాయశాఖ, ఎన్జీఓ, రెవెన్యూ, ఆర్టీసీ, అధ్యాపకులు, ఇతర శాఖల ఉద్యోగులు దీక్షల్లో కూర్చున్నారు. తొలుత భారీ సంఖ్యలో ఉద్యోగులు దీక్షలో పాల్గొన్నారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు 200 అడుగుల భారీ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు కెఆర్‌కె రెడ్డి తదితరులు రూ. 36వేల విరాళాన్ని అందజేశారు. ఈసందర్భంగా విద్యార్థి జెఏసి ఆధ్వర్యంలో చైతన్యజ్యోతిని వెలిగించారు. విద్యార్థులు నగరంలో తిరిగి సమైక్యాంధ్రపై ప్రజలను జాగృతం చేసేందుకు కృషిచేస్తారు. ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు జి హరిబాబు, సీమాంధ్ర న్యాయవాదుల జెఏసి కోకన్వీనర్ ముప్పాళ్ల సుబ్బారావు, ఆర్టీసీ యూనియన్ నాయకులు కొండలరావు, సత్తిబాబు, నగరపాలక సంస్థ జెఏసి నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, మద్దూరి శివసుబ్బారావు, టికె విశే్వశ్వరరెడ్డి, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి 72గంటల సమ్మె చేపట్టారు. సమ్మెలో భాగంగా అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను బహిష్కరించారు.