ఏలూరు, సెప్టెంబరు 12 : గురువును ఆశ్రయించడం ద్వారానే ప్రపంచంలో ఎక్కడైనా జీవనం సుగమంగా సాగుతుందని మైసూర్ అవధూత దత్తపీఠాధిపతి, పరమపూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. స్థానిక నం దత్తనాధ క్షేత్రంలో జరుగుతున్న దశమ చాతుర్మాస్య వ్రత దీక్షా మహోత్సవాల్లో భాగంగా స్వామీజీ శ్రీ మాతార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేస్తూ మోక్షమార్గం ప్రాప్తించాలంటే సద్గురువును అనుసరించడమే సరైన మార్గమని ఉద్భోదించారు. గురువునందు భక్తితో, విశ్వాసంతో కార్యక్రమాలు కొనసాగించుకుంటే తప్పక మార్గదర్శనం లభిస్తుందన్నారు. అనంతరం క్షేత్రంలో ప్రతిష్ఠ మూర్తులకు జరిగిన యజ్ఞానానికి స్వామీజీ పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సిద్ధి గణపతి, అనఘాదేవి సమేత దత్తాత్రేయ స్వామి, వేణుగోపాలస్వామి, కార్యసిద్ధి హనుమాన్, సర్వపాపహర విశే్వశ్వర స్వామి, నవగ్రహ దేవతామూర్తులందరికీ మహా సంప్రోక్షణం చేశారు. భక్తుల జయజయ ద్వానాల మధ్య స్వామీజీ విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. కార్యక్రమంలో శ్రీశ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామి, బ్రిజ్‌గోపాల్ లునాని, వేణుగోపాల్ లునాని, హరగోపాల్ లునాని, దావుగోపాల్ లునానీ, డాక్టర్ వివి బాలకృష్ణారావు, కలగర శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
విభజన సరికాదు
*నిప్పులు చెరిగిన షర్మిళ* జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు
*ఏలూరులో సమైక్య శంఖారావం *కాంగ్రెస్,టిడిపిలపై విమర్శలు
ఏలూరు, సెప్టెంబర్ 12: సమైక్య శంఖారావం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రమైన ఏలూరు చేరుకున్న వైఎస్సార్‌సిపి నాయకురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్, టిడిపిలపై నిప్పులు చెరిగారు. విమర్శల వర్షం కురిపించారు. వైఎస్ మరణానంతరం ఈ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తూ దానికి పరాకాష్ఠగానే రాష్ట్రాన్ని విభజన వరకు తీసుకువచ్చారంటూ ఎండగట్టారు. వైఎస్ సంక్షేమ పధకాలను తుంగలోకి తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు, ప్రజాప్రయోజనాలు పట్టని తెలుగుదేశంపార్టీ మరోవైపు కలిసి ప్రజలను భ్రష్ఠుపట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమన్యాయం చేయలేని రాష్ట్ర విభజన రెండు ప్రాంతాలను నష్టపరుస్తుందని, సమైక్యాంధ్రకు ఉద్యమిస్తున్న ప్రజానీకం వెంట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తన ప్రసంగంలో జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేసి జనంలో ఉత్సాహన్ని నింపారు. వైఎస్సార్‌సిపి ఆధ్వర్యంలో సమైక్య శంఖారావం పేరుతో వైఎస్ షర్మిల చేపట్టిన బస్సు యాత్ర గురువారం రాత్రి ఏలూరు చేరుకుంది. ఈసందర్భంగా స్ధానిక ఫైర్‌స్టేషన్ సెంటరులో ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. తొలినుంచి అటు కాంగ్రెస్, ఇటు టిడిపిలపై విమర్శల వర్షం కురిపిస్తూనే సాగిన ఆమె ప్రసంగంలో అధికశాతం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమాలను, అప్పటి పధకాలను ప్రస్తావించటంతోనే సరిపోయింది. ఇదే సమయంలో కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుపై నేరుగానే విమర్శలు చేశారు. పదవి రాకముందు ఒకమాట, వచ్చిన తర్వాత మరొకమాట అంటూ కావూరి వైఖరిని ఎండగట్టారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్న సమయంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేవని, ఎన్నో పధకాలను ఆయన ఇదే లక్ష్యంతో ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే దురదృష్టవశాత్తూ వైఎస్ ఆకస్మిక మరణం అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవటం మానివేసిందని, అప్పటి సంక్షేమ పధకాలన్నింటిని తుంగలోతొక్కిందని ధ్వజమెత్తారు. అప్పటినుంచి రాష్ట్రంలో తిరోగమనమే దర్శనమిస్తోందని చెప్పారు. త్వరలోనే జైలు నుంచి విడుదలయ్యే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాజన్న రాజ్యాన్ని మళ్లీ తీసుకువస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వాన్న పాలనతో ముందుకెళ్తున్నా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి దీనికి వంతపాడుతూ కుమ్మక్కు రాజకీయాలను నడిపిస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన విషయంలోనూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు బ్లాంక్ చెక్ మాదిరిగా లేఖ ఇచ్చి ఇప్పుడు ఆత్మగౌరవయాత్ర అంటూ తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుతో సహా ఆయన పార్టీ ప్రజాప్రతినిధులంతా రాజీనామాలు చేసేవరకూ ఆ పార్టీ నాయకులను, చంద్రబాబును సీమాంధ్రలో అడుగుపెట్టనీయవద్దని ప్రజలను కోరారు. ఇదే సమయంలో రాష్ట్ర విభజన విషయం ముందుగానే తెల్సినా దిగ్విజయసింగ్ ప్రకటించే వరకు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విమర్శలు కురిపించారు. ఆ సమయంలోనే తగిన నిర్ణయం తీసుకునే ఉంటే విభజన ముందుకు సాగే అవకాశాలు ఉండకపోయేవని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా ప్రజల కన్నా తమ పదవులకే ఎక్కువ విలువనిస్తున్నారని, అందుకే పదవులు పట్టుకుని వేలాడుతున్నారని ధ్వజమెత్తారు. జీతాలు కూడా వదులుకుని ఎన్జీఓలు సమైక్యాంధ్ర కోసం ఉద్యమాలు చేస్తుంటే ఇంతకాలమైనా ఆ పార్టీ ఆధిష్టానాలు స్పందించలేకపోవటం దారుణమన్నారు. విభజన నిర్ణయమే ముందుకు వెళితే సీమాంధ్ర ప్రాంతం ఏడారిగా మారిపోతుందని, కృష్ణా గోదావరి జలాలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పిస్తున్నట్లు ప్రకటించినా దానికి నీళ్లు ఏలా వస్తాయని ఆమె ప్రశ్నించారు. అంతేకాకుండా ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచటంతో ఇప్పటికే జలాలు అందుబాటు తగ్గిపోయాయని, ఇప్పుడు మళ్లీ ఇంకో రాష్ట్రం వస్తే సీమాంధ్రకు ఉప్పు నీరే గతి అవుతుందని షర్మిల చెప్పారు. ఇటువంటి ఎన్నో సమస్యలు ఉన్నా వాటికి సమాధానం చెప్పకుండా విభజన నిర్ణయం తీసుకోవటం ఎంతమాత్రం సరైంది కాదని కాంగ్రెస్ పార్టీ తీరును ఎండగట్టారు. భవిష్యత్‌లో రాజన్న రాజ్యం స్ధాపనకు వైఎస్సార్‌సిపిని బలపర్చాలని, ఆ పార్టీ నేతలకు అండగా నిలబడాలని కోరారు. జెఎసి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌వివిఎస్‌డి ప్రసాద్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వైఎస్సార్‌సిపి మరోసారి లేఖ ఇస్తే మిగిలిన పార్టీలకు అది కనువిప్పుగా ఉంటుందని సూచించారు. జిల్లా జెఎసి ఛైర్మన్ ఎల్ విద్యాసాగర్ మాట్లాడుతూ సమైక్యనాదం విన్పించే వారి వెంటే ఎపి ఎన్జీఓలు నడుస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సిపి నేతలు పేర్ని నాని, తెల్లం బాలరాజు, ఆళ్ల నాని, మద్దాల రాజేష్‌కుమార్, పాతపాటి సర్రాజు, కొయ్యే మోషేన్‌రాజు, జి ఉమాబాల, అశోక్‌గౌడ్, ఘంటా ప్రసాదరావు, కొఠారు రామచంద్రరావు, పివి రావు, డాక్టరు దిరిశాల వరప్రసాద్, టిఆర్‌ఆర్ మోహనరావు, జాలా బాలాజీ, పప్పు ఉమామహేశ్వరరావు, గుడిదేశి శ్రీనివాసరావు, మున్నుల జాన్‌గురునాధ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సిపిలో చేరిన పిల్లంగోళ్ల
జిల్లా మహిళా కాంగ్రెస్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి వైఎస్సార్‌సిపి నాయకురాలు షర్మిల సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఈసందర్భంగా శ్రీలక్ష్మికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వైఎస్‌కు లభించని గౌరవం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో నెలకొల్పిన విషయం తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఆయన తనయుడు వై ఎస్ జగన్ వై ఎస్ ఆర్ సిపి పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీకి చెందిన ఏ స్థాయి నాయకుడు వచ్చినా ముందుగా వై ఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరమే మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటుండటం ఆనవాయితీగా మారింది. అటువంటిది వై ఎస్ ఆర్ తనయ వై ఎస్ షర్మిల సమైక్య శంఖారావం పూరించి ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ప్రజలనుద్దేశించి ప్రసంగించినా వై ఎస్ ఆర్ విగ్రహానికి పూలమాల వేయడంగానీ, నివాళులు అర్పించడం గానీ జరగలేదు. అయితే షర్మిల ప్రసంగంలో సింహభాగం వై ఎస్ ఆర్ కాలంలో రాష్ట్ర ప్రగతి, పధకాల గురించే ఏకరువు పెట్టడం కొసమెరుపు.
ప్రజా గర్జన
*సమైక్యం కోసం జనం ప్రతిన*ఎమ్మెల్యే ఉషారాణి ఇల్లు ముట్టడి*్భమవరంలో 48 గంటల బంద్
సమ్మెలోకి విద్యుత్ ఉద్యోగులు
ఏలూరు, సెప్టెంబర్ 12 : సమైక్యాంధ్ర కోసం పశ్చిమగోదావరి ప్రజానీకం గర్జిస్తూనే వుంది. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమాలు ఆగేది లేదని భీష్మిస్తోంది. ఉగ్రగోదావరి మాదిరిగా సమైక్యాంధ్ర ఉద్యమాలు పరవళ్లు తొక్కుతున్నాయి. సమైక్యం సాధించి తీరతామని జనం ప్రతీ చోట ప్రతినపూనుతున్నారు. గురువారం నాటి పరిణామాల్లో జిల్లా వ్యాప్తంగా సమైక్య ఉద్యమాలు హోరెత్తిపోయాయి. భీమవరంలో 48 గంటల బంద్ ప్రారంభమైంది. తొలి రోజున ఘనంగా విజయవంతమైంది. అలాగే భీమడోలులోను 48 గంటల బంద్ ప్రారంభం కాగా తొలి రోజున విజయవంతమైంది. కాగా పాలకొల్లులో ఎమ్మెల్యే ఉషారాణి ఇంటిని సమైక్యవాదులు ముట్టడించారు. ఇదిలా ఉంటే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టారు. తొలిరోజున విద్యుత్ సమస్యలు కొంత తక్కువగానే వున్నా శుక్రవారం నుంచి మాత్రం పరిస్థితి ఉధృతమవుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా విటిపి ఎస్‌లో ఉత్పత్తి భారీగా పడిపోవడంతో ఆ ప్రభావం ఇప్పటికే పారిశ్రామిక రంగంపైన, వ్యాపార, వాణిజ్య సంస్థలపైనా స్పష్టంగా కనిపిస్తుండగా శుక్రవారం నాటికి ఇది గృహావసరాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. దాదాపుగా రాష్ట్రంలో 30 శాతం అవసరాలను తీర్చే విటిపి ఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి పడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగానే ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె ప్రారంభించారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు ట్రాన్స్‌కో ఔట్ సోర్సింగ్ విధానంలో కొంతమంది సిబ్బందిని సిద్ధం చేసింది. ఇదిలా ఉంటే జిల్లా వ్యాప్త ఉద్యమాల్లో భాగంగా దేవరపల్లిలో తెలుగుదేశం పార్టీ నేతలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు రోడ్లపైనే విద్యార్ధులకు పాఠాలు బోధించారు. కొవ్వూరు ప్రాంతంలో దొమ్మేరు, కాపవరం, ఐ పంగిడి తదితర ప్రాంతాల్లో ఎన్‌జివోలు దీక్షలను కొనసాగిస్తున్నారు. దీక్షలో వున్న వారికి ఎన్‌జివోలు మోటారు సైకిళ్ల ర్యాలీ నిర్వహించి సంఘీభావం తెలిపారు. జె ఎసి ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్డులో జూనియర్ కాలేజీ వద్ద ఉపాధ్యాయులు దీక్షలు చేస్తున్నారు. పాలకొల్లులో విద్యాసంస్థల నిరవధిక బంద్‌ను ప్రారంభించారు. భీమడోలులో 48 గంటల బంద్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. అలాగే దీక్షలు కొనసాగాయి. భీమడోలు జంక్షన్‌లో రాస్తారోకో చేసి, మోకాళ్లపై నడిచి సమైక్యవాదులు నిరసన తెలిపారు. ఆకివీడులో సినీ ధియేటర్ల యజమానులు రిలే దీక్షలు చేపట్టారు. కామవరపుకోటలో కొత్తూరు చెక్‌పోస్టు సెంటర్ వద్ద విద్యార్ధులు మానవహారాన్ని నిర్వహించారు. ఈ కారణంగా ఏలూరు, జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలచిపోయాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో జె ఎసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహారదీక్ష ఐక్య శిబిరం వద్ద సమైక్యవాదులు టగ్ ఆఫ్ వార్, కుర్చీలాట ఆడారు. అలాగే రాష్ట్ర మంత్రుల మాస్క్‌లతో సమైక్యవాదులు వినూత్న రీతిలో నిరసనలు తెలిపారు. ఉండిలో విద్యార్ధులు రాస్తారోకో నిర్వహించారు. దేవరపల్లిలో భారీ మోటారు సైకిల్ ర్యాలీ జరిగింది. జంగారెడ్డిగూడెం బోసుబొమ్మ సెంటర్‌లో జె ఎసి ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించారు. ఇక్కడి జడ్పీ బాలుర హైస్కూల్ వద్ద చేపట్టిన రిలే దీక్షలు 22వ రోజుకు చేరుకున్నాయి.
--నరసాపురంలో బంగారు దుకాణంలో--
28 లక్షల చోరీ
నరసాపురం, సెప్టెంబరు 12: పట్టణంలోని బంగారు ఆభరణాల దుకాణంలో గురువారం రూ.28 లక్షల చోరీ జరిగింది. పట్టణంలో పట్టపగలు జరిగిన ఈ చోరీ సంచలనం రేకెత్తించింది. సంఘటనా వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని మెయిన్ రోడ్డులోని దేవి జీన్‌దత్ జ్యుయలరీ షాపు యజమాని కీర్తికుమార్ జైన్ గురువారం తన దుకాణం తెరిచేందుకు ఇంటి నుండి బ్యాగులో రూ.28 లక్షలతో వచ్చారు. దుకాణం షట్టర్ తెరిచేందుకు వీలుగా బ్యాగు కింద పెట్టారు. అప్పటికే కీర్తికుమార్‌ను వెంబడిస్తున్న దొంగ బ్యాగును కాజేసి పారిపోయాడు. కీర్తికుమార్ దొంగను పట్టుకునేందుకు కేకలు వేసినప్పటికీ దొంగ పారిపోయాడు. దీంతో కీర్తికుమార్ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆధార్ సీడింగ్‌లో లక్ష్యాలను అధిగమించాలి
బ్యాంకర్లు, గ్యాస్ కంపెనీలను కోరిన కలెక్టర్ సిద్ధార్థ్ జైన్
ఏలూరు, సెప్టెంబర్ 12 : జిల్లాలో సెప్టెంబరు నాటికి ఆధార్ సీడింగ్‌లో బ్యాంకర్లు 60 శాతం, గ్యాస్ కంపెనీలు 80 శాతం లక్ష్యాలను అధిగమించాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం రాత్రి జిల్లా బ్యాంకర్ల సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నగదు బదిలీ పధకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్న దృష్ట్యా ఆధార్ సీడింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, నవంబరు వరకు గడువు ఉందనే భావనతో జాప్యం చేయకుండా ఈ లోగానే నూరుశాతం సీడింగ్ ప్రక్రియ సమర్ధవంతంగా పూర్తి చేయడానికి బ్యాంకర్లు, గ్యాస్ ఏజెన్సీలు సమర్ధవంతంగా పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో తొలి విడతగా నగదు బదిలీ పధకాన్ని అమలు జరుపుతున్న అదిలాబాద్, తూర్పుగోదావరి జిల్లాల్లో ఆధార్ సీడింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించారో అధ్యయనానికి రెండు అధ్యయన బృందాలను ఆయా జిల్లాలకు పంపించనున్నట్లు చెప్పారు. కేవలం గ్యాస్ కోసమే ఆధార్ సీడింగ్ కాకుండా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాల లబ్ధిదారుల సమాచారాన్ని ఆధార్ సీడింగ్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టడానికి వివరాలు అందించాలన్నారు. జిల్లాలో కౌలు రైతులకు పంట రుణాలు అందించడంలో లక్ష్యానికి మించి ప్రగతి సాధించిన బ్యాంకర్లను కలెక్టర్ అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు, ఆంధ్రాబ్యాంక్ డిజి ఎం డి నాగరాజు నాయుడు, నాబార్డు డిడి ఎం మధుమూర్తి, ఎల్‌డి ఎం లక్ష్మీనారాయణ, ఐవోసి ఏరియా మేనేజర్ జెబి శర్మ, డిసిసిబి జి ఎం మాధవి, సాంఘిక సంక్షేమ శాఖ జెడి మల్లిఖార్జునరావు, ఐసిడి ఎస్ పిడి వసంతబాల తదితరులు పాల్గొన్నారు.
పాల సేకరణ ధరపై రైతుల నిరాసక్తత
భీమడోలు, సెప్టెంబరు 12 : ప్రభుత్వ రంగ సంస్థ విజయ డెయిరీ పెంచిన పాల సేకరణ ధర పట్ల రైతులు పెదవి విరుస్తున్నారు. పశువుల పెంపకం భారంగా మారిన నేపధ్యంలో ప్రభుత్వం పెంచిన ధర సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరను మరింతగా పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తాజాగా వెన్న శాతం ఆధారంగా పాల సేకరణ ధరను లీటరుకు ఒక రూపాయి మాత్రమే పెంచి పాల అమ్మకం ధరను లీటరుకు నాలుగు రూపాయలను పెంచడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీని వలన రైతులకు ఒరిగేదేమీ లేదంటున్నారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్సిడీతో కూడిన పశుక్రాంతి పధకాన్ని అర్ధంతరంగా ఆపివేయడం, నిరుద్యోగ రైతు, డ్వాక్రా మహిళలు స్వయం ఉపాధి సంఘాలు అవకాశాలను కోల్పోతున్నారని అంటున్నారు. పాడి పెంపకంలో మేత కీలకపాత్ర వహిస్తుంది. మేతగా రైతులు ఎక్కువ శాతం ఎండుగడ్డిని వాడతారు. పశువులు సైతం నిల్వ వున్న ఎండుగడ్డినే ఇష్టంగా తింటాయి. వీటికి అదనంగా పచ్చిరొట్ట, ధాణాలను ఇతర పోషకాలుగా రైతులు అందజేస్తుండటంతో పశువులు ఆరోగ్యవంతంగా ఉండటమే కాకుండా పాల దిగుబడిని అధికంగా ఇస్తుంది. జిల్లాలో 3.75 లక్షల గేదెలు, 82 వేల ఆవులు ఉండగా ఒక్కొక్కదానికి 5 కిలోలు చొప్పున ఎండు గడ్డి అవసరమవుతుంది. ఈ ప్రకారం 7.2 లక్షల టన్నుల ఎండుగడ్డి అవసరం. ఖరీఫ్, రబీలలో సుమారుగా నాలుగు లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగవుతుండగా 7.50 లక్షల టన్నులు ఎండుగడ్డి అందుబాటులో ఉండాలి. అయితే ఇటీవల వరికోతలను మనుషులతో కాక యంత్రాలతో చేస్తుండటంతో అందుబాటులోకి వస్తున్న ఎండుగడ్డి 4.50 లక్షలకు తగ్గిపోయింది. దీంతో గడ్డికి డిమాండ్ ఏర్పడింది. రెండు సంవత్సరాల క్రితం ఒక బండి గడ్డి 250 రూపాయలు ఉండగా నేడు అది 900 రూపాయలకు చేరుకుంది. దీనిపై రవాణా ఖర్చులు అదనం. రెండు పశువుల మేతకు సంవత్సరానికి రెండు ఎకరాల విస్తీర్ణంలో పండే ఆరు బళ్ల గడ్డి అవసరం అవుతుంది. దీని ప్రకారం ఒక్కొక్క గేదెకు నాలుగు వేల రూపాయల విలువైన ఎండుగడ్డి కావాలి. గేదెల పెంపకానికి గడ్డి ఖర్చు రోజురోజుకూ పెరుగుతోంది. భీమడోలు మండలంలో 11వేల గేదెలు, 1500 ఆవులు వున్నాయి. వీటికి పోషణకు సుమారుగా 20 వేల టన్నుల గడ్డి అవసరం కాగా మెట్ట, డెల్టా గ్రామాల్లో 17 వేల ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే వరిసాగు చేయబడుతోంది. సుమారుగా 30 వేల టన్నుల ఉత్పత్తి జరగాల్సి ఉండగా 70 శాతం విస్తీర్ణంలోని వరి పంటలను యంత్రాలతో కోస్తుండటంతో కేవలం పది వేల టన్నుల గడ్డి మాత్రమే అందుబాటులోకి వస్తోంది. దీంతో గడ్డి ఆవశ్యకత పెరిగి రేటు పెరుగుతూ పోతోంది. జిల్లాలో సైతం గతంలో 30 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవగా నేడు 20 లక్షల లీటర్లకు చేరుకుంది. డిమాండ్ మాత్రం 35 లక్షల లీటర్లు వుంది. దీంతో పాలకు డిమాండ్ పెరిగి ప్రైవేటు కంపెనీలు పాల ఉత్పత్తిదారులను ఆకట్టుకునేందుకై వివిధ పధకాలు అమలు చేస్తుండటంతో ప్రభుత్వ ఆధీనంలో వున్న విజయ డెయిరీకి వచ్చే పాలు తగ్గాయి. దీన్ని అధిగమించాలంటే రైతులకు ప్రోత్సాహకాలు అందజేయాల్సి వుంది. అయినప్పటికీ ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు లేకపోగా అమలులో వున్న పధకాలనే నిర్వీర్యం చేస్తుండటంతో రైతులలో అనాశక్తి పెరిగి ప్రైవేటు డెయిరీల వైపే మొగ్గుతున్నారు. రైతులకు అదనపు ఆదాయంగా వచ్చే పాల అమ్మకం డబ్బు తగ్గుతుండటంతో వారికి గేదెలను పెంచడంపై ఆసక్తి తగ్గుతోంది. ఇదే కొనసాగితే రాబోయే రోజుల్లో పాల ఉత్పత్తి తగ్గి పాల రేట్లు పెరిగి సామాన్యునికి అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం వుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా రైతులకు ప్రోత్సాహకాలను అందజేసి పాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం వుంది.
50 వేల లీటర్ల పాలు సేకరణ లక్ష్యం:కలెక్టర్
ఏలూరు, సెప్టెంబరు 12 : జిల్లాలో ప్రభుత్వ పాల సేకరణ కేంద్రాలను పటిష్టపరిచి నిత్యం 50 వేల లీటర్ల పాలు సేకరించే లక్ష్యంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం గోదావరి మిల్క్ గ్రిడ్ ప్రాజెక్టు ప్రగతితీరుపై ఆయన అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 12.65 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 20 బల్క్‌మిల్క్ కూలింగ్ సెంటర్లను పటిష్టపరిచి పెద్ద ఎత్తున పాలు సేకరించేలా నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని నాలుగు లక్షలకు పైగా పశుసంపద జిల్లాలో ఉన్నందున ప్రభుత్వపరంగా పాల కేంద్రాలను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి అత్యధికంగా పాలను సేకరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలో నిత్యం నాలుగు లక్షల లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి జరుగుతుండగా ఐకెపి ఆధ్వర్యంలో కేవలం 15 వేల లీటర్లు మాత్రమే సేకరిస్తున్న పాలను 2014 జనవరి 31 నాటికి 50 వేల లీటర్ల సామర్ధ్యానికి చేరుకోవాలని ఆదేశించారు. జిల్లాలో పశుసంరక్షణకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తోందని పశువుల దాణా, వ్యాధి నిరోధక టీకాలు, ఇతర కార్యక్రమాలకు కూడా అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నందున ప్రతీ రైతు పాలు విధిగా ప్రభుత్వ పాలకేంద్రాలకు పోసేలా వారిలో చైతన్యం కలిగించాలని కోరారు. పాలపై వచ్చే లాభాలు ప్రభుత్వపరమైన మహిళా సంఘాలకు చేరాల్సిన అవసరం ఉందని కానీ జిల్లాలో నిత్యం లక్షా 50 వేల లీటర్ల పాలు ప్రైవేటు యాజమాన్యాలు సేకరిస్తూ వాటి ఫలాలు అనుభవిస్తున్నాయని జిల్లాలో రైతులను చైతన్యపరిచి ప్రభుత్వపరంగా సబ్సిడీలు, ఇతర సౌకర్యాలు పొందుతున్నందున పాలపై లాభాలు ప్రభుత్వ పాలకేంద్రాలకు చెందితే తిరిగి ఈ ప్రాంత ఐకెపి మహిళలే లబ్ధిపొందుతారన్న వాస్తవాన్ని ప్రజలకు వివరించాలని పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వర్‌ను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 20 ప్రాంతాలలో చేపట్టిన పాల సేకరణ కార్యక్రమం ఇటీవల కొంత తగ్గుముఖం పట్టడం వలన ఆశించిన ప్రగతి సాధ్యపడడం లేదని చెప్పారు. జిల్లాలో పాలసేకరణలో బాగా వెనుకబడ్డ 16 బల్క్‌మిల్క్ కూలింగ్ కేంద్రాలను త్వరలో పునరుద్ధరించి వాటి పటిష్టతపై దృష్టి కేంద్రీకరించాలని దశల వారీగా పాల సేకరణ పెంచడానికి చర్యలు చేపట్టాలని చెప్పారు. గేదెల పెంపకంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. పశుగ్రాసం, మినరల్ మిక్చర్, అదనపు కాల్షియం, పశువ్యాధుల నివారణా మందులపై 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం సమకూరుస్తున్నందున వాటిని సద్వినియోగం చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని కలెక్టర్ కోరారు. సమావేశంలో డి ఆర్‌డి ఎ పిడి వై రామకృష్ణ జిల్లా పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ డిప్యూటీ డైరెక్టర్ మల్లిఖార్జునరావు, పశుసంవర్ధక శాఖ జెడి జ్ఞానేశ్వరరావు, భీమడోలు పాల కేంద్రం మేనేజరు సూర్యప్రకాశరావు, ఎపిడి ముస్త్ఫా తదితరులు పాల్గొన్నారు.
డెల్టాలో జోరువాన..!
భీమవరం, సెప్టెంబరు 12: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల డెల్టా ప్రాంతంలో గురువారం జోరుగా వాన కురిసింది. నర్సాపురం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట, పెనుగొండ, పెనుమంట్ర, పాలకోడేరు, వీరవాసరం, కాళ్ళ, భీమవరం మండలం, ఆకివీడు, ఉండి తదితర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక తీరప్రాంతమైన మొగల్తూరులో ఎక్కువగా వర్షపాతం నమోదైంది. గత రెండురోజులుగా అన్ని ప్రాంతాల్లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల వల్ల జనజీవనం స్తంభించింది. ప్రజలు అనేక ఇక్కట్లు పడ్డారు. రహదారులు, వరిచేలు వర్షానికి నీట మునిగాయి.
వీరవాసరం: గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వీరవాసరంలో రోడ్లన్నీ జలమమయ్యాయి. గురువారం కురిసిన భారీ వర్షంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వీరవాసరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి రాత్రి 6 గంటల వరకు ఎడతెరపి లేకుండా వర్షం రావడంతో ప్రజలు ఇబ్బందులుపడ్డారు. వీరవాసరం గ్రామంలో బొంతువారిపేట, గాంధీబొమ్మసెంటర్ ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు నిలిచిపోయింది. కాగా వర్షాలు విస్తారంగా పడటంతో రైతులు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
మేమక్కడ పోరాడుతున్నాం
ఎమ్మెల్యే ఉషారాణి
పాలకొల్లు, సెప్టెంబరు 12: మీరు ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో సమైక్యం కోసం పోరాడుతున్నారని, మీలాగే మేమూ హైదరాబాద్, ఢిల్లీలో పోరాటం సాగిస్తున్నామని ఎమ్మెల్యే బంగారు ఉషారాణి సమైక్యవాదులనుద్దేశించి పేర్కొన్నారు. గురువారం ఎన్జీవోలు, ఉపాధ్యాయులు, కార్మికులు ఎమ్మెల్యే ఉషారాణి ఇంటిని ముట్టడించి, తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమంలో ఉదాసీనంగా ఉంటున్నారని ఎన్జీవో నేతలు ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు. దీనిపై ఎమ్మెల్యే ఉషారాణి మాట్లాడుతూ రాజీనామా చేసినవారి తొలి జాబితాలోనే తాను ఉన్నానని, స్పీకర్ ఫార్మెట్‌లోనే తన రాజీనామా సమర్పించినా ఇంతవరకు ఆమోదించలేదని వివరించారు. దేశ రాజధాని ఢిల్లీ పార్లమెంటులో గాంధీ విగ్రహం వద్ద సాహసించి ఎమ్మెల్యేల నిరసన గళం వినిపించగలిగామని, ఈ నిరసన ఫలితంగానే కేంద్ర అధినాయకులు విభజన ప్రక్రియపై తొందరపడకుండా పునరాలోచనలో పడ్డారని ఆమె వెల్లడించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవిని ఏ మాత్రం లెక్కచేయకుండా రాష్ట్ర విభజన వల్ల వచ్చే అనర్థాలను ఖరాఖండిగా సోనియాకు, ప్రధానికి, ఆంటోని కమిటీకి వివరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉషారాణి సమైక్యవాదులకు వివరించారు. ఎపి ఎన్జీవోలు హైదరాబాద్‌లో సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు నిర్వహించటం వెనుక సీమాంధ్ర నాయకుల కృషి ఎంత ఉందో మీకు తెలియదా అంటూ ప్రశ్నించారు. కేంద్ర పాలకులు తమ నిర్ణయాన్ని మార్చుకోకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే ఉషారాణి ఈ సందర్భంగా సమైక్యవాదులకు తెలియజేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో ఎన్జీవో సంఘ నాయకులు గారపాటి గోపాలరావు, మల్లికార్జునరావు, జి హరిబాబు, పాలకొల్లు తహసీల్దార్ పి వెంకట్రావు, పోడూరు తహసీల్దార్ జి స్వామినాయుడు, డిప్యూటీ తహసీల్దార్ వి.పోతన, వి.ఆంజనేయులు, ఎం.నరసింహరావు, జి.సుబ్రహ్మణ్యం, లాల్ పాషా, గిరిధర్, ఎన్.రామకృష్ణ, డి.నాగేశ్వరరావు, ఎస్టీయు నాయకుడు పిఎస్ ప్రతాప్‌రాజు, సోమంచి శ్రీనివాసశాస్ర్తీ, ఎమ్మార్కె రాజు, తోలేటి గాంధీ, పీర్ సాహెబ్, మహిళా నాయకులు దాక్షాయణి, పుష్పలత, విద్యార్థి జెఎసి నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.