Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి

$
0
0

మణుగూరు, సెప్టెంబర్ 12: పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని, 10 జిల్లాల హైద్రాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రకటనకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేశారు. సుమారు రెండువేల మంది విద్యార్థులతో స్థానిక ఎంసిఓఏ క్లబ్ నుంచి బయలుదేరిన ఈ ర్యాలీ సురక్షా బస్టాండు, ఆంధ్రాబ్యాంకు సెంటర్‌ల మీదుగా అంబేద్కర్ సెంటర్‌కు చేరుకుంది. అనంతరం అంబేద్కర్ సెంటర్‌లో విద్యార్థులు మానవ హారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి అయోధ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నేత దుగ్గ్యాల సుధాకర్‌లు పూలమాలలు వేసి మాట్లాడారు., తెలంగాణ కోసం చిన్న పిల్లల నుంచి ముదుసలి వరకు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమం జరిగింనదన్నారు. తెలంగాణ సాధనలో 11969 నుంచి ఇప్పటి వరకు 12- మంది విద్యార్థులు బలైపోయారన్నారు. అనేక ఉద్యమాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రకటనకు సుముఖంగా ఉండటంతో సీమాంధ్ర ప్రజలను రెచ్చగొడుతూ తెలంగాణ విభజనను అడ్డుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. కేంద్రప్రభుత్వం వెంటనే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని, లేకుంటే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులదే కీలకపాత్ర అన్నారు. హైద్రాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కావాలన్నారు. ఈ సమావేశంలో సింగిల్‌విండో చైర్మన్ సరెడ్డి పుల్లారెడ్డి, ఐఐఎస్‌ఎఫ్ నాయకులు కె భాస్కర్, రామ్మోహన్, మహేష్, చంటి, వేల్పుల నరేష్, వేల్పుల నరేష్, అక్కి నర్సింహారావు, ఎస్ నర్సయ్య, టి ఉపేందర్ తదిరతరులు పాల్గొన్నారు

విష జ్వరంతో ఇద్దరి మృతి
కొణిజర్ల, సెప్టెంబర్ 12: విష జ్వరం మరో రెండు ప్రాణాలను కబళించింది. మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామానికి చెందిన సైదులు, పార్వతి జ్వరంతో బాధపడుతున్నారు. ఇరువుని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రవేయిటు ఆసుపత్రిలో చేర్పించారు. రక్త కణాల సంఖ్య తీవ్ర స్థాయికి పడిపోవటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుక వెళ్ళాల్సిందిగా వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. హైదరాబాద్ తీసుక వెళ్ళేందుకు ఆర్థిక స్థితి లేకపోవటంతో పరిస్థితి విషమించి గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు సైదులకు భార్య సైదాబి ఇద్దరు పిల్లలు, మృతురాలు పార్వతికి భర్త హేమ్లా ఒక కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదే విధంగాగ్రామంలో మరి కొంతమంది వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ ఖమ్మంలోని పలు ప్రవేయిటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్దగోపతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గ్రామంలో వైద్యం ఎర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ నాగేశ్వరావు ఆధ్వర్యంలో జ్వర పీడితుల రక్త నమూనాలు సేకరించి పరిక్షలు నిర్వహించి మందులు అంద చేస్తున్నారు.
కాగా గ్రామాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండబాల కోటేశ్వరావు గురువారం సందర్శించారు. పరిసరాలను పరిశీలించారు. మృతుల కుటుంబాలను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిదని ఆరోపించారు. విషజ్వరాలు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి భానుప్రకాశ్‌ను కోరారు.

రేపు పువ్వాడకు ఆత్మీయ సత్కారం
ఉద్యమాలే ఆత్మీయతను పెంచాయి
* ఐక్య ఉద్యమాలకు వామపక్షాలు శ్రీకారం చుట్టాలి
* నాపై ఆరోపణలకు ప్రజలే సమాధానం చెప్పారు
* సిపిఐ సీనియర్ నేత పువ్వాడ
ఖమ్మం, సెప్టెంబర్ 12: ప్రజా సమస్యలపై ప్రజలను సమీకరించి చేసిన ఉద్యమాలే ప్రజల్లో ఆత్మీయతను పెంచాయని సిపిఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఆయనకు ఆయన సన్నిహితులు ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. 75వ జన్మదినంతో పాటు 50 సంవత్సరాల రాజకీయ జీవితం కూడా పూర్తవుతుండటంతో ఆయనకు ఘన సన్మానం ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన ఆయన అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా, సిపిఐ కేంద్రకమిటీ సభ్యుడిగా పని చేసిన ఆయన జిల్లాలో సమస్యలపై నాయకులందరిని ఒక తాటిపైకి తీసుకొని రావటంలో అనేక సార్లు విజయం సాధించారు. 1953లో గోదావరి వరదల్లో తాను చదువుతున్న పాఠశాల నీటిలో మునిగే పరిస్థితిలో పాఠశాల రికార్డులను, గ్రంథాలను ఎత్తయిన ప్రదేశాలకు తరలించటం దగ్గర నుంచి ఇటీవల సిపిఐ కార్యకర్తలకు ప్రజా సమస్యలపై దిశానిర్దేశం చేసేంత వరకు సమస్యలపై అనేక ఉద్యమాలు చేశారు. 1962లోనే ఆయన యూత్ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఫిన్‌లాండ్ వెళ్ళారు. కూనవరంలో జన్మించిన ఆయన 1964లో భద్రాచలం డివిజన్ కార్యదర్శిగా, తర్వాత ఖమ్మం జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా, కేంద్రకమిటీ సభ్యుడిగా సిపిఐలో పని చేశారు. 78లోనే భద్రాచలం నుంచి ఖమ్మం కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. అదే ఏడాది సుజాతనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. 1981లో కాంగ్రెస్ కురవృద్ధుడు శీలం సిద్ధారెడ్డిని ఓడించటం ద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1989లో ఖమ్మం శాసనసభకు, 2004లో ఎమ్మెల్సీగాను ఎన్నికయ్యారు. 2007లో శాసనమండలికి పువ్వాడ ప్రోటెమ్ చైర్మన్‌గా సైతం పని చేశారు. శాసనసభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా పని చేసినప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు అధికారంలో ఉండగా, అప్పటి ముఖ్యమంత్రులు పువ్వాడ నాగేశ్వరరావుకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే వారు. తమ పార్టీకి చెందిన సభ్యుల కంటే ఆయనకే ప్రాముఖ్యత కల్పించే వారని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ నాటి నుంచి నేటి వరకు ప్రజా సమస్యలను పరిష్కరించటంలో కమ్యూనిస్టు పార్టీ కీలకపాత్ర పోషించిందన్నారు. 1973లో ఎమర్జన్సీ కాలంలో భూ పోరాటాలు నిర్వహించటం ద్వారా వేలాది ఎకరాలను పేదల పరం చేశామని, వేలాది మంది జైలు పాలైన ఉద్యమం ఆగలేదని, నాటి స్మృతులను నెమరవేసుకున్నారు. 1983లో రాష్టమ్రంతా ఎన్టీఆర్ ప్రభంజనం వీచినప్పటికీ జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు. కమ్యూనిస్టు పార్టీ అనుబంధ సంఘాల రాష్ట్ర, జాతీయ మహాసభలను ఖమ్మంలో నిర్వహించి ఖమ్మంలో కమ్యూనిస్టు బలాన్ని చాటామని పేర్కొన్నారు. నాటి భూ పోరాటాల నుంచి ఇటీవల జరిగిన బయ్యారం ఉక్కు పోరాటం వరకు ప్రజలదే విజయమన్నారు. అనేక మంది తామే చేశామని చెప్పుకుంటున్నా ప్రజలు ఉద్యమించటం వల్లనే ఆ సమస్యలు పరిష్కారమయ్యాయని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడు ప్రజలకు అండగా ఉందని, అందుకే ప్రజలు కూడా ఆదరిస్తున్నారన్నారు. ప్రస్తుతం తాను కమ్యూనిస్టు పార్టీ సాధారణ సభ్యుడిగానే ఉన్నానని, అయినప్పటికీ జిల్లా ప్రజలు తన పట్ల చూపిస్తున్న అభిమానం మరువలేనిదన్నారు. తన సన్నిహితులంతా కలిసి చేస్తున్న ఆత్మీయ సభ రోజే జిల్లాలో ప్రముఖులైన స్వాతంత్య్ర సమరయోధులతో పాటు మరి కొంతమందిని సన్మానించటం గర్వించదగిన విషయమన్నారు.
ప్రధానంగా ప్రస్తుతం రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే కమ్యూనిస్టు పార్టీ బాధ్యత తన భుజంపై వేసుకోవటంలో వెనుకంజ వేయదన్నారు. ఖమ్మం జిల్లాకు నష్టం చేకూర్చేలా ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటుందని, వాటిని నిలిపివేయించేందుకు పోరాటం చేయాల్సిన బాధ్యత కమ్యూనిస్టు పార్టీలపైనే ఉందన్నారు. ప్రజలు కూడా తమ సమస్యల పరిష్కారానికి తామే ముందుండేలా చైతన్యం కావాల్సిన అవసరం ఉందని, ఇందుకు కమ్యూనిస్టు పార్టీలే చొరవ తీసుకోవాలని సూచించారు. ఒక సమస్యపై వామపక్ష భావాలు కలిగిన పార్టీలన్ని ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం దిగి వస్తుందని, దీనిని అన్ని పార్టీలు గమనించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా పాలకులు సరళీకృత ఆర్థిక విధానాలను అవలంభించటం ద్వారా ప్రజలకు నష్టం చేకూరుస్తున్నారని, ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియచెప్పాల్సిన బాధ్యత వామపక్ష పార్టీలదేనన్నారు. ఇదిలా ఉండగా తన రాజకీయ జీవితంలో తనపై వచ్చిన ఆరోపణలకు అనేక సార్లు ప్రజలే సమాధానం చెప్పారని స్పష్టం చేశారు. ప్రజలకు అండగా తాను ఉన్నానని, వారు కూడా తన పట్ల అదే ఆత్మీయతను ప్రదర్శించారని గర్వంగా చెప్పారు. రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు ఎన్నికల వరకే పరిమితం కావాలని, మిగిలిన సమయాల్లో ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్ నెలాఖరులోగా ఓటరు నమోదుకు
ఇంటింటి సర్వేను పూర్తిచేయండి
ఖమ్మం, సెప్టెంబర్ 12: అక్టోబర్ నెలాఖరులోగా ఓటరు నమోదుకు ఇంటింటి సర్వేను పూర్తిచేయాలని, ఓటరు నమోదు, తొలగింపులు, మార్పులు, చేర్పులు పూర్తిస్థాయిలో చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులను ఆదేశించారు. గురువారం భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్, రాష్ట్ర చీఫ్ ఎలక్ట్రోరల్ అధికారి బన్వర్‌లాల్‌తో కలిసి ఓటరు నమోదు ఇంటింటి సర్వే ప్రగతి, ఓటరు జాబితా తయారి, సార్వత్రిక ఎన్నికలు తదితర అంశాలపై హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ బోగస్ కార్డుల ఏరివేత, మరణించిన వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులకు సూచించారు. ఓటరు నమోదు మార్పులు, తొలగింపు వంటి సమాచారాన్ని ప్రజల మోబైల్స్‌కు పంపించాలన్నారు. పోలింగ్ కేంద్రాల మార్పు, క్రమబద్దీకరణ పట్ల జాగ్రత్తలు వహించాలన్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రస్తుత సంవత్సరంలో చేపట్టిన ఓటరు నమోదు, ఇంటింటి సర్వే ప్రగతిని వివరించారు. జిల్లాలో ప్రస్తుతం 18,63,769మంది ఓటర్లుగా నమోదయ్యారన్నారు. ఇటీవల చేపట్టిన ఇంటింటి సర్వేద్వారా కొత్తగా 24,099మందిని ఓటర్లుగా గుర్తించామన్నారు. అనర్హులుగా గుర్తించిన 48,383మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించామని ఆయన వివరించారు. వచ్చే సంవత్సరం మార్చి నెలాఖరులోగా ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఏజెసి బాబురావు, డిఆర్వో శివ శ్రీనివాస్, సబ్ కలెక్టర్ భరత్‌నారాయణ గుప్త, ఆర్డీవోలు సంజీవరెడ్డి, అమయ్‌కుమార్, శ్యామ్‌ప్రసాద్, తహశీల్దార్లు పాల్గొన్నారు.

బాలికల విద్య ప్రోత్సాహానికే కస్తూరిబా గాంధీ పాఠశాలలు
ముదిగొండ, సెప్టెంబర్ 12: బాలికల విద్యను ప్రోత్సహించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం కస్తూరిబా గాంధీ పాఠశాలలను నెలకొల్పినట్లు రాష్ట్ర శాసనసభ డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మండల పరిధిలోని కొత్తలక్ష్మిపురం గ్రామంలో 1.25కోట్ల వ్యయంతో నిర్మించిన కస్తూరిబా గాంధీ పాఠశాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ పేదరికం, ఆర్థికపరమైన కారణాలు, తల్లిదండ్రులు లేకపోవటం అనేక మంది పిల్లలు బడి మానేసి కూలీలుగా మారుతున్నారని గ్రహించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పాఠశాలలను నెలకొల్పి సంవత్సరానికి ఒక్కొక్క విద్యార్థికి 30వేల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. ఇక్కడ మొదట 30మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారని, ప్రస్తుతం 130మంది విద్యార్థులుండటం అభినందనీయమన్నారు. మండలంలో భూమిని స్వచ్ఛంధంగా అందించేందుకు దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ కార్యాలయాలు నెలకొల్పేందుకు కృషి చేస్తామన్నారు. విద్య వల్ల జీవన ప్రమాణంలో మార్పులు వస్తాయన్నారు. నియోజకవర్గంలోని 4మండలాల్లోనూ ఇటువంటి పాఠశాలలను నెలకొల్పామన్నారు. రాష్ట్రంలోనే విద్యాభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మధిరను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మానసిక ధైర్యాన్ని అందించటంతో పాటు అన్ని వౌళిక సౌకర్యాలను కల్పించటమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ప్రజలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు పదో తరగతిలో ఉన్నప్పుడే ఇంటర్‌లోచేరాల్సిన గ్రూపులపై కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. పాఠశాల చుట్టు ప్రహారీగోడ నిర్మాణానికి 15లక్షలు మంజూరు చేస్తూ మంచినీటిని అందించేందుకు నేరుగా పైపులైన్ వేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. అనంతరం 353 మందికి భూహక్కు పట్టాలను అందించారు. అ లాగే మాధారం గ్రామంలో 20. 23లక్షల వ్యయంతో నిర్మించనున్న రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వరూపరాణి, డిఈఓ రవీంధ్రనాథ్‌రెడ్డి, తహశీల్దార్ ప్రకాశరావు, ఎంపిడివో నర్మద, వెంకటేశ్వర్లు, రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ హామీతో ఆందోళనలకు తాత్కాలిక విరామం
* టిజెఏసి నాయకుల వెల్లడి
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 12: ఎంపిడివోల అక్రమ బదిలీలు విషయమై జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఆందోళనలను తాత్కలికంగా విరమించినట్లు తెలంగాణ ఉద్యోగ సంఘం చైర్మన్ కూరపాటి రంగరాజు, పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటపతిరాజులు పేర్కొన్నారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో బోనకల్, ముదిగొండ మండలాల ఎంపిడివోలను అక్రమంగా బదిలీ చేశారని, వారి బదిలీలను రద్దు చేయాలని ఆందోళనలు చేస్తుండగా స్పందించిన జిల్లా కలెక్టర్ ఉద్యోగ సంఘం నేతలతో చర్చలు జరిపి ఎంపిడివోలకు తగిన విధంగా న్యాయం చేస్తామని, ఆందోళనలు విరమించాలని సూచించటంతో తాత్కలికంగా విరమించినట్లు తెలిపారు. జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అధికారులంతా ఒక్కటిగా ఉండి పని చేస్తేనే సాధ్యమవుతుందని, ఆ దిశగా అధికారులు పని చేసి, జిల్లాను అభివృద్ధిలో ముందుంచాలన్నారు. ఇటీవల ఉద్యోగ సంఘం నేతలతో కలిసి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపాల్ సెక్రటరీ, పంచాయతీ రాజ్ మంత్రులను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించేందుకు తన వంతుగా కృషి చేస్తామని హామీనివ్వటంతో ఆందోళనను విరమించుకున్నామని, రానున్న రోజుల్లో సమస్య పరిష్కారం కాకపోతే ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. విలేఖరుల సమావేశంలో నాయకులు ఖాజామియా, శ్రీనివాసరెడ్డి, రవీంధ్ర, నందగిరి శ్రీను, కోడి లింగయ్య, చంద్రకాని రమణయాదవ్, సన్యాసయ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

గిరిజనులపై వేధింపులకు పాల్పడే
పోలీసు అధికారులకు శిక్ష తప్పదు
* సిపిఐ మావోయిస్టు శబరి ఏరియా కమిటీ హెచ్చరిక
చింతూరు, సెప్టెంబర్ 12: అమాయక గిరిజనులను వేధింపులకు గురి చేసే పోలీసు అధికారులకు ప్రజాకోర్టులో శిక్ష తప్పదని సిపిఐ మావోయిస్టు శబరి ఏరియా కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు గురువారం మండలంలోని సరివెల విద్యుత్ సబ్ స్టేషన్ శివారులో మావోయిస్టులు పోస్టర్లు, మావో జెండాను ఉంచి వెళ్లారు. ఆదివాసీ గ్రామాలపై పోలీసుల దాడులు ఆపాలి, ఆదివాసీ ప్రజలను అనేక విధానాలుగా వేధింపులకు పోలీసులు గురి చేస్తున్నారని, వేధింపులకు పాల్పడే పోలీసు అధికారులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని ఆ లేఖలో హెచ్చరించారు. అలాగే సంతకాల పేరుతో పోలీస్‌స్టేషన్ల చుట్టూ గిరిజనులను తిప్పించుకుంటున్నారని, దాన్ని వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు, భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని, గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూములకు పట్టాలివ్వాలని, గిరిజనులపై అటవీ శాఖాధికారుల వేధింపులు ఆపాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం ప్రతి గిరిజన కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇవ్వాలనే తదితర డిమాండ్లను మావోలు ఆ లేఖలో పేర్కొన్నారు. అదే విధంగా ఆ రహదారి పక్కనే ఉన్న కిమీ దిమ్మెకు మావో జెండాను ఉంచి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని వాటిని తొలగించారు.

బొప్పాయిలో బొజ్జ గణపయ్య
మణుగూరు, సెప్టెంబర్ 12: గణేష్ నవరాత్రోత్సవాల సందర్భంగా వినాయక సంబరాలు జరుపుకుంటుండగా లయన్స్ క్లబ్ ఆఫ్ మణుగూరు మాజీ అధ్యక్షుడు బేతంచర్ల వెంకటేశ్వరరావు ఇంట్లో బొప్పాయి పం డులో వినాయకుడి ఆకృతి కన బడడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తరలివస్తున్నారు. సాక్షాత్ బొజ్జ గణపయ్యే తన ఇంటికి ఆ రూపంలో వచ్చాడని వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు.

14న అండర్ 14 క్రికెట్ జట్టు ఎంపిక
ఖమ్మం(స్పోర్ట్స్), సెప్టెంబర్ 12: ఈనెల 14న జిల్లా పాఠళాల క్రీడా సంఘం ఆధ్వర్యంలో స్థానిక సర్దార్ పటేల్ స్టెడియంలో అండర్ 14 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక జరుగుతుందని జిల్లా పాఠశాల క్రిడా సంఘం కార్యదర్శి శ్యాంబాబు తెలిపారు. ఎంపికలకు ప్రతి పాఠశాలనుంచి నలుగురు బాలురు మాత్రమే హాజరు కావాలని ఆయన కోరారు. ఎనిమిదోతరగతి లోపు చదువుతు 1-1-2000 తరువాత పుట్టిన వారు వయస్సు ధృవీకరణ పత్రంతో హాజరు కావాలని ఆయన కోరారు. ఈనెల 17వ తేదీ నుంచి 19వరకు రంగారెడ్డి జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లాజట్టు పాల్గొంటుందని ఆయన తెలిపారు.

ఉత్కంఠగా పాఠశాలల క్రీడా పోటీలు
వైరా, సెప్టెంబర్ 12: మండల స్థాయి పాఠశాల విద్యార్థుల క్రీడలు మండల పరిధిలోని కెజి సిరిపురం గ్రామంలో రెండవ రోజైన గురువారం ఉత్కంఠ భరితంగా సాగాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలురకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ అంశాలు నిర్వహించారు. ఈ ఆటల పోటీలకు కన్వీనర్‌గా సిరిపురం పాఠశాల వ్యాయామ ఉపాద్యాయుడు వి.చంద్రశేఖర్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి వీరభద్రాచారి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలలో చాలా ఉత్సాహం కనబరుస్తున్నాయన్నారు. కాని గెలుపు కోసమే కాదు ఆట కోసం ఆడాలని ఆయన విద్యార్థులకు సూచించారు. క్రీడలు జరుగుతున్న తీరును ఎంఈఒ సలాది రామారావు పర్యవేక్షించారు. మధ్యాహ్నం విద్యార్థులకు ఉచితంగా భోజన ఏర్పాటు చేశారు. ఈ క్రీడా కార్యక్రమాల్లో వ్యాయామ ఉపాధ్యాయులు వై వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, శ్రీనివాసరావు, సుజాత, చారి, అరుణ పాల్గొన్నారు.

యువత ఆర్థిక స్వావలంబన సాధించాలి
ముదిగొండ, సెప్టెంబర్ 12:చదువుకున్న యువత ఆర్థిక స్వావలంబన సాధించేందుకు రాజీవ్ యువకిరణాల ద్వారా వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు డెప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం మండలంలోని ఐకెపి కార్యాలయంలో నిర్వహించిన మెగా జాబ్‌మేళాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో 15రోజులకొక సారి ఇంటర్వ్యూలు నిర్వహించి వారి అభిరుచి,అర్హతల మేరకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. గురువారం 8కంపెనీలు జాబ్‌మేళాలో పాల్గొన్నాయన్నారు. చదువుకున్న యువత వారి విద్యార్హతలను బట్టి మండల కేంద్రాల్లోని ఐకెపి కార్యాలయాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని, వారి అర్హతల ఆధారంగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఎంపికైన వారికి నియామకపు ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుధారాణి, డిఆర్‌డిఏ పిడి పద్మజారాణి, ఎంపిడివో నర్మద తదితరులు పాల్గొన్నారు.

పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని, 10 జిల్లాల హైద్రాబాద్‌తో కూడిన తెలంగాణ
english title: 
m

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>