నూజివీడు, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు నూజివీడు డివిజన్‌లో 48 గంటల బంద్ సంపూర్ణంగా, స్వచ్ఛందంగా జరిగింది. గురువారం నాడు కూడా వివిధ వర్గాల ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. బంద్ సందర్భంగా ప్రైవేటు కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు, సినిమా థియేటర్లు మూతబడ్డాయి. చివరకు కూరగాయల దుకాణాలు కూడా మూసివేశారు. దీంతో ప్రజా జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ వర్గాల ప్రజలు పలు ఇబ్బందులకు గురయ్యారు. ఆటోలు సైతం తిరగకపోవటంతో రవాణా వ్యవస్థకూడా నిలిచిపోయింది. లారీలను కూడా ఆందోళనకారులు నిలిపివేశారు. సమైక్యాంధ్ర కోరుతూ మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. 48 గంటల పాటు బంద్ జరగడంవల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పట్టణంలోని పండ్ల వ్యాపారులు సమైక్యాంధ్ర కోరుతూ పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరులో న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు రిలే నిరాహారదీక్షల్లో పాల్గొన్నారు. మార్షల్ ఆర్ట్సు చెందిన ప్రతినిధులు సంఘవి, సాయి చేసిన ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ట్యూబ్‌లైట్లను చేతితో పగల కొట్టటం, బండరాళ్ళను శరీరంపై ఉంచుకుని పగల కొట్టి నిరసన తెలిపారు. సర్వవాణిజ్య సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక పెద్దగాంధీబొమ్మ సెంటరులో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు గురువారం సాయంత్రంతో ముగిశాయి. అనంతరం కాగడాల ప్రదర్శన జరిగింది. న్యాయవాదులు స్థానిక న్యాయస్థానాల ప్రాంగణంవద్ద చేపట్టిన రిలే నిరాహారదీక్షలు 25వ రోజుకు చేరుకున్నాయి. నూజివీడు బార్ అసోసియేషన్ కార్యదర్శి మురళీకృష్ణ ప్రారంభించిన దీక్షా శిబిరంలో న్యాయవాదులు పాల్గొన్నారు. వైకాప నూజివీడు నియోజకవర్గం ఇన్‌చార్జి, మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర కోరుతూ చేపట్టిన రిలే నిరాహారదీక్షలు స్థానిక ద్వారక ఎస్టేట్ వద్ద కొనసాగాయి.
ఉమకూ తప్పని సమైక్య సెగ!
మైలవరం, సెప్టెంబర్ 12: చిత్తశుద్ధి లేని సంఘీభావాలు, ఉద్యమాలు మాకొద్దంటూ ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వరరావును నిలదీసి ఉద్యమ సెగను చూపించారు. శతజన దీక్షా కార్యక్రమాన్ని గురువారం స్థానిక బస్‌స్టాప్ సెంటర్‌లో ఉద్యోగ సంఘాల ఐకాస నేతలు నిర్వహించారు. దాదాపు 250 మంది ఒకే శిబిరంలో నిరాహార దీక్ష నిర్వహించి ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చారు. ఈదీక్షా శిబిరాన్ని ఎమ్మెల్యే ఉమా సందర్శించి సంఘీభావం ప్రకటిస్తూ ప్రసంగించేందుకు సిద్ధపడుతుండగా ఒక్కసారిగా జేఏసీ నేతలు పుల్లారెడ్డి, వరదా శ్రీనివాసరావు ఉమా ప్రసంగానికి అడ్డుతగులుతూ నెల రోజులుగా రోడ్డునపడి జీతాలు లేకపోయినా కడుపు మంటతోనే ఉద్యమం చేస్తున్నాం, ఈ ఉద్యమాన్ని మీరెందుకు నాయకత్వం వహించి ముందుకు తీసుకెళ్ళడం లేదు, ఎంతకాలం మభ్యపెడతారు, అసలు కేంద్రానికి మీ పార్టీ విభజనకు అనుకూలంగా లేఖ ఎందుకిచ్చింది, ఇంత జరుగుతున్నా ఇచ్చిన లేఖను ఎందుకు వెనక్కి తీసుకోవటం లేదు, మీరు గానీ, మీ పార్టీ అధినేత గానీ ఇప్పటివరకూ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? మీ సంఘీభావాలు మాకక్కర్లేదంటూ ఎమ్మెల్యేను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో ఉమా ఒక్కసారిగా ఉద్యోగుల నుండి వచ్చిన ప్రతిఘటనుండి తేరుకుని తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని స్పష్టం చేశారు. 2009లో విభజన ప్రకటన సమయంలో తాను చేసిన దీక్ష గురించి చెప్పారు. అదేవిధంగా ప్రస్తుతం విభజన ప్రకటన అనంతరం తాను స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా లేఖను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. చివరికి తాను సమైక్య ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇస్తానని వారికి హామీ ఇచ్చి అక్కడినుండి వెళ్లిపోయారు.
తిరువూరు బంద్ విజయవంతం
తిరువూరు, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా సమైక్యాంధ్ర జిల్లా జెఎసి పిలుపు మేరకు తిరువూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల బంద్ విజయవంతమైంది. బంద్ కారణంగా గురువారం రెండవరోజు కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, దుకాణాలు, బ్యాంక్‌లు సినిమాహాళ్లు మూతపడ్డాయి. జెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బ్యాంక్‌ల ఎదుట కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని పోష్టల్ కార్యాలయం వద్ద ప్రదర్శన జరిపారు. అనంతరం స్థానిక బైపాస్ రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేస్తూ పట్టణంలో ప్రదర్శన జరిపారు. జెఎసి నాయకులు దద్దనాల రాంబాబు, జె జీవనజ్యోతి, బివివిఆర్ నాగేంద్రరావు, గద్దల ఏసురత్నం, ఎం ప్రకాష్‌బాబు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
జోరుగా ఇసుక అక్రమ రవాణా
మండలంలో ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. గతంలో కొందరు స్థానిక అధికారులు అండదండలతో ఈదందా నడుస్తోందని విమర్శలు రాగా ఇప్పుడు అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమంలో సమ్మెబాట పట్టడంతో అక్రమ రవాణాకు అడ్డూ అదుపూలేకుండా పోయింది. ఈట్రాక్టర్‌లకు రవాణా శాఖ అనుమతులు గాని, వాటిని నడిపే వారికి కనీసం లైసెన్సులు లేకపోవడం విశేషం. కనీసం నెంబరు ప్లేట్లు కూడా లేకుండా నడుస్తున్న ఈవాహనాల వైపు పోలీసులు కనెత్తి చూడకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఇప్పటికైనా ఆయా శాఖల ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని అక్రమ రవాణాను నిరోధించాలని అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
నేడు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్!
గుడివాడ, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాల్లో భాగంగా ఈ నెల 13న గుడివాడ పట్టణంలోని అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల బంద్ నిర్వహిస్తున్నట్టు సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్ చెప్పారు. గురువారం స్థానిక ఎన్‌జీవో హోమ్‌లో ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. జిల్లా కోకన్వీనర్ మండలి హనుమంతరావు మాట్లాడుతూ పట్టణంలోని 25బ్యాంక్‌లు, 5 ఇన్సూరెన్స్ కంపెనీల బ్రాంచిలు, పోస్టల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఆదాయపు పన్నుశాఖల కార్యాలయాలతో పాటు ఎఫ్‌సీఐ, సీడబ్ల్యూసి గోదాముల బంద్ జరుగుతుందన్నారు. ఎన్‌జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ ఫరీద్ బాషా, కార్యదర్శి జి రాజేంద్రప్రసాద్, రవాణాశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ శాఖల జెఎసి కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సమ్మెతో ప్రభుత్వానికి షాక్ తప్పదు
రాష్ట్ర విభజనకు నిరసనగా విద్యుత్ ఉద్యోగులు చేస్తున్న 72గంటల సమ్మెతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు షాక్ తగలక తప్పదని ఉపాధ్యాయ పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ మత్తి కమలాకర్ అన్నారు. స్థానిక ఎన్‌జీవో హోంలో గురువారం జరిగిన విద్యుత్ ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల జెఎసి చైర్మన్ జిఆర్ వెంకటేశ్వరరావు, కన్వీనర్ వి కృష్ణారావు, కోశాధికారి జి అజయ్‌కుమార్, సభ్యులు రాము, ఎడిఇలు టి తులసీరాం, బసవరాజు, సమైక్యాంధ్ర జెఎసి చైర్మన్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, జిల్లా కోకన్వీనర్ మండలి హనుమంతరావులు పాల్గొన్నారు.
రెండోరోజూ బంద్ సంపూర్ణం
నందిగామ, సెప్టెంబర్ 12: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ జెఎసి ఇచ్చిన 48గంటల పిలుపులో భాగంగా రెండవ రోజైన గురువారం కూడా నందిగామలో బంద్ సంపూర్ణంగా ప్రశాంతంగా జరిగింది. ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి నేతలు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ బంద్‌ను పర్యవేక్షించారు. వ్యాపార వాణిజ్య సంస్థలు, సినిమాహాళ్లు, పెట్రోల్ బంక్‌లు, పాఠశాలలు, బ్యాంకులు మూసివేశారు. అనంతరం జాతీయ రహదారి బైపాస్ వద్ద అరగంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీమాంధ్రకు చెందిన ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర విభజన అంశంపై స్పష్టమైన హామీ వచ్చే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా నేతలు స్పష్టం చేశారు. పట్టణంలోని పలు స్టాండ్‌లకు చెందిన ఆటో యజమానులు సమైక్యాంధ్రకు అనుకూలంగా ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ పట్టణంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు.
ముసునూరులో...
ముసునూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లా జెఎసి 48 గంటల పాటు ఇచ్చిన బంద్ గురువారం రెండవరోజు విజయవంతమైంది. మండల ప్రజలు, వర్తక, వ్యాపార, వాణిజ్య సంఘాల వారు స్వచ్ఛందంగా రెండవ రోజు బంద్‌కు సహకరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, బ్యాంక్‌లను మూసివేసి బంద్‌లో పాల్గొన్నారు. చింతలవల్లి విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో చింతలవల్లి, ముసునూరు తదితర గ్రామాలకు చెందిన ప్రజలు నూజివీడు- ఏలూరు ప్రధాన రహదారిపై నేలపాటివారి కుంట వద్ద రాస్తారోకో నిర్వహించారు. వాహనాలు రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు.
సకలం బంద్ సంపూర్ణం
కైకలూరు: సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో భాగంగా జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో నిర్వహిస్తున్న 48 గంటల బంద్ గురువారం కైకలూరులో సంపూర్ణంగా జరిగింది. విద్య, వ్యాపార, వాణిజ్య సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సినిమా హాళ్లు మూసివేశారు.
రైతులకు సాగునీరు టిడిపితోనే సాధ్యం
జి.కొండూరు, సెప్టెంబర్ 12: రైతులకు సాగునీటిని అందించడం టిడిపితోనే సాధ్యమని ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. జి.కొండూరులో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఉమా మాట్లాడుతూ మెట్టప్రాంత రైతాంగానికి సాగునీరు సమృద్ధిగా లభించే విధంగా రూపకల్పన చేసిన ఎత్తిపోతల పథకం గురించి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు వివరించి, ఆయన చేత ప్రజలకు హామీ ఇప్పించినట్లు తెలిపారు. టిడిపి అధికారంలోనికి రాగానే ఈపథకానికి నిధులు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు వివరించారు. విటిపిఎస్ రిటర్న్ వాటర్‌ను పైపుల ద్వారా విస్సన్నపేట 117వ కిలోమీటరు వద్దకు మళ్లించి, అక్కడి నుంచి మైలవరం, నూజివీడు ఎన్‌ఎస్‌పి బ్రాంచి కాల్వల ద్వారా దిగువకు సాగునీటిని సరఫరా చేస్తామన్నారు. దాదాపు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు లభ్యమవుతుందన్నారు. చంద్రబాబు చేపట్టిన ఆత్మగౌరవయాత్ర కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విజయవంతమయ్యిందన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ కుటిలతత్వాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. జగన్‌కు బెయిల్ వచ్చేందుకే సిబిఐ అధికారులను బదిలీ చేశారని ఆయన అన్నారు. తెలుగుదేశం నాయకులు వుయ్యూరు నరసింహారావు, జువ్వా రాంబాబు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర బంద్ ఉయ్యూరులో సంపూర్ణం
ఉయ్యూరు, సెప్టెంబరు 12: సమైక్యాంధ్ర లక్ష్యంగా గడచిన 42 రెండు రోజులుగా జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా చేపట్టిన 48 గంటల బంద్ స్థానికంగా, సంపూర్ణంగా, స్వచ్ఛందంగా, ప్రశాంతంగా జరిగింది. రాష్ట్ర విభజనను నిరసిస్తూ నిర్వహించిన బంద్ గురువారం కూడా కొనసాగింది. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవైటు పాఠశాలలు, వర్తక, వాణిజ్య సంస్థలు మూత పడ్డాయి. ఆటోలు, ప్రయివేటు వాహనాలు బంద్‌కు మద్దతు పలకడంతో రవాణా సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. సమైక్యాంధ్ర ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జోరు వానను సైతం లెక్కచేయకుండ గొడుగులు వేసుకొని మరీ ఉద్యమకారులు నిరసన తెలిపారు. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. స్థానిక సెంటరులో జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలేదీక్షా శిబిరంలో వివిధ ట్రేడ్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. గురువారం నుంచి సమ్మెలో ఉన్న విద్యుత్ శాఖ సిబ్బంది భారీ ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కెసిపి చక్కెర కర్మాగారం, విద్యుత్ సబ్ స్టేషన్‌లు మూతపడ్డాయి.
సమైక్యాంధ్రే కావాలని
గర్జించిన మహిళాలోకం
* రాష్ట్ర భవిష్యత్తు రాష్టప్రతి చేతుల్లోనే..
* ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి
చల్లపల్లి, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా రోడ్డెక్కిన మహిళల సమైక్య నినాదాలు మిన్నంటాయి. చల్లపల్లి జెఎసి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన మహిళా గర్జనకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయక చల్లపల్లి, పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 6వేల మంది మహిళలు సమైక్యాంధ్ర కోసం గర్జించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సమైక్యాంధ్రకు మద్దతుగా దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. జెఎసి కన్వీనర్ నాగళ్ళ భీమారావు పర్యవేక్షణలో ప్రధాన సెంటరులో నిర్వహించిన బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకురాలు, శాసనమండలి సభ్యురాలు నన్నపనేని రాజకుమారి, విజయవాడ నగర మాజీ మేయర్ రత్నబిందు, ప్రముఖ దంత వైద్యురాలు మాలెంపాటి శారద, వెలుగు సిసి స్వర్ణలత తదితరులు పాల్గొని తమ ప్రసంగాల ద్వారా మహిళలను ఉత్తేజపరిచారు. నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్‌కు గుండెకాయ అన్నారు. దాన్ని కబ్జా చేయాలని చూస్తే ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎంపిలు, ఒక మాజీ ఎంపి కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరితే ఉలిక్కిపడ్డ కేంద్రం విభజన నిర్ణయం తీసుకుందదన్నారు. ఇదేవిధంగా సీమాంధ్రలోని కేంద్ర మంత్రులు, ఎంపిలు పదవులకు రాజీనామాలు చేసి అధిష్ఠానానికి ఎదురుతిరిగితే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంలో సోనియా వెనక్కి తగ్గే అవకాశాలు లేవని, ఇదే సమయంలో ప్రధాని సైతం నిస్సహాయుడిగా మిగిలారని విమర్శించారు. రాష్ట్రా న్ని కాపాడే అవకాశం ఒక్క రాష్టప్రతికే ఉందని నన్నపనేని రాజకుమారి వివరించారు.
ఈసందర్భంగా వేదికపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.
సమైక్యాంధ్రే లక్ష్యం
* కూచిపూడిలో షర్మిల స్పష్టీకరణ
కూచిపూడి, సెప్టెంబర్ 12: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్యాంధ్రకు పూర్తిగా మద్దతు పలుకుతోందని పార్టీ నాయకురాలు, దివంగత నేత వైఎస్‌ఆర్ తనయ షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సుయాత్ర గురువారం రాత్రి కూచిపూడి చేరింది. మొవ్వ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఆందోళన చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకునే వరకు ఉద్యమం నిర్వహించాలని షర్మిల పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు ఉప్పులేటి కల్పన, కుక్కల నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. మండల కన్వీనర్ చిందా వీర వెంకట నాగేశ్వర్రాజు ఆధ్వర్యంలో ప్లకార్డులు చేబూని షర్మిలకు స్వాగతం పలికారు.
48గంటల బంద్ సక్సెస్
* జిల్లాలో స్తంభించిన జనజీవనం
* 72గంటల సమ్మెకు దిగిన విద్యుత్ ఉద్యోగులు
* నేడు ఉయ్యూరులో 30వేల మంది మహిళల ‘సమైక్య గోడు’
మచిలీపట్నం, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో హోరెత్తింది. 48గంటల జిల్లా బంద్ సంపూర్ణంగా ముగిసింది. స్వచ్ఛందంగా ఎవరికి వారు బంద్‌లో పాల్గొని రాష్ట్రం కలిసి ఉండాలన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు. బంద్ కారణంగా బుధ, గురువారాల్లో జనజీవనం స్తంభించింది. కనీసం ఆటోలు కూడా తిరగకపోవటం బంద్ ప్రభావాన్ని ఇనుమడింపజేసింది. జిల్లావ్యాప్తంగా వర్తక, వాణిజ్య, విద్యాసంస్థలు, బ్యాంక్‌లు, పెట్రోలు బంక్‌లు మూతబడ్డాయి. కిళ్ళీకొట్లు బంద్ కావటం సహా ఆటోలు కూడా బయటకు రాలేదు. విద్యుత్ శాఖ ఉద్యోగులు 72గంటల సమ్మెకు దిగారు. చల్లపల్లిలో వేలాది మంది మహిళలు సివంగులై గర్జించారు. గుడివాడలో ఉద్యోగులు భిక్షాటన చేశారు. బందరులో కూరగాయల వ్యాపారుల వంటావార్పు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. చల్లపల్లిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది మహిళలు కదంతొక్కారు. మచిలీపట్నంలో కూరగాయల వ్యాపారులు వంటావార్పుతో రోడ్లపై సహపంక్తి భోజనాలు చేశారు. గుడివాడలో ఉద్యోగులు భిక్షాటన చేయగా ఉపాధ్యాయులు మహార్యాలీ నిర్వహించారు. నూజివీడులో పండ్ల వ్యాపారులు భారీ ప్రదర్శన జరిపారు. విస్సన్నపేట, తిరువూరులో రాస్తారోకో, ర్యాలీలు అదిరాయి. నందిగామ, జగ్గయ్యపేటలో నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. ఉయ్యూరులో జోరున కురుస్తున్న వర్షంలో సమైక్యవాదులు గొడుగులతో నిరసన తెలిపారు. శుక్రవారం 30వేల మంది మహిళలతో ‘సమైక్య గోడు’ నిర్వహించనున్నారు. కూచిపూడిలో కాగడాల ప్రదర్శన, పెడనలో వంటావార్పు జరిగాయి. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఆర్జిత సేవలను రద్దు చేసి అర్చకులు, ఆలయ సిబ్బంది సమైక్యాంధ్ర ఉద్యమకారులకు సంఘీభావం తెలిపారు. బంటుమిల్లిలో పట్టపు నారిబాబు ఆమరణ దీక్షకు దిగారు. జిల్లావ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న
11 ట్రాక్టర్లు సీజ్
* 5లక్షల జరిమానా
ఎ కొండూరు, సెప్టెంబర్ 12: అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను విజయవాడ రీజనల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గురువారం దాడిచేసి పట్టుకున్నారు. ఒక్కొక్క ట్రాక్టర్‌కు 50 వేల రూపాయలు చొప్పున 5.50 లక్షల రూపాయలు జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ సిఐ పి రాజేష్ తెలిపారు. విజిలెన్స్ జిల్లా ఎస్‌పి ఎ సోనిబాలదేవి సమాచారం మేరకు ఈదాడులు నిర్వహించినట్లు తెలిపారు. భవన నిర్మాణదారులకు ట్రాక్టర్ ఇసుక 2800 రూపాయల వరకు అధిక మొత్తంలో ఇసుకను తరలించి విక్రయించడం వల్ల జాతీయ సహజ వనరులు తరిగిపోతుండటంతో ఈదాడులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గురువారం గంపలగూడెం మండలంలోని కట్టలేరు వాగు నుండి చీమలపాడు మొయిన్ సెంటర్‌లోని విజయవాడ- భద్రాచలం జాతీయ రహదారిపై తరలిస్తుండగా దాడి చేసి పట్టుకున్నట్లు చెప్పారు. ట్రాక్టర్‌లను స్వాధీనం చేసుకుని పంచానామా తయారు చేసి కఠిన చర్యలు తీసుకునేందుకు వాల్టా చట్టం ప్రకారం నూజివీడు సబ్‌కలెక్టర్‌కు నివేదిక పంపినట్లు చెప్పారు. దాడుల్లో ఎం వెంకటేశ్వరరావు, మైనింగ్ అసిస్టెంట్ జియాలజిస్టు కె జయసింగ్, వారి సిబ్బంది, ఎ కొండూరు ఎస్‌ఐ వి మధుసూదనరావు, ఎఎస్‌ఐ నాగపోతరాజు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓట్లు, సీట్ల కోసం విభజన చిచ్చుపెడతారా?
* కాంగ్రెస్ పార్టీపై షర్మిల ధ్వజం
కైకలూరు, సెప్టెంబర్ 12: ఓట్ల కోసం, సీట్ల కోసం తెలుగు ప్రజల మధ్య విభజన చిచ్చుపెట్టి ఆ మంటలతో కాంగ్రెస్ నాయకులు చలి కాసుకుంటున్నారని వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల విమర్శించారు. గురువారం సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా కైకలూరులోని అడవినాయుడు సెంటర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. రాష్ట్ర విభజన ప్రకటనకు ముఖ్యకారకుడు చంద్రబాబు నాయుడన్నారు. హత్య చేసి ఆ శవంపై పడి వెక్కివెక్కి ఏడ్చినట్లుగా ఆయన వైఖరి ఉందన్నారు. సమైక్యాంధ్రకు మద్దతు తెలపకుండా రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ బ్లాంక్ చెక్ మాదిరిగా ఉత్తరం ఇచ్చి దాన్ని ఉపసంహరించుకోకుండా ఆత్మగౌరవ యాత్ర చేయడం ఆయనకే చెల్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనా రాజీనామాలు చేస్తే ప్రభుత్వం పడిపోతుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేసిన కృషి తెలుగు ప్రజలందరికీ తెలిసిందేనన్నారు. ప్రధానమంత్రే స్వయంగా వైఎస్సార్ బతికి ఉంటే రాష్ట్రానికి ఈ పరిస్థితి ఉండేదికాదని చెప్పడం వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా సమర్థతకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో సిపిఎం, ఎంఐఎం, వైఎస్సార్సీపీలు సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచాయన్నారు. మిగిలిన పార్టీలు రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసేందుకే కంకణం కట్టుకున్నాయని షర్మిల విమర్శించారు. రాష్ట్రం విడిపోతే దాపురించే కష్టనష్టాలను వారికి తెలిసినా పదవులు మాత్రమే ముఖ్యమని వారు భావిస్తున్నారని, తమ పార్టీ సమైక్యాంధ్రకు మద్దతుగా చివరి వరకు పోరాడుతుందని, దీనికోసం పోరాటం చేసే సకల జనులకు తమ మద్దతు ఉంటుందని షర్మిల హామీఇచ్చారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్తలు కుక్కల నాగేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, మేకా ప్రతాప్ అప్పారావు, రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవిఎస్ నాగిరెడ్డి, పోసిన చెంచురామారావు, బొడ్డు నోబుల్, వాసిపల్లి యోనా, సిఈపి సభ్యురాలు ఉప్పులేటి కల్పన పాల్గొన్నారు.
షర్మిలతో గొంతుకలిపిన జనం
పామర్రు : వైఎస్సార్సీపీ నేత షర్మిల పామర్రులో గురువారం స్థానిక నాలుగు రోడ్ల జంక్షన్‌లో బస్‌యాత్ర ద్వారా కొన్ని నిమిషాలపాటు ఆగి సమైక్యాంధ్ర వర్ధిల్లాలి అని నినాదాలు చేయగా ఇటు సమైక్యాంధ్ర జెఎసి నేతలు అటు వైఎస్సార్సీ నేతలు, కార్యకర్తలు వర్థిల్లాలి అంటూ ప్రతిస్పందించారు. నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద రిలే దీక్షలో కూర్చున్న పామర్రు సర్పంచ్ దేవరకొండ రోహిణి, పలువురు వార్డు మెంబర్లకు షర్మిల అభివాదం చేశారు. వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉప్పులేటి కల్పన, పార్టీ ప్రముఖులు షర్మిలకు పామర్రు ఆరంభంలో స్వాగతం పలికారు. షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సమైక్యాంధ్రకు మద్దతుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. గ్యాస్ డీలర్లు, సిబ్బంది ధర్నా జరిపారు.
చంద్రబాబుకు వీడ్కోలు
గన్నవరం, సెప్టెంబర్ 12: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం హైదరాబాద్ వెళ్లారు. తెలుగువారి ఆత్మగౌరవ యాత్రను కృష్ణాజిల్లాలో ముగించుకున్న చంద్రబాబు బుధవారం రాత్రి విజయవాడలో బస చేశారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గంగుండా విమానాశ్రయంకు చేరుకున్న ఆయన కొద్ది సేపు విఐపి రాంజ్ రూంలో విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం 8.20 గంటలకు జిల్లా నేతల నుండి వీడ్కోలు అందుకుని స్పైస్ జెట్ విమానంలో బయలుదేరి హైదరాబాద్‌కు వెళ్లారు. చంద్రబాబుకు వీడ్కోలు పలికిన వారిలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకట బాలవర్థనరావు, తంగిరాల ప్రభాకరరావు, నాయకులు కాగిత వెంకట్రావు తదితరులు ఉన్నారు.
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి
* ఎన్నికల సంఘం కమిషనర్ వినోద్
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 12: అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయటంతో పాటు కచ్చితమైన ఓటర్ల జాబితాల తయారీకి జిల్లా కలెక్టర్లు కృషి చేయాలని భారత ఎన్నికల సంఘం కమిషనర్ వినోద్ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కలిసి గురువారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్, పోస్టల్ బ్యాలెట్, 18సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయటం, ఇపిఆర్ రేషియో, ఎన్నికల నిర్వహణకు సిబ్బంది గుర్తింపు, ఇఆర్‌ఓలకు, ఎఇఆర్‌ఓలకు శిక్షణ, గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలతో సమావేశం, ఇవిఎంల నిర్మాణం తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లాలో డేటా ఎంట్రీ నూరుశాతం పూర్తయిందని కలెక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి వివరించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, డిఐఓ శర్మ పాల్గొన్నారు.
చైతన్య విద్యార్థి ఆత్మహత్య
పాతబస్తీ, సెప్టెంబర్ 12: గొల్లపూడిలోని చైతన్య కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థి హాస్టల్‌లోని బాత్‌రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వన్‌టౌన్ పోలీసుల కథనం ప్రకారం... తెనాలి బోస్‌రోడ్డుకు చెందిన పంజా ఈశ్వర్ (16) గొల్లపూడిలోని చైతన్య కాలేజీ ఇంటర్ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం వంట్లో బాగోలేదని చెప్పి తరగతి రూం నుంచి హాస్టల్ రూంకు వచ్చాడు. సాయంత్రం ఐదు గంటల సమయంలో సహచర విద్యార్థులు ఈశ్వర్ గురించి ఆరా తీయగా హాస్టల్ రూంలో బాత్‌రూంలో ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించాడు. సమాచారం అందిన కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వర్ తల్లిదండ్రులకు విషయం చెప్పి ఫోన్ ద్వారా వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు విద్యార్థి ఎలాంటి సుసైడ్ నోట్ రాయలేదని తల్లిదండ్రులు వచ్చాకాగాని ఏ విషయం చెప్పలేమని పోలీసులు తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.
20న నగరంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’
సబ్ కలెక్టరేట్, సెప్టెంబర్ 12: 20వ తేదీ నగరంలో సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఎపి ఎన్జీవో జెఎసి రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిందని ఎన్జీవో జెఎసి జిల్లా చైర్మన్ ఎ విద్యాసాగర్ చెప్పారు. ఈ నెల ఏడో తేదీ హైదరాబాద్‌లో నిర్వహించినట్లుగానే నగరంలో కూడా సభ నిర్వహించాలని నిర్ణయించామన్నారు. గురువారం సాయంత్రం గాంధీనగర్‌లోని ఎపి ఎన్జీవో హోంలో విలేఖర్ల సమావేశం జరిగింది. సాగర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో నిర్వహించిన సభలో హైకోర్టు ఉత్తర్వుల మేరకు కేవలం ఉద్యోగులు మాత్రమే పాల్గొన్నారని నగరంలో 20వ తేదీ నిర్వహించే సభకు సీమాంధ్రలోని అందరూ ఆహ్వానితులేనని స్పష్టం చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో బుధ, గురువారాల్లో నిర్వహించిన 49 గంటల బంద్‌లో ప్రజలు స్వచ్చంధంగా పాల్గొని జయప్రదం చేశారని ఇది ప్రజావిజయంగా భావిస్తున్నామని చెప్పారు. విద్యుత్ జెఎసి కన్వీనర్ ఎం సత్యానందం మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించినా ముఖ్యమంత్రి విన్నపం మేరకు 72 గంటల సమ్మెగా మార్చామని చెప్పారు. ఇప్పటికే సీమాంధ్రలో విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని శుక్ర, శనివారాల్లో పంపిణీ మరింత దిగజారే ప్రమాదం ఉందన్నారు. విటిపిఎస్‌లో 1760 మెగావాట్ల ఉత్పత్తిలో 400 మెగా వాట్ల ఉత్పత్తి తగ్గిందని రానున్న రెండు రోజుల్లో మరింతగా తగ్గుతుందని వివరించారు.
విఘ్నేశ్వరుడి సేవలో తాబేలు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 12: కృష్ణవేణి మ్యూజియం సమీపంలో ఉన్న శ్రీ భూగర్భ వినాయకదేవస్థానంలో కొలువై ఉన్న శ్రీగణపతిని సేవిస్తున్న తాబేలును చూడటానికి భక్తులు అధిక సంఖ్యలోతరలి వస్తున్నారు. ఈ దేవస్థానంలో శ్రీగణపతి మహోత్సవాలు ఈ నెల 9న ప్రారంభమయ్యాయి. ముందురోజే పవిత్ర కృష్ణానది నుండి ఒక తాబేలు వచ్చి స్వామివార్ల పాదాల చెంతకు చేరింది. తొలుత దేవస్థానం కమిటీ అధ్యక్షుడు బాయన కనకరావు ఈ తాబేలును గమినించలేదు. సోమవారం గణపతికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం వచ్చిన ఒక భక్తుడు తాబేలును గమినించి ఈ విషయాన్ని చైర్మన్ కనకారావు చెప్పారు. దీంతో కనకారావు తాబేలును తీసుకువెళ్ళి కృష్ణానదిలో విడిచిపెట్టారు. మంగళవారం వేకువ జాము సమయానికి అదే తాబేలు తిరిగి వచ్చి స్వామివార్ల పాదాల వద్ద నుండి బయటకు వెళ్ళే చిన్న కాలువలోకి వచ్చి చేరింది. భక్తుల రద్దీలేని సమయంలో తిరిగి స్వామివార్ల పాదాల చెంతకు వచ్చి అక్కడే ఉంటుంది. ఈ విషయాన్ని పరిశీలించిన చైర్మన్ కనకారావు గురువారం ఉదయం అక్కడ కొంతమంది విలేఖరులు, స్థానిక పెద్దలను తీసుకువెళ్ళి స్వామివార్ల పాదాల చెంత ఉన్న తాబేలును చూపించారు. అందరి సమక్షంలో తాబేబును కొంచెం దూరంగా పెట్టిన కొద్ది సేపటికే తిరిగి స్వామివారి పాదాల చెంతకువచ్చి చేరుతోంది. దీంతో స్వామివారిని దర్శించుకోవటానికి వస్తున్న భక్తులు ఈ తాబేలుకు కూడ పూజలు చేయటం ప్రారంభించారు.
ప్రజల చేతుల్లో ఉద్యమం
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 12: ప్రస్తుతం రాష్ట్రంలో రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సమైక్య ఉద్యమం ప్రజల చేతుల్లో ఉందని వాస్తవంగా ప్రజలే నిజమైన ప్రతినిధులని వారు చెప్పిన విధంగా నడుచుకోవటానికి తాను సిద్ధంగా ఉన్నానని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ ది విజయవాడ బ్రాస్, అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం శివాలయం సెంటర్‌లో వంటావార్పు, బైక్ ర్యాలీ తదితర కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శాసన సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ సమైక్య వాదం ఇప్పుడు ప్రజల నుండి పుట్టిన ఉద్యమం అని ఈ ఉద్యమం ఆపాలి అంటే కేంద్రం సీమాంధ్ర ప్రజల మనోభావాలను గౌరవించవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓట్లేసి గెలిపించిన ప్రజల మనోభావాలను గౌరవించవల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతైనా ఉందన్నారు. ఒక సమస్య వచ్చినప్పుడు అందరికి ఆమోదయోగ్యమైన తీర్పు ఇవ్వవల్సి ఉంటుందన్నారు. ప్రజలు చేస్తున్న న్యాయమైన డిమాండ్ విషయంలో తాను ఎల్లప్పుడు ప్రజల పక్షానే ఉంటానన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు వల్లంకొండ పూర్ణ చంద్రరావు, సెక్రటరీ ఉప్పుశివాజీ, కోశాధికారి వి సంపత్‌కుమార్, ఉపాధ్యక్షుడు జి సూర్యప్రసాద్, జాయింట్ సెక్రటరీ నరసింహారావు, గౌరవాధ్యక్షుడు సంపలాల్ జైన్, శ్రీ వేంకటేశ్వరస్వామివార్ల దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ కె విద్యాధరరావు, రూపా బాయమ్మ ట్రస్ట్ కమిటీ ధర్మకర్త శివ, తదితరుల పర్యవేక్షణలో కమిటీ సభ్యులు వంటావార్పు, బైక్ ర్యాలీ తదితర కార్యక్రమాలను నిర్వహించారు.
మున్సిపల్ జెఎసి 48 గంటల బంద్ సక్సెస్
విజయవాడ, సెప్టెంబర్ 12: కృష్ణాజిల్లా జెఎసి పిలుపు మేరకు జిల్లాలో చేపట్టిన 48 గంటల నిరవధిక బంద్‌ను పురస్కరించుకుని నగరపాలక సంస్థ జెఎసి ఆధ్వర్యంలో ఉద్యోగులు పూర్తి స్థాయిలో బంద్ పాటించి విజయవంతం చేశారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల అన్ని ముఖ్య ద్వారాలకు తాళాలు వేయించటంతో పాటుగా సర్కిల్ కార్యాలయాల్లో కూడా ఎటువంటి కార్యకలాపాలు సాగకుండా పూర్తి స్థాయిలో విధులను స్తంభింపచేశారు. నగరపాలక సంస్థ జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరంను యథావిథిగా కొనసాగించారు. నేటి రిలే దీక్షలలో డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) వరలక్ష్మి, అసిస్టెంట్ కమిషనర్ విజయలక్ష్మిలతో పాటుగా పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ సిబ్బంది, ఆఫీసు సబార్డినేటర్లు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని సమైక్య రాష్ట్రంగానే ఉంచాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో విఎంసి జెఎసి కన్వీనర్ డి ఈశ్వర్ ప్రతినిధులు ప్రకాష్‌సాగర్, నారాయణబాబు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.