Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యత సాధించే వరకు ఉద్యమమే

$
0
0

తెనాలి, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని తెలంగాణ ప్రాంత రాజకీయ నిరుద్యోగి కెసిఆర్ రగల్చిన చిచ్చుకు కేంద్రంలోని యుపిఎ అధినేత్రి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాలకు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనే ఆలోచనకు వచ్చారని, విభజన నిర్ణయం విరమించుకుని రాష్ట్ర సమైక్యతను చాటేవరకు ఉద్యమాన్ని విరమించేది లేదని విద్యుత్ ఉద్యోగుల ఉద్యమ జెఎసి నాయకులు ముక్తకంఠంతో పిలుపునిచ్చారు. 72 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విద్యుత్ ఉద్యోగుల జెఎసి గురువారం స్థానిక చెంచుపేటలోని విద్యుత్ డిఇ కార్యాలయం ఎదుట తెనాలి - గుంటూరు రహదారిపై బైఠాయించి విభజనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో డివిజన్ జెఎసి నాయకులు అర్మ్‌స్ట్రాంగ్ విభజన వల్ల విద్యుత్ రంగంలో ఎదుర్కొనే ఇబ్బందులను వివరించారు. డివిజన్‌లో విద్యుత్ శాఖ సిబ్బంది 349 మంది కాగా, 287 మంది సమ్మెలోకి రాగా, 51 మంది విధులలో ఉన్నారు. 51 మంది మెడికల్ లీవ్‌లో ఉన్నట్లు విద్యుత్ డిఇ జయకుమార్ ద్వారా అందిన సమాచారం. ఎడిఇ క్యాడర్ నుండి ఎఇలు, ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగులు పెద్ద సంఖ్యలో రాస్తారోకోలో పాల్గొని సమైక్యవాదాన్ని వినిపించారు.

విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో నిలిచిన కార్యకలాపాలు

మాచర్ల, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్రకు సంఘీభావంగా స్థానిక విద్యుత్ శాఖ జెఎసి నాయకులు గురువారం నుండి సమ్మెబాట పట్టారు. దీంతో స్థానిక డివిజన్ కార్యాలయంలోని వినియోగదారుల సేవా విభాగానికి తాళం వేశారు. అధికారులందరూ సమ్మెబాట పట్టడంతో ఎప్పుడు వినియోగదారులతో కళకళలాడే డివిజనల్ విద్యుత్ కార్యాలయం వినియోగదారులు లేక కళా విహీనంగా మారింది. ఉదయానే్న రోడ్డుపైకి చేరుకున్న విద్యుత్ జెఎసి నాయకులు సమైక్యాంధ్ర ప్లకార్డులు పట్టుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎడిఎ భాస్కరరావు ఆధ్వర్యంలో కార్మికులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ జెఎసి నాయకులు మాట్లాడుతూ అసెంబ్లీలో గాని, పార్లమెంటులో గాని రాష్ట్ర విభజన బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె బాట పడతారని హెచ్చరించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజా ప్రతినిధులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా మంగళగిరి బంద్ ప్రశాంతం
మంగళగిరి, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిర్వహించిన మంగళగిరి పట్టణ బంద్ ప్రశాంతంగా, సంపూర్ణంగా జరిగింది. ఒకవైపు బంద్, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమకారుల నిరసనలతో పట్టణం హోరెత్తింది. పట్టణంలో విద్యా, వ్యాపార సంస్థలు, బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థలు మూసివేశారు. ఉద్యోగులు పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఆర్‌టిసి బస్‌స్టేషన్ వద్ద వంటావార్పు నిర్వహించారు. డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రాజశేఖర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు సంకా బాలాజీగుప్తా తదితరులు పాల్గొన్నారు. సినిమా థియేటర్లలో ప్రదర్శనలు నిలిపి వేశారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గతనెల 13 నుంచి ఉద్యోగులు జరుపుతున్న నిరవధిక సమ్మె ఉధృతంలో భాగంగా ఉపాధ్యాయులు, ఇతర వర్తక, వాణిజ్య సంఘాలతో కలిసి ఎన్‌జిఓలు బంద్ జరిపారు. ఉద్యోగుల సంఘం నాయకులు మహమ్మద్ ఘని, మురళి, మధుకిరణ్, శ్రీనివాస్, సురేష్ తదితరులు వీధుల వెంట తిరుగుతూ సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ బంద్‌ను పర్యవేక్షించారు. తెరిచిన దుకాణాలను మూసివేయించారు. ఆర్‌టిసి సిబ్బంది కూడా గత నెలరోజులుగా సమ్మె జరుపుతున్నారు. బంద్‌లో ఆర్‌టిసి కార్మిక సంఘాల నాయకులు చిన్ని సత్యనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఆటోలు స్వల్పసంఖ్యలో నడిచాయి. శుక్రవారం ఉదయం వరకు 24 గంటల పాటు బంద్ జరుపుతున్నట్లు నాయకులు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు మిద్దెసెంటర్లో మానవహారంగా ఏర్పడి సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. శేషగిరి, రత్నాకర్, భాను తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రిలే దీక్షలు

తెనాలి, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర సాధనే లక్ష్యంగా ఉద్యోగ సంఘాల ఉద్యమ జెఎసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న సామూహిక రిలే నిరాహార దీక్షలు గురువారానికి 17వ రోజుకు చేరుకున్నాయి. మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులు సామూహిక రిలే దీక్షలకు ఉపక్రమించగా, ఉద్యమ జెఎసి కన్వీనర్ ఏటుకూరి మధుబాబు, ఆర్‌ఒ విజయసారథి, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు దీక్షలో ఉన్న వారికి సంఘీభావం తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ఇరు ప్రాంతాల్లో అభివృద్ధికి అవసరమైన నిధులు కేంద్రం నుండి పుష్కలంగా రాబట్టుకోగలుగుతామని, చిన్న రాష్ట్రాల పట్ల చిన్నచూపు ఉంటుందన్న విషయం ప్రజలు గుర్తించారని అందుకే ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయని తెలుగుదేశం బిసి సంఘ నాయకుడు కావేటి యలమందరావు అన్నారు. గంగానమ్మపేటలోని మశీద్ సెంటర్‌లో తెలుగుదేశం ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు గురువారానికి 15వ రోజుకు చేరుకున్న క్రమంలో కృష్ణబలిజ సంఘ నాయకులు కావేటి యలమందరావు తమ బృందంతో దీక్షకు ఉపక్రమించారు.

సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థుల మానవహారం, ర్యాలీ

వినుకొండ, సెప్టెంబర్ 12: పట్టణంలోని 15వ వార్డు ఎంపిపి స్కూల్, తొమ్మిదో వార్డులోని ఎంపిపి స్కూల్, హనుమాన్‌నగర్, ధర్మపురి కాలనీ, సీతయ్యనగర్ ఎంపిపి పాఠశాలలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు సమైక్యాంధ్రకు మద్దతుగా గురువారం నిరసన ర్యాలీలు, మానవహారం నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే సమగ్రాభివృద్ధి చెందుతుందని విద్యార్థులు, ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని ప్రధానోపాధ్యాయుడు రామలింగేశ్వరరావు వివరించారు.

భారీ ఊరేగింపుగా వినాయక నిమజ్జనం
అమృతలూరు, సెప్టెంబర్ 12: వినాయక చవితిని పుసర్కరించుకుని ఏర్పాటు చేసిన గణనాథుని నిలువెత్తు విగ్రహాన్ని గురువారం సాయంత్రం భారీ ఊరేగింపుతో నిమజ్జనం చేశారు. అమృతలూరులోని శంకరగణేష్ యూత్ ఆధ్వర్యంలో యలవర్రు రోడ్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ఈ నెల 9 నుండి 12వరకు పరాశరం రత్నమాచార్యులు నిర్వహించిన పూజాది కార్యక్రమాల్లో చిలువోలులంక రామచంద్రరావు, దేవరకొండ సుబ్బారావు, వీరగంథం సుధీర్ దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం గణనాథుని నిమజ్జనం సందర్భంగా డప్పు వాయిధ్యాలు, భారీ ఊరేగింపుతో గ్రామోత్సవం నిర్వహించి నిజాంపట్నం తూర్పు కాలువలో నిమజ్జనం చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ వెంకటేశ్వరావు, ఎఎస్‌ఐలు రఘునాధరావు, సత్యనారాయణ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. పండగ సందర్భంగా నిర్వాహకులు గ్రామంలోని వీధులను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.

షర్మిల సమైక్య శంఖారావం స్ఫూర్తిదాయకం
బాపట్ల, సెప్టెంబర్ 12: వైఎస్‌ఆర్ సిపి ఆధ్వర్యంలో మహిళా నేత షర్మిల నేతృత్వంలో చేపట్టిన సమైక్య శంఖారావం స్ఫూర్తిదాయకంగా కొనసాగుతోందని, అడుగడుగునా షర్మిలకు బ్రహ్మరథం పడుతూ ప్రజలు ఆదరాభిమానాలు చూపడం హర్షణీయమని పార్టీ సమన్వయకర్త కోన రఘుపతి పేర్కొన్నారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రఘుపతి మాట్లాడుతూ వినుకొండ, రేపల్లెలో నిర్వహించిన సమైక్యశంఖారావం జనరంజకంగా, జయప్రదంగా జరగడం, బాపట్ల నియోజికవర్గంలోని చందోలు మీదుగా ఈ యాత్ర జరగడం సంతోషదాయకమన్నారు. షర్మిల బస్సుయాత్రకు ఘనంగా స్వాగతం పలకడానికి నియోజకవర్గం నలుమూలల నుండి హాజరైన పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్‌ఆర్ సిపి బాపట్ల పట్టణ కన్వీనర్ ధర్మారావు, మండల కన్వీనర్ గవిని కృష్ణమూర్తి, పివిపాలెం కన్వీనర్ హుస్సేన్, కర్లపాలెం కన్వీనర్ సీతారామిరెడ్డి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు.

ఘనంగా గణనాథుని నిమజ్జనం
నగరం, సెప్టెంబర్ 12: మండలంలోని గణనాధుని నిమజ్జన కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం మండలంలోని పూడివాడ, అద్దంకివారిపాలెం, నగరం గ్రామాల నుండి వినాయక విగ్రహాలను ట్రాక్టర్లపై ఊరేగింపుగా మేళతాళాలు, భజనలతో గ్రామోత్సవం నిర్వహిస్తూ, గులామ్‌లు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ కోలాహలంగా నిమజ్జనం చేసేందుకు రేపల్లె వద్ద కృష్ణా నది పెనుమూడికి వెళ్ళారు.

విద్యార్థులకు పండ్లు పంపిణీ
నరసరావుపేట, సెప్టెంబర్ 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను గురువారం స్థానిక లిటిల్‌హార్ట్స్ అనాధ శరణాలయంలో కేక్ కట్ చేసి చిన్నారుల మధ్య జరుపుకున్నారు. అనంతరం చిన్నారులకు పండ్లు పంపిణీ జేశారు. అనాథ పిల్లలు డాక్టర్ గోపిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ కన్వీనర్ హనీఫ్, షేక్ ఖాదర్‌బాషా, చాన్‌బాషా, అజ్మీల్, జాకీర్, అజీమ్‌జిలాని, చాంద్‌బాషా, కల్యాణ్, కరిముల్లా, నాగూర్, ఖాదర్‌మస్తాన్, ఇమామ్ బాషా తదితరులు పాల్గొన్నారు.

రగులుతున్న సమైక్యోద్యమం
గుంటూరు, సెప్టెంబర్ 12: రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. విభజన ప్రకటనను వెనక్కు తీసుకునే వరకూ వెనకంజ వేయబోమంటూ ఉద్యోగులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ రాజకీయ పక్షాలు, పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో 44 రోజులుగా ఆందోళనలు ఉద్ధృతమవుతున్నాయి. విభజన జరిగితే రాష్ట్రం అంధకారమవుతుందంటూ ఎన్జీవోలు నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. గురువారం సాయంత్రం విద్యుత్ ఉద్యోగుల 72 గంటల సమ్మెకు సంఘీభావంగా, సమైక్యాంధ్రను కోరుతూ ఉద్యోగులు స్థానిక కలెక్టరేట్ నుండి హిందూ కళాశాల సెంటర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ అధిక సంఖ్యలో ఉద్యోగులు కాగడాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్ర మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి ఉద్యమంలో భాగస్వాములై విభజన నిర్ణయాన్ని అడ్డుకోవాలని ఉద్యోగ జెఎసి జిల్లా అధ్యక్షుడు రామిరెడ్డి, పలువురు నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ఎదుట వ్యవసాయ, రవాణా, రిజిస్ట్రేషన్ శాఖలకు చెందిన ఉద్యోగులు సమైక్యాంధ్రను కాంక్షిస్తూ దీక్షలు నిర్వహించారు. రోడ్డుపై ఆటలాడి ఉద్యోగులు నిరసన తెలియజేశారు. తమకు న్యాయం దక్కేవరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేస్తూ, సమైక్యాంధ్ర వర్ధిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ జెఎసి నాయకుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ ఉదయం 10 గంటలకు సమైక్యాంధ్ర అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని, ఉద్యోగులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేబ్రోలు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రాష్ట్రాన్ని విభజిస్తే తమకు ఉద్యోగాలు కరవై తాము రోడ్డున పడటం ఖాయమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు అధిక సంఖ్యలో స్థానిక బిఆర్ స్టేడియం నుండి హిందూ కళాశాల సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధను కాంక్షిస్తూ ఆటలాడి నిరసన తెలియజేశారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమ పరిస్థితి ఇదేనంటూ రోడ్లు ఊడ్చి ఆందోళన వ్యక్తం చేశారు. విభజన జరిగితే విద్యార్థులకు అందుతున్న ఫీజు రీయింబర్సుమెంటు ఆగిపోయి వారి భవిష్యత్తు అంధకారంగా మారుతుందని కళాశాల ప్రిన్సిపాల్ హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సంగడిగుంటలోని చలమయ్య కళాశాల విద్యార్థులు సమైక్యాంధ్ర నినాదాలు చేస్తూ కళాశాల వద్ద నుండి హిందూ కాలేజి సెంటర్‌లోని అమరజీవి విగ్రహం వరకూ ర్యాలీ నిర్వహించి, మానవహారంగా ఏర్పడ్డారు. కబడ్డీ తదితర క్రీడలతో నిరసన తెలిపారు. సమైక్యాంధ్రను కోరుతూ ప్రభుత్వాసుపత్రి వైద్యులు కదంతొక్కారు. సమైక్యాంధ్రకు చెందిన పాలకులు, రాజకీయ నేతలు తమ ప్రయోజనాలను పక్కనబెట్టి, సామాన్యుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాజీనామాలు చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొని ఉద్ధృతం చేయాలని డిమాండ్ చేశారు. విభజన వల్ల రెండు ప్రాంతాల ప్రజలు పావులుగా మారుతున్నారని, అందుకు నిరసనగా చదరంగం ఆడారు. హిందూ కళాశాల సెంటర్‌లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షల్లో గురువారం పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. దీక్షలను ప్రారంభించిన పొలిటికల్ జెఎసి నాయకులు ఆతుకూరి ఆంజనేయులు, ప్రొఫెసర్ నరసింహారావు మాట్లాడుతూ కేంద్రం మెజార్టీ ప్రజల మనోభీష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న విభజన నిర్ణయాన్ని విరమించుకోకుంటే సీమాంధ్రుల సత్తా చాటుతామని హెచ్చరించారు. హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షలు 10వ రోజుకు చేరుకోగా, జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది, న్యాయవాద గమస్తాలు చేస్తున్న దీక్షలు కొనసాగుతున్నాయి. నగరంపాలెంలోని వైఎస్‌ఆర్ సిపి నాయకులు చేస్తున్న దీక్షలను ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ప్రారంభించారు.

పిడుగుల బీభత్సం
గుంటూరు/ నాదెండ్ల/ రొంపిచర్ల/ అచ్చంపేట, సెప్టెంబర్ 12: జిల్లాలో గురువారం పిడుగుల వర్షం కురిసిం ది. నాలుగు మండలాల పరిధి లో మొత్తం ఏడుగురు పిడుగు పాటుకు విగతజీవులు కాగా పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి తోడు గురువారం ఉరుములు మెరుపులు విజృంభించడంతో ప్రజలు భీతావహు లయ్యారు. ముఖ్యంగా పొలాలకు వెళ్లిన కూలీలు ఈ పిడుగుల దాడిలో చిక్కుకున్నారు. జిల్లాలో పిడుగుపాటుకు ఏడుగురు మృతి చెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రగాయాలపాలయ్యారు. ముప్పాళ్ల మండలంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, నాదెండ్ల, రొంపిచర్ల, అచ్చంపేట మండలాల్లో ఒక్కొక్కరు చొప్పున పిడుగుపాటుకు బలయ్యారు. జిల్లావ్యాప్తంగా ఉద యం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవగా పలుచోట్ల పిడుగులు పడ్డాయి. దీంతో ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెంకు చెందిన తేలుకుంట్ల వెంకటేశ్వర్లు (55), నార్నెపాడుకు చెందిన యార్లగడ్డ మంగాయమ్మ (44), బొల్లవరానికి చెందిన కె అర్జున్‌రెడ్డి (54), వ్యవసాయ పనుల నిమిత్తం కృష్ణా జిల్లా కురకల్లు గ్రామం నుంచి తురకపాలెంకు వచ్చిన బి సుధ (22) దుర్మరణం పాలయ్యారు. రొంపిచర్ల మండలం విప్పర్లలో షేక్ గరియావలి (40) పొలంలో పనిచేస్తూ పిడుగుమీదపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అలాగే నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో శ్రీనివాసరావుతో పాటు పలువురు కూలీలు పొలంలో వరినాట్లు వేస్తుండగా భారీ వర్షం కురవడంతో చింతచెట్టు కిందకు చేరారు. ఉరుములు, మెరుపులతో పెద్దశబ్దం చేస్తూ పిడుగు పడటంతో శ్రీనివాసరావు అనే రైతు మృతి చెందగా కూలీలు గాయాలపాలయ్యారు. అచ్చంపేట మండలం నిండుజర్లలో పొలంపనులకు వెళ్లిన కూలీలు వర్షంతో చెట్టును ఆశ్రయంచగా ఆ చెట్టుపై పిడుగుపడి యడ్లవల్లి సామ్రాజ్యం (52) అక్కడికక్కడే మృతి చెందగా మరో 12 మంది గాయపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా వున్నాయ. నాదెండ్ల మండలం సాతులూరులో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని సాతులూరులో గురువారం జరిగింది. మండలంలోని సాతులూరుకి చెందిన వీరగాధ శ్రీనివాసరావు(40) పొలం పనులకు వెళ్ళాడు. అదే సమయంలో భారీ వర్షంతోపాటు పిడుగు పడటంతో శ్రీనివాసరావు పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో అక్కడే ఉన్న బండారుపల్లి ధనలక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు ధనలక్ష్మిని నరసరావుపేటకు తరలించారు. మృతుడు శ్రీనివాసరావుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక రొంపిచర్ల మండలం విప్పర్లలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి చెందాడు. విప్పర్లకి చెందిన షేక్ పమిడిమర్రు దరియాసాహెబ్ (40) గురువారం మధ్యాహ్నం నారుమడిని పరిశీలించడానికి పొలానికి వెళ్ళాడు. ఆ సమయంలో భారీ వర్షంతోపాటు పిడుగు పడింది. అక్కడే ఉన్న దరియాసాహెబ్ పిడుగుపాటుకు మృతి చెందాడు. దరియాసాహెబ్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అచ్చంపేట మండల పరిధిలోని నిండుజర్ల గ్రామంలో యడ్లవల్లి సామ్రాజ్యం (52) మిరపనారు వేయడానికి 25 మంది సభ్యుల ముఠాతో కలిసి వెళ్లింది. కూలి పనుల్లో ఉండగా చిరుజల్లులు మొదలయ్యాయి. అయినా ముఠా సభ్యులు మిరపనారు వేసే పనిలో నిమగ్నమయ్యారు. కొంతసేపటికి ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం ఆరంభం కావడంతో చెట్లకిందకు వెళ్లి తలదాచుకున్నారు. ఈ సమయంలో వీరు నిలబడి ఉన్న చెట్టుపై పెద్దఎత్తున శబ్దం చేస్తూ పిడుగుపడింది. పిడుగుపాటుతో కూలి ముఠాలోని సామ్రాజ్యం అక్కడికక్కడే మృతి చెందగా, టి పద్మ, కె భూలక్ష్మి, శివపార్వతి, జి సుబ్బాయమ్మ, కె బ్రహ్మయ్య, టి వౌలాలి, రాజగోవిందు, నారాయణ, పోతురాజు, అంజమ్మ, కోటేశ్వరరావు, వీర్లంకమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. వీరందరినీ సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు ప్రత్యక్షసాక్షులు వివరించారు. గ్రామ విఆర్‌ఒ ఎస్ కోటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అచ్చంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతిచెందిన సామ్రాజ్యంకు భర్త సత్యనారాయణ, ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

విభజన పాపం రాజకీయ పార్టీలదే
నాగార్జున యూనివర్సిటీ, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజన నిర్ణయంలో అన్ని పార్టీలు సమానమైన పాత్రనే పోషించాయని, తెలుగు ప్రజలను ముక్కలు చేయాలన్న కుట్రలో అన్ని పార్టీలూ పాత్రధారులేనని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమైక్యాంధ్ర జెఎసి స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఆచార్య జెడ్ విష్ణువర్థన్ అన్నారు. వర్సిటీ విద్యార్థి, ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగం గా గురువారం వర్సిటీలోని ఆర్కిటెక్చర్ కళాశాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు. తొలుత వర్సిటీలోని ఆర్కిటెక్చర్ కళాశాల నుండి ప్రదర్శనగా బయలుదేరిన విద్యార్థులు వర్సిటీలో భారీర్యాలీ నిర్వహించారు. అనంతరం వర్సిటీ ప్రధానద్వారం వద్ద ఐదవ నెంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. తీన్‌మార్ డప్పులతో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించి, సమైక్యగీతాలకు జాతీయ రహదారిపై నృత్యాలు చేశా రు. అనంతరం వర్సిటీ ప్రధానద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో రిలే నిరాహరదీక్షలు చేపట్టారు. రాస్తారోకో చేస్తున్న విద్యార్థులనుద్దేశించి విష్ణువర్థన్ మాట్లాడుతూ రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాలపై ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, విభజనపై వేర్పాటువాదులు చేస్తున్న ప్రచారంలో వాస్తవాలు లేవని స్పష్టం చేశారు. కేవలం కాంగ్రెస్ పార్టీ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని, రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ రాష్ట్ర విభజనను అడ్డుకోడానికి ఉద్యమించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నూటా అధ్యక్షుడు ఆచార్య పి వరప్రసాద్‌మూర్తి, సిఇ డి సత్యనారాయణ, డాక్టర్ లింగరాజు, జెఎసి నాయకులు కనకరాజు, తమలపాకుల విజయశేఖర్, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నేడు సీమాంధ్ర వర్సిటీల జెఎసి సమావేశం
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని వికాసభవన్‌లో శుక్రవారం సీమాంధ్ర వర్సిటీల జెఎసిల కార్యవర్గ సమావేశం జరుగతుందని సీమాంధ్ర వర్సిటీల జెఎసి కార్యదర్శి డాక్టర్ జి రోశయ్య తెలిపారు. సీమాంధ్రలోని 14 వర్సిటీల అధ్యాపక జెఎసి ప్రతినిధులు పాల్గొంటారని, రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహలపై ఈ సమావేశంలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వినుకొండ, సెప్టెంబర్ 12: సఫారీ వాహనం బోల్తాపడిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన వినుకొండ రూరల్ పరిధిలోని విఠంరాజుపల్లి శివారు బోడిచెంబువారిపాలెం వద్ద గురువారం తెల్లవారు ఝామున జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం, చాకిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన కొండా నాగార్జునరెడ్డి (25), గుంటూరు రూరల్ మండలం జొన్నలగడ్డకి చెందిన వంగా అరుణాధరరెడ్డి (28), జొన్నలగడ్డకి చెందిన కొండా కోటిరెడ్డి, వంగా అమర్‌నాధ్‌రెడ్డి శ్రీశైలం వెళ్ళేందుకు సఫారి వాహనంలో బయలుదేరారు. తెల్లవారుఝామున నాలుగు గంటల ప్రాంతంలో బోడిచెంబునివారిపాలెం సమీపంలోని గుంటూరు, కర్నూలు వెళ్ళే జాతీయ రహదారిపై ఉన్న గుంటను తప్పించబోయిన సఫారి వాహనం బోల్తా పడింది. సుమారు వంద మీటర్ల వరకు వాహనం పల్టీలు కొడుతూ పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో నాగార్జునరెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, వంగా అరుణాధరరెడ్డిని గుంటూరుకు మెరుగైన చికిత్స కోసం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అదే వాహనంలో ప్రయాణిస్తున్న కొండా కోటిరెడ్డి, వంగా అమర్‌నాధ్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 వాహనం క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్సానంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. నాగార్జునరెడ్డి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు నాగార్జునరెడ్డికి ఏడాది క్రితమే వివాహం జరిగింది. అమర్‌నాధ్‌రెడ్డికి మూడేళ్ళ క్రితం వివాహమైంది. ఈపూరు ఎస్‌ఐ నారాయణస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.

అమరావతిలో భారీ వర్షం
అమరావతి, సెప్టెంబర్ 12: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు రోజులుగా అమరావతి, పరిసర గ్రామాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో పిడుగులు పడతాయని ప్రజలు ఆందోళన చెందారు. భారీవర్షంతో అమరావతి మెయిన్ బజారు తటాకంలా మారి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అలాగే అమరావతిలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో అడుగు తీసి బయటపెట్టలేని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బండచేను కాలనీ, కాలచక్రపాలెం, జైల్‌సింగ్ కాలనీ, చెంచు కాలనీలు వర్షపునీటితో జలమయమయ్యాయి. వినాయకచవితి సందర్భంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను అమరావతి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేయడానికి వచ్చే భక్తులు భారీవర్షంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అమరావతి- క్రోసూరు రహదారిపై ముత్తాయపాలెం వద్ద గల వాగు పొంగిపొరలి ప్రవహించడంతో సుమారు 4 గంటల పాటు రాకపోకలు స్తంభించాయి. అలాగే అమరావతి- గుంటూరు రహదారిలో కూడా నరుకుళ్లపాడు, యండ్రాయి వద్ద గల వాగులు కూడా పొంగిపొర్లుతున్నాయి.

వినాయకుడి మండపం వద్ద
విద్యుత్ తీగె తగిలి విద్యార్థి మృతి

గురజాల, సెప్టెంబర్ 12: విద్యుదాఘాతానికి గురై విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలో గురువారం జరిగింది. సంఘటన వివరాల ప్రకారం పట్టణంలోని లక్ష్మీ టాకీస్ సెంటర్‌లో పెట్రోల్ బంకు వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి మండ పం వద్ద అదే ప్రాంతానికి చెందిన చీతిరాల గోపీకృష్ణ (12) ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ తీగె తగిలి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. గోపీకృష్ణ పట్టణంలోని అక్షర స్కూల్‌లో ఆరో తరగతి చదువుతున్నాడు. పోస్ట్‌మార్టం నిమిత్తం గోపీకృష్ణ మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గురజాల సిఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16 నుంచి నృసింహుని పవిత్రోత్సవాలు
మంగళగిరి, సెప్టెంబర్ 12: స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో ఈనెల 16వ తేదీనుంచి నాలుగు రోజుల పాటు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఇఓ నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి, ఉపప్రధాన అర్చకులు నల్లూరి శ్రీరామచంద్ర భట్టాచార్యులు వెల్లడించారు. గురువారం ఆలయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ అత్యంత శోభాయమానంగా ప్రకాశించే స్వామి పానకాల స్వామి అని, దిగువ సన్నిధిలో భీష్ముడు, ధర్మరాజులాంటి ఎందరో అర్చన చేసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి మూలవిరాట్టుకు పవిత్రోత్సవాలు గడిచిన నాలుగేళ్లుగా వార్షికంగా భాద్రపద మాసంలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయంలో తెలిసీ తెలియక జరిగే లోపాలను సరిదిద్దేందుకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. 16వ తేదీ సాయంత్రం విష్వక్సేన పూజ, అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభ మవుతాయని, 17వ తేదీన వాస్తుహోమం, అగ్నిమధనం, పంచాగ్ని ప్రణయణము, పంచగ్రవ్య ప్రాసన, ప్రోక్షణ, యుక్తహోమాలు, దిక్సూత్త హోమము, నవగ్రహహోమం మొదలైన కార్యక్రమాలు, 18వ తేదీన ఈంకారాది, అష్టాశీతి, పారమాత్మక తదితర హోమాలు, 19న మూలవరులకు స్నపన, పవిత్ర విసర్జన, పూర్ణాహుతి తదితర పూజాదికాలు, గ్రామోత్సవం జరుగుతాయని, భక్తులు పవిత్రోత్సవాల్లో పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇఓ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

రాష్ట్ర సంక్షోభానికి కాంగ్రెస్, వైఎస్‌ఆర్ సిపిదే బాధ్యత
గుంటూరు , సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజనకు వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుడితే కాంగ్రెస్ పార్టీ ఆజ్యం పోసిందని, తత్ఫలితంగా రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలే బాధ్యత వహించాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో జిల్లా ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు నిరసనగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలను తెలుగుదేశం శ్రేణులు ముమ్మరం చేయాలన్నారు. జిల్లా, నగర అనుబంధ విభాగాల వారితో కలిసి ప్రతిరోజూ వినూత్నరీతిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో విలీనం కాబోతున్న తరుణంలో వచ్చే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు పార్టీ నేతలు సిద్ధంగా ఉండాలని పుల్లారావు తెలిపారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు, ఉద్యమాలను కాంగ్రెస్ పార్టీ చిన్నచూపు చూస్తోందని, ఈ ప్రాంత ప్రజానీకాన్ని రెచ్చగొడుతూ కేంద్రప్రభుత్వం రోజుకో ప్రకటన చేయడం విచారకరమన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు జెఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకునే ముందు కొత్త రాష్ట్రం ఏర్పాటు క్రమంలో వచ్చే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు ముందుగా పరిశీలించకుండా హడావుడిగా తీసుకున్న చర్య వల్లే ఈ సంక్షోభం ఏర్పడిందన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సమాచార కమిషనర్లను ఇష్టానుసారంగా రాష్ట్రప్రభుత్వం నియమించిందని, గతంలో రాష్ట్ర గవర్నర్ సమాచార కమిషనర్ల నియామకాన్ని వ్యతిరేకించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం మొండిగా అనర్హులకు పట్టం కట్టబెట్టిందన్నారు. హైకోర్టు వీరి నియామకాలు చెల్లవంటూ ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జివిఎస్ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీ్ధర్, నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, పార్టీ నాయకులు చీరాల గోవర్ధనరెడ్డి, అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, కందుకూరి వీరయ్య, పోతినేని శ్రీనివాసరావు, చుక్కా ఏసురత్నం, ముమ్మనేని వెంకట సుబ్బయ్య, యాగంటి దుర్గారావు, దాసరి రాజామాస్టారు, బోనబోయిన శ్రీనివాసయాదవ్, మన్నవ సుబ్బారావు, ఇక్కుర్తి సాంబశివరావు, కోవెలమూడి నాని తదితరులు పాల్గొన్నారు.

నూతన శకానికి నాందిపలికిన వివేకానంద చికాగో ప్రసంగం
గుంటూరు , సెప్టెంబర్ 12: సనాతన ధర్మ చరిత్రలో నూతన శకానికి స్వామి వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగం నాంది పలికిందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గురువారం స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద చికాగోలో చేసిన ప్రసంగంపై విశే్లషణ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యావేత్త ఆర్‌వి సింగరయ్య మాట్లాడుతూ చికాగో సభలో వివేకానంద చేసిన ప్రసంగం భారతదేశ గౌరవాన్ని ఇనుమడింప జేయడమే కాక సనాతన ధర్మం, సాంప్రదాయాలు, సర్వమత సామరస్యాన్ని చాటిచెప్పిందన్నారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ 1983 సెప్టెంబర్ నెలలో అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళన సభ ప్రపంచ చరిత్రలో ఒక గొప్ప సంఘటన అని కొనియాడారు. సనాతన ధర్మాన్ని పశ్చిమ ఖండానికే కాక ప్రపంచమంతటికీ చాటిచెప్పిన ఘనత వివేకానందుడికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత హెచ్‌ఎం చంద్రయ్య, జయకుమార్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు గల్లంతు
చిలకలూరిపేట, సెప్టెంబర్ 12: వినాయక నిమజ్జనానికి వెళ్లి వాగులో పడి ఇద్దరు గల్లంతైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. పట్టణంలోని మదర్‌థెరిస్సా కాలనీకి చెందిన కొండెపాటి బాబు (32), ఎస్‌కె వెంకటేశ్వర్లు (45) గణేష్ ఊరేగింపులో భాగంగా ఓలేరు వాగు వద్దకు చేరుకుని నిమజ జనం అనంతరం వాగులో పడిపోయా రు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

రాష్ట్ర విభజన వల్ల ఇరు ప్రాంతాల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles