Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఖజానాకు ‘షాక్’

$
0
0

శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ ఆపరేషన్ సర్కిల్, శ్రీకాకుళం జిల్లా పరిధిలో అన్నీ రెవెన్యూ కార్యాలయాలకు విద్యుత్‌శాఖ జెఏసీ తాళాలు వేసారు. దీంతో తొలిరోజే రాజాం, పాలకొండ, శ్రీకాకుళం, టెక్కలి, పలాస ఇఆర్‌వో కేంద్రాల నుంచి రూ.1.15 కోట్ల మేర వినియోగదారుల బిల్లుల వసూళ్లు నిలిచిపోయాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎపిఇపిడిసిఎల్ ఉద్యోగులు బుధవారం అర్థరాత్రి నుంచి 72 గంటల సమ్మె ప్రకటనతో ప్రభుత్వ ఖజానాకు షాక్ తగిలింది. సిబ్బంది సమ్మెకు దిగీదిగగానే ఫ్యూజ్‌కాల్ సెంటర్‌లో తొలిరోజు సాయంత్రానికి జిల్లా అంతటా 2,234 మంది వినియోగదారులు విద్యుత్ పునరుద్ధరణకు ఫిర్యాదులు చేసినా, సంబంధిత సిబ్బంది సమ్మెలో ఉన్నారన్న సమాధానమే వినిపిస్తుంది. జిల్లాలో మొత్తం 7,71,685 విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో గృహ విద్యుత్ కనెక్షన్లు 6,76,155, వాణిజ్యపరమైన కనెక్షన్లు 51,170 ఉన్నాయి. ప్రతీ రోజు జిల్లాలో ఐదు ఇఆర్వో కేంద్రాల నుంచి గృహ, వాణిజ్యపరమైన విద్యుత్ బిల్లులను సగటున రోజుకు 72 లక్షల రూపాయలు వసూళ్లు చేస్తుండగా, పరిశ్రమల నుంచి రోజుకు సగటున 84 లక్షల రూపాయలు వసూళ్లు జరుగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నిరవధికంగా సమ్మె చేయాలని విద్యుత్ ఉద్యోగులు తొలుత నిర్ణయించినా, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమ్మెను 72 గంటలకు కుదించిన విషయం తెలిసిందే. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగి 12గంటలు కూడా ముగియకముందే విద్యుత్ వినియోగదారుల నుంచి వసూళ్లు చేయాల్సిన 1.15 కోట్ల రూపాయలు బిల్లులు నిలిపోయాయి. అంతేకాకుండా వరుసగా శుక్ర, శనివారాల్లో కూడా ఇంతకంటే రెట్టింపు బిల్లులు చెల్లింపులు జరిగే అవకాశం ఉందని, వినియోగదారులు ఆలస్యపు రుసుముతో లేకుండా చెల్లించేందుకు ఈ నెల 15వ తేదీ గడువు కావడంతో మరింత ఎక్కువ బిల్లులు వసూళ్లు ఉంటాయని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. 72 గంటల విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల సర్కార్‌కు సుమారు 5.5 కోట్ల రూపాయలు బిల్లుల వసూళ్లు నిలిచిపోయే అవకాశం ఉంటోందని వారి అంచనా.
శ్రీకాకుళం, టెక్కలి డివిజన్లలో ఎస్‌ఈ, డీఈఈలు, ఏడీలు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు 136 మంది వరకూ ఉన్నారు. ఆఫీస్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది 714 మంది ఉన్నారు. వీరిలో ఎస్‌ఈ మినహా మిగిలినవారంతా సమ్మెలో పాల్గొన్నారు. దీనివల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతే సిబ్బంది ఎటువంటి చర్యలకు దిగరు. జిల్లాలో 11 కాల్ సెంటర్లు పూర్తిగా మూగబోయాయి. సాగునీరు, ఆసుపత్రులు మినహా మిగిలిన విద్యుత్ సేవలన్నింటినీ నిలిపేస్తున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జెఎసీ ఇప్పటికీ వెల్లడించింది. నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి డిప్యూటీ ఇంజనీర్ల వరకూ అంతా సమ్మెలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ శాఖ ఇచ్చిన సీయుజీ సిమ్ కార్డులను సైతం ఎస్‌ఈకి అందజేసారు. కనీసం మొబైల్ కాల్‌ను కూడా స్వీకరించబోమన్న సంకేతాన్ని ఇచ్చేందుకు ఎపిఇపిడిసిఎల్ సరఫరా చేసే ఎమర్జన్సీ సెట్‌లను కూడా మూగబోయేలా బ్యాటరీ ఛార్జింగ్ కట్ చేసారు. సిబ్బంది సమ్మెకు దిగుతున్న నేపథ్యంలో కార్పొరేట్ కార్యాలయాలు, పరిశ్రమల నుంచి వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమని ఎస్‌ఈ శ్రీనివాసమూర్తికి నోటీసులో పేర్కొన్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఎసీ చైర్మన్ ఎం.వి.గోపాలరావు ‘ఆంధ్రభూమి’కి చెప్పారు. అలాగే సి.ఎం.డీకి కూడా సుస్పష్టం చేసామన్నారు. ముఖ్యమంత్రిపై గౌరవంతోనే 72 గంటలకు సమ్మె కుదించడమైందని, పార్లమెంటు, అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణం నోటీసులు ఇవ్వకుండానే విద్యుత్ ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగుతారని హెచ్చరించారు.

నేడు సమైక్య చైతన్యయాత్ర
పాతపట్నం, సెప్టెంబర్ 12: సమైక్యాంధ్ర పరిరక్షణకు సమైక్యవాదుల్లో మరింత చైతన్యాన్ని నింపేందుకు శుక్రవారం నిర్వహించనున్న సమైక్య చైతన్యయాత్రను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శత్రుచర్ల విజయరామరాజు పిలుపునిచ్చారు. ఆయన గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో పాతపట్నం, పాలకొండ, నాగూరు, బొబ్బిలి, పార్వతీపురం నియోజకవర్గాలను కలుపుకొంటూ సుమారు పదివేలకుపైగా బైక్‌ల ర్యాలీని జరుపుతున్నామన్నారు. పాతపట్నంలో ఉదయం 7.30 గంటలకు ప్రారంభమయ్యే బైక్ ర్యాలీ సాయంత్రానికి పార్వతీపురం చేరుకుంటుందన్నారు. 106 కిలోమీటర్ల మేర ఈ యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. సమైక్య నినాదాన్ని ఢిల్లీకి వినిపించేలా ర్యాలీని చేపడతామని చెప్పారు. లక్షలాది మంది ఉద్యోగులకు మద్దతుగా ఈ ర్యాలీని జరుపుతున్నామని, ప్రజల అభిమతం మేరకు తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి అందించామన్నారు. కార్యక్రమంలో మెళియాపుట్టి మాజీ ఎం.పి.పి సలాన మోహనరావు, పాతపట్నం, కొత్తూరు ఎఎంసి చైర్మన్‌లు లింగాల జనార్ధనరావు, జి.చెల్లంనాయుడు, మాజీ జెడ్పీటిసి ఎస్.తేజేశ్వరరావు, చీకటి పద్మరాజు తదితరులు పాల్గొన్నారు.

ఉవ్వెత్తున ఉద్యమ పంథా
ఎన్జీవోల సమ్మెకు నెల పూర్తి
శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఎపి ఎన్జీఒలు చేపట్టిన సమ్మె గురువారం నాటికి నెలరోజులకు చేరుకుంది. సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. రోజుకో విధంగా వినూత్న నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన ప్రకటనను విరమించుకునే వరకూ తమ ఉద్యమానికి ఊపిరిపోస్తామని ముందువరుసలో నిల్చొంటున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వినాయక ప్రతిమలకు సమైక్యవాదులు వినతిపత్రాలు అందిస్తున్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు సమైక్యాంధ్రను కోరుకుంటూ 72 గంటల సమ్మెకు దిగారు. జిల్లా కేంద్రంలో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు రోడ్లు ఊడ్చి నిరసన వ్యక్తంచేశారు. సెయింట్ పాల్స్ పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించి, రోడ్డుపై బైటాయించి పరీక్షలను రాసి నిరసన తెలిపారు. మున్సిపల్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జెడ్పీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వౌన ప్రదర్శన నిర్వహించారు. అలాగే ఆర్.అండ్.బి ఉద్యోగులు నోటికి నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తంచేశారు. నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో డేఅండ్ నైట్ నుంచి ఏడురోడ్ల కూడలి మీదుగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రిమ్స్ జేఏసి ఆధ్వర్యంలో ఆడిటోరియంలో సమైక్యాంధ్రపై మేథోమదన సదస్సును నిర్వహించి, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయమే రాష్ట్ర విభజనకు కారణమైందని ధ్వజమెత్తారు. అదేవిధంగా సమైక్యాంధ్రకు మద్దతుగా పాలిటెక్నిక్ అధ్యాపకులు, న్యాయవాదులు, విద్యుత్, పశుసంవర్ధక శాఖ, రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్, ఆర్.అండ్.బి, విశ్రాంత ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీక్షలను కొనసాగిస్తున్నారు. నరసన్నపేట మండలకేంద్రం వద్ద జాతీయ రహదారిపై డిగ్రీ కళాశాల విద్యార్థులు రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తంచేశారు. సుమారు రెండు గంటలపాటు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అదేవిధంగా రిలే నిరాహార దీక్ష శిబిరంలో విద్యుత్ ఉద్యోగులు పాల్గొని సంఘీభావం తెలిపారు. జలుమూరు మండలం చల్లవానిపేటలో దీక్షాశిబిరం కొనసాగిస్తున్నారు. సారవకోటలో వినాయకుని ప్రతిమలకు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వినతిపత్రం అందించారు. ఉద్యోగులు ఒంటికాలితో దీక్షలకు దిగారు. సమైక్యవాదులు రహదారిపై బంగురుకుంటూ నడిచి పీకలతో నిరసన వ్యక్తంచేశారు. లావేరులో సమైక్యాంధ్రపై ప్రజాఅవగాహన సదస్సులను ప్రారంభించారు. ఎచ్చెర్లలో చేపడుతున్న దీక్షాశిబిరంలో మహిళా ఉపాధ్యాయులు పాల్గొని మద్దతు తెలిపారు. జి.సిగడాంలో సమైక్యాంధ్ర జేఏసి ఆధ్వర్యంలో ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. పొందూరు, గార, ఆమదాలవలస తదితర ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. పలాసలో ఆర్టీసి ఉద్యోగులు ర్యాలీ, మానవహారం చేపట్టి సమైక్య ఉద్యమానికి మరింత ఊతమందించారు. మందస, ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో దీక్షలు, నిరసనలు కొనసాగుతున్నాయి.

చిమ్మచీకట్లు
* 56 పంచాయతీలకు విద్యుత్ కట్
శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టి 24 గంటలకు ముందే జిల్లాలో 56 పంచాయతీలకు ‘చీకటి’దెబ్బ తగిలింది. విద్యుత్ సబ్‌స్టేషన్ల వద్ద ఏర్పడిన సాంకేతిక లోపాలతో లావేరు, భామిని, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాలకు గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శ్రీకాకుళం-2 సబ్‌స్టేషన్ పరిధిలో ఓవర్‌లోడ్ అనే సమస్యను తెరమీదకు తీసుకువచ్చి విద్యుత్ ఉద్యోగులు శ్రీకాకుళం పట్టణంలో కొన్ని ముఖ్యమైన వీధులతోపాటు, శివారు కాలనీలకు కరెంటు లేకుండా చేసారు. అలాగే, లావేరు మండలంలో అదపాక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో తలెత్తిన సాంకేతిక లోపంలో సబ్‌స్టేషన్ పరిధిలో 20 గ్రామాలకు గురువారం ఉదయం పదిన్నర గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సిబ్బంది సమ్మె కారణంగా సాంకేతిక లోపాలు పరిశీలించే నాథుడు లేక గోవిందపురం, పెదకొత్తకోట, గుర్రాలపాలెం, పాతకుంకాం, కొత్తకుంకాం, కొత్తకోట, అదపాక పంచాయతీ పరిధిలో 20 గ్రామ ప్రజలు విద్యుత్ సమస్యలతో సతమత మవుతున్నారు. వినియోగదారులు సబ్‌స్టేషన్‌కు సమాచారం కోసం ఫోన్ చేసినప్పటికీ స్పందించేందుకు సిబ్బంది అందుబాటులో లేరు. చిలకపాలేం సబ్‌స్టేషన్ నుంచి సరఫరా కావల్సిన విద్యుత్ అంతరాయం కలగడంతో లావేరు మండలంలో సుమారు 14 పంచాయతీలు అంధకారంలో ఉన్నాయి. ఇకపోతే, ఏజెన్సీ ప్రాంతమైన భామిని మండలం కూడా చీకటిలో ఉంది. 22 పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొత్తూరు 33 కె.వి.సబ్‌స్టేషన్ నుంచి భామిని 11 కె.వి. సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా కావల్సివుండగా, మార్గమధ్యంలో హైటెన్షన్ వైర్లు తెగిపడిపోవడంతో భామిని మండలంలో 22 పంచాయతీలకు విద్యుత్ లేకుండాపోయింది.
ఇదిలా ఉండగా, కేవలం గ్రామాలను చీకటిలో పెట్టి సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు వ్యూహరచన చేసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె తొలిరోజే సక్సెస్ అయ్యిందని చెప్పాలి. కాని - విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగించే సాంకేతిక లోపాలను విద్యుత్ ఉద్యోగులు చాకచక్యంగా అమలు చేయడం వల్ల సమ్మె ప్రభావం సర్కార్‌కు చేరుతుందోలేదోగాని, భామిని మండలంలో 6 మంచినీటి రక్షిత పథకాలు పనిచేయకుండాపోయాయి. 22 పంచాయతీలకు తాగునీటి సమస్య మరికొద్ది గంటలో జటిలమయ్యే ప్రమాదం ఉంది. అలాగే, లావేరు మండలంలో 20 వ్యవసాయ బోరుబావులకు నీరులేక వ్యవసాయ పనులు నిలిచిపోయే అవకాశం ఉంది. కేవలం గ్రామాలను అంధకారం చేయడమే సమైక్య ఉద్యమానికి మరింత ఊతం అనుకున్న విద్యుత్ ఉద్యోగులు పరోక్షంగా తాగు, సాగునీటి సమస్యను కూడా తీవ్రత చేస్తున్నారు.

విద్యుత్ సమస్యా.. అయితే 9440812386 కాల్ చేయండి
విద్యుత్ సమస్య నెలకొందా.. ఎక్కడైనా తీగెలు తెగినా.. ట్రాన్స్‌ఫార్మర్ నుంచి మంటలు రేగుతు న్నాయా.. వెంటనే 9440812386 నెంబరుకు కాల్ చేయాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసమూర్తి కోరుతున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటు న్నామని చెప్పారు. జిల్లాలో ఉన్న 84 సబ్‌స్టేషన్లలో ఒక్కో సబ్‌స్టేషన్‌కు ముగ్గురేసి సిబ్బందిని నియమించామని, వీరు నిర్వాహణ పనులు చేపడతారని ఆంధ్రభూమికి తెలిపారు.

చరిత్ర గుణపాఠం నేర్పుతుంది
* విభజన తొందరపాటు చర్య * స్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమం* మేథోమదన సదస్సులో వక్తలు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: సమాజంలో చరిత్ర తెలుసుకోపోతే, రాబోవు కాలంలో గుణపాఠం తప్పదని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ్ అన్నారు. గురువారం స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో నిర్వహించిన సమైక్యాంధ్ర మేథోమదన సదస్సులో ఆయన ముఖ్యవక్తగా మాట్లాడారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాసిన చరిత్ర సూచనలు ఉటంకించారు. రాష్ట్ర విభజన యుపిఎ ప్రభుత్వ తొందరపాటు చర్యగా అభివర్ణించారు. దీంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. ప్రజల మనోభావాలను వాణి రూపంలో వినిపించాల్సిన ప్రజాప్రతినిధులు అధిష్టాన నిర్ణయం అంటూ జై కొట్టడం దౌర్భాగ్యకరమన్నారు. . ఒకవేళ సమైక్యాంధ్ర సాధించకపోతే తదనుగుణ పరిష్కార మార్గాలు సమైక్యవాదులు సూచించగలగాలని కోరారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్శిటీ ఆచార్యులు గుంట తులసీరావు మాట్లాడుతూ అభివృద్ధిలో వెనుకబడిన వారు విభజన కోరడం పరిపాటని, అయితే ఇందుకు భిన్నంగా అభివృద్ధి సాధించిన వారు వెనుకబడిన వారినుండి విడిపోవాలని కోరడం అన్యాయమన్నారు. ఏ రాష్ట్ర రాజథాని అయినా అభివృద్ధి సాధించడం గొప్పేమీ కాదని, హైదరాబాద్ దేశ రాజధానికి ధీటుగా అభివృద్ధి సాధించిందన్నారు. దానిని వదులుకోవడానికి సీమాంధ్రులు సిద్ధంగా లేరన్నారు. హిందీ రాష్ట్రాలు ఐదు ఉండగా తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేంటని ప్రశ్నిస్తున్న నాయకులు హిందీ అన్నది జాతీయ భాష అని, ప్రాంతీయ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైనా రెండు ఉన్నాయేమో చెప్పాలని ప్రశ్నించారు. జెఎసి చైర్మెన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం రాజకీయ ప్రయోజనమని, కుల, మత, వర్గ భేదాలు లేని స్వచ్ఛంద ఉద్యమం సమైక్యాంధ్రఉద్యమమన్నారు. . స్వాతంత్య్రానంతరం ఏకైక లక్ష్యంతో వచ్చిన అంతటి ఉద్యమంగా సమైక్య ఉద్యమం నిలుస్తుందని పేర్కొన్నారు. సదస్సులో డాక్టర్ ఆర్.అరవింద్, డాక్టర్ దేవి మాధవి, జ్యోతి సరళ, ప్రసన్నకుమార్, బి.అప్పలనాయుడు, రవిమోహన్, గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబు చరిత్రహీనుడు
* వైకాపా నేత తమ్మినేని విమర్శ
ఆమదాలవలస, సెప్టెంబర్ 12: ఐఎన్‌జి భూములు అవినీతి నుండి బయటపడేందుకు సోనియాగాంధీ, చిదంబరంతో లాలూచీపడి రాష్ట్ర విభజన కోసం అనుకూలంగా లేఖలు అందించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దేశ రాజకీయాల్లో చరిత్రహీనుడిగా నిలిచిపోయారని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం విమర్శించారు. రాజధానిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థ్ధం పుచ్చుకున్న తొలిసారిగా జిల్లాకు వచ్చిన ఆయనకు ఇక్కడి రైల్వేస్టేషన్ వద్ద ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీపై విమర్శలు సంధించారు. టిడిపికి నైతిక విలువలు సభ్యత, సంస్కారం ఉంటే తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార వ్యామోహం కోసం తెలుగుదేశం పార్టీ నేత ఏం మాట్లాడుతున్నారో ప్రజలకే అర్ధం కావడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌తో కుమ్మక్కైతే జగన్ జైల్‌లో ఉండాల్సిన పనిలేదని, పార్టీ కొన్ని లక్ష్యాలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉందని అన్నారు. టీడీపీలో తనకు మోసం జరుగుతుందని గ్రహించి జగన్ పిలుపు, అభిమానులు ఒత్తిడి మేరకు తాను వైఎస్సార్‌సీపీలో చేరానని స్పష్టంచేసారు. జిల్లాలో పది శాసనసభ స్థానాలు, శ్రీకాకుళంతో పాటు జిల్లాకు ఆనుకుని ఉన్న విజయనగరం, అరకు పార్లమెంట్ స్థానాలు గెలిపించి జగన్‌కు కానుకగా అందిస్తానని అన్నారు. ఈయన వెంట వైఎస్సార్‌సీపీ నేతలు హనుమంతు కిరణ్‌కుమార్, వరుదు కల్యాణి, అంధవరపు సూరిబాబు, మార్పు ధర్మారావు, కూన మంగమ్మ, పైడి కృష్ణప్రసాద్, పి.ఎం.జె.బాబు పాల్గొన్నారు.

తెలుగుజాతి ఆశాజ్యోతి ఎన్టీఆర్
* రామ్మోహన్‌నాయుడు
శ్రీకాకుళం, సెప్టెంబర్ 12: తెలుగుజాతి ఆశాజ్యోతి దివంగత ఎన్టీ రామారావు అని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహననాయుడు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలు గురువారం రెండో రోజు ఆయన ప్రారంభించారు. తొలుత దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుజాతి గౌరవం, తెలుగు గొప్పదనం కాపాడినది అన్న ఎన్టీ ఆర్ అంటూ కొనియాడారు. తెలుగు జాతి ఐక్యత తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ఖ్యాతి ఇనుమడించిందని, మరల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంక్షేమానికి పార్టీ అధికారంలోకి రావాలన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి, పట్టణ అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణం, గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.

* విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ఇఆర్‌వో కేంద్రాలకు తాళాలు * తొలిరోజు నిలిచిపోయిన రూ. 1.15 కోట్ల బిల్లులు * పనిచేయని కాల్‌సెంటర్లు
english title: 
shock

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>