మహబూబ్‌నగర్, మార్చి 5: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎదురీదుతుందని ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నార్థకంలో పడక తప్పదని బిజెపి సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడుతూ ఉప ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నార్థకంగా తయారయ్యాయని, ఎన్నికల అనంతరం ప్రభుత్వం నిలకడగా ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితి ఏర్పడనుందని, ముమ్మాటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుర్చీ పోవడం మాత్రం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుతం జరగబోయే ఏడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోక తప్పదని, అది ఎవరో చెప్పడం లేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలే బహిరంగంగా చెబుతున్నారని ఆయన అన్నారు. జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలుస్తుందని మంత్రులు ప్రగల్భాలు పలకడం చూస్తుంటే వారి అహంకారానికి నిదర్శనంగా కనబడుతుందని అన్నారు. ఒకవేళ మహబూబ్‌నగర్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేస్తారా అంటూ దత్తాత్రేయ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని, మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. సకల జనుల సమ్మెలో ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన నిలబడని టిడిపి, కాంగ్రెస్‌లు ఈ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి జనం ముందుకు వస్తారని హితవుపలికారు. కాంగ్రెస్ నాయకులు ప్రజల ముందుకువస్తే నిలదీయాలని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులపై పెట్టిన కేసుల విషయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, విద్యార్థులపై కేసులు ఎత్తివేయడానికి కృషి చేయడం లేదని ఆరోపించారు. హోంమంత్రి మాత్రం మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో మాత్రం ప్రచారానికి వస్తున్నారని, అయితే ప్రతి ఇంటి దగ్గర మంత్రిని విద్యార్థులు నిలదీయాలని దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మాజీ ఎంపి జంగారెడ్డి మాట్లాడుతూ బిజెపి ద్వారానే తెలంగాణ వస్తుందని, గల్లీ పార్టీల నుండి తెలంగాణ రాదన్నారు. టిఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందని, పలు ఉప ఎన్నికల్లో తెరాసకు ఓటు వేస్తే ఫలితాలు వచ్చాయి తప్ప తెలంగాణ వాదం బలపడిందే తప్ప రాష్ట్ర సాధనకు సార్థకత కాలేదన్నారు. బిజెపికి ఓటు వేసి ఈ నియోజకవర్గ ప్రజలు గెలిపిస్తే ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుందని, ఈ విషయాన్ని నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయ స్థితిలో ఉందని ఆయన అన్నారు. మద్యం మాఫియాలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఇరుక్కున్నారని ఆయన ఆరోపించారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిలకు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో బిజెపి నాయకులు బద్దం బాల్‌రెడ్డి, లింగయ్య, మల్లారెడ్డి, రతంగ్ పాండురెడ్డి, రాములు తదితరులు పాల్గొన్నారు.
* టిడిపికి శృంగభంగం తప్పదు * బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ
english title:
ff
Date:
Tuesday, March 6, 2012