మహబూబ్‌నగర్, మార్చి 5: హన్వాడ మాజీ జెడ్పీటిసి, టిఆర్‌ఎస్ నాయకుడు బోడ నరేందర్ టిఆర్‌ఎస్ పార్టీకి సోమవారం గుడ్‌బై చెప్పారు. అదేవిధంగా టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు రవితో పాటు మరో 20 మంది టిఆర్‌ఎస్‌వి కార్యకర్తలు తెరాసకు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సోమవారం హన్వాడ మాజీ జెడ్పీటిసి నరేందర్ మహబూబ్‌నగర్‌లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ తాను టిఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నానని, టిఆర్‌ఎస్‌తో తెలంగాణ రాదనే భావన తనకు కలిగిందని, జాతీయ పార్టీ ద్వారానే తెలంగాణ వస్తుందని విశ్వసిస్తున్నానని అన్నారు. తాను టిఆర్‌ఎస్ పార్టీలో చేరినపుడు కెసిఆర్ చెప్పిన మాటలు నెత్తుటి చుక్క నేలకు రాలకుండా తెలంగాణ సాధిస్తానని గొప్పగా మాట్లాడారని, అయితే నెత్తుటి చుక్క నేలకు రాలిందోలేదో గానీ 700 మంది బిడ్డలు ఎలా చనిపోయారని ఆయన ప్రశ్నించారు. టిఆర్‌ఎస్ పార్టీ ఉద్యమాన్ని నీరుగార్చి పబ్బం గడుపుకుంటుందని, జిల్లా కేంద్రంలో కొందరు టిఆర్‌ఎస్ నాయకులు ఉద్యమం చేయకుండా వేరే దందాలకు అలవాటుపడ్డారని, తాను పలుమార్లు ఈ విషయంపై వారిని ప్రశ్నిస్తే తననే తప్పుబట్టారని, అయితే ఇక టిఆర్‌ఎస్‌లో ఉంటే ఉద్యమం పక్కదారి పడుతుందని భావించి తాను ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నట్లు నరేందర్ తెలిపారు.కెసిఆర్‌పై తనకు పూర్తిగా నమ్మకం పోయిందని అన్నారు. అదేవిధంగా సింధూ మీటింగ్‌హాల్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టిఆర్‌ఎస్‌వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు రవి మాట్లాడుతూ తాను సైతం టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెబుతున్నానని వెల్లడించారు. కాగా టిఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పిన నరేందర్, మున్నూరు రవిలు నేడో రేపో బిజెపిలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బిజెపి నాయకులు ఆచారితో పాటు అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు నరేందర్‌తో కలిసి సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.
* అదే దారిలో టిఆర్‌ఎస్‌వి నాయకులు
english title:
gg
Date:
Tuesday, March 6, 2012