మహబూబ్‌నగర్, మార్చి 5: భారతీయ జనతా పార్టీకి వంద ఎజెండాలు ఉంటాయని, ఒక్కో గ్రామానికి, ఒక్కో రాష్ట్రానికి ఓ విధానం ఉంటుందని, ఆ విధానాలను తాము తప్పుబట్టడం లేదని, తెలంగాణ విషయంలో కూడా బిజెపి విధానాన్ని తాము సమర్థిస్తున్నామని, అయితే టిఆర్‌ఎస్‌కు మాత్రం వంద ఎజెండాలు లేవని, కేవలం తెలంగాణనే ఏకైక ఎజెండా అని టిఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలను ఐక్యంగా చేసిన ఘనత టిఆర్‌ఎస్‌కే దక్కిందని, ఈ ప్రాంత బిడ్డలను సీమాంధ్ర పాలకులు విడదీశారో ఆ బిడ్డలందరిని ఏకతాటిపైకి తెచ్చి తెలంగాణ మాది అనే విధంగా ఓ చైతన్యమైన ఉద్యమాన్ని తీసుకువచ్చిన మహా ఉద్యమ నాయకుడు కెసిఆర్ అని అన్నారు. 1998లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే బిజెపి అధికారంలోకి వచ్చాకా తెలంగాణ విషయంలో ఓ నాయకుడు అడ్డువేస్తే ఇవ్వలేదన్న సంగతి ఆ నేతలే చెప్పారన్నారు. వాస్తవాలు మాట్లాడుకుంటే చాట భారతమవుతుందని తెలిపారు. బిజెపిని శత్రువుగా భావించడం లేదని, మిత్రత్వంతోనే చూస్తున్నామని తెలిపారు. తెరాసకు ప్రధానంగా టిడిపి, కాంగ్రెస్‌లే శత్రువులని అన్నారు. దేశాన్ని పరిపాలించిన ఓ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకుని వ్యాఖ్యలు చేయడం అంటే అది మంచి పద్ధతి కాదని, తమ విధానాన్ని వేరే విధంగా ప్రజల్లోకి తీసుకోవాలని, ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేయొద్దని పరోక్షంగా మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల గురించి బిజెపిని ఉద్దేశించి రాజేందర్ హితవుపలికారు. తెలంగాణ ప్రజలకు కులమతాలు లేవని, తామంతా తెలంగాణ మతమని భావిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు తామంతా ఒకే విధానంతో ముందుకు వెళ్లాలనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని, కొందరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు విజయం సాధించడం మహాకష్టమన్నారు. విజయం వారికి ఆకాశానికి భూమికంత దూరంలో ఉందని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అందరి ఇళ్ల మెట్లు ఎక్కామని, తమకు అందరు కావాలని, దేశంలోని 28 పార్టీల కార్యాలయాలకు వెళ్లామని, వారందరి మద్దతు కూడగట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో తమ హైకమాండ్ ప్రజలు అని, ప్రజలు గుండెల్లో పెట్టుకుంటే ఆకాశనంత ఎదుగుతామని, ప్రస్తుతం అదే పరిస్థితి ఉందన్నారు. గతంలో తెలంగాణ ప్రజలు తమకు ఎన్నోమార్లు తిరస్కరించినా ఆ తిరస్కరణానికి శిరసావహించి తిరిగి ప్రజల మన్ననలను పొందామని, ఉప ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలు తెరాసను గుండెల్లో పెట్టి గెలిపించుకుంటారని అన్నారు. ఉద్యమంలో జెఎసియే తమ హైకమాండ్ అని, జెఎసి నిర్ణయమే తమ నిర్ణయాలు అని తెలిపారు. జిత్తుల మారి చంద్రబాబునాయుడు ఉప ఎన్నికల్లో ఎన్ని జిమ్మిక్కులు వేసినా ఓటమి తప్పదని హితవుపలికారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను దగా చేసిందని, 700 మంది బిడ్డల ప్రాణాలకు కారణమైందని అన్నారు. తాము పార్టీ క్యాడర్‌ను నమ్ముకోలేదని, ప్రజలను నమ్ముకుని ఎన్నికలకు వెళ్తున్నామని, తమ కార్యకర్తలను, నాయకులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని, అయినా తెరాసకు ఎలాంటి ఢోకా లేదన్నారు.
టిఆఠ్‌ఎస్‌కు తెలంగాణ ఒక్కటే తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్
english title:
f
Date:
Tuesday, March 6, 2012