హైదరాబాద్, సెప్టెంబర్ 15: అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతున్న మహా నగరంలో ప్రధానసమస్య మురికివాడలు. అరకొర వసతుల మధ్య నలిగిపోతున్న మురికివాడల ప్రజలను చైతన్యవంతులను చేసి పక్కా ఇళ్లను నిర్మించటంతో పాటు అన్ని రకాల వౌలిక వసతులను కల్పించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రాజీవ్ ఆవాస్ యోజన(రే) పథకం అమలు ఆరంభశూరత్వంలా తయారైంది.
ఈ పథకం అమలుకు శివార్లలోని రెండు మురికివాడలను ఎంపిక చేసి ఎంతో ఆర్భాటంగా శంకుస్థాపనలు చేసినా, ఆ తర్వాత పాలకులుగానీ, అధికారులు గానీ మళ్లీ అక్కడకు వెళ్లిన దాఖలాల్లేవు. దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రయోగాత్మకంగా నగరంలో ప్రారంభించిన పథకం అమలు తీరే ఇలా ఉంటే, ఇక స్థానిక సంస్థ అధికారులు, పాలకులు చేపడుతున్న పథకాలెలా అమలవుతున్నాయో అంచనా వేసుకోవచ్చు. నగరాన్ని మురికివాడల రహిత నగరంగా(స్లమ్ ఫ్రీ సిటీ)గా తీర్చిదిద్దేందుకు జిహెచ్‌ఎంసి గత దశాబ్దాపు కాలం నుంచి చేపడుతున్న చర్యలన్నీ కూడా కాగితాలకే పరిమితమయ్యాయి. నగరం గ్రేటర్ కాకముందు 2005లో అప్పటి మేయర్ తీగల కృష్ణారెడ్డి, కమిషనర్ సంజయ్‌జాజులు కూడా ముంబైకి చెందిన ఓ కన్సల్టెన్సీతో ఒప్పందం చేసుకున్నా, నేటికీ అతీగతీలేదు. సిటీలో జిహెచ్‌ఎంసి గుర్తించిన సుమారు 1476 మురికివాడలున్నాయి. అయితే వీటిని పూర్తి స్థాయిలో ఆధునీకరించి రాజీవ్ ఆవాస్ యోజన పథకం కింద సుమారు రెండు లక్షల 33వేల పక్కా ఇళ్లను నిర్మించటంతో పాటు అక్కడ వౌలిక వసతులను కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పిన అధికారులు ఇపుడు వాటి మాటను కూడా ప్రస్తావించేందుకు సిద్ధంగా లేరు. ఇందుకు గాను ‘రే’ పథకం కింద కేంద్ర ప్రభుత్వం గ్రేటర్‌కు రూ. 12వేల 54 కోట్లను వివిధ దఫాలుగా మంజూరు చేసేందుకు సిద్దంగా ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రతిపాదనలు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఈ పథకంపై అవగాహన లోపం కారణంగా మురికివాడల ప్రజలు ముందుకు రాకపోవటం, వారిని చైతన్యవంతులను చేసే దిశగా అధికారులెలాంటి చర్యలు చేపట్టకపోవటం వల్లే మురికివాడలు అభివృద్దికి నోచుకోలేకపోతున్నాయి. ఈ పథకం అమలు, ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన తీరుపై గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించినా, కార్పొరేటర్ల నుంచి స్పందన అంతంతమాత్రమే. ఒక్కో మురికివాడలో నివసిస్తున్న వారిలో కనీసం 70 శాతం ప్రజలు ముందుకొస్తే ఈ పథకాన్ని అమలు చేయలేమని అధికారులు చెబుతుండగా, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు కూడా కార్పొరేటర్లు కృషి చేయకపోవటం మురికివాడల అభివృద్ధిపై వారి చిత్తశుద్ధికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
నిధులున్నా...ప్రయోజనం సున్నా!
రాజీవ్ ఆవాస్ యోజన పథకం అమలుకయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అప్పట్లో నిధులు వెచ్చించేందుకు సుముఖతను తెలియజేశాయి. మొత్తం రూ. 12వేల 54 కోట్లతో అంఛనాలను తయారు చేయగా, ఇందులో యాభై శాతం నిధులను కేంద్రం, మిగిలిన యాభై శాతంలో రాష్ట్ర ప్రభుత్వం 20శాతం, మరో ముప్పై శాతం నిధులను లబ్దిదారుడు తన వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పథకం అమలుకు లబ్దిదారుల నుంచి అధికారులు వాట సేకరించకపోవటమే ప్రధాన అడ్డంకిగా మారింది. ఇందుకు బ్యాంకు లింకేజీ రుణాలుగా ఇప్పించేందుకు సమన్వయకర్తగా వ్యవహారించాల్సిన జిహెచ్‌ఎంసి యూసిడి చేతులెత్తేయటం వల్లే పథకం అమలు ఎక్కడికక్కడే నిల్చిపోయింది.
ప్రయోగమన్నారు..పరువుతీశారు!
దేశంలోనే మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం రాజీవ్ ఆవాస్ యోజన స్కీంను నగరంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత దేశంలోని ఇతర పట్టణాలు, మహానగరాల్లో అమలు చేస్తుందని చెప్పిన అధికారులు మహానగరం పరువు తీసినంత పని చేశారు.
రెండు మురికివాడల్లో అప్పటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చేతుల మీదుగా హడావుడిగా శంకుస్థాపనలు చేసి, ఫొటోలకు పోజులివ్వటం వరకే పాలకులు, అధికారులు పరిమితమయ్యారే తప్పా, ఆ తర్వాత ఈ పథకాన్ని పట్టించుకున్న పాపానపోలేదు.
‘స్లమ్ ఫుల్ సిటీ’గా గ్రేటర్ * 50 మురికివాడలు ఎంపిక చేసినా పనులు నిల్
english title:
r
Date:
Monday, September 16, 2013