హైదరాబాద్, సెప్టెంబర్ 15: మహానగర పాలక సంస్థ రోజురోజుకి అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు, స్వీపింగ్ యూనిట్లలో అవకతవకలు, వాహన విడిభాగాల్లో భారీ కుంభకోణాలు వంటి అప్రదిష్టను కూడగట్టుకున్న బల్దియా మరో తప్పిదం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయంలో గతంలో సెక్యూరిటీ విధులు నిర్వర్తించిన రేణుకా సెక్యూరిటీ సర్వీసెస్ మరోసారి కాంట్రాక్టు కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో పలువురు ఉన్నతాధికారులు, యూనియన్ నేతలతో ఏజెన్సీకి బేరం కుదిరించుకుని కాంట్రాక్టును చేజిక్కించుకున్నట్లు సమాచారం. ఇదే ఏజెన్సీ గతంలో కార్మికుల పేరిట జవమ చేయాల్సిన పిఎఫ్‌లో అవకతవకలకు పాల్పడినట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత ఏజెన్సీని కాంట్రాక్టు నుంచి తప్పించిన అధికారులు గ్లోబల్ సెక్యూరిటీకి బాధ్యతలను అప్పగించారు. చాలా రోజుల క్రితమే గ్లోబల్ సెక్యూరిటీ కాంట్రాక్టు గడువు ముగిసినా, ఎక్స్‌టెన్షన్లతో కాలం గడుపుకుంటూ వచ్చారు. ఇక తప్పని పరిస్థితుల్లో మరోసారి టెండర్లను ఆహ్వానించినట్టే ఆహ్వానించి, మళ్లీ రేణుకా ఏజెన్సీని తెరపైకి తెచ్చారు. గతంలో 34 మంది సెక్యూరిటీ గార్డులకు 25రోజుల జీతభత్యాలను చెల్లించకుండా వెళ్లిపోయిన రేణుకా ఏజెన్సీ గార్డులకు బకాయిలను చెల్లించాలని పలు యూనియన్ల నేతలు, గార్డులు కూడా డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పలు యూనియన్ల నేతలు మధ్యవర్తులుగా వ్యవహరించి కొందరు గార్డులకు బకాయిలను ఇప్పించటంతో పాటు అందినంత వారు కూడా దండుకుని మళ్లీ అదే ఏజెన్సీకి సెక్యూరిటీ కాంట్రాక్టును ఇప్పించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం మొత్తం 64 మంది సెక్యూరిటీ గార్డులను నియమించాల్సి ఉంది. వీరిలో గన్ లైసెన్సు ఉన్న వారిని కూడా నియమించాల్సి ఉన్నా, ఏజెన్సీ మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ల నివాసాలతో పాటు ప్రధాన కార్యాలయం వరకు సైతం కేవలం 40 మంది గార్డులను మాత్రమే నియమించినట్లు ఆరోపణలున్నాయి. ప్రతి నెల జీతాలు మాత్రం 64 మందికి క్లెయిమ్ చేస్తున్నట్లు ఆరోపణ ఉంది. ఇందులో పలువురు ఉన్నతాధికారులకు కూడా వాటాలున్నట్లు వాదనలు విన్పిస్తున్నాయి. బల్దియాలోని కొందరు అధికారులు తమ స్వప్రయోజనాల కోసం అక్రమాలకు పాల్పడిన ఏజెన్సీలకు ఈ రకంగా అందలం ఎక్కిస్తున్నా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.
* అక్రమాలకు పాల్పడ్డ ఏజెన్సీకే సెక్యూరిటీ బాధ్యతలు * భారీగా చేతులు మారినట్టు ఆరోపణలు
english title:
contract
Date:
Monday, September 16, 2013