వికారాబాద్, సెప్టెంబర్ 15: ప్రభుత్వం వికారాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయాలను ప్రభుత్వ కార్యాలయాలకు రెవిన్యూ శాఖ అధికారులు భూములను సర్వే చేసి కేటాయించకపోవడంతో పనులు ఆగిపోవడం, తరలిపోవడం జరుగుతోంది. వికారాబాద్‌లో ఐఎఎస్ స్థాయి అధికారి సబ్‌కలెక్టర్ ఉన్నా భూములను సర్వే చేసి కేటాయించడంలో భూముల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వికారాబాద్ పట్టణంలోని రైల్వే జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న 132 కెవి సబ్‌స్టేషన్ నిర్మాణపు పనులు రైల్వే, రెవిన్యూ శాఖ మధ్య ఉన్న సమస్య పరిష్కరించకపోవడంతో ముందుకు సాగడం లేదు. అంతే కాకుండా జిల్లా జైలు, జాతీయ జైళ్ళ అకాడమీ ఈప్రాంతానికి మంజూరైనా స్థల ఎంపిక, సేకరణలో రెవిన్యూ శాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమిని కేటాయించలేకపోయారంటే రెవిన్యూ శాఖ అధికారుల ఉదాసీనత ఏస్థాయిలో ఉందో అర్థమవుతోంది. రోడ్డు రవాణావారు ఏర్పాటు చేయాలనున్న టెస్టింగ్ ట్రాక్‌కు, ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి సరైన స్థలాన్ని ఎంపిక చేసి అప్పగించడంలో వారు ముందడుగు వేయడం లేదు. రాష్ట్ర చేనేత, జౌళి, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి జి.ప్రసాద్‌కుమార్ ప్రభుత్వం నుండి కష్టపడి నిధులను మంజూరు చేయించినా రెవిన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ది కుంటుపడుతోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. ఇప్పటికైనా రెవిన్యూ శాఖ అధికారులు స్పందించి అభివృద్ధి పనులకు అవసరమైన స్థలాల కేటాయింపుపై దృష్టిపెట్టాలని కోరుతున్నారు.
సిసి రోడ్డు, బస్టాప్ ప్రారంభించిన తీగల
సరూర్‌నగర్, సెప్టెంబర్ 15: మహేశ్వరం టిడిపి ఇంచార్జి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తీగల కృష్ణారెడ్డి తన సొంత నిధులతో టికెఆర్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో నిర్మించిన సిసి రోడ్డు, బస్టాప్‌ను ఆదివారం ప్రారంభించారు. సుమారు 11 లక్షల రూపాయలతో టికెఆర్ తన నిధులతో ఆర్‌ఎన్ రెడ్డినగర్ వద్ద సిసిరోడ్డు, నూతన బస్టాప్‌ను నిర్మించాడు. పూర్తియిన సిసి రోడ్డును, బస్టాప్‌ను టికెఆర్ విద్యా సంస్థల సిబ్బంది, టిడిపి శ్రేణులతో కలిసి ప్రారంభించారు. దీంతో ఆర్ ఎన్‌రెడ్డి నగర్ పరిసర కాలనీవాసులకు రహదారి, బస్టాప్ అందుబాటులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రోడ్డు, బస్టాప్ విషయం పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంతో తన నిధులతో ఏర్పాటు చేసినట్టు చెప్పారు.