ఒంగోలు, సెప్టెంబర్ 18: జిల్లావ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. జిల్లాలో రోజురోజుకు ఉద్యమసెగలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మంగళవారం జిల్లాలోని అనేకప్రాంతాల్లో సమైక్యవాదులు వివిధరూపాల్లో ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట డిఆర్‌డిఎ, అంగన్‌వాడీల ఆధ్వర్యంలో భారీఎత్తున మహిళా గర్జన సదస్సు జరిగింది. ఈసదస్సుకు జిల్లాలోని నలుమూలల నుండి భారీగా మహిళలు తరలివచ్చి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. మహిళా గర్జనతో నగరం మార్మోగింది. సమైక్యాంధ్రను సాధించేంతవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని మహిళలు హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు వైద్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా వైద్యశాలలను మూసివేసి నిరసన తెలిపారు. కాగా జిల్లాలోని అనేకప్రాంతాల్లో ప్రైవేటు వైద్యులు ర్యాలీలు, మానవహారాలు చేపట్టి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించారు. వైద్యులు సమ్మెలో పాల్గొనటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థల బంద్ కొనసాగుతుండటంతో విద్యార్థుల భవిష్యత్తు కుంటుపడుతోంది. ఈ సందర్భంగా జరిగిన మహిళాగర్జన సదస్సులో డిఆర్‌డిఎ పిడి పద్మజ, జిల్లా పరిషత్ సిఇఒ గంగాధర్ గౌడ్, సిపిఒ కె వెంకయ్య, ఒంగోలు నగర కార్పొరేషన్ కమిషనర్ విజయలక్ష్మి, ఒంగోలు ఆర్‌డిఒ మురళి, ఎపిఎన్‌జివో అసోసియేషన్ చైర్మన్ అబ్దుల్ బషీర్, కార్యదర్శి బండి శ్రీనివాసరావు, కోశాధికారి రాజ్యలక్ష్మి, ఐకెపి నుండి డేవిడ్, సురేష్ తదితరులు మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా భారీఎత్తున మహిళలు రావడం అభినందనీయమన్నారు. ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర విభజన చేసిన తరువాత సీమాంధ్ర ప్రాంతాల్లో ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయన్నారు. ముఖ్యంగా ఎన్‌జివోలు, విద్యార్థులు, మహిళలు, అన్నివర్గాల ప్రజలు సమైక్యాంధ్ర ఆందోళనల్లో పాల్గొని ఉద్యమాన్ని ఉద్ధృతంగా నిర్వహిస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేదని వారు ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని విభజించటం వల్ల రాష్ట్భ్రావృద్ధి కుంటుపడుతుందన్నారు. మహిళల శక్తిముందు ఏ శక్తీ నిలవదని సమైక్యాంధ్రను సాధించేవరకు మహిళలు ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. మహిళా గర్జన సందర్భంగా సమైక్యాంధ్రకు మద్దతుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టారు.
బంద్ పాటించిన ప్రైవేటు వైద్యులు కొనసాగుతున్న ప్రైవేటు విద్యాసంస్థల బంద్
english title:
mahilalu
Date:
Wednesday, September 18, 2013