కొత్తపట్నం, సెప్టెంబర్ 18: కొత్తపట్నం - ఒంగోలు మార్గమధ్యంలోని 11/10 వంతెన మంగళవారం కుంగిపోవటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. 2009 సంవత్సరంలో కొంతభాగం కుంగిపోవటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. ఈనేపధ్యంలో మండల ప్రజలు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరగటంతో జాతీయ విపత్తు ప్రత్యేక నిధులు మూడుకోట్ల 90 లక్షల రూపాయలతో ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ఈసంవత్సరం మేలో శంకుస్థాపన చేశారు.వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో ఇటీవల కురిసిన వర్షాల తాకిడికి మంగళవారం వంతెన కొంతభాగం నెర్రెలిచ్చి ఒక అడుగు లోతుకు కుంగిపోయింది. ఇది గమనించిన ప్రయాణీకులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొత్తపట్నం ఎస్‌ఐ బి శ్రీనివాసరావు తన సిబ్బందితో హుటాహుటిన కూలిన వంతెన ప్రదేశానికి చేరుకుని కూలిన భాగంలో కి రాళ్లుపెట్టి రాకపోకలకు ఆంక్షలు విధించారు. ఒంగోలు నుండి కొత్తపట్నం వెళ్లే వాహనాలను ఆలూరు, మోటుమాల మీదుగా మళ్లించారు. అదేవిధంగా కొత్తపట్నం నుండి ఒంగోలు వెళ్లే వాహనాలను ఈతముక్కల మీదుగా తరలిస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపారు. అసలే సమైక్యాంధ్ర ఉద్యమసెగతో ఆర్‌టిసి బస్సులు ఆగిపోవటంతో ఆటోడ్రైవర్లు ఒంగోలుకు 20 రూపాయల వరకు చార్జీని వసూలు చేస్తున్నారు. వంతెన దెబ్బతినటంతో రాకపోకలను దారిమళ్లించటంతో ఆటోవాలాలు రెట్టింపు చార్జీలను వసూలు చేస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. అధికారులు స్పందించి త్వరితగతిన వంతెన నిర్మాణ పనులను పూర్తిచేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
రాకపోకలకు అంతరాయం
english title:
vantena
Date:
Wednesday, September 18, 2013