కొత్తపట్నం, సెప్టెంబర్ 18: రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోవాలంటే సీమాంధ్రలోని ఎంపిలందరు రాజీనామాలు చేసేలా సమైక్యవాదులంతా ఒత్తిడి తీసుకురావాలని ఒంగోలు శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కొత్తపట్నంలో ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు బాలినేని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వప్రయోజనాల కోసం రాష్ట్ర విభజన ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ఇటువంటి పరిస్థితులు దాపురించి ఉండేవి కావన్నారు. సమైక్యాంధ్ర కోసం అన్ని పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సమైక్యాంధ్రకోసం నిరంతరం పోరాడుతోందని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు బత్తుల బ్రహ్మానందారెడ్డి మాట్లాడుతూ హైదరాబాదు రాష్ట్ర ప్రజలందరి సొత్తని పేర్కొన్నారు. రిలే నిరాహారదీక్షలో ఉపాధ్యాయులు చంద్రశేఖర్, లక్ష్మీనారాయణ, వాసు, శ్రీనివాసరావు, పద్మావతి, పద్మజ, నిర్వాహకులు వి భాస్కరరావు, జి రాఘవరావు పాల్గొన్నారు. బాలినేని వెంట ఆ పార్టీ నాయకులు లంకపోతు అంజిరెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, డాక్టర్ చెరుకూరి వీరరాఘవరావు తదితరులు ఉన్నారు.
సమైక్యవాదులకు ఎమ్మెల్యే బాలినేని పిలుపు
english title:
pressure
Date:
Wednesday, September 18, 2013