Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల మధ్య ఘర్షణ

$
0
0

ముండ్లమూరు, సెప్టెంబర్ 17: మండలంలోని పూరిమెట్ల గ్రామంలో టిడిపి, వైఎస్‌ఆర్‌సిపి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగి ఆరుగురికి తీవ్ర గాయాలైన సంఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వర్గీయుల మధ్య స్వల్పవివాదం చోటుచేసుకొని ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ముసలయ్య, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, కోటేశ్వరమ్మలతో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామాన్ని ముండ్లమూరు ఎఎస్‌ఐ హనుమంతరావు సందర్శించి ఘర్షణకు దారి తీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ఉండటానికి పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

కందుకూరులో కదంతొక్కిన విద్యార్థులు
* విజయవంతమైన సమైక్య గర్జన
కందుకూరు, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థిగర్జన కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు భారీసంఖ్యలో తరలివచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా గర్జించారు. మంగళవారం పట్టణ పరిధిలోని సుమారు 20ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల ఆధ్వర్యంలో పట్టణం నలుమూలల నుండి భారీ ర్యాలీతో విద్యార్థులు స్థానిక పోస్ట్ఫాసు సెంటర్‌కు చేరుకుని, సమైక్యాంధ్రకు మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలోని ఏరియా వైద్యశాల సమీపంలో గల ఎన్‌టిఆర్ విగ్రహానికి, మార్కెట్‌సెంటర్‌లోని పొట్టిశ్రీరాములు విగ్రహానికి, కోవూరురోడ్డులోని టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి, పాత బస్టాండ్ సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి విద్యార్థిని, విద్యార్థులు పూలమాలలువేసి ఘన నివాళులు అర్పించారు. ర్యాలీ సందర్భంగా పలు పాఠశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో ర్యాలీ అగ్రభాగాన నిలిచి ప్రధాన ఆకర్షణగా ఉన్నారు. పోస్ట్ఫాసు సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్, జెఎసి గౌరవ అధ్యక్షులు కంచర్ల రామయ్య, జెఎసి మరో గౌరవ అధ్యక్షులు జివి కృష్ణారావు, అధ్యక్షులు ఎం చంద్రశేఖర్, కార్యదర్శి పి చంద్రశేఖర్, ఖజానా ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు అహ్మద్, ఉపాధ్యాయ జెఎసి నాయకులు ఎంఎస్ రాంబాబు, ప్రతిభా విద్యాసంస్థల డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రైవేటు విద్యాసంస్థల యూనియన్ నాయకులు నల్లూరి కృష్ణమూర్తి, గాయత్రి రామకృష్ణ, జెఎసి కోశాధికారి బెజవాడ కృష్ణయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరి కోటేశ్వరరావులు మాట్లాడారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఉద్యమంలో పాల్గొంటున్నారని అన్నారు. అయినా ఢిల్లీ పెద్దలు ప్రజా ఉద్యమాన్ని గుర్తించకుండా విభజన ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటిస్తూ తెలుగుజాతి ప్రజలను మనో వేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలను ఆమోపింజేసుకుని ఉద్యమంలోకి తరలి రావాలని డిమాండ్ చేశారు. ఈకార్యమ్రంలో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన కాళిదాసు రామచంద్రప్రసాద్, జొన్నాధుల రాఘవ, ఓరుగంట శివరామయ్య, హరిబాబు, మాలకొండయ్య, నారాయణ, చైతన్య, ప్రకాశం, వివేకా, ప్రతిభ, నాగార్జున విద్యాలయం, విజ్ఞాన్‌విహార్, భాష్యం, శివసాయి తదితర విద్యాసంస్థలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు, జెఎసి నాయకులు ఎవి రావు, పెరుగు ప్రసాద్, ఉన్నం వెంకటేశ్వర్లు, ముప్పరాజు కోటేశ్వరరావు, మర్రి శ్రీనివాసులు, థామస్, పాలేటి కోటేశ్వరరావు, ఉప్పుటూరి రాజేంద్రప్రసాద్, ఎన్‌జిఓ సంఘం నాయకులు జెవి రమణారావు, మురళీకృష్ణ, వార్డెన్లు నాగేశ్వరరావు, బివి తదితరులు పాల్గొన్నారు.

కందుకూరు మున్సిపల్ కార్యాలయం ముట్టడి
- కమిషనర్‌తో జెఎసి నాయకుల వాగ్వాదం
కందుకూరు, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్రకు మద్దతుగా అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులతోపాటు ప్రజలు కూడా ఉద్యమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి రాజీనామాచేసి మద్దతు తెలిపిన తరుణంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో విధులు నిర్వహిస్తూ ఆయనను అవమానిస్తారా అని సమైక్యాంధ్ర జెఎసి నాయకులు మున్సిపల్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న జెఎసి గౌరవ అధ్యక్షులు జివి కృష్ణారావు, అధ్యక్షులు ఎం చంద్రశేఖర్, కోశాధికారి బెజవాడ కృష్ణయ్య, ఖజానా ఉద్యోగుల సంఘం అహ్మద్ ఆధ్వర్యంలో జెఎసి నాయకులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కమిషనర్ చాంబర్‌ను ముట్టడించారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ అన్ని కార్యాలయాలు మూతపడిన తరణంలో మున్సిపల్ కార్యాలయంలో కార్యకలాపాలు జరగడం విచారకరం అన్నారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. మంత్రి సొంత మున్సిపాలిటీలో ఆయన అభిప్రాయానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమానికి తూట్లు పడే విధంగా వ్యవహరిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆ ప్రదేశంలో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు అందరం సమైక్యాంధ్రకు మద్దతు తెలుపుతున్నామని, ఎవరు ఉద్యమాన్ని తూట్లు పొడవడం లేదని జెఎసి నాయకులకు సర్ది చెప్పారు. అదేవిధంగా కమిషనర్ ఎగ్జిక్యూటివ్ అధికారులు మినహాయించి మిగిలిన సిబ్బంది, ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని, ఏవిధమైన కార్యకలాపాలు జరగడం లేదని, తాము సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. అనంతరం జెఎసి నాయకులు ఉద్యమానికి మద్దతు తెలపాలని, సిబ్బంది కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను కోరారు. ఈసందర్భంగా జెఎసి నాయకులతోపాటు ఉపాధ్యాయ జెఎసి నాయకులు ఎంఎస్ రాంబాబు, మర్రి శ్రీనివాసులు, ఎవి రావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరి కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

గుండ్లకమ్మ పరవళ్ళు
రాచర్ల, సెప్టెంబర్ 17: రెండురోజులుగా కురిసిన వర్షాలకు గుండ్లకమ్మ పరవళ్ళు తొక్కుతుంది. మండలంలోని చోళ్ళవీడు వద్ద ఉన్న వంతెనపై భారీగా నీరు ప్రవహిస్తోంది. నల్లమల అటవీలో భారీవర్షాలు కురవడం వలన సోమవారం రాత్రి చినగానిపల్లి చెరువు నిండింది. అదేవిధంగా ఆకవీడు చెరువుకు నీరు చేరింది. గుండ్లకమ్మ భారీగా ప్రవహించడంతో వెలుతుర్లపాడు తాండ నుంచి పొలాలవైపు వెళ్ళేందుకు కూడా అవకాశం లేకపోవడంతో పత్తి, నూగు వంటి పంటలు ఇంటికి చేర్చుకునేందుకు అవకాశం లేకుండాపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహం భారీగా ఉండటంతో కంభంచెరువుకు వరదనీరు భారీగా చేరుకుంటుంది.

మోటార్‌సైకిల్ ఢీకొని ఒకరు మృతి
సంతనూతలపాడు, సెప్టెంబర్ 17:మండలంలోని సంతనూతలపాడు ఎర్రమిట్ట వద్ద మంగళవారం మోటార్‌సైకిల్ ఢీకొట్టడంతో చీమకుర్తి శిద్దానగర్‌కు చెందిన కొమరగిరి నరసింహం (70)కు తీవ్రగాయాలు కాగా మోటార్ సైక్లిస్టు షణ్ముఖరెడ్డికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో నరసింహం మృతి చెందాడు. షణ్ముఖరెడ్డి పరిస్థితి విషమంగా మారడంతో ఒంగోలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక ఎస్‌ఐ కె ఆరోగ్య రాజు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త
హనుమంతునిపాడు, సెప్టెంబర్ 17: పూటుగా మద్యం సేవించి ఓ తాగుబోతు భర్త తన భార్యను కిరాతకంగా హతమార్చిన సంఘటన మంగళవారం జరిగింది. మండల కేంద్రమైన హనుమంతునిపాడుకు చెందిన కొండపోగు జ్యోతి (22)ని ఆమె భర్త నేహేమియ అత్తగారింట్లోనే అతికిరాతకంగా కత్తితో నరికి చంపాడు. సంఘటన పట్టపగలే జరగడంతో హనుమంతునిపాడులో భయాందోళనలు నెలకొన్నాయి. కనిగిరిలోని పాతూరుకు చెందిన నేహేమియతో రెండు సంవత్సరాల క్రితం జ్యోతికి వివాహమైంది. వీరికి 9నెలల పాప ఉంది. బేల్దారీపని చేసే నెహేమియ తరచూ మద్యం మత్తులో ఉండేవాడు. మద్యం మత్తులో ఉన్నప్పుడు తనకు ఉన్న అక్రమ సంబంధాలను గురించి భార్యకు చెబుతూ మానసికంగా వేధించేవాడు. సోమవారం హనుమంతునిపాడు నుంచి భార్యాభర్తలు కలిసి కనిగిరి మండలంలోని రాచగుండ్లపాడులో బంధువుల పెళ్లికి వెళ్లి మంగళవారం హనుమంతునిపాడు వచ్చారు. మద్యంమత్తులో ఉన్న నెహేమియ భార్యను అన్నం వడ్డించాలని నిర్మాణంలో ఉన్న అత్తగారింటి నుండి వారు ఉంటున్న ఇంట్లోకి పిలిచాడు. తన తొమ్మిది నెలల కుమార్తెను అమ్మమ్మ దగ్గర ఉంచి భర్తకు అన్నం వడ్డించేందుకు వెళ్లిన జ్యోతిని కత్తితో నరికి చంపాడు. ఒక్కసారిగా భర్త కత్తితో దాడి చేయడంతో భయాందోళనకు గురైన జ్యోతి ఆర్తనాధాలు చేయడంతో చుట్టుపక్కల వారు వెళ్లే సరికి జ్యోతి రక్తపు మడుగులో పడి ఉంది. ఈవిషయాన్ని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్సై ఎంఎస్ బేగ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య వివరాలను సేకరిస్తున్నారు.
నిందితుడిని కట్టేసిన గ్రామస్థులు
భార్యను హత్యచేసిన నెహేమియను గ్రామస్థులు కట్టేసి పోలీసులకు అప్పగించారు. భార్యను కిరాతకంగా హత్యచేసిన నెహేమియను తిడుతూ గ్రామస్థులు శాపనార్థాలు పెట్టారు.
ఆ పాపకు దిక్కెవరు?
అన్ని తానై తన కుమార్తెను అల్లారుముద్దుగా పెంచుకునే జ్యోతి హత్యకు గురవడంతో తన మనుమరాలికి ఇంక దిక్కెవరు అని అమ్మమ్మ, తాతయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ఇంటికి వచ్చి మా బిడ్డను పొట్టన పెట్టుకున్నాడని జ్యోతి తల్లిదండ్రులు నవనీతమ్మ, బాపయ్య బోరున విలపిస్తున్నారు. అల్లుడు బేల్దారీ కావడంతో ఇంటిని కట్టించేందుకు హనుమంతునిపాడు తీసుకువచ్చి తన బిడ్డను పోగొట్టుకున్నామని వారు బోరున విలపిస్తున్నారు. వృద్ధాప్యంలో ఉన్న మా తరువాత మా మనుమరాలికి దిక్కు ఎవరు అని దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నారు.
ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి పరామర్శ
స్థానిక శాసన సభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించి హత్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌పార్టీ నాయకులు సానికొమ్ము రామరాఘవరెడ్డి, కుందురు నారాయణరెడ్డి, ఆలా తిరుపతయ్య, పాశం వెంకటేశ్వర్లు, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు శాంతరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను తదితరులు ఉన్నారు.

‘రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడమే లక్ష్యం’
కనిగిరి రూరల్, సెప్టెంబర్ 17: రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని, రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే తమ లక్ష్యం అని తెలుగుదేశంపార్టీ మండల అధ్యక్షులు బేరి పుల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు చిరంజీవి అన్నారు. మంగళవారం స్థానిక పామూరు బస్టాండ్‌లో జరిగిన రిలే నిరాహార దీక్షలలో ఆయన మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని సిడబ్ల్యుసిలో నిర్ణయం తీసుకోవడం విచారకరం అని, రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే టిడిపి నేతృత్వంలో పోరాటాలు చేపడతామన్నారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ పామూరు బస్టాండ్‌లో టిడిపి నాయకులు ఒంటి కాలిపై నిలబడి వినూత్న ప్రదర్శన చేశారు. టిడిపి నిర్వహించిన రిలే నిరాహార దీక్షలలో ఈదర కోటేశ్వరరావు, పి సత్యనారాయణ, తేజ, సుబ్బారెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు దొడ్డా వెంకటసుబ్బారెడ్డి, రాచమర్ల శ్రీనివాసరెడ్డి, ఫయాజ్, టి వెంకటరెడ్డి, ఎం పెద్దిరెడ్డి, షేక్ బుజ్జా తదితరులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైఎస్‌ఆర్‌సిపి నేతృత్వంలో మంగళవారం స్థానిక వైఎస్‌ఆర్ సిపి కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను నిర్వహించారు. ఈసందర్భంగా వైఎస్‌ఆర్ సిపి నాయకులు పిచ్చాల శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే సహించేది లేదని, రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం అన్ని రంగాలలో ఘోరంగా దెబ్బతింటుందని ఆయన అన్నారు. రిలే నిరాహార దీక్షలలో మడతల కస్తూరిరెడ్డి, షేక్ రహీమ్, రమణారెడ్డి, కొండారెడ్డి, గుడిపాటి ఖాదర్, పి శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే జెఎసి నేతృత్వంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా నిర్వహించిన రిలే నిరాహార దీక్షలలో జెఎసి నాయకులు చిలకల శివరామిరెడ్డి, అబ్దుల్ గఫార్, విజయభాస్కర్, కె మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.
డిగ్రీ కళాశాల అధ్యాపకుల నేతృత్వంలో
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రాష్ట్ర విభజనను నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజిస్తే, రాష్ట్రం 20సంవత్సరాల వెనకకు వెళ్లిపోతుందని, రాష్ట్ర అభివృద్ధి తీవ్రంగా నష్టపోతుందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో ముక్కు బాలకృష్ణారెడ్డి, ఎంవి సుబ్బయ్య, ఆర్ కోటేశ్వరరావు, పి నాగేశ్వరరావు, వసంతరావు, రంగయ్య, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలో కంప్యూటర్లు అపహరణ
జరుగుమల్లి, సెప్టెంబర్ 17: ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి విలువైన కంప్యూటర్లను అపహరించుకెళ్లిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కె బిట్రగుంట ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గదిలో 11మానిటర్‌లు, 3 సిపియులు, ఎల్‌సిడి టివి ఒకటి, డివిడి ప్లేయర్ ఒకటి అపహరణకు గురైనట్లు పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు శీలం వెంకట్రావు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీసులు విచారణ చేపట్టారు. ఈనెల 14,15తేదిలలో పాఠశాలకు సెలవు ఇచ్చారు. తిరిగి 16వ తేది సోమవారం పాఠశాల ప్రారంభించారు. రోజు విధంగా పాఠశాల మూసే సమయంలో తరగతి గదులకు తాళాలు వేసే ముందు కంప్యూటర్ గదికి తాళాలు వేసి ఉండకపోవడంతో విద్యార్థులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కంగారుగా ఉపాధ్యాయులు కంప్యూటర్ గదిని పరిశీలించారు. గదులలో 11మానిటర్‌లు, ఎల్‌సి టివి ఒకటి, సిపియులు మూడు, డివిడి ప్లేయర్ ఒకటి కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. వీటి విలువ 50వేల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మంగళవారం ఉపాధ్యాయులతోపాటు కంప్యూటర్ ఆపరేటర్లు, రాత్రి కాపలాదారుడిని పిలిపించి విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాసులు తెలిపారు.

గిద్దలూరులో భారీ వర్షం
- అపారనష్టం
గిద్దలూరు, సెప్టెంబర్ 17: గిద్దలూరు మండల ప్రాంతంలో సోమవారం రాత్రి కురిసిన భారీవర్షానికి అపారనష్టం వాటిల్లింది. 9సెంటిమీటర్ల వర్షం నమోదైంది. చేతికి అందివచ్చిన పంటలన్నింటికి నష్టం వాటిల్లింది. పలుకాలనీల్లోనికి వర్షపునీరు ప్రవేశించి ప్రజలు ఇబ్బందులపాలయ్యారు. పలురోడ్లు కోతలకు గురయ్యాయి. మండలంలోని జయరాంపురం, వెల్లుపల్లి, వెంగళరెడ్డిపల్లి, అంబవరం గ్రామాల్లో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రస్తుతం టమోటా, మిర్చి, ఆముదం పంటలు వర్షానికి పొలంలోనే నేలకొరికి పొలాలన్నీ నీటిమయమయ్యాయి. గిద్దలూరు నుంచి అంబవరం, జయరాంపురం గ్రామాలకు వెళ్ళే ఆర్ అండ్‌బి రోడ్డు నక్కలవాగు ప్రవాహానికి కోతకు గురైంది. దీనితో ఆప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. అంబవరం సమీపంలోని ఎర్రవాగు పొంగిపొర్లడంతో జయరాంపురం గ్రామం జలమయమైంది. ఇటీవలనే కోసికుప్పలు వేసిన నువ్వులు భారీఎత్తున దెబ్బతిన్నాయి. కుప్పలన్నీ నీటిలో మునిగిపోవడంతో లక్షలాది రూపాయల నష్టం వాటిల్లింది. గిద్దలూరు సగిలేరువాగు ఉధృతంగా ప్రవహించింది. దీనితో పట్టణంలోని అర్బన్‌కాలనీలోనికి పలుఇళ్లలో నీరు ప్రవేశించి భారీనష్టం వాటిల్లింది.

ఆరుగురికి తీవ్ర గాయాలు
english title: 
injured

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>