మచిలీపట్నం, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్ర కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన ప్రైవేట్ ఆస్పత్రుల 24 గంటల బంద్ విజయవంతమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ వైద్యశాలలు, క్లినిక్‌లు మూతబడ్డాయి. పలు ప్రాంతాల్లో ప్రైవేట్ వైద్యులు, ఆర్‌ఎంపి వైద్యులు, ల్యాబ్ టెక్నీషియన్‌లు ర్యాలీలు నిర్వహించిన నిరసన తెలిపారు. జగ్గయ్యపేటలో సుమారు 2 వేల మందితో సహస్ర గళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ్యుడు శ్రీరాం తాతయ్య తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ల్యాబ్ టెక్నిషియన్‌లు మోకాళ్ళపై నడిచి నిరసన తెలపగా మున్సిపల్ కార్యాలయం వద్ద శాంతి హోమం నిర్వహించారు. దివి ఏరియా జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో చల్లపల్లి నుండి అవనిగడ్డ వరకు వందలాది మంది పాత్రికేయులు, ఎన్‌జిఓలు పాదయాత్ర నిర్వహించారు. అవనిగడ్డలో పాత్రికేయులు తుర్లపాటి రామ్మోహనరావు, ఆళ్ళపర్తి గోపాలకృష్ణ ఆమరణ దీక్షకు దిగగా రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్మన్ మండలి బుద్ధప్రసాద్, శాసనసభ్యుడు అంబటి శ్రీహరిప్రసాద్ సంఘీభావం తెలిపారు. నూజివీడు ఆటోనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పొక్లెయిన్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోపిదేవిలో చల్లపల్లి, మోపిదేవి ప్రాంత రైతులు భారీ మోటారు సైకిల్ ర్యాలీతో హోరెత్తించారు. నందిగామలో ఎన్‌జిఓలు, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ, రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. గుడివాడలో దళిత క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కూచిపూడిలో నారుూ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై క్షురకర్మలు చేశారు. పెడనలో టాక్సీ వర్కర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెసిఆర్ దిష్టిబొమ్మతో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకో అనంతరం కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి రిలే దీక్షలో పాల్గొన్నారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం కోనేరుసెంటరులో జరుగుతున్న రిలే దీక్షలు కొనసాగాయి.
సమైక్యాంధ్ర కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన
english title:
bandh
Date:
Wednesday, September 18, 2013