మచిలీపట్నం , సెప్టెంబర్ 17: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. తాగి వాహనాలు నడపటం, మితిమీరిన వేగం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా గుర్తించి ఆయన ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. తాగి వాహనాలు నడిపే వారి ఆటలు కట్టడి చేసేందుకు జిల్లా వ్యాప్తంగా బ్రీత్ ఎనలైజర్స్ విధానాన్ని, మితిమీరిన వేగానికి కళ్ళెం వేసేందుకు స్పీడ్ గన్ విధానాన్ని జిల్లాలో ప్రవేశపెట్టారు. ఈ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి రోజూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇందులో భాగంగానే బ్రీత్ ఎనలైజర్స్‌తో తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించి వారిని న్యాయస్థానాల్లో హాజరుపరుస్తున్నారు. బ్రీత్ ఎనలైజర్స్ ద్వారా జనవరి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 1,136 మందికి 9 లక్షల 82 వేల 850 జరిమానా విధించారు. స్పీడ్‌గన్ పరికరం ద్వారా జాతీయ రహదారులపై వాహనాల వేగ పరిమితిని ముందుగానే పసిగట్టి వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈ పరికరం ద్వారా కిలోమీటరు ముందుగానే వాహన వేగ పరిమితిని తెలుసుకునే అవకాశం ఉంది. మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను అడ్డుకుని వాహనచోదకులకు జరిమానా విధిస్తున్నారు. ఈ స్పీడ్ గన్‌లను జగ్గయ్యపేట, చిల్లకల్లు, నందిగామ, కంచికచర్ల పోలీస్టేషన్‌ల పరిధిలో వినియోగిస్తున్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా వీటిని వినియోగించనున్నట్లు ఎస్‌పి తెలిపారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్
english title:
breath analysers
Date:
Wednesday, September 18, 2013