Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

రేపు ‘సమైక్య సమరభేరి’

$
0
0

మచిలీపట్నం , సెప్టెంబర్ 17: రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ ఈ నెల 19వ తేదీన జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ‘సమైక్య సమరభేరి’ నిర్వహించనున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి తూర్పు కృష్ణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. నోబుల్ కళాశాల క్రీడా మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే సమైక్య సమరభేని బహిరంగ సభలో వేలాదిమంది ప్రజలు పాల్గొనేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ బహిరంగ సభకు ఎపి ఎన్‌జిఓల సంఘం రాష్ట్ర అధ్యక్షులు చలసాని అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని బహిరంగ సభను విజయవంతం చేసేందుకు జెఎసి నాయకులు విస్తృత చర్యలు చేపట్టారు. జెఎసి చైర్మన్ ఉల్లి కృష్ణ నేతృత్వంలో బృందాలుగా ఏర్పడి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో పాటు గ్రామ సర్పంచ్‌లు, సొసైటీ అధ్యక్షులు, మాజీ ఎంపిటిసిలు, డ్వాక్రా గ్రూపు సంఘాల అధ్యక్షులు, ప్రార్థనా మందిరాలు, మసీదుల పాలకవర్గాలను కలిసి సమైక్య సమరభేరి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు.

ఉద్ధృతమవుతున్న సమైక్యాంధ్ర నిరసనలు
నందిగామ, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్ర ఉద్యమాల్లో భాగంగా మంగళవారం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై అంబారుపేట బైపాస్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. రాష్ట్రాన్ని విభజిస్తే తమకు గడ్డే గతి అంటూ గడ్డి తింటూ నిరసన తెలియజేశారు. దాదాపు అరగంటకు పైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో పెద్ద ఎత్తున విజయవాడ - హైదరాబాదు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమైక్యాంధ్ర అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు జి వెంకటరత్నం, దాదా సాహెబ్, దాసు, డాక్టర్ నీరజ, ఎ సాంబశివరావు, గంగాధర్, పెసరమిల్లి శేఖర్ పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులతో పాటు కెవిఆర్ కళాశాల యూనిట్ ఆక్టా చైర్మన్ ఎజె ప్రతాప్‌రెడ్డి, కార్యదర్శి రాయప్ప, అధ్యాపకులు యు వాసుదేవరావు, మాగం వెంకటేశ్వరరావు తదితరులు తాము కూడా నేటి నుండి సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలియజేసి రాస్తారోకోలో పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కనె్నకంటి జీవరత్నం, ఇ రంగారావు ఆధ్వర్యంలో న్యాయవాదులు గాంధీ సెంటర్ వద్ద రాష్టప్రతికి రాసిన పోస్టుకార్డులను ప్రదర్శిస్తూ నిరసన తెలియజేశారు. గాంధీ సెంటర్ వద్ద ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరంలో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు కూర్చోగా దీక్షా శిబిరాన్ని జెఎసి నేతలు ఆళ్ల రాంబాబు, అమరనేని రమేష్‌బాబు, తాటి రామకృష్ణ తదితరులు ప్రారంభించారు.

రిటైర్డు వైద్యుని ఇంట్లో చోరీ కేసులో నలుగురి అరెస్టు
మచిలీపట్నం టౌన్, సెప్టెంబర్ 17: నాలుగు రోజుల క్రితం ప్రభుత్వ రిటైర్డ్ డాక్టర్ వెంకోబా ఇంట్లో పట్టపగలు జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఇనగుదురు పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి నిందితులను మీడియాకు చూపించారు. ఈయన తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 13వ తేదీన స్థానిక బొర్రావారి వీధిలో నివాసం ఉంటున్న డా. వెంకోబా ఇంట్లో ఉదయం 11 గంటలకు ఇద్దరు గుర్తు తెలియని దుండగలు తాము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లమని చెప్పి చొరబడ్డారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వైద్యుని భార్య నోట్లో గుడ్డలు కుక్కి చంపేస్తామంటూ బెదిరించి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులు, మెడలో ఉన్న నాంతాడు, ఇతర బంగారు వస్తువులు, 4 వేల నగదు అపహరించారు. క్లూస్ టీమ్ ఆధారాల మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు మంగళవారం నిందితులు కాగిత చక్రధర్, ఆయంచ బాలకృష్ణ చైతన్య అలియాస్ బాలు, బండ్రెడ్డి మురళీకృష్ణ అలియాస్ పండు, చింతగుంట అశ్వని కుమార్‌ను అరెస్టు చేశారు. నిందితుల్లో ఇద్దరు బొర్రావారి వీధికి చెందిన వారు కావడం గమనార్హం. చక్రి, బాలు ప్రణాళిక ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డారు. చోరీకి ముందు రోజు చికిత్స నిమిత్తం డాక్టర్ ఇంటికి వెళ్ళి ఎలా చోరీకి పాల్పడాలి అనే దానిపై ప్రణాళిక రచించుకున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి పై నలుగురు చోరీకి పాల్పడ్డారని సిఐ మూర్తి తెలిపారు.

ఇద్దరు నకిలీ పోలీసుల అరెస్టు
నందిగామ, సెప్టెంబర్ 17: తాము పోలీసుల మని చెప్పి ఒక వ్యక్తిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులను నందిగామ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సిఐ భాస్కరరావు విలేఖరుల ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించారు. నందిగామ శివారు అనాసాగరంకు చెందిన రాయిడి వెంకటేష్, రెడ్డి రామకృష్ణ లారీ డ్రైవర్‌లుగా పని చేశారన్నారు. ఈ నెల 4వ తేదీన నందిగామకు చెందిన మస్తాన్ అనే యువకుడు ఒక యువతితో కలిసి అనాసాగరం సమీపంలోని పొలాల్లో కూర్చుని ఉండగా రెడ్డి రామకృష్ణ వారి వద్దకు వెళ్లి తాను పోలీసునని, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మీపై కేసు పెట్టాలంటూ బెదిరించాడు. కేసు పెట్టకుండా ఉండాలంటే 5 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనిపై మస్తాన్ తన వద్ద అంత డబ్బు లేదని, వెయ్యి మాత్రమే ఉన్నాయని చెప్పగా ఆ డబ్బులు తీసుకుని తమ ఎస్‌ఐ మాట్లాడతారంటూ రాయిడి వెంకటేష్‌కు ఫోన్ చేసి మస్తాన్‌కు ఇవ్వగా మరుసటి రోజు పోలీస్ స్టేషన్‌కు వచ్చి తనను కలవాలని తెలిపాడు. ఈ సందర్భంగా మస్తాన్ సెల్ నెంబర్‌ను రెడ్డి రామకృష్ణ తీసుకొని మరుసటి రోజు నుండి ఫోన్ చేసి డబ్బుల కోసం వేధించడంతో పాటు స్టేషన్‌కు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించాడు. దీనిపై అనుమానం వచ్చిన మస్తాన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి విచారించగా ఆ సెల్ నెంబర్ పోలీసులకు సంబంధించింది కాదని తెలుసుకున్నాడు. రెండు రోజుల క్రితం బాధితుడు మస్తాన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితుడు ఇచ్చిన సెల్ ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితులు రాయిడి వెంకటేష్, రెడ్డి రామకృష్ణను అదుపులోకి తీసుకొని విచారించగా వారు నేరం చేసినట్లు అంగీకరించారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సిఐ భాస్కరరావు తెలిపారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

కావూరిని అడ్డుకునేందుకు విఫలయత్నం
హనుమాన్ జంక్షన్, సెప్టెంబరు 17: కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకొనేందుకు సమైక్యావాదులు జాతీయా రహదారిపై అడుగుఅడుగునా విఫలయత్నాం చేశారు. హనుమాన్ జంక్షన్ కూడలిలో జెఎసి నాయకులు, విజయవాడ రోడ్డులో వైయస్‌ఆర్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు కావూరి కాన్వాయ్‌ను అడ్డుకోనేందుకు జాతీయా రహదారిపైకి చేరుకున్నారు. జంక్షన్ సి.ఐ వైవి రమణ, ఎస్.ఐ ప్రభాకర్‌లు సమైక్యావాదులను ఆదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రికి వినతిప్రతం ఇచ్చేందుకు ప్రయాత్నిస్తున్నా తమను అకారణంగా పోలీసులు అడ్డుకున్నారని సమైక్యావాదులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. కావూరి సైతం ప్రయివేటు వాహనంలో వెళ్ళడంతో సమైక్యాసెగ తగలకుండా జాగ్రత్తపడ్డారు.

నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి.. యువకుని మృతి
కంచికచర్ల, సెప్టెంబర్ 17: వినాయకుడి నిమజ్జన వేడుకల్లో అపశృతి చోటుచేసుకోని యువకుడు మృతి చెందడంతో మండలంలోని చెవిటికల్లు గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. వినాయకుడి విగ్రహాన్ని ఊరేగిస్తూ నిమజ్జనం చేసి వెళుతుండగా విద్యుత్ షాక్‌కు గురై గ్రామానికి చెందిన మంగిశెట్టి శ్రీనివాసరావు (25) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది. మృతుడు శ్రీనివాసరావు ఎంబిఎ పూర్తి చేసి హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. స్నేహితుల ఆహ్వానం మేరకు వినాయక నిమజ్జన వేడుకల్లో పాల్గొనేందుకు రెండు రోజుల క్రితం శ్రీనివాసరావు గ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి 2గంటల సమయంలో కృష్ణానదికి విగ్రహాన్ని తీసుకువెళుతుండగా విద్యుత్ తీగలు చేతికి తగిలి ట్రాక్టర్‌పై నుండి కింద పడి అక్కడికక్కడే శ్రీనివాసరావు మృతి చెందాడు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వేల్పుల పరమేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మిశెట్టి భాస్కరరావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి మల్లికార్జునరావు తదితరులు శ్రీనివాసరావు మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

నారుూబ్రాహ్మణుల సమైక్య నాద గర్జన
తోట్లవల్లూరు, సెప్టెంబరు 17: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా మంగళవారం తోట్లవల్లూరులో నారుూ బ్రాహ్మణులు సమైక్యనాద గర్జన చేశారు. మండలంలోని 16 గ్రామాల నుంచి నారుూ బ్రాహ్మణులు పెద్ద ఎత్తున తోట్లవల్లూరు తరలివచ్చారు. వీరికి రాజకీయ, ఉపాధ్యాయ, ఉద్యోగ జెఎసి నాయకులు మద్దతు పలికారు. గుర్విందపల్లికి చెందిన శ్రీ గణేష్ ఫ్రేండ్స్ తీన్‌మార్ బ్యాండ్ బృందం, తోట్లవల్లూరు ఇతర గ్రామాలకు చెందిన సన్నాయి బ్యాండు మేళం వాయిద్యాలతో తోట్లవల్లూరులో సమైక్యనాద గర్జన హోరెత్తింది. వీనులవిందైన పాటలతో ఆలరించారు. జై సమైక్యాంధ్ర, జైజై సమైక్యాంధ్ర నినాదాలతో మార్మోగించారు. మెయిన్ సెంటర్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వద్ద రిలే నిరాహారదీక్ష శిబిరం వరకు భారీ ప్రదర్శన చేశారు. మార్గమధ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను నిరసిస్తూ రామకృష్ణ, పెరుమాళ్ళు అనే వృద్ధులు అరగుండు చేయించుకున్నారు. సమైక్యాంధ్ర నినాదాలతో తోట్లవల్లూరు హోరెత్తిపోయింది.

హ్యాండ్‌బాల్ టోర్నీ విజేత జాకీర్ హుస్సేన్ కళాశాల
విజయవాడ (స్పోర్ట్స్), సెప్టెంబర్ 17: చుట్టుగుంట శాతవాహన కళాశాల ఆధ్వర్యంలో రెండు రోజులుగా జరుగుతున్న కృష్ణా విశ్వవిద్యాలయం అంతర కళాశాలల హ్యాండ్‌బాల్ పురుషుల టోర్నీ విజేతగా డా. జకీర్ హుస్సేన్ కళాశాల జట్టు నిలిచింది. ఆతిధ్య కళాశాల శాతవాహన జట్టు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోగా ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ స్థానంలో నిలిచింది. మంగళవారం సాయంత్రం జరిగిన బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ కార్యదర్శి డా. ఎన్. శ్రీనివాసరావు పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, టోర్నీ చైర్మన్ ఎస్. నాగేశ్వరశర్మ, కృష్ణాజిల్లా హ్యాండ్‌బాల్ సంఘ కార్యదర్శి పి. సత్యనారాయణ, కళాశాల వ్యాయామ విద్య సంచాలకులు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి బిసిహెచ్ సంగీతరావు, క్యాంపస్ మేనేజర్ శ్రీ్ధర్, వివిధ కళాశాలల వ్యాయామ విద్య సంచాలకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. రెండోరోజు మ్యాచ్‌ల ఫలితాలు ఇలా ఉన్నాయి. నాకౌట్ మ్యాచ్‌లో డా. జకీర్ హుస్సేన్ కళాశాల జట్టు విజయం సాధించింది. లీగ్ మ్యాచ్‌ల్లో ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల 10-9తేడాతో డా. జకీర్ హుస్సేన్ కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ కళాశాలపై 15-10 తేడాతో శాతవాహన కళాశాల, ఎస్‌ఆర్‌ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలపై 15-14 తేడాతో జకీర్ హుస్సేన్ కళాశాల, కెబిఎన్ కళాశాలపై 11-7 తేడాతో శాతవాహన కళాశాల జట్లు విజయం సాధించాయి.

రాజకీయ నేతలు పదవులకు రాజీనామా చేయాలి
* దీక్షా శిబిరంలో తుర్లపాటి
విజయవాడ, సెప్టెంబర్ 17: సమైక్యాంధ్రకు మద్దతుగా రాష్ట్ర ప్రజలందరూ కట్టుబడి ఉండాలని, మన రాజకీయవేత్తలు సమైక్యాంధ్రను ముక్కలు చేయుటకు కట్టుబడి ఉండేలా వారి యొక్క ప్రవర్తన కనబడుతోందని, వారి పదవులకు రాజీనామా చేయకుండా ఉన్నారని సీనియర్ పాత్రికేయులు పద్మశ్రీ డా తుర్లపాటి కుటుంబరావు అన్నారు. జెఎసి పిలుపు మేరకు నగరపాలక సంస్థ ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టిన జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరంను ఆయన మంగళవారం సందర్శించి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు జై ఆంధ్ర ఉద్యమంలో ఎందరో ప్రాణత్యాగం చేసి మనకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరిచారని, ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా సాధించిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాన్ని ఇప్పటి రాజకీయవేత్తలు సమైక్యంగా ఉన్న సమైక్యాంధ్రను ముక్కలు చేయాలనే కృత సంకల్పంతో పయనించటం బాధాకరమని అన్నారు. డి ఈశ్వర్ మాట్లాడుతూ సమైక్యాంధ్ర జెఎసి పిలుపు మేరకు ఉద్యమాన్ని కొనసాగించటంతో పాటుగా 30వ తేదీ వరకు జెఎసి ప్రకటించిన నిరసనలలో పాల్గొని వాదనను కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులకు వినిపించి వారు దిగివచ్చేలా పోరాటం కొనసాగించాలని అన్నారు. అడిషనల్ కమిషనర్ (జనరల్) ఆర్‌యంజె నాయక్, అసిస్టెంట్ కమిషనర్లు విజయలక్ష్మి, సాంబశివరావు పాల్గొన్నారు.

లోకాయుక్త ముంగిటకు దుర్గగుడి పంచాయితీ?
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 17: అమ్మవారి సన్నిధిలో ఇటీవల చోటుకున్న వివిధ అవినీతి ఆరోపణలు, ఉద్యోగులపై వేధింపులు, తదితర అంశాలకు సంబంధించిన ఒక వినతిపత్రాన్ని కొంతమంది ఉద్యోగులు లోకాయుక్తకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనికితోడు ఆలయంలో ఒక ప్రముఖ అధికారి ప్రత్యేక్షంగా, పరోక్షంగా మహిళా ఉద్యోగులతోపాటు నిజాయితీ కలిగిన పిఎ స్ధాయి అధికారులపై తీవ్రస్ధాయిలో ఒత్తిడి తీసుకొచ్చి నియమ నిబంధలకు వ్యతిరేకంగా పనులు చేయాలని చెప్పటంపై వినతిపత్రంలో పొందిపర్చినట్లు సమాచారం. లోకాయుక్తతోపాటు వివిధ ప్రభుత్వ శాఖలకు కూడా పంపినట్లు తెలిసింది. దీనికితోడు గత కొద్దిరోజుల క్రితం లోపాయకారిగా నియమ నిబంధలకు వ్యతిరేకంగా ఒక మహిళా ఉద్యోగికి అమ్మవారి సన్నిధిలో ఉద్యోగం కేటాయించటంతోపాటు పట్టుమని పదిరోజులు గడవక ముందే అత్యంత కీలకమైన పోస్ట్‌ను కట్టబెట్టే ప్రయత్నం చేసి చివరకు గొడవ జరుగుతుందని భావించి తిరిగి పోస్టింగ్ ఇచ్చిన సెక్షన్‌కు పంపిన వైనం, తదితర విషయాలను కూడా తేదీలతో సహా పొందిపర్చినట్లు తెలిసింది. కాగా మంగళవారం ఉదయం లోకాయుక్తకు చెందిన ఒక సెక్షన్ అధికారి అమ్మవారి సన్నిధికి వచ్చి వివిధ సెక్షన్‌లకు చెందిన ఉద్యోగులతో కొన్ని అంశాలపై మాట్లాడినట్లు తెలిసింది. ప్రసాదాల అమ్మకాలకు సంబంధించి దేవస్థానానికి కాంట్రాక్టర్ నగదు జమ చేయకుండా నడిపించిన వ్యవహారం, తర్వాత చోటు చేసుకున్న పలు అంశాలను కూడా లోకయుక్తకు సమర్పించిన వినతిపత్రంలో పొందుపర్చారు. ఇప్పటికే దుర్గగుడిపై వస్తున్న ఆరోపణలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ శాఖ ప్రధాన కార్యాలయానికి చెందిన ఒక సీనియర్ ఉద్యోగి తెలిపారు.

టిఆర్‌ఎస్ నేతలు సిగ్గు తెచ్చుకోవాలి
* నన్నపనేని రాజకుమారి
పాయకాపురం, సెప్టెంబర్ 17: తెలంగాణా ప్రజలు, సీమాంధ్ర బిడ్డలు ఒకరిని ఒకరు గౌరవించుకోలేని స్థితిలో ఉన్నారనీ, కేసిఆర్, కేటిఆర్, కోదండరామ్‌లు ఎంతసేపు ద్వేషం, కసీ, అసూయ మాటలు మాట్లాడుతున్నారని, ఈరోజు ఒక తెలుగమ్మాయిని మిస్ అమెరికాగా ఎన్నిక చేయడాన్ని చూసైనా తెలంగాణ పార్టీ వారు సిగ్గు తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి హితవుపలికారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ విజయవాడలో మాంటిస్సోరి వ్యవస్థాపకురాలైన కోటేశ్వరమ్మ మనవరాలు తెలుగమ్మాయి దావులూరి నీనా మిస్ అమెరికాగా ఎన్నికవ్వటం మనం చాలా గర్వించదగ్గ విషయమనీ, ఆ పోటీ ద్వారా భారతదేశాన్ని ఉన్నత స్థాయిలో ఆమె నిలిపిందని అభినందించారు. ఇతర దేశాలు మనల్ని గౌరవిస్తుంటే హైదరాబాద్‌లోని ఉద్యోగుల్ని అక్కడి నుండి వెళ్లిపోమ్మని టిఆర్‌ఎస్ నేతలు అనడం సమంజసమా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అశోక్‌బాబు ఆధ్వర్యంలో జరిగే ఈ ఉద్యమం గతంలో జరిగిన అన్ని ఉద్యమాల కంటే ఏ దేశంలో కూడా కనివినీ ఎరుగని శాంతియుత ఉద్యమమని ఆమె అభివర్ణించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపిలు ఢిల్లీలో ప్రభుత్వాన్ని పడేస్తామని హెచ్చరిస్తే తప్ప కేంద్రానికి చలనం కలగదన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు గరిమెళ్ళ నానయ్య చౌదరి పాల్గొన్నారు.

దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 17: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత శ్రీకనకదుర్గమ్మ సన్నిధిలో వచ్చే నెల 5వ తేదీనుండి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాలకు సంబంధించిన వివిధ ఏర్పాట్లను చేయటంతో అమ్మవారి సన్నిధిలో దసరా సందడి ప్రారంభమైంది. అమ్మవారి ఘాట్ రోడ్‌లో నుండి కెనాల్‌రోడ్‌లోని వినాయకుని గుడి వరకు అతి పెద్ద క్యూ మార్గానికి సంబంధించిన ఏర్పాట్లు ఆర్‌జెసి కె ప్రభాకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రారంభమైయ్యాయి. ఆదివారం అమ్మవారి ఘాట్‌రోడ్ మలుపు వద్ద సబ్ కలెక్టర్ హరి చందనతో క్యూలైన్లు ఏర్పాటు కార్యక్రమానికి ఆర్‌జెసి శంఖుస్ధాపన చేయించారు. మంగళవారం సాయంత్రం 5గంటల సమయానికే ఘాట్‌రోడ్ నుండి రధం సెంటర్ వరకు అనగా కొండపై నుండి కెనాల్‌రోడ్ రధం సెంటర్ వరకు రోడ్డును తవ్వి ఇనుప గ్రిల్స్‌తో క్యూలైను ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 10గంటల కల్లా కెనాల్‌రోడ్ వినాయకుడి వరకు వచ్చి ప్రత్యేక క్యూ మార్గాన్ని పూర్తిస్ధాయిలో ఏర్పాటు చేస్తారు. ఇదేవిధంగా అమ్మవారి మహా ప్రసాదాలలైన లడ్డూ, పులిహార తదితర వాటిని తయారు చేయటానికి ఎంపిక చేసిన శ్రీ మల్లిఖార్జున మహామండపంలోని ఒక ప్రత్యేక కాంప్లెక్స్‌ల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.

విద్యార్థుల విద్యాకాలాన్ని నష్టపోనివ్వం
పాతబస్తీ, సెప్టెంబర్ 17: సీమాంధ్ర ప్రాంత విద్యార్థుల విద్యాకాలాన్ని నష్టపోనివ్వమని అవసరమైతే అదనపు తరగతులు, శెలవుదినాలు, పండుగ దినాల్లో కూడా పాఠాలు బోధిస్తామని ప్రైవేటు పాఠశాలల, కళాశాలల యాజమాన్యాలు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సమైక్యాంధ్ర ప్రధానోపాధ్యాయ పోరాట సమితి పిలునిచ్చింది. మంగళవారం ఉదయం విజయవాడ పాతబస్తీలోని గాంధీజీ మున్సిపల్ హైస్కూల్‌లో సీమాంధ్ర ప్రధానోపాధ్యాయ పోరాట సమితి సమావేశంలో సమైక్యవాద ప్రధానోపాధ్యాయుల సమావేశం అనంతరం విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సీమాంధ్ర ప్రభుత్వ పాఠశాలలో ఈ నెల 22 నుండి పూర్తి స్థాయిలో సమ్మె చేస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని జిల్లాల్లోని పాఠశాలల్లో అవసరమైతే అదనపు పని గంటలు విధించుకుని ఉదయం, రాత్రులు కూడా పాఠాలు చెప్పి విద్యార్థుల సిలబస్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులు నందమూరి హరికృష్ణ తన రాజీనామాని ఆమోదించుకొన్నట్లుగా రా ష్ట్రంలోని ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టుబట్టి తమ రాజీనామాని ఆమోదింపజేసుకోవాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపిన రాజకీయ పార్టీలు తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1 నుండి ఉద్యమ కార్యాచరణను ఈ నెల 30న జరిగే సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఈ సమావేశంలో పోరాట సమితి కన్వీనర్ జివి నారాయణరెడ్డి (కడప), బిసిహెచ్ శంకర్‌నాథ్ (కృష్ణా), వై వెంకట్రావు (ప్రకాశం జిల్లా), ఎంఎ సూర్యనారాయణ (విజయనగరం), సిహెచ్ వెంకటేశ్వర్లు (నెల్లూరు),శంకరరావు (గుంటూరు), పి విష్ణుమూర్తి (తూ.గో జిల్లా), సివివి సత్యనారాయణ, డివి రమణ (ప.గో జిల్లా), కె సతీష్‌బాబు (చిత్తూరు) తదితరులు పాల్గొన్నారు. సీమాంధ్ర జిల్లాల వారీగా సుమారు 50 మంది ప్రధానోపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రాష్ట్ర విభజనను నిరసిస్తూ, సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ
english title: 
samara bheri

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>