విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 18: కన్నబిడ్డను అమ్మకానికి పెట్టిన కసాయి తండ్రి కథ ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక పేగు పంచిన కన్నతల్లికి కడుపుకోతే మిగిలింది. కడు పేదరికం ఆ తండ్రిని ఈ దుస్థితికి దిగజార్చిందా అంటే అదీ కాదు.. వ్యసనాలకు బానిసై డబ్బు కోసం ఈ దురాగతానికి ఒడిగట్టిన పాషాణపు తండ్రితో పాటు అతనికి సహకరించిన డాక్టర్, బిడ్డను అంగట్లో కొనుగోలు చేసిన మరో వ్యక్తిపై గవర్నర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కథనం ప్రకారం... నడివింటి ఆదిలక్ష్మీ, భర్త అప్పారావులకు ఒక కొడుకు, ఒక కుమార్తె ఉన్నారు. సివిల్ కోర్టుల ఎదురుగా ప్లాట్‌ఫారమే వీరి ఆవాసం. రోజూ ఏదొక పని చేసుకుంటూ బతుకు బండిని ఈడ్చుతున్నారు. కాగా వీరికి ఇటీవలే ఒక మగబిడ్డ జన్మించాడు. అయితే వ్యసనాలకు బానిసైన అప్పారావుకు 20రోజులు కూడా నిండని పసికందును అమ్మకానికి పెట్టాలనే దుర్భుద్ధి కలిగింది. ఇంకేముంది భార్య ఆదిలక్ష్మీ కాన్పు వ్యవహారాలు పర్యవేక్షించిన ఆర్‌ఎంపి వైద్యుడు డబ్బుకు కక్కుర్తి పడి అప్పారావుకు జత కట్టాడు. వీరిద్దరూ కలిసి బిడ్డను కొనుగోలు చేసే వ్యక్తి కోసం అనే్వషణ ఆరంభించారు. ఎట్టకేలకు గుంటూరు జిల్లాకు చెందిన సాయిబాబు అనే వ్యక్తితో 40వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో భార్యకు విషయం తెలిసి తన కన్నపేగును దూరం చేసేందుకు ససేమిరా అంటూ భర్తకు అడ్డు తగిలింది. అయినా ఆ పాషాణ హృదయం కరగలేదు. తల్లి నుంచి బిడ్డను వేరుచేసి ఈనెల 16వ తేదీ ఏలూరు రోడ్డు అప్పర థియేటర్ సమీప ప్రాంతంలో అప్పారావు పసికందును తీసుకుని ఆర్‌ఎంపి డాక్టర్ ఆనందరావు సమక్షంలో సాయిబాబుకు విక్రయించి 40వేలు తీసుకుని పంచుకున్నారు. ఇదిలావుండగా పురిటి వాసన కూడా వదలని ఆ పసికందుకు పాలదిక్కయిన ఆ తల్లి హృదయం విలవిలలాడిపోయింది. తట్టుకోలేని గుండెకోత, కడుపుమంటతో ఆమె గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త అప్పారావు, డాక్టర్ ఆనందరావు, కొనుగోలు చేసిన సాయిబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
* పసికందు ఖరీదు రూ.40వేలు * పోలీసులను ఆశ్రయంచిన తల్లి * కొన్న వ్యక్తి, సహకరించిన ఆర్‌ఎంపిపై కేసు నమోదు
english title:
k
Date:
Thursday, September 19, 2013