హైదరాబాద్, మార్చి 5: తెలుగు దేశం పార్టీలో బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. సామాజిక న్యాయానికి అనుగుణంగా బ్రాహ్మణులకు న్యాయం జరగాలని అన్నారు. ప్రపంచ బ్రాహ్మణ జాగృతి సంస్థ, ధన్వంత్రి ఫౌండేషన్, విప్రో ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివిధ జిల్లాల, వివిధ సంఘాల బ్రాహ్మణ నాయకులు సోమవారం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబును కలిశారు.
సామాజిక న్యాయానికి అనుగుణంగా బ్రాహ్మణులకు న్యాయం జరగాలని, సమర్థులైన నాయకులకు తగిన ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చంద్రబాబు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పి కమలాకర్ శర్మ, నారాయణ్ వాస్, హరిదాస్ శర్మ, సినీనటుడు చంద్రమోహన్, న్యాయవాదులు నరసింహారావు, హరీష్‌రావు, పలువురు వైద్య, న్యాయవాద, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సిపై చర్య తీసుకోండి
ఎన్నికల కమిషన్‌కు టిడిపి వినతి
హైదరాబాద్, మార్చి 5: కోవూరు ఉప ఎన్నికల్లో విజయానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇ. పెద్దిరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆ పార్టీపై చర్య తీసుకోవాలని కోరారు. కోవూరులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థికి అనుకూలంగా సాక్షి చానల్‌లో, పత్రికలో ప్రచారం చేస్తున్నారని, ఇవి జగన్ సంస్థలని తెలిపారు. వీటిని పేయిడ్ ఆర్టికల్స్‌గా భావించి, అభ్యర్థి ఎన్నికల వ్యయంలో ఈ ఖర్చు చేర్చాలని కోరారు.
ఎస్‌ఐల రిక్రూట్‌మెంట్
5 కి.మీ పరుగు పరీక్ష జులై 9కి వాయిదా
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 5: రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెల 12న నిర్వహించాల్సిన సబ్ ఇన్‌స్పెక్టర్ల(ఎస్‌ఐ) ప్రాథమిక ఎంపిక టెస్ట్ 5 కిలోమీటర్లు/2.5 కిలోమీటర్ల పరుగును జులై 9కి వాయిదా వేసినట్లు ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 3న జారీ చేసిన నోటిఫికేషన్‌లో ప్రకటించిన సివిల్, ఎ.ఆర్, ఎస్‌ఏఆర్, ఎపిఎస్‌పి విభాగాల్లో ఎస్‌ఐ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. వేసవి కావడంతో ఈ పరీక్షలను బోర్డు వాయిదా వేసింది. అభ్యర్ధులు సంబంధిత రేంజ్ కార్యాలయాల్లో మిగిలిన వివరాలకు సంప్రదించాలని బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది.
చంద్రబాబు హామీ
english title:
bra
Date:
Tuesday, March 6, 2012