ముంబయి, మార్చి 5: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇక నుంచి అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండనున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపిఎల్ సీజన్ నుంచి సచిన్ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లో అకౌంట్ తెరవనున్నాడు. దీని ద్వారా సచిన్ తన ఆలోచనలను, మైదానంలో తన అనుభవాలను అభిమానులతో పంచుకోనున్నాడు. సచిన్‌తో పాటు ముంబయి ఇండియన్స్ జట్టు సభ్యులు హర్భజన్ సింగ్, మలింగ, ఇతర ఆటగాళ్లు, కోచ్ షాన్ పొలాక్ ‘ఎమ్‌ఐ పాల్టన్’ అనే పేరుతో ఒకే అకౌంట్‌లో అందుబాటులో ఉంటారు. ఆటగాళ్లకు, అభిమానులకు మధ్య సంబంధాలను పెంచడానికి ఈ ప్రయత్నం చేశారు. ఐపి ఎల్ ఫ్రాంచైజీలు అభిమానులతో టచ్‌లో ఉండటానికి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లాంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను కొంత కాలంగా ఉపయోగించుకుంటున్నాయి. యువ క్రికెటర్లు సచిన్, ఇతర ముంబయి ఇండియన్స్ (ఎమ్‌ఐ) ఆటగాళ్లతో ఐపి ఎల్ జరిగే టప్పుడు, తర్వాత కూడా క్రికెట్ గురించి చర్చించవచ్చు. ‘అభిమానులు ఎల్లప్పుడూ మా వెంటే ఉండి మద్దతునిచ్చారు. మేము ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాం. దీనికోసం ప్రతి ఆటగాడు అభిమానులకు అందుబాటులో ఉండేవిధంగా ఎమ్‌ఐ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది’ అని ఎమ్‌ఐ ప్రతినిథి తెలిపాడు. అభిమానులతో ఇలా అందుబాటులో ఉండటానికి సచిన్ ఆసక్తిని వ్యక్తం చేశాడు. ‘అభిమాలకు అందుబాటులో ఉండగలగడం, వారు ఏం ఆనుకుంటున్నారో తెల్సుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. మాలో చాలా మంది తొలి సారిగా సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అభిమానులకు చేరువవుతున్నారు’ అని భజ్జీ చెప్పాడు.
రిటైర్మెంట్‌పై సచిన్ ఆత్మవిమర్శ చేసుకోవాలి : చాపెల్
మెల్ బోర్న్ : సహేతుక కారణాలతోనే క్రికెట్ ఆడుతున్నాడో లేదో తెల్సుకోవడానికి సచిన్ ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆసీస్ మాజీ క్రికెటర్ ఇయాన్ చాపెల్ సలహా ఇచ్చాడు. ‘సచిన్ లాంటి ఆటగాడి సామర్థ్యాన్ని ఇతరులు శంకిస్తున్నప్పుడు, నేనెందుకు ఆడుతున్నానని అతడు అద్దంలో ప్రశ్నించుకోవాలి’ అని చాపెల్ ‘సండే టెలిగ్రాఫ్’కు రాసిన కాలమ్‌లో అభిప్రాయపడ్డాడు. ఎవరైనా జట్టును గెలిపించడానికే క్రికెట్ ఆడాలని అతడు పేర్కొన్నాడు. ఆటగాడు పూర్తి సామర్థ్యం మేరకు రాణించినా, జట్టు గెలవనప్పుడు అందులో తప్పుబట్టాల్సిందేమీ ఉండదన్నాడు. సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో రనౌట్ అయినప్పుడు సచిన్‌లో వందో సెంచరీ చేయలేకపోయాననే అసంతృప్తి కనిపించిందని చాపెల్ చెప్పాడు. సచిన్ వందో సెంచరీ భారత జట్టుకు భారంగా మారిందని చాపెల్ తెలిపాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఇక నుంచి అభిమానులకు నిత్యం అందుబాటులో ఉండనున్నాడు.
english title:
sachin
Date:
Tuesday, March 6, 2012