న్యూఢిల్లీ, మార్చి 5: లండన్ ఒలింపిక్స్‌కు డౌ కెమికల్స్ స్పాన్సరషిప్‌పై భారత ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంబించడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఒఎ) ఆక్షేపించింది. లండన్ ఒలిపిక్స్‌లో నిరసన తెలిపితే అది తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చని ఐఒఎ పేర్కొంది. డౌ కెమికల్స్‌ను స్పాన్సర్‌గా తప్పించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం (ఐఒసి) నిరాకరిస్తే ఒలింపిక్స్ బహిష్కరణపై అథ్లెట్ల అభిప్రాయమే కీలకమని క్రీడా శాఖ మంత్రి అజయ్ మాకెన్ ప్రకటించిన సంగతి తెల్సిందే. క్రీడా శాఖ బహిష్కరణ గురించి మాట్లాడుతుంటే, కేంద్ర వ్యవసాయ శాఖ డౌ కెమికల్స్ సహకారంతో సెమినార్‌ను నిర్వహించిందని ఐఒఎ తెలిపింది. ప్రభుత్వం ఈ అంశంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరింది. ‘ప్రభుత్వ ద్వంద్వ వైఖరి ఎక్కువ సమస్యలను సృష్టించింది. మన వాదనను బలహీన పర్చింది. ఒలింపిక్స్ స్పాన్సర్‌షిప్ నుంచి డౌను తప్పించాలని ఓ వైపు ప్రభుత్వం డిమాండ్ చేస్తుండగా, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) గత నెలలో డౌ సహకారంతో సెమినార్‌ను నిర్వహించిందని ఐఒసి తాత్కాలిక అధ్యక్షుడు విజయ్ కుమార్ మల్హోత్రా పేర్కొన్నాడు. ‘ప్రభుత్వం తీరు మమ్మల్ని విస్మయానికి గురిచేస్తోంది. ఈ అంశంపై వారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. మేము రాసిన లేఖలకు సమాధానమివ్వకపోవడం ఈ విధంగా భావించడానికి బలం చేకూరుస్తోంది’ అని మల్హోత్రా తెలిపారు. కావాలని కొన్ని అంశాలను మీడియాకు లీక్ చేయడం ఎక్కువ సమస్యలకు దారితీస్తోందనీ ఆయన అన్నాడు.
ఒలింపిక్స్‌ను పాక్షికంగా బహిష్కరిస్తే తర్వాత తీవ్ర పరిణామాలు ఉండొచ్చనీ, ఆ వ్యూహం బెడిసికొడుతుందని ఆయన వివరించాడు. ఈ అంశంపై ఆరాతీస్తూ ఐఒఎకు చాలా ప్రశ్నలు సంధించారనీ, దేశంలో భారీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న డౌ కెమికల్స్‌పై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో తెలపాలని కోరారని ఆయన పేర్కొన్నాడు.