నేపాల్ రాజ్యాంగ పరిషత్‌కు మంగళవారం జరిగిన ఎన్నికలలో ‘యూనిఫైడ్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ అధినేత పుష్పకమల్ దహల్ ప్రచండ పరాజయంపాలు కావడం ప్రజాస్వామ్య పరిపుష్టికి దోహదం చేయగల చారిత్రక పరిణామం. నేపాల్‌లోని భారత వ్యతిరేక చైనా అనుకూల శక్తులకు దాదాపు రెండు దశాబ్దాలుగా ప్రచండ కేంద్ర బిందువు. 1996నుండి సాయుధ బీభత్స పద్ధతుల ద్వారా నేపాల్‌లో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను భగ్నం చేయడానికి యత్నించిన ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టు పార్టీవారు 2006 నుండి ప్రజాస్వామ్య నిబద్ధత అన్న ముసుగేసుకొని ప్రచ్ఛన్న బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. నూతన రాజ్యాంగ రచనకు వీలుగా రాజ్యాంగ సభ నిర్మాణం కోసం ఎన్నికలు 2006లో జరుగవలసి ఉండగా, ఈ ప్రచ్ఛన్న బీభత్స పద్ధతుల ద్వారా నిరంతరం నేపాల్ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్న మావోయిస్టులు 2008 ఏప్రిల్ వరకు ఆ ఎన్నికలను జరుగనివ్వలేదు. 2008 నాటి ఎన్నికల తరువాత రెండేళ్ళలో రాజ్యాంగ పరిషత్ వారు నూతన రాజ్యాంగాన్ని రచించి అమలు జరుపవలసి ఉండింది. కానీ ఐదేళ్ళుగా రాజ్యాంగ రచన జరగకపోవడానికి ఏకైక కారణం మావోయిస్టుల ప్రచ్ఛన్న బీభత్స కాండ మాత్రమే. తన మాటను మిగిలిన ప్రజాస్వామ్య రాజకీయ పక్షాలు పాటించి తీరాలన్న ప్రచండ మొండిపట్టుదల ఐదేళ్ళపాటు ప్రజాస్వామ్య ప్రక్రియను కుదేలుమనిపించింది. ప్రచండకు, మావోయిస్టులకు లొంగి ఉండకపోయినట్టయితే 2006కు పూర్వం నాటి సాయుధ బీభత్సకాండ పునరావృత్తం కాగలదన్న భయం ఆవహించిన ఇతర రాజకీయ పక్షాలు నిన్నమొన్నటి వరకు కూడ బితుకు బితుకు మంటూ ప్రజాస్వామ్య ప్రకియను నత్తనడకన నడిపించారు. మావోయిస్టుల ఈ బెదిరింపు రాజకీయాలను తుదముట్టించడానికి నేపాలీ జన బాహుళ్యం కృతనిశ్చయంతో ఉందని ఖాట్మండూలోని పదవ నియోజకవర్గంలో ప్రచండ ఓడిపోవడం వల్ల స్పష్టమైపోయింది. 601 మంది సభ్యులున్న రాజ్యాంగ పరిషత్‌లో 575 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగిలిన స్థానాలకు, సభ్యులను, ఎన్నికైన సభ్యులు నియుక్తి-కోఆప్షన్- చేస్తున్నారు. ఎన్నుకునే ఐదువందల డెబ్బయి ఐదింటిలో 235 స్థానాలను వివిధ రాజకీయ పక్షాలకు లభించే వోట్ల శాతం ప్రాతిపదికగా ఆయా పార్టీలకు కేటాయిస్తున్నారు. మిగిలిన 240 స్థానాలకు ఏకసభ్య నియోజకవర్గం -మనదేశంలో వలె- ప్రాతిపదికపై ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రచండ మాత్రమే కాక ఆయన కుమార్తె రేణుకా దహల్ కూడ పరాజయం పాలు కావడం మావోయిస్టుల పట్ల వారి ప్రజాస్వామ్య వ్యతిరేక బీభత్స స్వభావం పట్ల నేపాలీ ప్రజలలో రగులుతున్న ఆగ్రహానికి సరికొత్త నిదర్శనం. 2008 నాటి ఎన్నికలలో 225 స్థానాలను సాధించి ప్రథమ స్థానంలో నిలచిన మావోయిస్టు పార్టీ ఇప్పుడు మూడవ స్థానానికి దిగజారిపోయింది. నేపాలీ కాంగ్రెస్ పార్టీ మొదటిస్థానాన్ని, కమ్యూనిస్టు మార్క్సిస్టు లెనినిస్టు పార్టీవారు రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు.
ప్రచండ ఓటమికాని, మావోయిస్టు పార్టీ తృతీయ స్థానానికి దిగజారడం కాని ఆశ్చర్యకరం కాదు. తమ ఓటమి తప్పదని మావోయిస్టులకు ముందే తెలుసు. అందువల్లనే గత ఏడాది మే నెలలో జరుగవలసి ఉండిన ఎన్నికలను మావోయిస్టులు పద్ధెనిమిది నెలలపాటు వాయిదా వేయించారు. రెండేళ్ళలో రాజ్యాంగ రచన పూర్తి చేయలేకపోయిన రాజ్యాంగ పరిషత్ కాలవ్యవధి 2010లోనే ముగిసింది. అయితే ‘గడువు’ను మూడుసార్లు పెంచడం ద్వారా మూడు ప్రధాన పక్షాలవారూ 2008లో ఎన్నికైన ‘పరిషత్’ను గత ఏడాది మే వరకూ పొడిగించగలిగారు. అయినప్పటికీ, రాజ్యాంగ రచన పూర్తికాలేదు. మళ్ళీ గడువు పొడిగించరాదని నేపాల్ సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో రాజ్యాంగ పరిషత్ రద్దయిపోయింది. దాదాపు పూర్తయిన రాజ్యాంగాన్ని ఆమోదించడానికి మొదట అంగీకరించిన పెద్ద పార్టీ వారయిన మావోయిస్టులు చివరి నిముషంలో అడ్డం తిరగడంతో రాజ్యాంగ రచన పూర్తికాకముందే అలా పరిషత్ రద్దయింది. మావోయిస్టుల ఈ వైఖరికి కారణం వారికి ప్రజాస్వామ్యం గిట్టకపోవడమే. బహుళ పక్ష ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినట్టయితే యుగాలనాటి భారత నేపాల్ స్నేహ సంబంధాలు యధాతథంగా కొనసాగుతాయి. చైనా ప్రభుత్వ ప్రతినిధులుగా 1995లో రంగ ప్రవేశం చేసిన మావోయిస్టులకు ఇది ఇష్టం లేదు. ఏకపక్ష కమ్యూనిస్టు మావోయిస్టు నియంతృత్వ వ్యవస్థను నెలకొల్పడం ద్వారా నేపాల్‌ను భారత్ నుంచి సాంస్కృతికంగా, వ్యూహాత్మకంగా విడగొట్టి చైనా ఒడిలో కూచోబెట్టడం మావోయిస్టుల దీర్ఘకాల లక్ష్యం!
ఈ లక్ష్య సాధనలో భాగంగానే మావోయిస్టులు ఎత్తుగడలు మార్చారు. 1995వ, 2005వ సంవత్సరాల మధ్య సాయుధ బీభత్సకాండను సృష్టించి పదమూడు వేలమందిని బలిగొన్న మావోయిస్టులు 2006 నుంచి వ్యూహం మార్చారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారం హస్తగతం చేసుకొని ఆ తరువాత సైనిక దళాలను మావోయిస్టులతో నింపి సైనిక బలంతో తమ ఏకపక్ష నియంతృత్వాన్ని వ్యవస్థీకరించ యత్నించారు. ఈ రెండవ యత్నం బెడిసికొట్టింది. సైనిక దళాల అధిపతి రుక్మాంగదను తొలగించి చైనా అనుకూల అధిపతిని నియమించాలన్న ప్రధాని ప్రచండ ప్రయత్నాన్ని 2009లో అధ్యక్షుడు రామ్‌భరణ్ అడ్డుకున్నాడు. అప్పటి నుంచి సాయుధ బీభత్సకాండను మళ్ళీ పునరుద్ధరించే వ్యూహ రచనలో మావోయిస్టులు నిమగ్నమై ఉన్నారు. తగిన సమయం కోసం వేచి ఉండటంలో భాగంగా ప్రజాస్వామ్య రాజ్యాంగ రచనా ప్రక్రియకు అంతరాయం కలిగిస్తున్నారు. మావోయిస్టుల ఎత్తుగడలను ఇతర రాజకీయ పక్షాలు గ్రహించాయి. జనం గ్రహించారు. అందువల్లనే మళ్ళీ ఎన్నికలు జరిగినట్టయితే తమకు పరాజయం తప్పదని మావోయిస్టులకు గత ఏడాది ఆరంభం నాటికే స్పష్టమైంది. అందువల్ల రాజ్యాంగ పరిషత్ రద్దయిన తరువాత మావోయిస్టు ప్రధాని బాబూరామ్ భట్టారాయ్ మళ్ళీ ఎన్నికలను జరిపించలేదు. ప్రధాని పదవికి రాజీనామా కూడ చేయలేదు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు వీలుగా రాజీనామా చేయవలసిందిగా అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ పదే పదే ఆదేశించినప్పటికీ, మావోయిస్టులు పదినెలలకు పైగా మొండికెత్తడం, మరో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించింది. నూతన రాజ్యాంగం ఏర్పడకపోవడం తాత్కాలిక రాజ్యాంగం ప్రకారం పాలన జరుగుతుండడం మొదటి సంక్షోభం...
ఇలా ఎన్నికలను వాయిదా వేయించడాన్ని సహించని అధ్యక్షుడు తీవ్రచర్యలకు పూనుకుంటానని హెచ్చరించడంతో గత మార్చిలో భట్టారాయ్ వైదొగాడు. నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అఖిల్ రాజ్ రేగ్మీ కార్య నిర్వాహక ప్రధానిగా నియుక్తి అయ్యాడు. ఆ తరువాత కూడ మావోయిస్టులు ఎన్నికలు జరగరాదని 2012లో రద్దయిన రాజ్యాంగ పరిషత్‌ను పునరుద్ధరించాలని విచిత్రమైన కోరికను కోరారు. అధ్యక్షుడు తిరస్కరించడంతో ఆ వైచిత్రి వాస్తవం కాలేదు. తమ పార్టీని చీల్చడం రాజ్యాంగ ప్రక్రియను నిరోధించడానికి మావోయిస్టులు వేసిన మరో ఎత్తు..గత ఏడాది జూన్‌లో కిరణ్ అనే నాయకుడు ప్రచండ నాయకత్వంలోని పార్టీనుంచి విడిపోయాడు. అప్పటి నుంచి ఎన్నికలను బహిష్కరించాలని అతగాడు పిలుపునిస్తున్నాడు. ఒకవర్గం ఎన్నికలలో పోటీ చేయడం, మరోవర్గం బహిష్కరించడం. మొదటి వర్గం గెలిస్తే వౌనంగా ఉండాలి. లేకుంటే రెండవ వర్గం మళ్ళీ హింసాకాండ మొదలు పెట్టాలి. ఇదీ ఎత్తుగడ!!
నేపాల్ రాజ్యాంగ పరిషత్‌కు మంగళవారం జరిగిన ఎన్నికలలో ‘యూనిఫైడ్ మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’
english title:
prechanda
Date:
Saturday, November 23, 2013