మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడబోతున్న తరుణంలో, రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకం సమస్య మళ్ళీ తెరమీదకు వస్తోంది. అయితే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెబుతున్నట్టుగా నీటియుద్ధాలు జరగవు కానీ, నీటిపై సరికొత్త సంఘర్షణలు తలెత్తే అవకాశాలను తోసిపుచ్చలేం. అందువల్ల రాష్ట్రాన్ని విభజించకుండా సమైక్యంగా ఉంచడం ద్వారా నీటి సంఘర్షణలకు పరిష్కారం లభిస్తుందని కాదు ఇక్కడ అర్థం. అసలు నీటికోసం మనమెందుకు పోరాటం చేయాలనేది వౌలికమైన ప్రశ్న. ఇప్పటి వరకు భారతదేశం నీటి నిర్వహణపై పెద్దగా దృష్టి సారించలేదు మరి. మనదేశం ఎంతసేపూ నదీ జలాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణాకోసం పనికి వచ్చే సాధనాలుగా మాత్రమే పరిగణిస్తూ వచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాలగుండా అనేక నదులు ప్రవహిస్తున్న నేపథ్యంలో నీటి నిర్వహణపై సరియైన అవగాహన అటు కేంద్రానికి, ఇటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయ. ప్రాజెక్టులు నిర్మించడం ఎంత ముఖ్యమో, వాటిద్వారా సరఫరా అయ్యే నీరు సక్రమంగా ఆయా రాష్ట్రా లు, లేదా ఒక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య సమతూకంగా పంపిణీ జరగడం కూడా అంతే ముఖ్యం. దీనిపై సరైన దృష్టి కేంద్రీకరించనంతకాలం నీటి సంఘర్షణలు తప్పవు. ఈ నేపథ్యంలో నీటి సంఘర్షణలు రావడానికి కారణాలు తెలుసుకుందాం.
గత నలభైఏళ్ళ కాలంలో చాలా ప్రపంచ దేశాలు నీటి నిర్వహణా విధానాలను రూ పొందించాయి. కానీ భారత్ మాత్రం ‘‘ నీరు వృధా అవుతోంది. పెద్దమొత్తంలో నీరు సముద్రంలో కలిసిపోతున్నది. సాగుకు మరింత నీరు అవసరం. అందువల్ల డ్యాంల నిర్మాణానికి, డైవర్షన్‌లకు, కాల్వల నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేయాలి,’’ వంటి పురాతన భావజాలానే్న పట్టుకొని వేలాడుతోంది. నిజానికి ఈరకమైన ఆలోచనా విధానం 1950,1960 లేదా 1970 ప్రాంతంలో కొనసాగాల్సింది. అప్పట్లోనే ఇటువంటి ఆలోచనలను అమలు జరిపి మన ఇంజనీర్లు అద్భుతాలు సృష్టించారు. ఆహార భద్రతను మరింత మెరుగు పరచి మనం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపగలమని వారు అప్పట్లోనే నిరూపించారు. ఇదంతా నాటిమాట. కానీ అసలు సమస్య ఎక్కడ వస్తున్నదంటే, నాటి భావజాలానే్న ఇంకా పట్టుకొని వేలాడంవల్ల. ఎప్పుడో చేపట్టి పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు కూడా చేపడుతుండటమే సంఘర్షణలకు అసలు కారణం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004-09 మధ్య కాలంలో జలయజ్ఞం కోసం రూ. 1,86,000 కోట్లు మంజూరు చేసింది. నిజం చెప్పాలంటే అది ధనయజ్ఞంగా మారిపోయింది. చాలామంది భూముల కొనుగోళ్ళకు, భవన నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టారు. కానీ మంజూరైన నిధుల్లో చాలా స్వల్ప మొత్తం మాత్రమే ఉత్పత్తిని పెంచడానికి వినియోగించారు. సరీగ్గా ఈ వృధానే ‘కాగ్’ తప్పు పట్టింది. నేడు రైతులకు లబ్ది చేకూర్చే విధంగా సాగునీటి పథకాలపై పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన విధివిధానాలు మనదేశంలో ప్రస్తుతం అమల్లో లేవు. కేవలం రైతులకు సహాయం చేస్తున్నామన్న పేరుతో కాంట్రాక్టర్ల బొజ్జలు నింపుతున్నామంతే!
ఇక నీటి కేటాయింపులు కూడా సంఘర్షణకు మరో కారణంగా మారుతున్నాయి. నదీ ప్రవాహంనుండి, కొంత పరిమితికి లోబడి మాత్రమే మనం నీటిని వాడుకోగలం లేదా వినియోగించుకోగలం. ఎందుకంటే పరిమితికి మించి వాడితే నదులుగా వాటి మనుగడ చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. తర్వాత అవి ‘డ్రైన్లు’గా మారిపోతాయి. ఈ అభిలక్షణం కారణంగానే, నదులపై ఆధారపడటాన్ని 75శాతం నుంచి 65 శాతానికి కుదించడం జరిగింది. ఇది రాష్ట్రాల మధ్య, ఒక్కొక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య నీటి సంఘర్షణలకు ప్రధానంగా దారి తీసింది.
ఇక నదుల నీటిలో తనకు రావలసిన వాటా కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇతర రాష్ట్రాలతో పోరాటం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుంది. కానీ అవే రాష్ట్రాలు అంతర్గతంగా వివిధ ప్రాంతాల మధ్య నీటి కేటాయింపులు సక్రమంగా జరపడానికి అనువైన యంత్రాంగాన్ని ఏర్పరచుకున్న పాపాన పోలేదు. సంఘర్షణలు తలెత్తడానికి ఇది రెండో కారణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన డిమాండ్ రావడానికి అటువంటి యంత్రాంగాన్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేయకపోవడం కూడా కారణం. ప్రభుత్వం ఆనకట్టలు నిర్మిస్తుంది. మరి ఆ ఆనకట్టలనుంచి ఆయకట్టు ప్రాంతాలకు నీరు ఉచితంగానే సరఫరా చేయబడుతుంది. ఈవిధంగా ఉచితంగా నీటిని అందించడం మరో కొత్త సంక్లిష్ట సమస్యకు దారితీస్తోంది. ప్రభుత్వం నీటి సరఫరా చేస్తున్నప్పుడు, అది కూడా ఉచితంగానే లభిస్తున్నప్పుడు, ప్రతి రైతూ ఆ నీటికి కోరుకుంటాడు. ప్రభుత్వం ఎంతపెద్ద మొత్తంలో నీటిని సరఫరా చేసినా, ఇంకా..ఇంకా కావలని కోరడం సర్వసాధారణం. అటువంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయకుండా కేవలం పంట ఉత్పత్తులకు మాత్రమే నీటిని వినియోగించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు అందించే వ్యవస్థ లేకపోవడం మరో దౌర్భాగ్యం. విచ్చలవిడిగా సాగునీటిని వాడే విధానానికి అడ్డుకట్ట వేయాలంటే, వాడుకున్న నీటికి రైతులనుంచి కొంత మొత్తం వసూలు చేయడం ఉత్తమం. మరి సరఫరా చేసే నీటికి ఎంత రేటు నిర్ధారించాలనే దానిపై స్పష్టమైన ఫ్రేమ్‌వర్క్ ఉన్నదా అంటే అదీ లేదు. ఎంతకాలమైతే రైతులు తాము వాడుకుంటున్న నీటికి తగిన మొత్తం చెల్లించే అవసరం ఉండదో, అప్పటి వరకు వారు తమ పొలంలోని ప్రతి అంగుళాన్ని నీటితో తడపాలన్న ఉద్దేశంతో ఉంటారు. అయితే ఇది ఏ ఒక్కసారికో పరిమితం కాదు. రెండుసార్లు, అవసరమైతే మూడోసారి కూడా వారు తమ భూములను పూర్తిగా తడుపుకోవడానికి వెనుకాడబోరు. ఇది నీటి సంఘర్షణలు రావడానికి మూడో కారణం. ఎవరైతే నీటిని పొందుతున్నారో..ఆ నీటిపై పరిమితి లేదు, దానికి ధర నిర్ణయమూ లేదు, చెల్లించాల్సిన అవసరం అంతకంటే లేదు.
తమకు నీరు లభించకపోవడానికి మీరే కారణమంటూ, రాష్ట్రాలు పరస్పరం ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడం సర్వసాధారణంగా జరుగుతోంది. మరి అదే ఒక రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమైనప్పుడు, ఆయా ప్రాంతాలకు చెందిన రాజకీయ నాయకులు తమ ప్రాంతానికి అనుకూలంగా వ్యవహరించడం వర్తమాన వైపరీత్యం. అందువల్ల ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నప్పటికీ...వారు నీటిని చట్టప్రకారమైనా లేదా చట్టవిరుద్ధమైనా పట్టించుకోకుండా తమ జిల్లాకు నీటిని తరలించుకుపోవడం సర్వసాధరణంగా జరిగే తంతు. నిజానికి ఆంధ్రప్రదేశ్‌లో నీటి సంఘర్షణలకు అత్యంత ప్రధాన కారణం ఇదే. ఏది ఏమైనా రాష్ట్ర విభజన దగ్గరపడినట్టే కనిపిస్తున్నది. ఒకవేళ అదే నిజమైతే, సీమాంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు గత అనుభవాలనుంచి నేర్చుకున్న పాఠాల నేపథ్యంలో, నీటి సంఘర్షణలను పరిష్కరించడం కోసం ప్రత్యేక యంత్రాంగాలను తక్షణమే ఏర్పాటు చేసుకోవాలి. క్లుప్తంగా చెప్పాలంటే రెండు రాష్ట్రాల మధ్య నీటి నిర్వహణపై అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతుల్లో ఈ దిగువ పేర్కొన్న వాటిని కూడా కలపాలి.
* ట్రిబ్యునల్ అవార్డుల లేఖలను, స్ఫూర్తిని గౌరవించడం. ప్రాజెక్టుల ద్వారా రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులు జరగాలి. కృష్ణ, గోదావరి పరీవాహక ప్రాంతాలకు సంబంధించినంతవరకు ఈ కేటాయింపులను గౌరవించాలి.
* రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన నీటి వౌలిక సదుపాయాలను- నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు- స్వతంత్రంగా పనిచేసే చట్టబద్ధమైన పాలనాయంత్రాంగం నిర్వహించాలి.
* పోలవరం ప్రాజెక్టును పునః పరీక్షించాలి. ఒకే లక్ష్యాన్ని సాధించడానికి వీలుగా ఆర్‌ఆర్, ఇతర అవకాశాలు ఏమైనా ఉన్నాయేమో అనే్వషించాలి. వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కూడా ప్రాజెక్టును నిర్మించడం తప్పనిసరైతే భార త ప్రభుత్వం తప్పనిసరిగా కలుగజేసుకోవాలి. అప్పుడు కేంద్రం తన ఆర్‌ఆర్ విధానాన్ని, మార్గదర్శకాలను అమలు జరపాలి.
* రెండు రాష్ట్రాలు పరస్పరం ఒకరిని ఒకరు నిందించుకోవడం తగదు. ప్రతి హెక్టారు భూమిని సాగులోకి తీసుకొని రావడం సాధ్యం కాదని, రెండు రాష్ట్రాల రాజకీయ నాయకులు రైతులకు స్పష్టంగా తెలియజేయాలి. ప్రాజెక్టు నీటిని సాగుకోసం వాడుకుంటున్న రైతులు కనీసం నిర్వహణ ఖర్చులనైనా ప్రభుత్వానికి చెల్లించాలి. అదేవిధంగా సాగునీరు లభించని మిగిలిన రైతులకు ఇతర ప్రోత్సాహకాలను అందించాలి.
* తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయం సాధించే రైతులకు రివార్డులు, ప్రోత్సాహకాలు అందించాలి. అస్పష్టమైన భావనలకు ఏమాత్రం తావు ఇవ్వరాదు. ఈ విధానాలు చాలా దేశాల్లో అమలు జరుపుతున్నారు.
* తెలంగాణలో అత్యధిక ఖర్చుతో కూడి, అత్యంత సంక్లిష్టత కలిగిన ప్రాజెక్టులను, ఎక్కువ మొత్తం పెట్టుబడిగా పెట్టాల్సిన, బహుళ- దశల ఎత్తిపోతల పథకాలను పునఃసమీక్షించాలి. ఇదే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. అలా చేయకపోతే ఈ ప్రాజెక్టులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి గుదిబండగా మారతాయి.
సోవియట్ యూనియన్, ఇట్రుష్ నది నుంచి కరగండ కాల్వ వంటి ప్రాజెక్టులను నిర్మించింది. ఈ ప్రాజెక్టు ఇంకా పనిచేస్తోంది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్వహణ ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారింది. సాగునీటి ప్రాజెక్టుల వాస్తవిక ఖర్చును పరిగణలోకి తీసుకోని ప్రణాళికా రూపకర్తలకు ఇదొక గొప్ప ఉదాహరణగా మిగిలిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా, కృష్ణా,గోదావరి నదులు మనకు ఉమ్మడి జీవన భృతిని కలిగించేవిగా కొనసాగుతాయి. అందువల్ల మనం నీటి యుద్ధాల గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటులో ఉన్న నదీ జలాలను ఏవిధంగా నిర్వహించుకోవాలో నేర్చుకోవడమే ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యావసరం.
మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు, నీటికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
english title:
neeti
Date:
Saturday, November 23, 2013