రాష్ట్ర విభజన అంశంతో ఇప్పుడు భాగ్యనగరం, భద్రాచలం వివాదస్పదంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భద్రాచలం డివిజన్ తెలంగాణ పరిథిలో ఉండాలని, కాదు సీమాంధ్ర పరిథిలో ఉండాలని వాదోపవాదాలు ప్రారంభమయ్యాయి. 1956 సంవత్సరానికి పూర్వం ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని పునరుద్ధరించమని కోరుతున్నామే తప్ప సీమాంధ్ర నుంచి ఒక్క అంగుళం కూడా ఎక్కువ వద్దు అని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు తన ప్రసంగాల్లో అనేక పర్యాయాలు పేర్కొన్నారు. కానీ కెసిఆర్ ఆ తర్వాత నాలిక కరచుకున్నారు. మొదటి నుంచి భద్రాచలం డివిజన్ ఆంధ్రలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. 1959 సంవత్సరంలో పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలో కలిపారు. కేవలం జీవో జారీ చేశారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టలేదు. భద్రాచలం నుంచి తూర్పు గోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడకు వెళ్ళాలంటే ఖమ్మం జిల్లా కేంద్రం కన్నా అధిక దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకసారి భద్రాచలాన్ని వదులుకున్న సీమాంధ్ర వాసులు తిరిగి ఎలా కోరుతారన్న ప్రశ్న తెలంగాణ వాసులు నుంచి ఉత్పన్నమవుతున్నది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు భద్రాచలం రెవెన్యూ డివిజన్‌ను ఖమ్మంలోనే ఉంచడం జరిగింది.
సమైక్యాంధ్రనే కొనసాగించాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని వివిధ రాజకీయ పార్టీలు చీలిపోయినట్టుగానే భద్రాచలం విషయంలోనూ భిన్న వాదనలు లేకపోలేదు. భద్రాచలం ఆది నుంచి ఆంధ్ర ప్రాంతంలోనే ఉందని,.. కాదు, తెలంగాణకే దక్కాలని ఇలా రెండు వాదనలు ప్రారంభమయ్యాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా మారే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలిపే విధంగా సీమాంధ్రకు చెందిన ప్రధాన పార్టీలన్నీ యత్నిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం ముంపు అంశాన్ని తెలంగాణ ప్రాంతం వాళ్ళు సాకుగా చూపి ప్రాజెక్టును నిలిపి వేయించే ప్రమాదం ఉందన్న అనుమానం సీమాంధ్ర నేతలకు ఉంది. భద్రాచలం 1820 నుంచి 1956 వరకు ఆంధ్రలో ఉందని చరిత్రకారుల ద్వారా స్పష్టమవుతున్నా, ఆ తర్వాత తెలంగాణలో కలిపారు కాబట్టి ఇక వివాదం చేయవద్దని తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భద్రాచలం కోసం సీమాంధ్ర ప్రాంత పార్టీల నేతలు ఎంతగా యత్నిస్తున్నారో, తెలంగాణ ప్రాంతానికి చెందిన నాయకులు, ప్రజలూ అదేవిధంగా పోరాటం చేస్తున్నారు. భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతం నుంచి విడదీసే ప్రక్రియ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో వివిధ పార్టీల నాయకులు 48 గంటల బంద్ నిర్వహించారు. ఇంకా నిరసనలు, నిరాహార దీక్షలూ కొనసాగుతూనే ఉన్నాయి.
చరిత్ర లోతుల్లోకి వెళితే భద్రాచలం వివాదస్పదంగానే ఉంది. 1923 సంవత్సరం వరకూ భద్రాచలం నవాబుల పాలనలో ఉండేదన్న వాదన ఉంది. అటువంటప్పుడు ఆ తర్వాత కాలంలో సీమాంధ్రలోకి ఎలా వెళ్ళింది, ఎందుకు వెళ్ళిందన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. నవాబు పాలనలో భద్రాచలం దేవాలయంలోని శ్రీసీతారామచంద్ర స్వామి కళ్యాణం సందర్భంగా గోల్కొండ ప్రభువులు తలంబ్రాలు పంపేవారని, అప్పటి నుంచి నేటికీ ఆ సంప్రదాయాన్ని ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అంటున్నారు. తలంబ్రాలు పోసినంత మాత్రాన తెలంగాణ ప్రాంతానికి చెందినది అవుతుందా? అలాగైతే పూరి జగన్నాథం, రామేశ్వరం ఆలయాల్లో నేపాల్ రాజు, తదితరులు ధర్మకర్తలుగా ఉన్నారని, అంత మాత్రాన ఆ దేవాలయాలు వారికే చెందుతాయా? అని సీమాంధ్ర ప్రాంత నాయకులు ప్రశ్నిస్తున్నారు. నేపాల్‌లోని పశుపతినాధుడి ఆలయంలో ప్రధాన పూజారులుగా కేరళకు చెందిన వారున్నారని, దీంతో ఆ దేవాలయం తమ దేశానికి చెందిందే అంటే అక్కడి వాళ్ళు ఊరుకుంటారా? అని అంటున్నారు. భద్రాచలాన్ని తెలంగాణ ప్రాంతంలో కలిపేందుకు నాడు బ్రిటీష్ దొరలు కూడా అంగీకరించలేదంటున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడానికి తెలంగాణ కంటే సీమాంధ్రులే ఎక్కువ సంఖ్యలో వెళతారని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. ఇలా రకరకాలుగా వాదనలు కొనసాగుతుంటే, మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం జరుగుతున్నది. లోగడ బ్రిటీష్ పాలనలో తూర్పు గోదావరి జిల్లాకు సిరివంచ కేంద్రంగా ఉండేది. మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఉన్న సిరివంచ ఆ తర్వాత ఆ ప్రాంతం మహారాష్టల్రో ఉంది. అక్కడ ఇంద్రావతి, ప్రాణహిత సంగమం ఉంది. సిరివంచలో తెలుగు వారే (90 శాతం) ఉన్నందున ఆ ప్రాంతాన్ని మళ్లీ కలుపుకుంటే బాగుంటుందన్న అభిప్రాయం వస్తున్నది. దీనికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తుందా? ఇది మరో వివాదానికి దారి తీయకుండా ఉంటుందా?.
ఇక భాగ్యనగరంగా భాసిల్లిన హైదరాబాద్‌పైనే అందరి కళ్ళు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ళ పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా చేయాలన్న ప్రతిపాదనను కేంద్రం తెలిపింది. దీంతో ఒకవైపు తెలంగాణ ప్రాంత వాసులు అగ్గిమీద గుగ్గిలం అవుతుంటే సీమాంధ్రకు చెందిన ఇరువురు కేంద్ర మంత్రులు, పలువురు రాష్ట్ర మంత్రులు, ఇతర నాయకులు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌ను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ముందు కూడా పెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీమాంధ్ర ప్రాంతానికి విడిగా రాజధాని నిర్మించుకోవడానికి వీలుగా మూడు లేదా ఐదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉండడానికి అభ్యంతరం లేదు కానీ పదేళ్ళు ఇవ్వడం సాధ్యం కాదని తెలంగాణ వాదులు, నాయకులు బలంగా వాదిస్తున్నారు. ఇలా భాగ్యనగరం, భద్రాచలం వివాదస్పదమయ్యాయి. ఈ రెండింటినీ సామరస్యంగా కేంద్రం పరిష్కరిస్తుందని ఆశిద్ధాం.
రాష్ట్ర విభజన అంశంతో ఇప్పుడు భాగ్యనగరం, భద్రాచలం వివాదస్పదంగా మారాయి.
english title:
bagyanagaram
Date:
Saturday, November 23, 2013