విజయనగరం పాలకులు ఆనందగజపతి, అశోకగజపతి, పి.వి.ఆర్.రాజు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుకున్నారు. ఇది కాదనలేని చారిత్రక సత్యం- మరి తర్వాత వచ్చిన ప్రజాప్రతినిధులు అలా చేశారా? తమ లిక్కర్ అక్రమ సామ్రాజ్యాలు పెంచుకోవటంలో పోటీపడ్డారు. ప్రజలు చాలాకాలం ఇది మా ఖర్మ అని భరించారు. సమయం వచ్చేసరికి వారి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. హింస కూడదు- అని గౌతమబుద్ధుని మహాత్మాగాంధీ జీసస్ క్రైస్టుల నీతులు ఇప్పుడు ఫలించటం లేదు. రాష్ట్రాన్ని రెండుగా చేయాలనే నిర్ణయం జరిగిపోయింది. ఇప్పుడేం చేయలేము అని కాంగ్రెసుపార్టీ అధినేత్రి సెప్టెంబర్ 2013లో మళ్లీ మళ్లీ ప్రకటించారు. ఆ నిర్ణయం ఏమిటి? తెలంగాణాలో దామోదర రాజ నరసింహ, లేదా జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేయటం, సీమాంధ్రలో చిరంజీవి లేదా బొత్స సత్యనారాయణకు పదవిని కట్టపెట్టాలనే నిర్ణయం జరిగిపోయిందట. నిర్ణయాలు తీసుకోవలసింది అమలుచేయవలసింది ప్రజాస్వామ్యంలో ప్రజలే కాని పాలకులు కాదు. కాని తమకు తెలియకుండా తమ ప్రమేయంలేకుండా ఏదో దగా జరిగిపోతున్నదని ప్రజలు పసికట్టేసరికి పరిస్థితి‘‘చే’’జారిపోయింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ ఉంది. ఓటు వారి ఆయుధం. కాని ఓట్లేయించుకొని అందలాలు ఎక్కినవారు ప్రజారక్షణకాక ప్రజాభక్షణ చేస్తుంటే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. బాలెట్ వదిలి బుల్లెట్ మార్గం పట్టిన నక్సలిజానికి ఇదొక ఆవిర్భావ కారణం. ఇటు తెలంగాణాలో రాష్ట్ర విభజనకు నక్సలైట్లు చురుకైన పాత్ర పోషించినట్లే అక్కడ సీమాంధ్రలో సమైక్య రాష్ట్రంకోసం క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యేక ఉద్యమాన్ని 2000 ప్రాంతాలలో ప్రారంభించిన కె.సి.ఆర్. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తన పార్టీని (టిఆర్‌ఎస్) కాంగ్రెసులో విలీనం చేస్తాను అన్నారు. శ్రీమతి సోనియాగాంధీ కెసిఆర్‌ను నమ్మిందా? లేదా నమ్మినట్లు నటించిందా? సిడబ్ల్యుసి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం నిర్ణయం తీసుకున్న తర్వాత కె.సి.ఆర్ విభజన గురించి మాట్లాడుతున్నారే కానీ విలీనం గురించి మాట్లాడటం లేదు- ఎందువల్ల? 2014 లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణాలో పదిహేను పార్లమెంటు స్థానాలు గెలుచుకోవటం ఆయన ఏకైక లక్ష్యం.
ఇటు తెలంగాణా ప్రజలను రెచ్చగొట్టారు- వెయ్యిమంది తెలంగాణా బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నారు. ‘‘ఆప్షన్ లేదు- వెళ్లిపోవలసిందే’’అని సీమాంధ్రులనూ రెచ్చగొట్టి వారిలో అభద్రతాభావం సృష్టించారు. హైదరాబాదు 30 లక్షల మంది ముస్లిములు మరో ముప్ఫై లక్షల మంది సీమాంధ్రులు, పార్శీలు, తమిళులు, కన్నడిగులు, మరాఠీలు, బెంగాలీలు ఉన్నారు. వీరి అభిప్రాయాల్ని కెసిఆర్ లేదా సోనియాగాంధీ పరిగణనలోకి తీసుకున్నారా?? 10 జన్‌పథ్‌లో ఒకరు, ఫాంహౌస్‌లో మరొకరు నిర్ణయాలు తీసుకొని ప్రజల నెత్తిమీద రుద్దటమేనా? విదర్భ ప్రాంతం మహారాష్టన్రుండి విడిపోవాలని చాలాకాలంగా అనుకుంటున్నది. దానికి మహారాష్ట్రులు ఒప్పుకోవటం లేదు. సుశీల్‌కుమార్‌షిండే అంగీకరించటం లేదు. కాని ఆంధ్రప్రదేశ్ మాత్రం వారి రాజకీయ ప్రయోగశాల అయింది. ఆంగ్లంలో దీనిని గన్నీడిగో అంటారు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర సోనియాగాంధీకి సుషమాస్వరాజ్‌కు తెలుసా? దేశ అఖండతకోసం ప్రాణాలర్పించిన మహాపురుషుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ గూర్చి ఈమెకు తెలుసా? ఇప్పుడు బిజెపివాళ్లు ఏ ముఖం పెట్టుకొని శ్యాంప్రసాద్ ముఖర్జీ- దీనదయాళ్ ఉపాధ్యాయల చిత్రపటాలను తమ పార్టీ ఆఫీసులలో పెట్టుకుంటారు? ఎంతకాలం ఇంకా ప్రజలను ‘‘అఖండ భారత్’’ నినాదంలో మోసంచేస్తారు?? ఒకే భాష మాట్లాడే రెండు ప్రాంతాలను కలిపి ఉంచలేని బిజెపి రెండు దేశాలను కలిపి అఖండభారత్ ఎలా సాధిస్తుందో చెప్పాలి.
రాష్ట్ర విభజన ప్రకటనను కాంగ్రెసు అధిష్టానం 29-7-2013నాడు చేయగానే తెలుగుదేశంపార్టీ నాయకుడు మాట్లాడుతూ తెలుగువారు ఆంధ్ర ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మించుకోవటంకోసం నాలుగు లక్షల కోట్లు ఇవ్వాలి అని అన్నారు. రాష్ట్ర విభజన తనకు సమ్మతమే అని న్యూఢిల్లీకి లేఖను ఇచ్చారు. కాని సెప్టెంబరు 2013లో సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున చెలరేగగానే ‘కాంగ్రెసు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది’ అన్నారు. ఈ అడ్డగోలు ఏమిటో ఎవరికీ అర్థంకాలేదు. బాబుగారూ! తెలుగుజాతి సమైక్యంగా ఉండాలా? లేక రెండు రాష్ట్రాలుగా విడిపోవాలా? అనే సూటి ప్రశ్నకు వారివద్ద క్లారిటీ లేదు. ఒకవైపు ‘విభజన’కు అంగీకరిస్తూ మరొకవైపు సీమాంధ్ర సమైక్యవాదానికి న్యాయం జరగాలి అంటే అర్థం ఏమిటో బిజెపి వివరించగలదా??
సీమాంధ్ర ప్రజలు తెలుగుజాతి ఏకతను కోరుకుంటున్నారు. తెలంగాణాలో కొన్ని జిల్లాలలో ప్రత్యేకవాదం ఉంది. హైదరాబాదులోని ముస్లిములు సమైక్యవాదాన్ని బలపరుస్తున్నారు. మరి ఈ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు? కేవలం రాజకీయ పార్టీలు మాత్రమే. ఉభయ ప్రాంతాలల్లో రాజకీయ లబ్ధిపొందాలనే దురాశతో డబుల్‌గేమ్ ఆడుతున్నారు. కెసిఆర్‌కు ప్రత్యేక రాష్ట్రం రావడం ఇష్టంలేదు. అందుకే సీమాంధ్రోళ్లను రెచ్చగొట్టి అక్కడ ఉద్యమం వచ్చేటట్లు చేశారు. తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తానని చెప్పి మాట మార్చారు. నిజంగా తెలంగాణావస్తే అప్పుడు ఏం నినాదంతో ఓట్లను దండుకోగలడు?? లేకుంటే ‘‘హైదరాబాదులో ఎన్నాళ్లనుండి సీమాంధ్రులు ఉన్నా వారంతా టూరిస్టులే’’- అనటంలో అర్థం ఏమిటి?ఈయన విజయనగరంనుండి ఒకప్పుడు వచ్చిన టూరిస్టే కదా!
చత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, తెలంగాణా విదర్భ అంటూ చిన్న రాష్ట్రాల విభజనకు అనుకూలంగా పనిచేస్తున్న బిజెపి జమ్మూకాశ్మీర్ లఢక్‌ల విభజనను ఎలా ఆపగలదు? ఉత్తరప్రదేశ్ నుండి బుందేల్‌ఖండ్ హరితప్రదేశ్, పూర్వాంచల్‌ల విభజనను ఎలా ఆపగలదు?? ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పరచింది నెహ్రూ- ఇందిరాగాంధీలు. తెలంగాణా కాంగ్రెసువారు ఆ ఫొటోలు ఎలా తమపార్టీ ఆఫీసులలో పెట్టుకుంటారు??
విజయనగరం పాలకులు ఆనందగజపతి, అశోకగజపతి, పి.వి.ఆర్.రాజు ప్రజలను కన్నబిడ్డలవలె చూచుకున్నారు.
english title:
v
Date:
Saturday, November 23, 2013