రాష్ట్రంలో నూలు, నేత శుద్ధి కేంద్రం ఏర్పాటుచేస్తామని కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రకటించటం అభినందించదగ్గదే! వ్యవసాయం తర్వాత చేనేత ద్వారా లక్షలాది కుటుంబాలకు ఉపాధితోపాటు విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. చేనేతలకు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం చెల్లించే పది శాతం ముదరా నిలుపుదలతో రాష్ట్ర ప్రభుత్వం కోత విధించడం మూలంగా చేనేత వస్త్రాల అమ్మకాలు దిగజారాయి. ఫలితంగా ఎందరో కార్మికులు వీధిన పడుతున్నారు. యువత ఉపాధికై ఇతర మార్గాలవైపు దృష్టిసారిస్తుండగా చేనేత పరిశ్రమ అంపశయ్యపై ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఐదువందల కోట్లతో నేత శుద్ధి కేంద్రం ఏర్పాటు ఎవరికి ప్రయోజనం. అంతకంటే ముందు చేనేత, సొసైటీలు, ఆప్కోలకు చెల్లించవలసిన ముదరా (సబ్సిడీ) యధావిధిగా కొనసాగించటంతోపాటు మరింత ప్రయోజనం చేకూరే విధంగా పాలకులు దృష్టిసారించాలి. ప్రకటనలకు పరిమితం కాకుండా చేతలలో అమలుచేయగలిగితే యువతకు ఉపాధితోపాటు ప్రస్తుత దేశం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతలకు పరిష్కారం లభించగలదు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
తెలుగుభాష దుస్థితి
సినిమాలలో, టీ.విలలో తెలుగు భాషకు పట్టిన దుర్గతి చూస్తుంటే భాషా ప్రేమికులకు ఎంతో ఆవేదన కలుగుతోంది. మొదట్లో అచ్చులు, హల్లులు, వత్తులు ఇష్టారాజ్యంగా మార్చేసి పదాలను పలకడంతో ప్రారంభమైన ఈ జాడ్యం ఇప్పుడు తెలుగు పదాలను ఆంగ్లంతో సమ్మిళితం చేసి, అర్ధంకాని ఒక క్రొత్త భాషను తయారుచేసే స్థితికి వచ్చింది. నిషిద్ధ పదాలను, బూతులను కూడా వాడుతూ కార్యక్రమాలను చూసేవారికి జుగుప్స కలుగుతోంది. టి.విలో యాంకర్లు, వార్తలు చదివేవారు తెలుగు పదాలను అతి పొదుపుగా వాడుతూ భాష పట్ల చిన్నచూపు కనబరుస్తున్నారు. తెలుగు భాష యొక్క మహోన్నత్యాన్ని తెలియపరిచే కార్యక్రమాలు ప్రసారం చెయ్యకపోతే మానెయ్యండి, కాని భాషను కించపరచే విధంగా ప్రవర్తించవద్దని టి.వి, సినిమా పెద్దలకు నా హృదయపూర్వక విన్నపం.
- సి.ప్రతాప్, విశాఖపట్నం