Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మనకు మనం దక్కాల్సిందే

$
0
0

మనకు మనం దక్కాల్సిందే. ప్రపంచంలో సాధించాల్సినవి ఎన్ని ఉన్నా అన్నిటికంటే మొదటి స్థానం ఈ తపనదే. మనకు మనంగా మిగలడమే గొప్ప విజయం. ఎన్ని అద్భుతాలు కళ్ల ముందుకొచ్చినా అత్యద్భుతమైనది ఇదే! మనల్ని మనం దక్కించుకోవడం అంత కష్టమైన పనా అని ఆశ్చర్యపోవలసి వస్తోంది కదూ...ఇలా మనల్ని గురించి మనం వెతుక్కోవటమంటే మన గురించి ఆలోచించడమే! అయితే ఈ అనే్వషణలో మనం సరిపుచ్చుకోవలసిన అగత్యం లేదు. సర్దుబాటుకు లోను కావలసిన అవసరం లేద. కారణం అంతా మనలోనే ఉంది కాబట్టి. మనలో లేదనుకుని ఎచ్చోట ఎంతలా వెతికినా అంతటా ఏమీ లభించదు. కాబట్టి మనలో లేనిదంటూ ఏమీ లేదు. అయితే ఉన్నదాన్ని వెలికి తీయడమే మనం చేయవలసింది.
మనం శ్వాసిస్తోంది భౌతిక ప్రపంచంలో కాబట్టి ప్రాపంచికాన్ని కాదనలేం. కానీ ప్రపంచానే్న మనం సర్వస్వం అనుకున్నా ప్రపంచం మనల్ని శాసించాలనుకున్నా ఉపద్రవం తన్నుకొచ్చినట్లే! బలహీనులకి ఎన్నో విధాల బయటి ప్రపంచం ఆసరా కావాలి. మనపై విశ్వాసం సడలనంత కాలం మనకు మనమే ఆసరా. స్వయం సహాయకం కావసిందే! సెల్ఫ్ రిలయెన్స్‌కు కావలసింది సెల్ఫ్ సపోర్టింగే!
వెతుకులాట బయటి ప్రపంచంలో...పోటీ బయటి ప్రపంచంలో...సరిచూసుకోవడం బయటి ప్రపంచంతో. అంటే మన జీవితం బయటి ప్రపంచానికే అంకితమా? బయటి ప్రపంచంలోనిది మాత్రమేనా మన అస్తిత్వం! ఈ ప్రాకులాటలో మనల్ని మనం గౌరవించుకోకుండా బయటి ప్రపంచానికే పెద్దపీట వేస్తున్నామా? ఈ దేహ వర్తనానికి బాహ్య వాతావరణం కావలసిందే. మానసిక వర్తనానికి మాత్రం ఆంతరిక వాతావరణం తప్పదు. అంతర్జగత్తు నుండి దేహాన్ని వర్తింపచేస్తుంటే ప్రపంచమే మనల్ని గౌరవిస్తుంది.
ప్రపంచానికి తగ్గట్టు బతకడంలో గొప్పేముంది. మనదైన పద్ధతిలో బ్రతకడంలోనే మన అస్తిత్వముంది. ప్రపంచంలో ఉంటున్నాం కాబట్టి మనం ప్రపంచానికి తలాడించడం కాదు.. ఆ ప్రపంచం చేత మనం సంపూర్ణులం అనిపించుకోలేమా? మనం స్వయం సహాయకం అవుతూ, స్వతంత్ర జీవనం, స్వంత జీవనం గడపలేమా? అంతెందుకు మనం ప్రపంచానికి ఊకొడుతున్నంత కాలం మనలది మానసిక దాస్యమే. మనసు స్వతంత్రించగలిగితేనే మన బ్రతుకు అర్ధవంతమయ్యేది.
ఇంతకీ స్వయం సహాయకం ఎలా? అన్నది పెద్ద ప్రశ్న కాదు. మన అంతర్వాణి మనలో గుసగుసలాడుతుంటుంది.ఆ గుసగుసలను సరైన రీతిన వినగలిగితే మనలది స్వతంత్ర పంథానే అవుతుంది. పైగా ప్రపంచంపైన ఆధారపడినంత కాలం ప్రపంచం మనల్ని వేలెత్తి విమర్శిస్తునే ఉంటుంది. ఆధారపడడం ఎందుకు? విమర్శలకు కృంగిపోవడం ఎందుకు? సరిగ్గా ఆలోచించుకుని ఆచరణకు దిగగలిగితే ఏ విమర్శల్నీ పట్టించుకోనవసరం లేదు. మన కళ్లముందున్న ప్రపంచం మన అంతర్జగత్తుకన్నా గొప్పదేం కాదు. కాబట్టి THE PURPOSE OF LIFE IS NOT TO BE HAPPY. IT IS TO BE USEFUL, TO BE HONORABLE, TO BE COMPASSIONATE, TO HAVE IT MAKE SOME DIFFERENCE THAT YOU HAVE LIVED AND LIVED WELL.
జీవితం ఎంతకాలం సాగుతుందో మనకు తెలీకపోవచ్చు. అయినా బతికినంత కాలం ఎలా బతకాలో మనం నిర్ణయించగలం. మనం ప్లాన్ చేసుకోగలం. గమ్యాన్ని చేరుకోగలం. లక్ష్యాన్ని సాధించగలం. బ్రతుకు పగ్గాలు మన దగ్గరే ఉన్నాయి. జీవితాన్ని అర్ధం చేసుకోగలిగితే స్వతంత్రంగా, స్వయం సహాయకంగా, స్వయం సంపూర్ణంగా జీవించడం అలవిమాలిన విద్య కాదు. మనకు మనం స్వతస్సిద్ధం కాగలిగితే చాలు. ‘ఎవిరి టబ్ మస్ట్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ బాటమ్’-అంటే ఏమిటి? మన కాళ్లపై మనం నిలబడడం. మన మూలాలను మరవకుండా ఆత్మవిశ్వాసంతో, స్వీయ రక్షణతో, స్వతంత్ర వర్తమానం సాగించడం.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకూడదు. స్వయం సహాయకం, స్వయం సమృద్ధం కావాలి.అప్పుడే మన స్వతంత్రతకు అస్తిత్వం జత కలుస్తుంది. మన చేతులను మనం నమ్ముకోవాలి. మనం చేతులు కట్టుకుని ఇతరుల చేతులను అందుకోవాలంటే సాధ్యమా... చేతులుజాస్తేనే ఇతరుల చేతులు అందుతాయి. మన చేతులతో కలుస్తాయి. ఈ సంఘీభావమూ స్వతంత్రించడమే! చేతులు కలవడంవల్ల ఎప్పటికీ మనం బలవంతులమే...పైగా ఒంటరివారం కానే కాము.
అందుతున్న చేతులను పట్టుకోక చేతులు కట్టుకుని కనపడని అదృష్టాన్ని న మ్మటం అంత వెర్రితనం మరొకటుండదు. సహాయాన్ని అర్ధించడం గొప్పకాదు..సహకరించగలగడం మహనీయం. అదృష్టం ఎక్కడో ఉండదు. మన చేతులలోనేఉంటుంది. మన చేతలలోనే ఉంటుంది..చేతి రేఖలలో మాత్రం గూడుకట్టుకుని ఉండదు. మనకంటూ తెలివితేటలున్నాయి. ఆలోచించగలం. మనకంటూ కాళ్లు చేతులు ఉన్నాయి. ఆచరించగలం. వీటిని ఉపయోగించుకోగలగడమే అదృష్టం. ఉపయోగించుకోవడం చేతకాకపోతే దాన్నిమించిన దురదృష్టం మరొకటి ఉండదు. సంఘర్షణలప్పుడే నిద్రాణమై ఉన్న శక్తులను జాగృతపరచాలి...సత్ఫలితాలను అందుకోవాలి.
మనం అదృష్టవంతులం కాబట్టి భిక్షాటనకు బయలుదేరాల్సిన పనిలేదు. స్వయం సహాయకులం మనం. ఎవరినీ దేబరించాల్సిన అవసరం లేదు. అలాగని అహంకరించనూ కూడదు...స్వార్ధమూ పనికిరాదు. మనల్ని మనం ఎలా అంచనా వేసుకుంటూ ఉంటామో అలాగే ఈ ప్రపంచం సైతం మనల్ని తూకం వేస్తుంటుందని మరవకూడదు. మనకు స్థాన భ్రంశం కలగకుండా ఉండాలంటే మనల్ని మనం తక్కువ చేసుకోకూడదు.
మనకు ప్రత్యేకమైన ఆలోచనలున్నాయి. అభిప్రాయాలున్నాయి. ఈ ఆలోచనలు కేవలం ప్రపంచం వెంటనే పడవు..అవి అంతర్జగత్తును పలకరిస్తుంటాయి. ప్రాపంచికఆస్తులు తరుగుతుంటాయి తప్ప అంతస్తత్వం మాత్రం పెరుగుతునే ఉంటుంది. ఆ అంతస్తత్వంతో ఎదగడం ముఖ్యం. మనకు మనం దక్కడం అంటే ఇదే.
మనకంటూ స్వంత ఆలోచనలు ఉన్నాయంటేనే మనం తెలివైన వారమని. ఈ తెలివికి ప్రపంచంనుండి తూకుడు రాళ్లను అరువు తెచ్చుకోవలసిన అవసరం లేదు. ఆలచన మన మనసుది...హృదయాన్ని స్పందింప చేసేది..మనలను ఆచరణ మార్గం పట్టించగల సత్తాగలది. ఇంకెందుకు ఆలస్యం. మానసిక వాణిని, అంతర్వాణిని కేమారు వినగల శక్తి సంపన్న మన హృదయం. హృదయానికి కొలమానాలతో పనిలేదు. కాబట్టి హృదయమే మనకు మార్గదర్శి. సామాన్యంగా మనం హృదయం చెబుతున్న దాన్ని వినటం మానేసి ప్రాపంచికంగా మహామహులు చెప్పిన మాటల్ని నెమరేసుకుంటుంటాం. వారి మాటల వెలుతురు మనకు కొంతవరకే మార్గం చూపగలుగుతుంది. గమ్యం చేర్చగలిగేది మాత్రం మనలో ప్రకాశమైన వెలుగు మాత్రమే. ఎంతో వెలుతురును చిమ్మే బల్బునే చూడండి.. వెలుగంతా బల్బుదే అనిపిస్తుంది. కాని అసలు వెలుతురు ఫిలమెంటుదే! మన ప్రాపంచికమైన దంతా బల్బులా అనిపించే గాజుగోళమే. మన అంతర్జగత్తే ప్రకాశింపచేసే ఫిలమెంట్.
ఇంతకీ మనం గుర్తించాల్సింది ఒకటుంది. ప్రపంచ వాణిని మనం ఆదిరిస్తున్నాం. మన అంతర్వాణిని పక్కన పెడుతున్నాం..పక్కనపెట్టిన వాణి మరోమారు మనలను తడుతుంది. పదే పదే జోరీగలా మన చెవులకు తాకుతుంటుంది. అంటే మనం వద్దనుకున్న ఆలోచన మరలా మరలా మనల్ని వెన్నాడుతోందంటే, మన వెంట పడుతోందంటే, మనలో సుడులు తిరుగుతోందంటే దాని అవసరం మన జీవితానికి ఉన్నట్టే! మన జీవితంలో దానికి ప్రాముఖ్యమున్నట్లే! ఎన్నదగింది, మన్నింప దగింది అనే!!
ఒక్కోసారి మన అంతర్వాణి వంటిదే ప్రపంచవాణి అనిపిస్తుంటుంది. గతంలో ఎన్నడో మనలో మెదలిన భావం మహనీయుల వాణిలా వర్తమానంలో మన కళ్లముందుకొస్తుంది. అప్పుడు మన అంతర్వాణిని లెక్కపెట్టలేదన్న మనస్తాపం కలుగుతుంది. కాబట్టి మన చుట్టూ వున్న ప్రపంచం పెద్దదే కావచ్చు..గొప్పదే కావచ్చు. దానికంటే మహనీయమైంది మన అంతర్జగత్తు. అందుకే మనం మొదటగా వినాల్సింది అంతర్వాణినే. ఆ తర్వాతనే ఎన్ని ప్రాపంచిక వాణులైనా. మనం అర్ధమనస్కులమైనా, అన్య మనస్కులమైనా అంతర్వాణిని వినలేం..అర్ధం చేసుకోలేం..జీవితాన్ని అర్ధవంతం చేసుకోలేం. అంతర్వాణిని ఆచరణలో పెట్టగలిగితే దొరికే సంతృప్తి, లభించే ప్రశాంతి ప్రాపంచికానికి అనుగుణంగా వర్తిస్తే దొరుకుతుందేమో చూడండి!

వినదగు!
english title: 
v
author: 
-డా.వాసిలి వసంతకుమార్ 9393933946

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>