ఉన్నట్టుండి
మనసంతా బాల్యంలోకి జారిపోతుంది
అక్కడ దాగున్న స్మృతులన్నీ
వెనె్నల ముద్దలై నన్నలుముకుంటాయి
మహదానందంలో కాసింతసేపు
తేలియాడుతాను
స్వాతి ముత్యపు చిప్పల్లో
చిగురించిన అమాయకపు ఆశల్ని
నిండుగా నవ్వుకునే ఆనందపు ఊసుల్ని
ఏదో కలుషితం మింగుతున్నట్లు
ఓ స్వప్నం ననె్నప్పుడూ వెంటాడుతుంది
నిజాల మూలాల్లోకి వెళితే...
గుర్తుకొచ్చే
మధుర ఘట్టాలన్నీ వికటిస్తాయేమోననీ...
ముందుగానే ఓ పథకాన్ని
నా చుట్టూ అల్లుకుంటాను.. ఇక
నిర్భయంగా మస్తిష్కంలో దాగిన
జ్ఞాపకాల పుస్తకాన్ని తెరుస్తాను
తేనెపట్టును చుంబించినట్టు
ఒక్కొక్క పుటనూ
తనివితీరా అనుభవిస్తాను
స్వార్థంలేని
స్నేహ సంపెంగల పూదోటలూ
నేనూ ఓ పువ్వై
సౌరభాలు వెదజల్లటం చూస్తాను
మనసంతా పులకరింపులతో
ఘార్ణిల్లుతుంది
పాఠ్య పుస్తకాల్లో
భద్రంగా దాచుకున్న నెమిలీకలు
పిల్లల్ని పెడతాయనే భ్రమ
తియ్యగా ఒలికిపోవటం చూస్తాను
ఇప్పటికీ...
సుతారంగా చెక్కిలిపై
స్పృశించుకున్నప్పుడు
బాల్యమంతా ఊయలై జోల పాడుతుంది.
*
ఆత్మశాంతి
-డా.తిరునగరి
పాపం పండింది
ధర్మం గెలిచింది
‘యత్ర నార్యస్తు..
ప్రశ్నార్ధకమైన వేళ
‘పూజ్యతే’
అన్నదే సమాధానం వచ్చింది
భయం లేకుండా
నిర్భయలు దేశంలో
తిరుగవచ్చని
న్యాయదేవత
భరోసా ఇచ్చింది
ఉన్మాద కాముకులకు
ఓ చికిత్స ఈ తీర్పు
రాక్షస మృగాళ్లకు
ప్రాణాంతకం ఈ తీర్పు
ఆడది తల్లిరా
ఆమె చెల్లిరా
ఆడది అర్ధాంగిరా
ఆమె దుహితరా
ఆమె విలువను గ్రహించక
అసురులు కూడా సిగ్గుపడే
అత్యాచారం చేసిన
నరపశువులకీ శిక్ష
న్యాయం న్యాయం
అంటున్నది
నాగరిక సమాజం
మనిషి
చీకటినుంచి
వెలుగులోకి
వెళ్లాలన్నది
న్యాయం
వెలుగుల నార్పేసి
చీకట్లో
చిందులు వేస్తామనేవాళ్లకు
శిక్ష తప్పదు
అంటున్నది
ధర్మం
పోనీ
ఈ రాక్షసావళి
సమూలంగా
తొలగనీ
ఆ తిమిరావళి
సంపూర్ణంగా
‘యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతా’
అన్నది
నిన్న ధర్మదేవత
అదే ఏనాటికైనా
నిజం నిజం
అంటున్నది న్యాయ దేవత
‘మృగాళ్ల’కు పడ్డ ఈ శిక్ష
రేపటి తరానికి కనువిప్పు
మగాళ్లూ! తస్మాత్ జాగ్రత్త
ఆడది ఆగ్రహిస్తే
చరిత్ర తలక్రిందు
పాపం పండింది
ధర్మం గెలిచింది
అమరలోకంలోని
నిర్భయ
ఆత్మ కొంత శాంతించింది.
(నిర్భయ హంతకులకు ఉరిశిక్ష వార్త విని 14-9-2013)
పాఠం
-మంత్రి కృష్ణమోహన్
9441028286
ఒక అపరిచిత పదార్ధాన్ని
ఆబగా ఆరగిస్తున్నపుడు
తెలీదు-
సానరాయి మీది
గంధపు చెక్కలా ఇది
అరుగునో
మరిలేదో?
తళతళ మిలమిల మెరుస్తున్న
పరిశుభ్ర పదార్ధ ప్రదర్శనలోని
రుచులన్నీ
చక్కగా చవులూరిస్తాయి
సరళ, విశేషాలంకరణలతో
సోగయాలు పోతాయి
మునుపెరగని కొత్త వాసనలు
ముక్కుపుటాలు రెచ్చగొడతాయి
బహుశ ఆకలికి
విచక్షణ తెలియదు!
ఇమడలేంది కూడా ఉదరంలోకి
గజ ఈతగాడిలా దుముకుతుంది
ఆనకగదా..
దీని బడాయి రాయైతేలేది!
తలుపులు కిటికీలు మూసిన
గదిలోంచి లగెత్తాలని
పిల్లి పిల్ల పడే
పెనుగులాట లాంటి పెనుగులాట లోపల!
అరగని పదార్ధం
ఆరని కుంపటిలా రగుల్తూ!
ఇప్పటిదాకా
సెగలు పొగలు ఎరుగని దేహానికి
ఇదో చిత్రమైన ఇరకాటం
నాకో జ్వాలానుభవ పాఠం
బహుశా
ఒక సరికొత్త పాకమీద మోహపడడం
బహు ప్రాచీన ప్రలోభమేనేమో!