సినిమా హీరోలా
అందగాడు.. మంచి
సంపాదనా పరుడు..
జీవితాంతం
ప్రేమానురాగాలను
పంచేవాడు..
కష్టసుఖాల్లో
తోడుండేవాడు..
ఇలాంటి గుణగణాలున్న
వరుడైతే చాలు- నిన్నటి
తరం అమ్మాయిలు
రెండో ఆలోచన లేకుండా
పెళ్లికి ‘ఓకే’
చెప్పేసేవారు. అయితే,
నేటి నవ నాగరిక
యువతులు మాత్రం
‘మూడుముళ్ల’కు
సిద్ధపడేముందు తమ
మనోభావాలను తెగేసి
చెబుతున్నారు.
నిశ్చితార్థానికి
ముందుగానే తమ
‘కోర్కెల చిట్టా’ను
నిర్మొహమాటంగా
విప్పుతున్నారు.
కాబోయే జీవిత
భాగస్వామి గురించి
ఆధునిక భారతీయ
యువతుల ఆకాంక్షలు
ఎలా ఉంటాయన్న
అంశంపై తాజాగా
జరిగిన ఓ సర్వేలో
ఆసక్తికరమైన అంశాలు
వెలుగుచూశాయి.
ముంబైలోని ఓ ప్రముఖ
‘మాట్రిమోనియల్’
వెబ్‌సైట్ నిర్వహించిన
‘ఆన్‌లైన్’ సర్వేలో
39.5 శాతం
యువతులు తమ
జీవిత భాగస్వామికి
వంట చేయడం తెలిసి
ఉండాలని తమ
మనోగతాన్ని
బయటపెట్టారు.
ఇంటిపనుల్లో భర్త
చేదోడు వాదోడుగా ఉంటే
చాలని 51.2 శాతం
మంది అమ్మాయిలు
ఆశపడుతున్నారు.
పెళ్లికి ముందే
అమ్మాయిలు,
అబ్బాయిల
ఇష్టాయిష్టాలను పెద్దలు
తెలుసుకుంటే వారి
దాంపత్య జీవితంలో
ఎలాంటి సమస్యలు
ఉండవని సర్వే
నిపుణులు
అంటున్నారు. సర్వే
సందర్భంగా కొంతమంది
అబ్బాయిల
అభిప్రాయాలను కూడా
పరిగణనలోకి
తీసుకున్నారు.
ఉద్యోగాలు చేసే
యువతులు మాత్రం
ఇంటి బాధ్యతలను
పురుషులు కూడా
సమానంగా
పంచుకోవాలని
వాంఛిస్తున్నారు.
పగలంతా ఆఫీసులో
కష్టపడి సాయంత్రం ఒకే
సమయానికి ఇంటికి
చేరుకునే దంపతులు
సమానంగా బాధ్యతలు
పంచుకుంటే ఎంతో
బాగుంటుందని
పలువురు యువతులు
సూచించారు. తాము
వంటింట్లో
కష్టపడుతుంటే మగాళ్లు
టీవీ చూస్తూ కాలక్షేపం
చేయడాన్ని సహించేది
లేదని ఉద్యోగినులైన
యువతులు
పేర్కొన్నారు. భర్తలు
ప్రేక్షకపాత్ర వహిస్తే
ఇంటిని అందంగా
తీర్చిదిద్దడం ఎలా అని
46 శాతం మంది
యువతులు
ప్రశ్నించారు. కుటుంబ
విషయాలు
మాట్లాడుతుండగా
సెల్‌ఫోన్‌లో మాట్లాడే
మగాళ్లంటే తాము
ఇష్టపడేది లేదని 39
శాతం యువకులు తేల్చి
చెప్పారు. గంటల
తరబడి ఉద్యోగ
బాధ్యతలతో తాము
సతమతమవుతుంటా
మని యువకులు
చెప్పగా, ఇంటాబయటా
కలిసి తాము 14
గంటలకు పైగా
శ్రమిస్తున్నామని
మగువలు
అంటున్నారు. కాగా,
అబ్బాయిల
మనోభావాల్లో
ఆశాజనకమైన
మార్పులు రావడాన్ని
సర్వేలో గుర్తించారు.
తమ జీవిత
భాగస్వామికి సమాన
హోదా ఇచ్చేందుకు,
వంటపని
నేర్చుకునేందుకు
ఎంతోమంది యువకులు
సుముఖతను వ్యక్తం
చేశారు. వంటలు
నేర్చుకునేలా శిక్షణ
తరగతులకు వెళ్లేందుకు
చాలామంది
అబ్బాయిలు
ఇష్టపడుతున్నారు.
ఇంటిపనుల్లో
సహకరిస్తూ తమ పట్ల
గౌరవ భావం ప్రదర్శించే
జీవిత భాగస్వామి
కావాలంటూ 48.2
శాతం అమ్మాయిలు
ఆకాంక్షిస్తున్నారు. తమ
ఉద్యోగ బాధ్యతలను
నిండు మనసుతో
గుర్తించాలని 40 శాతం
మంది, తమ ఆర్థిక
స్వేచ్ఛను గుర్తించాలని
9.3 శాతం
యువతులు
కోరుకున్నారు.
‘కాబోయే వరుడితో
తొలిసారిగా
మాట్లాడినపుడు వారి
నుంచి ఏం ఆశిస్తార’ని
సర్వేలో ప్రశ్నించగా,
మంచి వ్యక్తిత్వం,
ఉన్నత లక్షణాలుంటే
చాలని 55.6 శాతం
అమ్మాయిలు
పేర్కొన్నారు.
*