అనంతపురం, నవంబర్ 23 : పుట్టపర్తి సత్యసాయి బాబా కలియుగ ప్రత్యక్షదైవంగా ప్రజలు భావిస్తారని కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి కిల్లి కృపారాణి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శనివారం ఏర్పాటు చేసిన సత్యసాయిబాబా 88వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం సత్యసాయి బాబా ట్రస్టు ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసిన తరువాత బాబా భౌతికంగా ఉన్నప్పుడు పుట్టపర్తికి ఎందుకు రాలేకపోయాననే బాధ కలుగుతోందన్నారు. బాబా విద్య, వైద్యంతోపాటు సామాజిక సేవా కార్యక్రమాలకు ఎంతోప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఆయన ట్రస్టు ద్వారా రూపొందించిన సేవలు ప్రభుత్వాలు కూడా అందించలేవన్నారు. ఖర్చుకు వెనుకాడకుండా సాయి ట్రస్ట్ అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఇక్కడ చికిత్స పొందిన వారు మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తిరిగి వస్తున్నారన్నారు. పుట్టపర్తి, బెంగళూరుల్లో ఉన్న సాయి ఆసుపత్రుల గురించి తాను గతంలోవిన్నానన్నారు. అయితే ప్రస్తుతం వాటిని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఇందులో పేద, ధనిక అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యాధునిక వైద్య సేవలు అందచేస్తుండడం విశేషమన్నారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం సత్యసాయి ట్రస్టుకు మాత్రమే సాధ్యమయ్యిందన్నారు. రక్షిత తాగునీటి కోసం కోట్ల రూపాయలను వెచ్చించి అనంతపురం, కర్నూలు, తూర్పు, పశ్చిమ గోదావరి, మహబూబ్‌నగర్, చెన్నైలకు చెందిన ప్రజలకు రక్షిత మంచినీటిని అందించిన ఘనత కూడా బాబాకే దక్కుతుందన్నారు. ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులున్నారని, అయితే సేవ చేయాలన్న లక్ష్యంతోముందుకు వచ్చేవారు చాలా తక్కువమందేనన్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబా ప్రేమ, సేవల లక్ష్యంగా కోట్లాది మంది హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. బాబా పేరుతో పోస్టల్ స్టాంపును విడుదల చేయడం తన జీవితంలో మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు.
స్టాంప్ ఆవిష్కరించిన మంత్రి
పుట్టపర్తి: సత్యసాయి బాబా 88వ జయంతి సందర్భంగా ఆయన పేరిట తపాలా శాఖ రూపొందించిన పోస్టల్ స్టాంప్‌ను కేంద్రమంత్రి కిల్లి కృపారాణి శనివారం అనంతపురం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఆవిష్కరించారు. తొలి స్టాంప్‌ను ట్రస్టు సభ్యులు ఎపి మిత్ర, తొలి కవర్‌ను మద్రాస్ శ్రీనివాసన్‌కు అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయిబాబా మానవాళికి అందించిన సేవలు ప్రభుత్వం కూడా చేయలేదని పేర్కొన్నారు. విద్య, వైద్యం, సామాజిక సేవలతో దుర్భిక్ష ప్రాంతాలకు మారుపేరైన అనంతపురం జిల్లాలోని పేద ప్రజలకు మేలు జరిగిందన్నారు. దాహార్తిని తీర్చడానికి ఆయన రూపొందించిన కార్యాచరణ అనన్య సామాన్యమైదన్నారు. (చిత్రం) బాబా స్మారక పోస్టల్ స్టాంపు విడుదల చేస్తున్న మంత్రి కిల్లి కృపారాణి
జయంతి వేడుకల్లో బాబా పోస్టల్ స్టాంపు విడుదల
english title:
stamp on satya sai
Date:
Sunday, November 24, 2013