విజయవాడ , నవంబర్ 23: కోట్ల రూపాయల మేర డిపాజిటర్లకు ఎగవేసి తన తల్లితో సహా తాను కారు ప్రమాదంలో మృతి చెందినట్లు లోకాన్ని నమ్మించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నార్ల వంశీకృష్ణను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా పోలీసుల అదుపులో ఉన్న వంశీని విచారిస్తున్న అధికారులు ఎట్టకేలకు అరెస్టును ధ్రువీకరించి శనివారం మీడియా ఎదుట హాజరుపరిచారు. అయితే బాధితులకు ఎగవేసిన సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉన్నా నికరంగా ఇంత అని ఇంకా నిర్థారించలేదని, దర్యాప్తు పూర్తికావాల్సి ఉందని నగర డిసిపి ఎం రవిప్రకాష్ తెలిపారు. కాగా అతని తల్లి కూడా బతికే ఉందని, ఆమె ఆచూకీ కూడా కనుగొన్నామన్నారు. నిందితుడిని రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా డిసెంబర్ 5వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో జిల్లా జైలుకు తరలించారు. వంశీని మరింత విచారించాల్సి ఉన్నందున కోర్టును పోలీసు కస్టడీకి కోరనున్నట్లు విలేఖర్ల సమావేశంలో డిసిపి చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా నుంచి నగరానికి వలస వచ్చిన వంశీకృష్ణ 1995- 2000 సంవత్సర మధ్యకాలంలో ఒక దినపత్రికలో విలేఖరిగా పనిచేశాడు. వీనస్ ఏజెన్సీ పేరుతో బ్యాంకు రుణాల రికవరీ సంస్థను ప్రారంభించాడు. బ్యాంకు అధికారులతో పరిచయం ఏర్పడటంతో తర్వాత రియల్టర్‌గా మారి అపార్ట్‌మెంట్లు నిర్మించాడు. ఒకే ఫ్లాట్‌ను నలుగురైదుగురికి విక్రయించడం, వాటిపై ఒకటి కంటే ఎక్కువసార్లు రుణాలు తీసుకొని కోట్ల రూపాయలు దండుకుని పరారయ్యాడు. 2011 జనవరి 3న గుంటూరు జిల్లా దుగ్గిరాల సమీపంలో బకింగ్‌హామ్ కాలువలో కారును తోసేసి ఆ ప్రమాదంలో తాను, తల్లి సుజాత మరణించినట్లు లోకాన్ని నమ్మించాడు. మృతదేహాలు దొరక్కపోవడంతో దుగ్గిరాల పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి చెన్నై, కోయంబత్తూరు, బెంగుళూరు, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, వైజాగ్ తదితరచోట్ల వంశీ తలదాచుకుంటూ డాక్టర్‌గా అవతారమెత్తాడు. టచ్ పేరిట ఆస్పత్రి ప్రారంభించి డాక్టర్ పసుపులేటి ప్రవీణను పెళ్లి చేసుకున్నట్లు వంశీ తమ విచారణలో వెల్లడించాడని డిసిపి రవిప్రకాష్ వివరించారు. మారువేషంలో నగరానికి వచ్చిన వంశీని తమకందిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకుని చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.
కోట్ల రూపాయల మేర డిపాజిటర్లకు ఎగవేసి తన తల్లితో సహా తాను కారు
english title:
car accident
Date:
Sunday, November 24, 2013