విజయవాడ, నవంబర్ 23: రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 371 (డి) అవరోధంగా నిలుస్తుందని, అదే సమైక్యాంధ్రకు రక్షణ కవచమని సమైక్యవాదులు ధీమాగా ఉండగా, మరోవైపు రాష్ట్ర విభజనకు ఆర్టికల్ 3 ఏవిధంగానూ దోహదపడదని నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది మట్టెగుంట రామకృష్ణ అన్నారు. తొలుత ఆయన ఆర్టికల్ 371డి ఆధారంగా రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ వ్యవహారం రాష్టప్రతి వరకు వెళ్లలేదంటూ ఇలాంటి అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు పెండింగ్‌లో ఉంచింది. అయనా రామకృష్ణ అసలు ఆర్టికల్ 3 ప్రకారం పాత రాష్ట్రాల విభజనే రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టులో పోరాడేందుకు సిద్ధవౌతున్నారు. దీనిపై తక్షణ విచారణకు పిల్ దాఖలు చేశానని, త్వరలో అడ్మిట్ కాగలదనే నమ్మకం ఉందని శనివారం ఆయన ఇక్కడ ఆంధ్రభూమికి తెలిపారు. వాస్తవానికి దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం తొలుత 14 రాష్ట్రాలు, తర్వాత 16 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయన్నారు. కొత్తవి వస్తుంటే అంతకుముందువి పాత జాబితాలో చేరుతుంటాయని, ఈవిధంగా ప్రస్తుతం దేశంలో 13 కొత్త, 15 పాత రాష్ట్రాలు ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్ అయితే మూడుగా విడిపోయి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో, రెండోది పాత మైసూర్ రాష్ట్రంలో, మూడోది పాత ముంబాయి రాష్ట్రంలో కలిసిపోవటం వల్ల కొత్త రాష్ట్రాలను 13గా చెప్పుకోవాల్సి వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రాలను మాత్రమే ఏర్పాటు చేయొచ్చుకాని పాత రాష్ట్రాలను విభజించే అధికారం కేంద్రానికి లేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ఎ (4) ప్రకారం 1956లో తెలంగాణ భూభాగం ఆంధ్ర భూభాగంతో కలిసి భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందన్నారు. అప్పుడు ఆ భూభాగాన్ని కొత్తది అన్నారని, ఇప్పుడు ఆర్టికల్ 3ఎ (1) ప్రకారం తెలంగాణ కొత్త భూభాగంగా, ఆంధ్ర పాత భాగంగానూ ఎలా మారతాయని ప్రశ్నించారు. ఇలా వేర్పాటువాద ఆందోళనలు రేగినప్పుడల్లా రాష్ట్రాలు ఇచ్చుకుంటూపోతే దేశం వెయ్యి ముక్కలవుతుందని, సమగ్రతకే ముప్పు ఏర్పడుతుందని అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా పూర్వ పాత రాష్ట్రాలను ఏర్పాటు చేయదలిస్తే అనేక అనర్థాలు తలెత్తుతాయని ఈసందర్భంగా రామకృష్ణ వివరించారు.
‘సుప్రీం’కెక్కిన ప్రముఖ న్యాయవాది రామకృష్ణ
english title:
rama krishna
Date:
Sunday, November 24, 2013