అడిలైడ్ ఓవల్, డిసెంబర్ 6: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్ మొదటి టెస్టును కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా రెండో టెస్టుపైనా పట్టు బిగించే ప్రయత్నంలో పడింది. మ్యాచ్ రెండో రోజున ఈ జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను తొమ్మిది వికెట్లకు 570 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. కెప్టెన్ మైఖేల్ క్లార్క్, వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ బ్రాడ్ హాడిన్ శతకాలతో రాణించడంతో ఆసీస్‌కు ఈ భారీ స్కోరు సాధ్యమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా మ్యాచ్ మొదటి రోజు, గురువారం ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 273 పరుగులు చేసింది. క్లార్క్ 48, హాడిన్ 7 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం ఉదయం ఆటను కొనసాగించి, 457 పరుగుల వద్ద క్లార్క్ వికెట్‌ను చేజార్చుకుంది. ఆరో వికెట్‌కు హాడిన్‌తో కలిసి 200 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన క్లార్క్ మొత్తం 348 నిమిషాలు క్రీజ్‌లో నిలిచి, 245 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్లతో 148 పరుగులు చేశాడు. ఐదు యాషెస్ టెస్టుల్లో మూడవ, మొత్తం మీద 26వ సెంచరీని క్లార్క్ నమోదు చేశాడు. మిచెల్ జాన్సన్ (5), పీటర్ సిడిల్ (2) ఒకరి తర్వాత మరొకరిగా పెవిలియన్ చేరారు. హాడిన్ 177 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 118 పరుగులు చేసి, కెరీర్‌లో నాలుగో సెంచరీని సాధించాడు. అనంతరం ర్యాన్ హారిస్ (నాటౌట్ 55), నాథన్ లియాన్ (నాటౌట్ 17) మరో వికెట్ కూలకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 570 పరుగులకు చేర్చారు. ఈ దశలో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు క్లార్క్ ప్రకటించాడు.
ఆసీస్ భారీ స్కోరుకు తగిన సమాధానం ఇవ్వడంలో ఇంగ్లాండ్ విఫలమైంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ మూడు పరుగులకే జాన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మైఖేల్ కార్బెరీ 20, జో రూట్ 9 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, మ్యాచ్ రెండో రోజు, శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ ఒక వికెట్‌ను చేజార్చుకొని 35 పరుగులు చేసింది. ఆసీస్ భారీ స్కోరుకు ఇంగ్లాండ్ ఏ స్థాయిలో సమాధానం చెప్తుందో చూడాలి. ప్రస్తుతానికి ఈ మ్యాచ్‌పై ఆసీస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తున్నది.
.............................
ఆస్ట్రేలియా సెంచరీ హీరోలు మైఖేల్ క్లార్క్, బ్రాడ్ హాడిన్
ఆస్ట్రేలియా 9 వికెట్లకు 570 డిక్లేర్ ఇంగ్లాండ్‌తో రెండో ‘యాషెస్’ టెస్టు
english title:
c
Date:
Saturday, December 7, 2013