ఆంధ్రప్రదేశ్ విభజన కార్యక్రమం వేగాన్ని పుంజుకొంది! తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ మరో కీలక ఘట్టాన్ని చేరుకుంది! పది జిల్లాల తెలంగాణను మాత్రమే ప్రత్యేక రాష్ట్రంగా వ్యవస్థీకరించాలని గురువారం నిర్ణయించడం ద్వారా కేంద్ర మంత్రివర్గం మరోసారి వాగ్దాన నిష్ఠను ఋజువు చేసుకుంది. పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఐక్య ప్రగతి కూటమి సమన్వయ సంఘం, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం జూలై 30వ తేదీన నిర్ణయించినప్పటినుంచి ఒకవైపున హర్షోల్లాస ఆనంద తాండవాలు, జరుగుతుండడం, మరోవైపున నిరసన జ్వాలలు నింగినంటుతుండడం తెలుగు ప్రజల ప్రగతి ప్రస్థానంలో ప్రస్ఫుటించిన విచిత్రమైన పరిణామం. అయినప్పటికీ వేటినీ లెక్క చేయకుండా తెలంగాణ ప్రక్రియను నిర్ధారిత రీతిలో ముందుకు నడిపిస్తుండడం వాగ్దాన నిష్ఠకు నిదర్శనం. రాష్ట్ర విభజన కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కాక తప్పదన్న ప్రచారాన్ని ఆ పార్టీ లెక్క చేయడం లేదన్న వాస్తవం కూడ గురువారం నాటి కేంద్ర మంత్రివర్గ నిర్ణయంతో ధ్రువపడింది. సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు పార్లమెంటు ప్రతినిధులు మాత్రమే కాక రాష్ట్ర ముఖ్యమంత్రి సహా రాష్ట్ర ప్రతినిధులు అరచి గీ పెట్టినప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం పూర్వ నిర్ధారితా ప్రక్రియను సడలించకపోవడం మొత్తం ప్రక్రియలో అతి ప్రధానమైన అంశం. నిర్ధారిత ప్రక్రియను నిజంగానే సడలించడం లేదా లేక అలా ఇప్పటికీ అభినయిస్తూ ఉన్నదా అన్న సందేహాలు ఇప్పటికీ వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇందుకు ప్రాతిపదిక ముసాయిదా బిల్లు తుది బిల్లుగా మారి పార్లమెంటు ఆమోదం పొందడానికి ఇంకా కొన్ని కీలకమైన ఘట్టాలను దాటవలసి ఉండడం...ఏ ఘట్టంలోనైనా తెలంగాణ ప్రక్రియ కూలబడిపోవచ్చన్న అనుమానాలను తెలంగాణ వాదులు, ఆశాభావాలను సమైక్యవాదులు వ్యక్తం చేస్తుండడం కేంద్ర ప్రభుత్వ వాగ్దాన నిష్ఠను నిలదీస్తోంది.
రాయల తెలంగాణ పేరుతో గత కొన్ని వారాలుగా ప్రచారమైన విచిత్ర ప్రతిపాదన మిథ్యా కథనంగానే మిగిలిపోవడం గురువారం నాటి కేంద్ర మంత్రివర్గ నిర్ణయంలో ప్రస్ఫుటించిన మరో ప్రధానమైన పరిణామం! పనె్నండు జిల్లాల రాయల తెలంగాణను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర విభజన పట్ల వ్యతిరేక తీవ్రతను తగ్గించడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరిగిపోయింది. రాయలసీమను చీల్చి రెండు జిల్లాలను తెలంగాణకు అంటకుట్టడం ద్వారా ఏదో ఒక ప్రత్యర్థి పార్టీ రాజకీయ ప్రాబల్యాన్ని దెబ్బతీయడానికి అధికార ‘అధిష్ఠానం’ యత్నిస్తోందని మరో కథనం వినిపించింది. మజ్లిస్ పార్టీవారి ఒత్తడికి లొంగి ఈ పనె్నండు జిల్లాల విచిత్ర రాష్ట్రాన్ని కేంద్రం ఏర్పాటు చేయబోతోందని మరో వదంతి వ్యాపించింది. రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణ ఏర్పాటు చేయడం ఇష్టం లేనందువల్లనే చివరి నిముషంలో కేంద్రం ఈ వికృత విభజనకు పాలుపడిందని కూడ మాధ్యమాలలో విశే్లషణలు విస్తరించాయి. తెలంగాణ రాష్టస్రమితి కాని, భారతీయ జనతాపార్టీ కాని, రాయలసీమ తెలంగాణ ప్రాంతాల కాంగ్రెస్ ప్రతినిధులు కాని ఈ ప్రతిపాదనను అంగీకరించడం లేదు. అందువల్ల ప్రధాన జాతీయ ప్రతిపక్షం పార్లమెంటులో వ్యతిరేకించడానికి వీలైన విచిత్ర రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్న వదంతులు వ్యాపించాయి. అలా బిల్లు పార్లమెంటులో వీగిపోవడానికి వీలు కల్పించడానికై వ్యూహాత్మకంగా కేంద్ర ప్రభుత్వం ఈ రాయల తెలంగాణను తెరపైకి తెచ్చిందన్న ప్రచారం కూడ కొనసాగింది. కానీ ఈ విచిత్ర ప్రహసనం మొత్తం రామాయణంలో పిడకల వేట వంటిదని గురువారం నాటి పది జిల్లాల తెలంగాణ నిర్ణయం ద్వారా కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పగలిగింది. రాయల తెలంగాణ ప్రతిపాదకుల నోళ్ళు మూతపడడానికి అన్ని ప్రాంతాలవారు, తెలంగాణ వాదులు, రాయలసీమ విభజన వ్యతిరేకులు ఊపిరి పీల్చుకొనడానికి గురువారం నాటి మంత్రివర్గం నిర్ణయం దోహదం చేసింది. అయితే సమైక్యవాదుల తదుపరి వ్యూహం ఏమిటి?
సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు రాజీనామా చేస్తున్నారన్నది సమైక్య పరిరక్షణకు అనుకూలంగా ఆరంభమైన ప్రచారం. ఈ రాజీనామా చేయనున్న మంత్రులు తమ పదవీ పరిత్యాగ పత్రాలను నేరుగా రాష్టప్రతికే సమర్పించి రాష్ట్ర విభజన పట్ల తమ వ్యతిరేకతను ద్విగుణీకృతం చేయనున్నారని కూడ వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. ‘అదిగో ఇదిగో’ అని అంటున్నారు తప్ప ఈ సీమాంధ్ర కేంద్ర మంత్రులు అందుకు సిద్ధం మాత్రం కావడం లేదు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్టు ప్రచారం చేసుకుంటున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశంలోనే రాజీనామాలను ప్రకటించి బయటికి వచ్చి ఉండవచ్చు. శుక్రవారం సాయంత్రం వరకు కూడ సమైక్యవాదులైన కేంద్ర మంత్రులు రాజీనామాలు సమర్పించడానికై రాష్టప్రతి భవనానికి వెళుతున్న దృశ్యం ఆవిష్కరణ కాలేదు. సీమాంధ్ర అంతటా విభజన వ్యతిరేక ఉద్యమ జ్వాలలు మరోసారి రాజుకుంటున్న దృశ్యాలను మాత్రమే ఆవిష్కృతవౌతున్నాయి. కానీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో మిన్ను ముట్టిన సీమాంధ్ర ప్రజల ఆగ్రహ జ్వాలలను లెక్క చేయని అధిష్ఠానం కాని, కేంద్ర ప్రభుత్వం కాని, ఇప్పుడు మళ్ళీ మొదలవుతున్న వ్యతిరేకతను పట్టించుకుంటాయా??
ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ప్రక్రియ ఇలా తీవ్ర వివాదగ్రస్తం కావడం స్వతంత్ర భారత చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. పనె్నండేళ్లకు పైగా కొనసాగుతున్న వివాదం కొలిక్కి వస్తుందన్న విశ్వాసం ఇప్పటికీ కలగడం లేదు. కేంద్ర మంత్రి వర్గంవారి నిర్ణయాలలో అస్పష్టమైన అంశాలు ప్రస్ఫుటిస్తూనే ఉన్నాయి. భారత రాజ్యాంగంలోని 371‘డి’ అధికరణం ఉభయ ప్రాంతాలకు వర్తింపచేయనున్నారనడం ఒక ప్రధానమైన అస్పష్టత. భౌగోళికంగా పాలనా పరంగా తెలంగాణలో ఉండే హైదరాబాద్‌లో అవశిష్ట ఆంధ్రప్రదేశ్ రాజధాని పదేళ్ళు ఎలా మనుగడ సాగిస్తుందన్నది మరో అస్పష్టత! ఒక రాష్ట్ర విభజన జరిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి రాజ్యాంగంలోని 368వ అధికరణం కింద సవరణ జరపనవసరం లేదని నాలుగవ అధికరణంలో నిర్దేశించారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కు వర్తించే 371‘డి’ని విభజన తరువాత రెండు రాష్ట్రాలకు వర్తింపచేయడానికి 368 అధికరణం కింద సవరణ అనివార్యం. ఈ సవరణను పార్లమెంటు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించవలసి ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈ మెజారిటీని సంతరించుకోగలదా!?
ఆంధ్రప్రదేశ్ విభజన కార్యక్రమం వేగాన్ని పుంజుకొంది!
english title:
p
Date:
Saturday, December 7, 2013