విశాఖపట్నం, డిసెంబర్ 9: రాష్ట్ర విభజన నిర్ణయం నేపధ్యంలో విభజన సూత్రధారి, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినోత్సవాన్ని సీమాంధ్రలో తెలుగుజాతి విద్రోహదినంగా నిర్వహించారు. ఎపి ఎన్జీఓలు, వైద్య ఉద్యోగులు, విద్యార్థి,యువజన, ముస్లిం జెఎసిల ఆధ్వర్యంలో సోమవారం తలపెట్టిన విద్రోహదినం విజయవంతమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఎపి ఎన్జీఓలు కలెక్టరేట్ నుంచి ప్రదర్శనగా వచ్చి జగదాంబ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. విభజన కారకురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, దిగ్విజయ్‌సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నేతల చిత్రపటాలను ఊరేగింపుగా తీసుకువచ్చి దగ్ధం చేశారు. వైద్య ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది తదితరులు కెజిహెచ్ నుంచి ప్రదర్శన నిర్వహించారు. ఎయులో విద్యార్థి, యువజన జెఎసి ప్రతినిధులు ప్రదర్శన నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
పుట్టిన రోజు కానుక ఎవరికి
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పుట్టిన రోజు కానుకగా తెలంగాణా రాష్ట్రాన్నిచ్చారంటున్నారు. కానుక ఎవరికి. కేవలం రాహుల్‌ను ప్రధాని చేసేందుకు ఓట్లు, సీట్లకోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్రపన్నిన సోనియాగాంధీ తీరుపై నిరసననలు వెల్లువెత్తాయి. సమైక్య రాష్ట్ర విద్యార్థి, యువజన జెఎసి ఆధ్వర్యంలో ఆంధ్రాయూనివర్శిటీ వద్ద సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసన తెలిపారు. సోనియాగాంధీ పుట్టిన రోజును పురస్కరించుకుని 2009 డిసెంబర్ 9న తెలంగాణా రాష్ట్రం ఇస్తున్నట్టు అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటించారని, ఆనాటి నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విద్యార్థి జెఎసి రాష్ట్ర కన్వీనర్ లగుడు గోవిందరావు ఆరోపించారు. తాజాగా 2013 సెప్టెంబర్ 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్ర విభజనకు నిర్ణయించడం, అందుకు తగ్గట్టుగానే వేగంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. కేవలం స్వార్ధం కోసం రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయం తీసుకున్న సోనియాగాంధీ ఎవరిని ఉద్ధరించారని పుట్టిన రోజు వేడుకలు జరుతున్నారని గోవిందరావు ఆరోపించారు. తొలుత విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు ఆరేటి మహేష్, ఎయు విద్యార్థి జెఎసి అధ్యక్షుడు బి కాంతారావు, కోటి తదితరులు పాల్గొన్నారు.
విభజన అంగీకరించం
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించేది లేదని ఎపిఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు కె ఈశ్వరరావు స్పష్టం చేశారు. విద్రోహదినంలో భాగంగా కలెక్టరేట్ నుంచి నిరసన ప్రదర్శన నిర్వహించి జగదాంబ వద్ద కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజనతో సీమాంధ్రకు తీరని నష్టం వాటిల్లుతుందని అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నప్పటికీ కేంద్రం మరింత వేగంగా అడుగులు వేయడాన్ని తప్పుపట్టారు. విభజన నిర్ణయాన్ని అడ్డుకునేందుకుగల అన్ని అవకాశాలను తాము వదులుకోమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వస్తే సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎంపిలు పార్లమెంట్‌లో బిల్లును వ్యతిరేకించాలని, విభజన అంశం అడుగుముందుకు పడకుండా నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. తాముకూడా విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఎపిఎన్జీఓ నాయకులు గోపాలకృష్ణ, పిఎం జవహర్, ఆర్టీసీ ఎన్‌ఎంయు ప్రతినిధి వై శ్రీనివాసరావు, పివివి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మెడికల్ జెఎసి ఆధ్వర్యంలో
మెడికల్ జెఎసి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులు, నర్శింగ్ స్ట్ఫా, వైద్య విద్యార్థులు కెజిహెచ్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈసందర్భంగా కేంద్రమంత్రుల చిత్రపటాలను ఊరేగించి వాటికి నిప్పంటించారు. జెఎసి ప్రతినిధి డాక్టర్ పిడకల శ్యాంసుందర్ మాట్లాడుతూ విభజన నిర్ణయం దారుణమని అన్నారు. ప్రజామోదం లేని విభజన ప్రతిపాదనలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైద్య విద్యార్థులు, నర్శింగ్ స్ట్ఫా పాల్గొన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా అత్యవసర సర్వీసులు మినహా అన్ని సేలను మెడికల్ జెఎసి నిలిపివేసింది. ఒపి విభాగం పనిచేయలేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
ముస్లింలు, లాయర్ల ప్రదర్శన
రాష్ట్ర విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా ముస్లిం జెఎసి, న్యాయవాదులు భారీ ప్రదర్శన నిర్వహించారు. జగదాంబ జంక్షన్ వద్ద ముస్లిం జెఎసి ప్రతినిధులు మాట్లాడుతూ విభజన నిర్ణయం వల్ల సీమాంధ్రకు తీరని నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు.
జిల్లా కోర్టు ప్రాంగణానికి న్యాయవాదులు తాళాలు వేశారు. రాష్ట్ర విభజన విషయంలో మూర్ఖంగా ముందుకెళ్తున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు.