విశాఖపట్నం, డిసెంబర్ 9: పనులు చేసేప్పుడు కాస్త బుర్ర ఉపయోగించండి. అంతగా అవసరం లేని ప్రాంతాల్లో చక్కటి బిటి రోడ్లు వేస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండి, అవసరమైన ప్రాంతంలో రోడ్లకు కనీసం మరమ్మతులు కూడా చేయని తీరు జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణకు కళ్లకు కట్టినట్టు అవగతమైంది. జోన్ 1 భరత్ నగర్ పరిధిలో సోమవారం పర్యటించిన ఆయన అంతగా ప్రాధాన్యం లేని రహదారి నిర్మాణాన్ని పరిశీలించారు. లక్షలు వెచ్చించి ఇక్కడ బిటి రోడ్డును నిర్మిస్తున్నారు. ప్రధాన రహదారి మాత్రం గోతులతో నిండి అసౌకర్యంగా ఉంది. కాస్త బుర్ర ఉపయోగిస్తే ఏది ఎక్కడ అవసరమో తెలుస్తుందంటూ ఇంజనీరింగ్ అధికారులను ఉద్దేశించి కమిషనర్ వ్యాఖ్యానించారు. ఇదేప్రాతంలో 60 చదరపుగజాల స్థలంలో మూడంతస్తుల భవనం నిర్మించడాన్ని కమిషనర్ గుర్తించారు. ఇంత చిన్న స్థలంలో ఇన్ని అంతస్తులు నిర్మిస్తున్నారు, వీటికి అనుమతులున్నాయా అంటూ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ప్రశ్నించారు. తక్షణమే దీనికి సంబంధించిని వివరాలు అందజేయాలని ఆదేశించారు. అలాగే అనుమతి లేకుండా నిర్మిస్తున్న భవనంపై ఆరాతీశారు. రిజిస్టర్‌ను పరిశీలించి అనుమతులు ఉన్నదీలేనిదీ తెలపాలన్నారు. అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలపై చైన్‌మెన్, బిల్డింగ్ ఇనస్పెక్టర్లదే బాధ్యతని, తెలిసీ అనుమతి లేని నిర్మాణాలను ప్రోత్సహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. భవన నిర్మాణాలు చేపట్టే యజమానులు రోడ్లను తమ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే అంగీకరించేది లేదని హెచ్చరించారు. ఈసందర్భంగా స్థానికులతో ముచ్చటించిన కమిషనర్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించట్లేదని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ ఎఎంహెచ్‌ఓ, శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఇనస్పెక్టర్ ఏంచేస్తున్నారని ప్రశ్నించారు. సక్రమంగా పనిచేయాని పారిశుద్ధ్య కార్మికులను తొలగించాలని ఆదేశించారు. వీధిలైట్ల నిర్వాహణపై వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అదేశించారు. నివాస గృహాల్లో దుకాణాలు నడుపుతున్న విషయం గమనించి డిఅండ్‌ఓ ట్రేడ్ లైసెన్సులు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. పర్యటనలో ఆయన వెంట జెడ్సీ శివాజీ, సిఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యనారాయణ రాజు, ఎసిపి హరిబాబు తదితరులు ఉన్నారు.
* ఇంజనీరింగ్ అధికారులకు కమిషనర్ చురక * ఇంత చిన్న స్థలంలో ఇన్ని అంతస్తులా * పట్టణ ప్రణాళిక తీరుపై ఆశ్చర్యం * క్షేత్ర పర్యటనలో వెలుగుచూస్తున్న చిత్రాలు
english title:
k
Date:
Tuesday, December 10, 2013