హైదరాబాద్, డిసెంబర్ 13: శాసనసభ సమావేశాలు ఎప్పుడు జరిగేది, బిఎసి మీటింగ్ ఎప్పుడు జరిగేది చెప్పడానికి దిగ్విజయ్‌సింగ్ ఎవరని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. దిగ్విజయ్‌సింగ్ చేతిలో స్పీకర్ రిమోట్ కంట్రోల్‌గా మారిపోయారని ఆయన మండిపడ్డారు. గవర్నర్, స్పీకర్ రాజ్యాంగ పదవుల్లో ఉండి కళంకం తెచ్చేలా ప్రవర్తిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చించే అంశంపై బిఎసి సమావేశం కానుందని దిగ్విజయ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం తన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించారు. రాష్ట్ర విభజనపై చంద్రబాబుకు స్పష్టతలేదని దిగ్విజయ్‌సింగ్ చాలా తెలివిమీరి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన జరిగితే ఇరు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలని, సమన్యాయం జరిగేలా చూడమని రాష్టప్రతికి, ప్రధాన మంత్రికి లేఖ రాసారు. తన నుంచి ఇంతకంటే ఇంకేమి ఎక్కువ స్పష్టత కావాలని చంద్రబాబు ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్టప్రతికి ఎప్పుడు వెళ్లేది, అసెంబ్లీకి, పార్లమెంట్‌కు ఎప్పుడు వచ్చేది టైమ్ టేబుల్‌తో సహా చెప్పడానికి దిగ్విజయ్‌సింగ్ ఎవరు? ఆయనేమైనా కేంద్ర మంత్రా? అని చంద్రబాబు నిలదీసారు. ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చించేందుకు రాష్టప్రతి జనవరి 13 వరకు గడువు ఇస్తే, ఇప్పుడే సభలో ప్రవేశపెడుతామని చెప్పడానికి దిగ్విజయ్‌సింగ్‌కు ఏమి అధికారం ఉందని ఆయన మండిపడ్డారు. దిగ్విజయ్‌సింగ్ ఏ పదవిలో ఉన్నారని ఆయన్ను గవర్నర్ కలిసారు, రాజ్యాంగ పదవుల్లో ఉండే వ్యక్తులు ఇలాగేనా ప్రవర్తించేది అని చంద్రబాబు తప్పుపట్టారు. కేంద్రంలో కాంగ్రెసు పార్టీ అధికారంలో ఎప్పుడున్నా, అధికారాలను తన చేతుల్లోకి తీసుకొని తన ఇష్టానుసారంగా వ్యవహరించడం రివాజుగా మారిపోయిందని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన అంశంలోనూ కేంద్రం అలాగే వ్యవహరించాలని చూస్తోంది, అదే జరిగితే 1984లో కేంద్రంపై ప్రజలు ఏవిధంగా తిరగబడ్డారో, మళ్లీ అదే పునరావృతం అవుతుందని తస్మాత్ జాగ్రత్తని చంద్రబాబు హెచ్చరించారు. రాజ్యాంగంలో ఎక్కడైనా ఉమ్మడి రాజధాని అనే పదం ఉందా? గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఎలా కల్పిస్తారు, దానికి రాజ్యాంగం అంగీకరిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడంపై ఎవరైనా రేపటినాడు కోర్టుకు వెళ్లి గవర్నర్‌కు ఇచ్చిన అధికారాలను ప్రశ్నిస్తే, అప్పుడు సీమాంధ్ర విద్యార్థుల, ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ప్రశ్నించారు. ఎలాంటి ఆంక్షలు లేని పరిపూర్ణ తెలంగాణ రాష్ట్రం కావాలని, ఎలాంటి ఆంక్షలు ఉండరాదని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నారు, మరి అదే జరిగితే, ఇక్కడ స్థిరపడిన సీమాంధ్ర ప్రజల పరిస్థితి ఏమిటనీ ప్రశ్నించారు. సీమాంధ్రులకు, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తామని దిగ్విజయ్‌సింగ్ హామీలు ఇస్తున్నారు, వెంటిలేటర్‌పై ఉన్న కేంద్ర ప్రభుత్వం మూడు నెలల్లో ఇంటికి పోతుంది, అప్పుడు ఈ హామీలను అమలు చేసేది ఎవరని ప్రశ్నించారు. నాలుగు, ఐదు సీట్ల కోసం కక్కుర్తిపడి తెలుగు జాతికి మధ్య విద్వేషాలు సృష్టిస్తారా? అని కేంద్రంపై ధ్వజమెత్తారు. ఆర్టికల్ మూడును ఉపయోగించి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తామంటే ఎలా సహిస్తామని ప్రశ్నించారు. సర్కారియా కమిషన్, జస్టిస్ పుంచ్ కమిషన్ చెప్పినదాని ప్రకారం శాసనసభ ఆమోదం లేకుండా రాష్ట్రాలను విభజించడం కానీ, సరిహద్దులను మార్చడం కానీ చేయరాదని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసారు. ఆర్టికల్ 371డి సవరించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుందని ముసాయిదా బిల్లులోనే అటర్నీ జనరల్ పేర్కొన్నారని, మరి రాజ్యాంగ సవరణ లేకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చాక టిఆర్‌ఎస్‌ను కాంగ్రెసులో విలీనం చేస్తారని, అలాగే వైఎస్ జగన్‌ది తమ కాంగ్రెస్ డిఎన్‌ఎ అని దిగ్విజయ్‌సింగ్ పునరుద్ఘాటించారని, దీనిని బట్టే ఈ రెండు పార్టీలతో కాంగ్రెసు మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకున్నాయని తాము ముందుగా చెప్పిందే దిగ్విజయ్ వ్యాఖ్యలతో నిర్ధారణ అయిందని ఆరోపించారు.
బిఎసి ఎప్పుడు జరుగుతుందో ఆయనే చెబుతారా? డిగ్గీ చేతిలో స్పీకర్ రిమోట్ కంట్రోల్ టిఆర్‌ఎస్, వైకాపాతో కాంగ్రెస్ మ్యాచ్‌ఫిక్సింగ్ విరుచుకుపడిన చంద్రబాబు
english title:
bac
Date:
Saturday, December 14, 2013