హైదరాబాద్, డిసెంబర్ 13: తెలంగాణ బిల్లును ప్రత్యేక విమానంలో పంపడం ఏమిటన్న టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముసాయిదా బిల్లును విమానంలో కాకుండా ఎడ్ల బండిపై తెస్తారా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన ఖాయంకావడంతో చంద్రబాబు సంయమనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం ఆయన అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. చంద్రబాబు తన గత చరిత్రను మరిచిపోయి మాట్లాడుతున్నారని చెప్పారు. తన మామ ఎన్టీఆర్‌ను పదవీచిత్యుడ్ని చేసి ముఖ్యమంత్రి పదవిని పొందే సమయంలో చంద్రబాబు అప్పటి స్పీకర్ యనమల రామకృష్ణుడు తునిలో ఉంటే ఆయనను ప్రత్యేక హెలిక్యాప్టర్ ద్వారా విశాఖపట్నానికి, అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా హైదరాబాద్‌కు పిలిపించలేదా? అని ప్రశ్నించారు. తన స్వార్థం, పదవి కోసం చంద్రబాబుకు ప్రత్యేక విమానం అవసరం ఉంటుంది కాని తెలంగాణ బిల్లు తేవడానికి అవసరం లేదా? అని విమర్శించారు.
బిఎసి ఏర్పాటు చేసి బిల్లు చర్చకు పెట్టండి: టిఆర్‌ఎస్
బిఎసి ఏర్పాటు చేసి తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ మొదలుపెట్టాలని టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఆ పార్టీ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, కొప్పుల ఈశ్వర్, వేణుగోపాలాచారి తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును అడ్డుకోవాలని కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రెండు, మూడు రోజుల్లో వారి కుట్రలను చేధించి బిల్లును చర్చకు తీసుకొస్తామని ఆయన తెలిపారు. వీరిరువురు స్వయంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని, న్యాయ నిపుణులతో చర్చించి వీరిపై సభా హక్కుల ఉల్లంఘన కేసులు పెడతామని ఈటెల పేర్కొన్నారు. కెసిఆర్‌ను విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని, స్థాయికి మించి మాట్లాడితే సహించమని ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు. తెలంగాణపై టిడిపి వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. తండ్రి చంద్రబాబులానే లోకేష్ కూడా రాజకీయాల్లో ద్వంద్వ విధానాలు అవలంబించి అభాసుపాలు కావొద్దని అన్నారు. (చిత్రం) విలేఖరులతో మాట్లాడుతున్న హరీష్‌రావు
చంద్రబాబు వ్యాఖ్యలపై హరీష్‌రావు ధ్వజం
english title:
harish rao
Date:
Saturday, December 14, 2013